లాయర్ సత్యమోహన్ గతరాత్రి పార్టీకి వచ్చిన అమ్మాయిల వివరాలను సంపాదించాడు.
తనకు కావలసిన వివరాలేమీ మిగిలిన ముగ్గురు అమ్మాయిలు కూడా చేప్పలేకపోయారు. అసలు ఆమె ఎలా వచ్చిందో, ఎవరు పిలిచారో జయచంద్రకు కూడా తెలియదన్న విషయం అర్ధంకావడంతో మరింతగా ఆశ్చర్యపోయాడు అతను.
తను ఏర్పాటు చేసి వుంటానని జయచంద్ర భావిస్తే.... ఆయనే పిలిచి వుండవచ్చునని తను అనుకోవడం వలన యద్దేచ్చగా ఆ యువతి తన పని తను వెళ్ళిపోయింది.
ఇంతకీ ఎవరామె? ప్రత్యర్దుల మనిషా? లేక పోలీసుల మనిషై వుంటుందా?
తన మనుషులకు టోకరా ఇచ్చి అదృశ్య మైపోవడాన్నిబట్టే ఆమె ఎంత తెలివైనదో అర్దమౌతుంది.
సత్యమోహన్ ఆలోచనలు వున్నట్టుండి ధీరజపైకి మళ్ళాయి.
ఆమె ధీరజకాదు అని తనకు తెలుసు__ ఆ యువతి ముఖం తను స్పష్టంగా చూశాడు. ధీరజ పోలికలు ఆమెలో లేవు. కానీ ఆమెకు తప్ప అంతటి తెగింపు ఇంకొకరికి రాదు. అందుకే ఆమెను గురించి ఎంక్వయిరీ చేశాడు. పార్టీ జరిగిన రోజు ఆమె ఇంట్లోనే వుందనీ బయటకు రాలేదనీ ఖచ్చితంగా తెలియడంతో నమ్మక తప్పడంలేదు.
చాటుగా ఫోటోలు తీయవలసిన అవసరం ఇంకెవరికి వుందో ఎంత ఆలోచించిన అంటు పట్టడంలేదు అతనికి.
ఏ మూలనో చిన్న అనుమానం__ ధీరజను అనుమానించకుండా వుండలేకపోతున్నాడు.
అనుమానం తీర్చుకోవడానికి తన కనుసన్నలలో మెలిగే కిరాయి గుండా 'కబీర్ దాదా' ను ఫోన్ చేసి పిలిపించాడు సత్యమోహన్.
అప్పటికప్పుడే అతను అరడజను మంది అనుచరులతో మారుతీ వాన్ లో ధీరజ ప్లాట్ కు బయలుదేరాడు.
ఆమె ఎపార్ట్ మెంట్ ముందు వ్యాన్ ఆగగానే బిలబిలమంటూ మారణాయుధాలు ధరించిన అనుచరులు కిందకు దిగారు. ఏ ప్లాట్ లో ధీరజ ఉంటుందో ముందే తెలుసుకాబట్టి అంగకు రెండు మెట్లు చొప్పున ఎక్కుతూ పైకి వెళ్ళారు.
మిగిలిన ప్లాట్ లోని వాళ్ళంతా ఏం జరిగబోతుందో అర్ధంకాక తెల్లబోయి చూస్తున్నారు. భయంతో వాళ్ళ తలుపులు, కిటికీలు మూత బడిపోయాయి.
ధీరజ ప్లాట్ కు తాళంవేసి వుంది.
తాళం పగులకొట్టి లోపలకు వెళ్ళారు. హాలు... బెడ్ రూమ్.... కిచెన్... ఎటాచ్ద్ బాత్ రూమ్... డైనింగ్ హాల్... ఒక్కటేమిటి అన్నింటినీ శోధించారు.
కానీ వాళ్ళకు కావలసిన ఫిల్మ్ దొరకలేదు.
బీరువాలో ఖాళీగా వున్న కెమేరా కనిపించింది.
ఇంటినంతా చిందరవందర చేశారు. కుర్చీలు, టి.వి, సోఫా సెట్, షోకేస్, ఎక్వరీయం... ఆ ఇంటిలో దేనినీ వదలలేదు. పుస్తకాలను నలుమూలలకూ విసిరేసారు. ఫర్నిచర్ మొత్తం ధ్వంసం అయింది. గోడలకున్న ధీరజ ఫోటోలనూ నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు.
అంతలో ఫోన్ మోగింది.
వాళ్ళ గూండాయిజానికి ఇంకా అది బలి కాలేదు. అందుకే జీవం పోసుకుందది.
రిసీవర్ ను తీసిన కబీర్ దాదాకు అర్దమయింది ఆ మాట్లాడేది ఎవరో.
"జీసాబ్... కానీ మనకు కావలసిన కెమేరా ఫిల్మ్ ఇంట్లో దొరకలేదు" అంటూనే యధాలాపంగా కిందపడివున్న ధీరజ ఫోటో వెనుక వైపు నిలిచిపోయింది కబీర్ దాదా దృష్టి.
ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత సంబరం కలిగించిందతనికి.
ఆ విషయాన్నే సత్యమోహన్ పోన్లో వివరించాడు.
అతని సూచనలు విన్న తరువాత...
"ఆచ్చాసాబ్..." అంటూ ఫోన్ పెట్టేసి తన అనుచరులతో కబీర్ దాదా బయటకు నడిచాడు.
* * * *
ఖైరతాబాద్....
ఆ ఫోటో స్టూడియో యజమాని సుధాకర్?
పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా ఏ ఉద్యోగం దొరకక చివరకు ఫోటోగ్రఫీలో డిప్లొమా సంపాదించి.... స్వంతంగా స్టూడియో ప్రారభించి, ప్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు అతను.
ఆధునిక భావాలు కల నేటి తరం యువతి ధీరజ అంటే అతనికి అభిమానం.
తన దైర్య సాహసాలను, తెలివితేటలను ప్రదర్శించి.... ఈ కుహనా రాజకీయలలోని కుళ్ళును వెలికిదీసి.... ప్రజల బాధ్యతలను గుర్తుచేయాలని సంకల్పించిన ధీరజ కు అవసరమైన సందర్బాలలో ఆదుకునే మంచి మిత్రులు కూడా.
డార్క్ రూమ్ లో వున్న ధీరజ... సుధాకర్ ల ఇద్దరి ముఖాల మీద చిరుచెమటలు....
"ధీరజా....ఇంత సాహసం చేస్తావు అనుకోలేదు"
"చేయకపోతే ఒక నిర్దోషికి శిక్ష పడుతుంది."
సుధాకర్ ఫిల్మ్ కడుగుతున్నాడు.
"సత్యమోహన్ అవలిస్తే పేగులు లెక్క పెట్టగలిగిన మేధావి. నిన్ను గుర్తుపట్టలేదని ఖచ్చతంగా చెప్పగలవా?"
"ఆ జాగ్రత్తలు తీసుకునే వెళ్ళాను. అప్పటి రూపానికి, ఇప్పటి రూపానికి అసలు పోలికే వుండదు. నేనే అక్కడకు వెళ్ళనని ఎవరూ ఊహించలేరుకూడా" స్థిరంగా అన్నది ధీరజ.
"అది ఎలా సాధ్యపడింది.... ఎంత మేకప్ చేసుకున్నా సాధ్యం కాదే!"
"అదే ట్రేడ్ సీక్రెట్" చిరునవ్వి నవ్విందామె.
"ఏది ఏమయినా నువ్వు చేసింది చాలా రిస్క్ తో కూడిన వ్యవహారం. ఏమాత్రం నిన్ను గుర్తించినా అక్కడికక్కడే ప్రాణాలు తీయడానికి వెనుకాడేవాళ్ళు కాదు తెలుసా?"
"న్యాయం, ధర్మం మన పక్షాన వున్నాయి. అవే నన్ను కాపాడతాయి అనే ఆత్మస్థయిర్యంతో ముందుకు నడిచాను.
"ధీరజా__ నీ దైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. ఈ ఫోటోలు బయట పడిన మరుక్షణం సత్యమోహన్, జయచంద్రలు ఆడుతున్న రాజకీయ నాటాకానికి తెరా పడుతుంది. వాళ్ళగుట్టు రట్టవుతుంది. ప్రజలు ఛీ కొడతారు.కానీ, తమ రాజకీయ భవిష్యత్ కు గండికట్టిన నీమీద కక్ష్య కడతారు. చివరకు నిన్ను అంతం చేయడానికి కూడా వెనుకాడరు. కాబట్టి ఇకనుంచి నీ జీవితం అనుక్షణం ప్రమాదాల మయమే, బీకేర్ ఫుల్ ..." డెవలప్ చేసిన ఫోటోలను హైపోలో కడుగుతూ అన్నాడు.
సుధాకర్ మాటలు పూర్తిగాకముందే....
బయట అదో అలికిడి....
చాలా మంది పరుగెత్తుకుంటూ వస్తున్న చప్పుడు.
