"టూ ఐస్ క్రీమ్స్..."
ఆర్డర్ తీసుకున్న సర్వరు వెళ్ళిపోయాడు.
ధీరజ తన అనుమానాన్ని తీర్చుకోవడానికి అన్నట్టు అంతకు ముందు చూసిన ఇద్దరి కోసం తల తిప్పింది.... మరుక్షణంలోనే ఆశ్చర్యపోయింది.
ఆ సీట్లలో ఇప్పుడు లేరు... ఎప్పుడు వెళ్ళిపోయారో... ఎలా వెళ్ళిపోయారో!?
వీరేష్ కు అనుమానం రాకుండా లోగొంతుకతో ఏదేదో మాట్లాడుతూనే నలువైపులా పరిశీలనగా చూస్తుందామె.
ఆర్డర ఇచ్చిన ఐటమ్స్ వచ్చాయి.
"ధీరజా... హర్రి అప్... ప్రోగ్రామ్ కు టైమ్ అవుతుంది..." అంటూ ఒక కప్పును ఆమె ముందుకు జరిపి తను ఒకటి తీసుకున్నాడు వీరేష్.
పెదవులకు అంటిన తడిని హాండ్ కర్చీఫ్ తో అద్దుడ్డుకుంటూ తాము కూర్చుని వున్న గోడవైపు చూసిన ధీరజ షాక్ తిన్నది.
"కెవ్వు" మంటూ పెద్దగా అరిచి ఖంగారుగా లేచి నిలబడింది.
ఆ అదటుకు ఆమె ముందున్న ఐస్ క్రీం కప్పు జారి వీరేష్ ముందున్న కప్పుని డీ కొన్నది. టేబుల్ మీద నున్న గ్లాస్ నునుపుదనానికి రెండు ఐస్ క్రీం కప్పులూ నేలపాలైపోయాయి.
అంతా క్షణాలమీద జరిగిపోయింది.
మిగతా కస్టమర్లకు ఏం జరిగిందో అర్ధంకాక అయోమయంగా వాళ్ళవైపు చూశారు.
"ఏమైంది ధీరజా.... ఎందుకు అలా అరిచావు?"
"బల్లి__బల్లి నా పక్కనే గోడమీద వుంది. నాపై పడిపోతున్నట్టుగా వుంటేనూ.."
అంత దైర్యం గల ధీరజ కూడా చిన్న జీవికి... అదీ ఎలాంటి హానీ తలపెట్టని జీవిని చూసి భయపడేసరికి వీరేష్ కు నవ్వు ఆగలేదు.
సర్వీస్ బాయ్ పరుగెత్తుకు వచ్చాడు.
'సారీ వీరూ... ఐస్ క్రీమ్ నేలపాలు జేసాను. ఇంకొక రెండు ఆర్డర్ ఇద్దామా?"
"వద్దులే టైమ్ అయింది" అంటూ వీరేష్ బిల్ పే చేసి బయటకు నడిచాడు.
ఆ హోటల్ వెనుకవైపు ద్వారం నుంచి బయటకు వచ్చిన ఆ ఇద్దరు ఆగంతుకులు కసిగా పళ్ళు కొరుక్కున్నారు.
"డామిట్... తప్పించుకున్నారు. ధీరజ అలా అరిచి నేలపాలు చేయకుండా ఆ ఐస్ క్రీమ్స్ ని చప్పరించి వుంటే మనం కలిపిన విషానికి ఈ పాటికే యమలోకానికి చేరుకొని వుండేవాళ్ళు..." అంటూ తమలో తామే గొణుక్కున్నారు ఆ ఇరువురూ.
అలాంటి ప్రమాదం ఏదో పొంచివుందని ధీరజ ముందే వూహించింది. ఆ ఇద్దరు నూతన వ్యక్తులు తరువాత మాయమైపోవడంతో తన అనుమానం నిజమై వుంటుందనే ఆ హోటల్ సప్లయర్ తెచ్చిన ఐస్ క్రీమ్స్ ను కాకతాళీయంగా జరిగినట్టు చిత్రించింది.
క్షణం క్రితమే మృత్యువు కోరల నుంచి సురక్షితంగా బయటపడిన సంగతి తెలియని వీరేష్ ఆమెవెంట రవీంద్రభారతిలోకి అడుగుపెట్టాడు.
ఆ రోజు జరిగే నృత్య ప్రదర్శనకు ఆ ఇద్దరూ వెళుతున్నారని తెలిసే వాళ్ళను మట్టు పెట్టడానికి రూపొందించబడిన మృత్యు ప్రవాసనంలో తొలి ప్రయత్నం ఘోరంగా ఫెయిల్ అయింది.
బెంగుళూరుకు చెందిన కధక్ నృత్యకళాకారిణి యిస్తున్న ప్రోగ్రామ్ అది...
వి.ఐ.పి.లకు పంపే ఇన్విటేషన్ మీద ధీరజ వెళుతుంది. తనతోపాటు రమ్మని వీరేష్ ను కూడా తీసుకు వెళుతుందామె.
నృత్య ప్రదర్శనను శ్రద్దగా తిలకించడంలో మునిగిపోయి వున్నాడు వీరేష్.
అదే సమయంలో అడిటోరియమ్ కు ఒక పక్కగా వున్న గది తలుపులు తెరుచుకుని హాలులోని జనాభాను పరికించి చూసింది ఒకతల...
ముందు వరసలోనే వి.ఐ.పి. ల గ్యారీలలో కూర్చుని వున్న ధీరజ, వీరేష్ లపై నిలిచిపోయింది అతని దృష్టి.
వెనువెంటనే అతని చేతిలోకి వచ్చింది టెలిస్కోపిక్ రైఫిల్.... ఆ సందులోనుంచి బారెల్ ను కొద్దిగా బయటకు పోనిచ్చి టార్గెట్ ను ఫిక్స్ చేసుకునే ప్రయత్నంలో వున్నాడతను.
రెస్టారెంట్ లో హఠాత్తుగా మాయమైపోయిన ఇద్దరి గురించే ఆలోచిస్తున్న ధీరజ యధాలాపంగా తల పక్కకు తిప్పిన మరుక్షణం బయటకు పొడుచుకు వచ్చిన సన్నటి గొట్టం కనిపించింది.
అది ఏమై వుంటుందో అర్ధమైన మరుక్షణం చకచకా ఆలోచించి ఎదురుగా నిలబడి వున్న ఫోటో గ్రాఫర్లను పిలిచి ఏదో చెప్పిందామె.
ధీరజ చెప్పిన విషయం నచ్చింది కాబోలు ఆడిటోరియమ్ కు ఒక పక్కగా నిలుచుని, అటూ ఇటూ తిరుగుతూ ఫోటోలను తీస్తున్నాడతను.
ఆ ఫోటోగ్రాఫర్ ఆ రైఫిల్ బారెల్ కు పదేపదే అడ్డురావడం వలన ఆ ఆగంతకుడికి ఏం చేయాలో తోచక పీకలవరకూ కోపం పట్టుకు వచ్చింది.
ధీరజ కావాలనే అతనని అక్కడ నిలుచోమన్నదన్న విషయం అప్పటికి కూడా ఆ ఆగంతుకులు గ్రహించలేకపోయారు.
ప్రోగ్రామ్ అయిపోయింది.
తెరపడడంతో జనం దృష్టిని ఆకర్షించకముందే ఆ ఇరువురు వ్యక్తులు చల్లగా బయటకు జారుకున్నారు.
రెండవ ప్రయత్నం కూడా ఫలించకపోవడంతో వాళ్ళలో కసితోపాటు పట్టుదల కూడా పెరిగింది.
ధీరజతో కలిసి మెట్లు దిగుతున్నాడు ఏ. సి. పి. వీరేష్.
ఒక గుబురుపొద చాటున పొంచి వున్నారు ఆగంతుకులు.
తమ కారుని సమీపించి ఎక్కుతుండగా ఉక్రోషాన్ని పట్టలేక ఘాట్ చేశాడు ఇద్దరిలో ఒకడు... కానీ అపుడే ఆటో ఒకటి అడ్డు రావడంతో దాని బాడీకి తగిలి వికృతమైన శబ్దాలు వినవచ్చాయి.
ధీరజ త్రుళ్ళిపడింది.
తమ మూడవ ప్రయత్నం కూడా పనికిరాకుండా పోయిందని అర్ధం కావడంతో జుట్టు పీక్కున్నంత పని అయింది వాళ్ళకు.... ధీరజ దృష్టిలో పడకుండా తప్పించుకు పారిపోవడం తప్ప మరో మార్గం కనిపించలేదు వాళ్ళకు.
దూరంగా జనంలో కలిసిపోతున్న ఆ ఇద్దరినీ చూడనే చూసిందామె.
మనసులోనే వాళ్ళ రూపాలను గుర్తుంచుకుంది.
తమ వెనుక జరిగిన హత్యా ప్రయత్నాల సంగతి ఏమీ తెలియని వీరేష్__ ధీరజ ఎక్కిన వెంటనే కారుని స్టార్ట్ చేసి ముందుకు దూకించాడు.
వాళ్ళ వెనకనే మరొక స్కూటర్ బయలుదేరిన సంగతి వాళ్ళకు తెలిసే అవకాశం లేకపోయింది.
* * * *
