Previous Page Next Page 
కౌగిట్లో జాబిల్లి పేజి 29


    టాకీ సినిమాలా కాకుండా మూకీ సినిమాలా రీలు త్రిప్పి వెళ్ళిపోయింది నన్నేం చేయమంటావు?

    మీరిద్దరూ కీచులాడుకున్నారేమో! ఒకరు ఉత్తర ధృవం! మరొకరు దక్షిణ ధృవం. కొద్దిరోజులు గడిస్తే మీరే సర్దుకుంటారులెమ్మని ఊరుకున్నాను.

    "మళ్ళీ వస్తుందిలే బాధపడకు" అని సముదాయించింది సుమిత్ర!

    చాలాసేపు ఎన్నో మాటలు చెప్పింది. తొలిరాత్రి అనుభవానికి తయారవుతున్న బిడ్డకు తల్లి చెప్పుకోవలసింది అంతా చెప్పుకుంది.

    మానసికంగా ఆమెను సమాయత్త పరచింది.

    ఆమని హుషారుగా చేయవలసిన పనులు అన్నీ ముత్తయిదువలు చేశారు.

    ఆ పుణ్య స్త్రీలే ఆమెను అలంకరించిన గదిలో విడచి వెళ్ళారు.

    గదిలోకి వచ్చింది గాయత్రి.

    వాల్మీకి ఎప్పుడో వచ్చి కూర్చున్నాడు. ఆమెకు ఎదురు వచ్చి స్వాగతం పలికాడు! తన జీవితంలోకి ఆహ్వానించాడు.

    గాయత్రి గుండెల్లో నిర్వేదం ఇంకా తీరలేదు.

    ఎందుకు అదోలా వున్నావు గాయత్రీ!"

    "ఆమని వెళ్ళిపోయింది" అంది గాద్గదంగా!

    "ఓ అదా నీ బాధ! ఆమె వెళ్ళిపోలేదు మనదగ్గరే వుంది!"

    "ఎక్కడ?" విస్మయంగా కళ్ళు విప్పి సిగ్గు మరచి తలఎత్తి చూచింది.

    "ఇదిగో ఇక్కడ" అంటూ పిల్లోస్ వైపు చూపించాడు.

    లవ్ లీ ఆమని! ప్రక్కమీద పరచిన పూలు వ్రేలాడుతున్న దండలు ఆమని (అక్షరాలను)ని తాకుతున్నాయి.

    దగ్గరగా వచ్చి అక్షరాలను చేతులతో తాకింది గాయత్రి.

    "ఎడబాటు ఎంతటి నిర్వేదాన్ని కలిగిస్తుందో చిన్నదయినా తనకే బాగా తెలుసు గాయత్రీ! ఆమెను అపార్ధం చేసుకోవటం మహాపాపం!

    మనం సంతోషంగా వున్న సమయంలో తనని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమంది. అంతేకాని రెప్పవేయకుండా ఆవైపే చూడమని చెప్పలేదు"

    "మరి ఇంకా ఏం చేయలందేమిటి?"

    "ఇకనించి నీ చూపులు నామీద నిలవాలంది." గాయత్రి సిగ్గుపడింది.

    అతడు ఆమెను దగ్గరకు తీసుకున్నాడు.

    ఆమె వెనుక లవ్ లీ అనే అక్షరాలు ఒద్దికగా ఇమిడాయి.

    తరువాత దిండ్లు రెండు ఒకదానిమీద ఒకటి చేరాయి.


   
                                    10



    "అమ్మగారూ! మీకోసం ప్రక్కఊరినుంచి రైతులు వచ్చారు" అంది వర్ధని.

    "లోపలకు రమ్మను! కూర్చుంటానికి చాపలు వేయించి అందరికి మంచినీరు ఇవ్వండి. అయిదు నిముషాల్లో నేను క్రిందికి దిగి వస్తాను" అని చెప్పింది సుమిత్ర.

    వ్రేలిగోళ్ళతో పాపిట సవరించుకుని ముందుకు పడుతున్న జుట్టు వెనక్కి సర్దుకుని షాల్ కప్పుకుని క్రిందికి దిగి వచ్చింది.

    వచ్చిన రైతులకు చేయవలసిన మర్యాదలు అన్నీ చేశారు.

    సుమిత్ర క్రిందికి దిగి రాగానే అందరూ లేచి నిలబడ్డారు.

    "అమ్మగారూ! దేవాలయం భూములు కౌలువివాదం మాటాడేందుకు వచ్చాం మాకు మీ సాయం కావాలి!" అని అర్దించారు.

    "ఆ వివాదం ఇంకా పరిష్కారం కాలేదా?" అని ప్రశ్నించిందామె.

    "ఎలా అవుతుంది అమ్మగారూ! ఎండోమెంట్స్ ఉద్యోగి చేయవలసినదంతా చేశాడు. మీ పెద్దలు స్వామిమీద భక్తి కలిగి ఇచ్చిన భూములు అవి! వాటిని డిపార్టుమెంటు తీసుకుంది.

    "రక్షించే నెపంతో వారు తీసుకున్న భూముల్ని భక్షిస్తున్నారు" అని ఒక పెద్ద వివరించాడు. ఎండోమెంటు ఉద్యోగి పేరు వినగానే ఆమె ముఖం వివర్ణమయింది. వివరాలు అడిగి తెలుసుకునేందుకు ఆలయం దగ్గరకు రావలసిందిగా కబురు పంపితే అతడు రాలేదు.

    ఆలయ నిర్వహణకోసం ఇచ్చిన భూములు కౌళ్ళకి యిస్తున్నాడు. ఆ మొత్తం డిపార్టుమెంటు ఉద్యోగుల జీతాలకే సరిపోతోంది. ఆలయ నిర్వహణకు ఏమీ మిగలలేదు అంటున్నాడు.

    పై అధికారులు చెప్తే ఆడిట్ కూడా కరెక్ట్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్తారు.

    ఆలయ నిర్వహణకు ఎవరో దాతలు ఇచ్చిన భూమిని పైనించి వచ్చిన అధికారులు తీసుకోవటం ఏమిటి?

    ఆలయం రిపేర్లు అర్చకులు మొదలయిన వారి జీతాలు ఉత్సవాల ఖర్చులు అన్నీ దివాణమే భరిస్తోంది.

    ఇదేం కలికాలం!

    దివాణం డబ్బు ఇవ్వకపోతే మళ్ళీ ఆలయంలో గబ్బిలాలు కాపురం చేస్తాయి. ఇదేం వ్యవస్థ! దీన్ని ఎవరికోసం ఏర్పాటుచేశారు.

    దేవుడి భూములు దేవుడు కాకుండా ఎవరో తినటం, దేవుడికి ఏ జరుగుబాటూ లేకపోవటం!

    అనేకమంది ప్రజల సమక్షంలో జరుగుతున్న ఘోరం!

    దేవుడి సొమ్ము వాళ్ళు తింటే వాళ్లనేం చేశాడు. దేవుడుంటే వాళ్ళని శిక్షించడా అన్న భావం పెరుగుతోంది.

    ఈ అవ్యవస్థమీద అసహ్యం కలిగి డిపార్టుమెంటు సంగతి ఇతః పూర్వం తమ కుటుంబం ఇచ్చిన పొలం సంగతి మర్చిపోయి మళ్ళీ దివాణంనించి డబ్బు తీసియిస్తోంది సుమిత్ర.

    ఆలయంలో గబ్బిలాలు తిరగకుండా ఉండాలంటే అలా చేయటం కన్నా మరో దారి లేదు.

    ఆలయం డబ్బులు ఉద్యోగుల జీతాలకు సరిపోతుంది. వారు ఆలయం దగ్గరకు ఎప్పుడో కాని రారు.

    అక్కడ పనిచేసే స్వీపర్, నైట్ వాచర్ కి కూడా జీతాలు లేవు.

    ఈ దురవస్థని విమర్శించటం యిష్టంలేక ఖర్చుకి తలవంచిందామె.

    "గతంలో ఇలా జరుగుతోంది కదండీ! ఆలయ భూమి అంతా అతడే కౌలుకిచ్చుకున్నాడు! అతడు మన గ్రామసభ్యుడు కాదు. పొలం యిచ్చిన దాత కాడు. అధికారాలూ అతనివే!

    మీదుమిక్కిలి నలుగురూ అసహ్యించుకునే రూలు మరొకటి ఉంది.

    "డబ్బు ఇవ్వకపోతే ఉత్సవాలు చేయకూడదట" అన్నాడు.

    డబ్బుతినేసినా ఉత్సవాలకు అభ్యంతరం చెప్పనందుకు అతడు మనవాడే అనుకుని సరిపెట్టుకుందామె.

    "మీ ఉద్యోగి మరీ దారుణం అమ్మగారూ! ఆలయ భూములు ఏ గ్రామంలో ఉన్నాయో అక్కడ కాకుండా మరో చోట పాటలు పెట్టాడు.

    వారి దగ్గర లంచం పుచ్చుకుని చౌకగా పాటలు కొట్టేశాడు.

    మా ఊరిలో పొలం ఉంది కదండి.

    ఒక్కరు కూడా మా ఊరు కౌలుదారులు లేరు. అంతా పరాయి ఊళ్లవాళ్ళకిచ్చేశాడు. మా ఊళ్ళో ఉన్న పొలం మరో ఊరి వాళ్ళకి యివ్వటం మాకు అన్యాయం కదండి తలవొంపు.

    ఇప్పుడు వెళ్ళి అడిగితే పాటలు ముగిశాయి టెన్ ఎన్ సీ యాక్టు ప్రకారం ఆరు సంవత్సరాలు ఆగమంటున్నాడు" అని ఫిర్యాదు చేశాడు.

    "భూమి యిచ్చిన దాతలు మీరు. అదంతా ప్రభుత్వఉద్యోగి దుర్వినియోగం చేస్తే మళ్ళీ ఖర్చుపెట్టుకుని స్వామిని నమ్ముకుని ఆలయాన్ని నమ్ముకొని అన్నీ జరిపించేది మీరు.

    మధ్యలో ఆయన పెత్తనం ఏమిటండీ? దానమిచ్చిన దాతలు కాక అక్కడ పనిచేసే ఉద్యోగులకు కాక, ఆ స్వామిని నిత్యం పూజించే భక్తులకు కాక అధికారాలన్నీ ఒక పూచికపుల్లకు యిచ్చి నిలబెట్టిన ప్రభుత్వాలు ఎంత గ్రుడ్డివి!

    ఈ దేశం ఎప్పుడు కళ్ళు తెరుస్తుంది? అంటూ కాస్తంత విప్లవ ధోరణి కలిగిన మరో రైతు ప్రశ్నించాడు.

    "ఇవన్నీ కాదు స్పష్టమయిన ఆరోపణలు చెప్పండి!" ఆ కంఠస్వరం వినిపించిన వైపు చూచారు అందరూ!

    రాణి సుమిత్రకూడ తలఎత్తి చూసింది! ఎప్పుడు దిగివచ్చారో కాని వాల్మీకి గాయత్రి నిలిచి ఉన్నారు.

    తనకు బహుకాలంగా కొరుకుడు పడని చిక్కు విడదీయగల శక్తి అతనికి ఉందేమో చూడాలనిపించింది.

    "రా బాబూ వచ్చి కూర్చో!" అంది.

    గాయత్రి వాల్మీకి ఆమెకు చెరో వంక కూర్చున్నారు.

    "అవకాశం వచ్చింది కాబట్టి భోంచేస్తున్నవారిని మనం ఎందుకు అనాలి!

    అవకాశం యిచ్చిన చట్టాలను అని ప్రయోజనం ఏమిటి?

    మనవరకు ఈ సమస్య పరిధిని తగ్గించి పరిష్కరించే మార్గం ఆలోచించాలి. అంటే చట్టం యిచ్చిన అవకాశంలో అధికారులు యిచ్చిన లాలూచీతో అతడిన్ని తప్పులు ఎలా చేయగలిగాడో ముందు విచారించాలి! పరిష్కారం అదే దొరుకుతుంది అన్నాడు వాల్మీకి.

    ఈ చిక్కు సమస్యకి ఒకటి పరిష్కారం ఉందని వినగానే రైతులకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది.

    వరుసగా ఆరోపణలు చెప్పడం ప్రారంభించారు.

    భూమి ఉన్న గ్రామంలో కాక మరో గ్రామంలో పాటలు జరిపాడు. అదేమంటే అది హెడ్డాఫీసు ఉన్న గ్రామం, అక్కడే జరపాలన్నాడు"

    "రైతుల దగ్గర లంచాలు పుచ్చుకుని పరాయి ఊళ్ళవాళ్ళకి తక్కువ రేట్లకి కౌలుకిచ్చి దాత, ప్రజల్ని దేవుణ్ణి ప్రభుత్వాన్ని ముంచేశాడు"

    "దొంగ రసీదులు పుట్టించి ఉత్సవాలలో తనుకూడా ఖర్చు రాసుకున్నాడు."

    "కూతురుకి కుష్టురోగం వచ్చిందని లక్షల వైద్యం చేయిస్తున్నాడు."

    "పెళ్ళాం మరొకడితో ఇల్లువిడిచి లేచిపోతే పట్నంలో పట్టుకుపోయిన వాడికి యాభై వేలిచ్చి భార్యని కాపురానికి తెచ్చుకున్నాడు."

    "దేవుడి వాహనాలు స్క్రాప్ క్రిందరాసి అమ్మేశాడు."

    "తాతలకాలంనాటి ఇత్తడి ఊచల పెద్దగేటు విరిగిపోయిందని దాన్ని అమ్మేసుకుని చిన్న ఇనుపగేటు ఆలయం ఖర్చుతో బిగించాడు."
 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS