Previous Page Next Page 
రామాయణము పేజి 29

    రాముడు "మమ్ము శీఘ్రముగ సుగ్రీవుని వద్దకు చేర్చుము" అని హనుమంతుని కోరినాడు. హనుమంతుడు రామలక్ష్మణులను తన భుజములపై కూర్చుండపెట్టుకొని ఋశ్యమూకమునకు ఎగిరిపోయి సుగ్రీవుని సమక్షమున దింపినాడు.
    సుగ్రీవుడు కోపముతోనూ దుఃఖముతోనూ "రామచంద్రా వాలితో యుద్ధమునకు నన్ను పరికొల్పి వాడు అయః పిండముల వంటి తన పిడికిళ్లతో నా దేహమును చితుకబాదుచుండగా నీవు తిలకించుచు వినోదించుచుంటివా? వానిపై బాణము నేల ప్రయోగించలేదు? అగ్నిసాక్షిగ జేసికొన్న మైత్రి ఫలమిదియేనా?" అని నిష్ఠురముగ పలికినాడు. రాముడు "సఖుడా, వినుము. అశ్వనీ సుతుల వలె పోరుచూ కవలల వలె ఒండొరులను పోలియున్న మీ యిరువురిలో ఎవడు వాలియో  ఎవడు సుగ్రీవుడో తెలియలేదు. వాలియనుకొని సుగ్రీవుని చంపు ప్రమాదమున్నది కనుక నేను బాణమును ప్రయోగించలేదు. రేపు నీవు మరల వాలితో తలపడుము, ఈసారి నిన్ను గుర్తించుటకు వీలుగా ఒక పూలహారమును ధరించి పొమ్ము. పోరాటమున ప్రారంభ దశ యందే వాలిని వధించెదను" అన్నాడు.
    మరునాడు హనుమంతుడు పూలతో నిండియున్న ఒక గజ పుష్పలతను తెచ్చి దాని కొసలను ముడివైచి హారముగా మార్చి సుగ్రీవుని మెడలో వేసినాడు. సుగ్రీవుడు ఇనుమడించిన ధైర్యోత్సాహములతో కిష్కింధకోట ద్వారము ముంగిట నిలిచి వాలిని ద్వంద యుద్ధమునకు రమ్మని పిలిచినాడు. వాలి "నిన్న నేను ఏమఱిపాటున నుండగా తప్పించుకొని పోయిన పిరికిపందవు! నిన్నీనాడు మొదటి క్షణముననె అంతమొందించెదను!" అనుచు లేచినాడు. పట్టమహిషి తార అడ్డువచ్చి "నాథా! సుగ్రీవుడు నిన్ననే కదా నీతో ద్వందయుద్ధమునకు వచ్చి పోరలేక పారిపోయినాడు? మరల ఇంతలోనే వచ్చి సవాలు చేయగలిగినాడనగా అతని వెనుక ఆసరా ఏదియో ఉన్నదని తోచుచున్నది. మన కుమారుడు అంగదునకు వేగుల వారి ద్వారా ఒక వార్త తెలిసినది. 'రాముడు' అనే నరశ్రేష్ఠుడొకడు ఏ కారణముననో భార్యతోనూ సోదరునితోనూ వనవాసమునకు వచ్చినాడట. ఆమెనొక రాక్షసుడు - రావణుడు కాబోలు - ఎత్తుకొనిపోగా ధనుర్ధరులైన ఆ అన్నదమ్ములు ఆమెను అన్వేషించుచూ వచ్చి రఋశ్యమూకమును చేరుకొన్నారట. సుగ్రీవుడు వారితో స్నేహము చేసినట్లు తెలిసినది... ఆ సంగతి అట్లుంచుము. నీవునూ సుగ్రీవుడునూ అన్నదమ్ములు. తమ్ముడు తప్పుచేసినచో మందలించి యూరుకొనవలెనే కాని సోదరులగు మీమధ్య ఈ ద్వేషము దేనికి? నీవు సుగ్రీవుని చేర్చుకొన్నచో ఆ రాముడునూ అతని అనుజుడునూ కూడ నీకు మిత్రులగుదురు" అని   హితమును బోధించినది.
    అవక్రపరాక్రమశాలి యగు వాలియందు ఒక పెద్ద లోపముండెడిది. ఎవరెంత బోధించినను వినెడివాడు కాదు. "తమ్ముడన్న దాక్షిణ్యముతో నేను ఈ ద్వంద యుద్ధమునకు పోకున్నచో లోకము నన్ను పిరికివానిగా భావించును" అనుచూ ఆతత్త్వంతో రయమున కోట ప్రాంగణమునకు పరుగెత్తి పోయి అచట గజ పుష్పహారాలంక్రుతుడై వేచియున్న సుగ్రీవునితో తలపడినాడు. పోరాటమున వాలి విజృంభించుచుండగా రాముని నిశిత సాయకము మహావేగమున వచ్చి వాని వక్షమును లోతుగా చొచ్చుకుపోయినది. వాలి పర్వత శిఖరము వలె ధరణిపై పడినాడు.
    మరణ యాతనకు లోనైన వాలి "నన్ను ఈ బాణముతో కొట్టినదెవరు?" అని పరికించుచుండగా మాటున నుండి వచ్చిన కోదండ రాముడతనికి ప్రత్యక్షమైనాడు.   
    వాలి: నా పట్టమహిషి తారాదేవి చెప్పిన రాముడవు నీవేనన్న మాట! నేను మరొక్కనితో ద్వంద యుద్దమున నిమగ్నుడనై యుండగా మాటున నుండి నాపై బాణమును ప్రయోగించినావు! ఇది ధర్మమేనా?   
    రాముడు: నీవంటి క్రూరమృగమును వేటాడునప్పుడు బాణమును ముందుండియే ప్రయోగించవలెనన్న నియమము లేదు. వలలు పన్నియూ, కూపములందు పడగొట్టియూ వేటాడవచ్చును.   
    వాలి: మానవులు వానర మాంసమును భుజించరు. మా చర్మము కూడ మీకు ఉపయుక్తము కాదు. నన్ను వేటాడుటకు కారణమేమి!   
    రాముడు: నీ తమ్ముడు తాను నిర్దోషినని తెలియజేయుటకు ఎంత ప్రయత్నించినను వినిపించుకొనక వానిని వానిని వధింపబూనినావు! సుగ్రీవుడు నా శరణుజొచ్చినాడు. శరణాగతులను కాపాడుట క్షత్రియ ధర్మము. నిన్ను శిక్షించి, నా ధర్మమును నెరవేర్చినాను.   
    వాలి: నీ భార్య అపహరింపబడినదనియూ, అపహరించిన వాడు లంకేశ్వరుడగు రావణుడేమో అనియూ నాకు తెలిసినది. అపహర్త ఆ పది తలల వాడే ఐనచో వానిని ఆదేశించగల శక్తి సామర్ధ్యములు నాకున్నవి. నేనొకనాడు సముద్రమున స్నానము చేయుచుండగా అటు వచ్చిన దశకంఠునకొక కొంటెబుద్ది పుట్టినది. వాడు నాకు తెలియకుండ వెనుక నుండి సమీపించి నన్ను పట్టుకొని తలకిందుగా జేసి నీట ముంచి నేను ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి యగుచుండగా చూచి వినోదించవలెననుకొన్నాడు. నేనది తెలిసికొని వానిని నేనే పట్టుకొని వాని పది తలలను నీట ముంచి క్షారజలమును త్రాగించినాను. అంతటితో ఆగక వానిని నా బాహుమూలమున నిరికించుకొని తక్కిన ఆరు సముద్రములకు కొనిపోయి ముంచి ప్రాణావశిష్టుని చేసి వదలినాను. నీ భార్య నెత్తికొని పోయినవాడు ఆ రావణుడే ఐనచో నేను వానిని 'రాముని భార్యను అతని వశము చేసి, అతని క్షమాపణ కోరుకొమ్మని ఆదేశించి యుండెడివాడను, బలపరాక్రమశాలినగు నా సాయమును కోరక అశక్తుడగు సుగ్రీవునితో మైత్రి చేసినావు! ఏమి సాధించగలవని?   
    రాముడు: వాలీ, బలపరాక్రమశాలినన్న అహంకారముతో నీవు చేయరాని అకృత్యమునకు పాల్పడినావు. నీ తమ్ముడు సుగ్రీవుడు ఋష్యమూక పర్వతగుహలో ఇడుములకు లోనై ప్రవాసమున నుండగా నీవాతని సతి రుమాదేవిని చెరపట్టినావు! తమ్ముని పత్ని కోడలుతో సమానము. కోడలిని చెరపట్టిన నీచుడవు నీవెంత బలవంతుడవైనను నీ సాయమును నేను అభిలషించను. కౌర్యసిద్దికైనను అధములను అర్ధించరాదు.... వాలీ నీ ప్రాణములింక ఎంతసేపో నిలువవు. ఈ స్వల్ప వ్యవధిని వృధా చేయక నీవారితో ఎవరితోనైన ఏమైన చెప్పవలసినది యున్నచో చెప్పుకొనుము.   
    వాలి రాముని వీక్షించినాడు. రాముడాతనికొక మహాపురుషుడిలా కనిపించినాడు. ఆ మహాధానుష్కుడు తనపై చేసిన నేరారోపణలన్నియూ సత్యములేయని వాలికి తోచినది. ఆవానరాధిపుని హఠాత్తుగా పశ్చాత్తాపము ముంచెత్తినది. సుగ్రీవుని కౌగలించుకొని "తమ్ముడా నీకన్యాయమును చేసినాను, నన్ను మన్నించుము. నీవు కిష్కింధను పాలించుము. వానర లోకమునంతనూ ఒక ఛత్రము కిందకు తేగల సామర్ధ్యము నీకున్నది. నా బిడ్డ అంగదుడు నాకు ప్రాణముకన్న మిన్న. వానిని యువరాజుగా చేసి నీ బిడ్డవలెనే వృద్దిలోనికి తీసుకొనిరమ్ము" అని చెప్పి ప్రాణములను విడిచినాడు.   
    సుగ్రీవుడు వాలి దేహముపై బడి "అగ్రజుడు పితృసముడని తెలిసియూ నిన్ను చంపుకొన్న భ్రాతృద్రోహిని!" అని రోదించినాడు. వాలి మరణముతో వైరము అంతమైనది. వాలి తనయుడు అంగదునిపై వాత్సల్యము హెచ్చినది.   
                                *      *      *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS