Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 30


    "నాట్ బాడ్!" క్రీగంటచూస్తూ అభినందించింది.
    
    "ఆస్కార్ అవార్డ్స్ అంటూ మనం తరచూ వింటూ ఉంటాంగా! అసలు ఆ బహుమతికి ఆస్కార్ అనే పేరెలా వచ్చింది?"
    
    "క్రీస్తుశకం 1927 మే నాలుగో తేదీన కళాత్మక చిత్రాల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో అమెరికా చిత్రరంగానికి చెందిన ప్రముఖులయిన ముఫ్ఫైమందితో ఏర్పడినది అనిడిలా ఆఫ్ మోడ్రన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ బాడీనే ఆస్కార్ కమిటీ అంటారు. ఆరోజుల్లో ప్రముఖ హాలీవుడ్ నటులు మే, లీపిక్ ఫోల్డ్, డగ్గస్ ఫెయిర్ బేంక్స్, కళాదర్శకుడు గిబ్బన్స్ లాంటివారు అందులో సభ్యులుగా ఉండేవారు. గిబ్బన్స్ ఓ టేబుల్ క్లాత్ పై గీసిన బొమ్మే ఆ తర్వాత ఆస్కార్ అవార్డుగా ఇచ్చే బంగారు విగ్రహానికి డిజైన్ గా అంగీకృతమైంది.
    
    ఆదిలో దాని పేరు ఒట్టి బహుమతే తప్ప దానికి ఏ పేరూ లేదు. క్రీ.శ. 1929లో నిజానికి ఈ బహుమతుల్ని ఇవ్వడం ప్రారంభించినా, దానికి 'ఆస్కార్' అనే పేరు నిర్ణీతమైంది మరో రెండేళ్ళ తర్వాత 1931లో మార్గరెట్ హెర్రిక్ అనే ఓ అకాడమీ లైబ్రేరియన్ ఆ బంగారు విగ్రహాన్ని చూస్తూ 'ఈ రూపం ముమ్మూర్తులా మా అంకుల్ ఆస్కార్ లా ఉంది' అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించింది. ఆ తర్వాత అదే పేరు విచిత్రంగా స్థిరమైంది."
    
    "ప్రముఖ హాలీవుడ్ నటి మేర్లిన్ మన్రో అసలు పేరు?"
    
    "నీర్మా జీన్ బేకర్."
    
    "మాల్దీవుల వైశాల్యం?"
    
    "నూట పదిహేను చదరపు మైళ్ళు."
    
    "ఇంగ్లీషు భాష మొత్తంలో ఎక్కువ అర్ధాలు గల పదం ఏది?"
    
    "సెట్" టక్కున అన్నాడు ఆదిత్య. "దీనికి నామవాచకంగా ఏభై ఒక్క అర్ధాలు, క్రియగా నూట ఇరవై ఆరు అర్ధాలు, విశేషణంగా పది అర్ధాలూ వున్నాయి."
    
    "నా చివరి ప్రశ్న" పదిహేనో ప్రశ్న ఆడగబోతూ క్షణమాగింది.
    
    "ఒక తల్లికి ఒకే సమయంలో ఇద్దరు పిల్లలు పుట్టినా వాళ్ళని 'ట్విన్స్' అనలేకపోయారు. కారణం?"
    
    "ముగ్గురు పుట్టుంటారు మొత్తం అప్పుడు ట్రిప్లెట్స్ అనాలి."
    
    "రైట్!" అభినందనాగా అంది ప్రణయ. మొత్తం పదిహేనులో పధ్నాలుగు జవాబులు చెప్పగలిగారు. అంటే పధ్నాలుగు అయిదులు డెబ్బై మార్కులు మీరు స్కోర్ చేశారు. ఇక మీరు ప్రారంభించండి."
    
    "ఏయే సబ్జెక్ట్సులో అడగమంటారు?"
    
    "ఏం? బెదిరిస్తున్నారా?" ప్రణయలో కోపం లేదు. మృదువుగానే అడిగింది. "అలాంటి నిబంధన ఏమీ లేదని ముందే చెప్పానుగా...? అడగండి."
    
    "అదికాదు ప్రణయా! అడిగేవాడికి చెప్పేవాడు ముఖ్యంగా క్విజ్ లో చాలా లోకువైపోతాడు."
    
    "అది నిజం కాదని నిరూపిస్తాలెండి."
    
    "అంత ధీమాగా వుందా?"
    
    "మరేం?" విడీవిడని నవ్వుతో అల్లరిగా అంది. "బహుశా.... ఏ స్థాయి ప్రశ్నలు అడగాలో డిసైడ్ చేసుకోలేకపోతున్నారనుకుంటాను."
    
    ఉక్రోషంగా మొహం మాడ్చేసుకున్నాడు ఆదిత్య. "సరే!"
    
    పెదవులకి అరచేతిని అద్దం పెట్టుకుని ఆదిత్యని గమనిస్తూ వుండిపోయింది ప్రణయ.
    
    తన ముందున్నది ప్రణయ అన్నది పదేపదే గుర్తుకొస్తుందేమో- రెండు నిముషాలపాటు కళ్ళు మూసుకుని వుండిపోయాడు.
    
    "రైట్! నా మొదటిప్రశ్న.... రైట్ బ్రదర్స్ మొదట జయప్రదంగా విమానాన్ని నడిపి అమెరికాలో ఏవియేషన్ పయొనీర్స్ గా పేరు సంపాదించారు. అది 1903వ సంవత్సరం, డిసెంబరు పదిహేడో తేదీన. అది ఓ సముద్రపు ఒడ్డున ఇసుకలాంటి ప్రదేశంలో అయితే ఆ తరువాత తొలిసారి ఓ వ్యక్తి సముద్రంపైన విమానంలో ప్రయాణంచేసి రికార్డు సృష్టించాడు."
    
    "ఫ్రెంచ్ మేన్ లూయీస్ 1909లో జూలై ఇరవై అయిదో తేదీన ఇరవై అయిదు హార్స్ పవర్ మోనో ప్లేన్ లో ఇంగ్లీషు చానల్ పై ప్రయాణం చేశాడు....సుమారు ఇరవై మూడుమైళ్ళ దూరం."
    
    కంగారుపడ్డాడు ఆదిత్య. తెలిసి ఉండొచ్చు అనుకున్నాడు కాని ఇంత వివరంగా చెప్పగలుగుతుందని వూహించలేకపోయాడు.
    
    "సందేహించకండి ఆదిత్యా! మీకు తెలిసినవన్నీ నాకు తెలియాలని రూలేం లేదు అడగండి."
    
    ప్రణయ కావాలని తనను రెచ్చగొడుతున్నట్లు అనిపించిన ఆదిత్య మరింత జటిలంగా ప్రశ్నల్ని అడిగి ఇబ్బంది పెట్టాలనుకున్నాడు.
    
    "మే డే అంటే తెలుసుగా?"
    
    ఆమె పెదవి విప్పి చెప్పబోతుంటే అన్నాడు- "ఆగండి! మీరు చెప్పాల్సింది ఆ 'మే డే' గురించి కాదు. అదే పదాన్ని ఓ ప్రమాదం సూచించే సిగ్నల్ గా వాడతారు."
    
    "ఓస్ అంతేగా!" భుజాల్ని కుదిపింది "ఈ పదం ఫ్రెంచ్ మెయిడెజో నుంచి వచ్చింది 'నన్ను రక్షించు' అనేది దాని అర్ధం. అంతర్జాతీయ సముద్ర భద్రతా సూత్రాల్ని అనుసరించి సముద్రంలో ఓడ అత్యంత ప్రమాదకరమైన స్థితిలో చిక్కుకున్నప్పుడు ఇంజనులో వున్న నేవిగేటర్స్ ఓడపై వున్న కెప్టెన్ కి పంపే సిగ్నల్ ఈ 'మే డే' కరక్టేనా? పాపం ఆదిత్య!"
    
    అసలు అణునంతయినా తొణుకూ బెణుకూ లేని ప్రణయకి తెలియని విషయమంటూ వుందా అని - ఆదిత్య కంగారుపడిన తొలిక్షణమది.
    
    మరోప్రశ్న అడిగేవాడే- ఫోన్ రింగ్ అయింది.
    
    సోఫాలో నుంచి లేచిన ప్రణయ- "వన్ మినిట్" అంటూ వడివడిగా హాల్లోనుంచి బెడ్ రూంలోకి నడిచింది.
    
    అప్పుడు సమయం రాత్రి పదిన్నర కావస్తోంది.
    
                                                              * * *
    
    "ఎవరూ మాట్లాడుతున్నది?"
    
    రిసీవరు పట్టుకున్న సుధీర్ సమీపంలో కూర్చుని వున్న శౌరికేసి ఉత్సాహంగా చూశాడు.
    
    "ప్రణయే" రహస్యంగా అన్నాడు మౌత్ పీస్ కి చేతిని అడ్డం ఉంచి.
    
    "మిమ్మల్నే!"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS