"వెళ్లి పోతున్నారా దొరా!"
"అవున్రా! పనయిపోయింది!" ఓ వంద కాగితాన్ని వాడిచేతిలో పెట్టాడు ప్రశాంత్.
వాచ్ మన్ మొహం వెయ్యి కాండిల్ బల్బ్ లా వెలిగిపోయింది.
"మళ్లీ ఎప్పుడొస్తారు దొరా!" అడిగాడు.
"మళ్లీ కొత్తచేప దొరికినప్పుడు!"
వాచ్ మన్ మల్లప్ప వెకిలిగా నవ్వాడు.
"మీ గాలానికి తగులుకోని చేపలుండవు దొరా! ఆఖరికి తిమింగలాలుకూడా పడచ్చు!"
"వెర్రి సన్నాసి. తిమింగలాలు పడితే అవి మననే తినేస్తాయిరా!"
"నాకు తెలుసు దొరా! ఈ గెస్ట్ హౌస్ లో మీరు వెయ్య శోభనాలు చేసుకొంటారు అలా చేసుకోవాలని నేను దేవుడ్ని ప్రార్దిస్తున్నాను"
ప్రశాంత్ వాడికేసి చూసి నవ్వి బయటికి నడిచాడు.
వెనకే ప్రశాంత్ లగేజ్ ని పట్టుకొని వచ్చాడు మల్లప్ప.
కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు ప్రశాంత్.
కారు గేటులోంచి మట్టిరోడ్డు మీదికి వచ్చింది. అప్పుడతని ఆలోచన 'సల్మా' మీదకి వెళ్ళింది.
సల్మాఎలా వెళ్లిందో?
అక్కడ నుంచి ఆటో దొరకదు. బస్సులు కూడా ఆ రూటులో అంత ప్రీక్వంట్ గా నడవవు.
సల్మాని తనెంత దారుణంగా హింసించిందీ అతనికి తెలుసు.
అప్పుడప్పుడూ అది మామూలే అతనికి.
మాధురి జ్ఞాపకాలు మనసుని తొలిచేస్తుంటే ఎదురుగా వున్న ఆడదాన్ని కసితో హింసాధోరణిలో అనుభవించడం కొత్త కాదతనికి.
అలాంటి సమయంలో సాడిస్ట్ లా ప్రవర్తిస్తాడు. ఆడదాన్ని రక్త మాంసాలున్న మనిషిగా ఆ క్షణంలో అతను గుర్తించలేని పశువై పోతాడు.
ఆ విధంగా అతని రాక్షస అనుభవంలో సమధి అయిన సల్మా నెంబర్ ఎంతో?
అయితే సల్మా అంటే అతనికో ప్రత్యేకమైన అబిమానం వుంది.
సల్మా అందం అసమానమైంది.
ఆనందాన్ని తను పొందడం ఒక విధంగా అదృష్టం.
కానీ... ఆమె మనసు విరిగిపోయేలా ప్రవర్తించాడతను.
అది తప్పే!కానీ ఆ తప్పుని ఒప్పుకోలేని భేషజం అతనిలో వుంది. నిజానికి తనేమడిగినా ఇవ్వడానికి సల్మా రెడీగా వుంది.
ఎన్నోసార్లు ఇచ్చి పుచ్చుకొంది. ఇంకా ఆమె విషయంలో కోరిక కూడా చావలేదు అతనికి.
సల్మా ఎలాంటి రూపంలో బయటికి వెళ్లిందో గుర్తుకురాగా అతనికి కోపం వచ్చింది.
అస్తవ్యస్తమైన దుస్తుల్లో ఇంతదూరం నడిచి వచ్చి ఏ బస్సో ఎక్కి వెళ్లడం ఆమెకి సాధ్యమైన విషయమా!
చెంపలపైన పంటిగాట్లు, రక్తంలో ముంచిన దొండపళ్లలా పెదిమలు, జుత్తు చెదిరి, చిరిగిన జాకెట్, నలిగిన చీర...
ఓహ్!
రోడ్డుమీదకి కారు తిరిగాక ఓసారి చుట్టూ పరిశీలనగా చూసాడు.
కానీ సల్మా జాడలేదు.
ఎలా వెళ్లిందోకానీ వెళ్లిపోయింది.
ఇప్పుడు తను ఆమె దృష్టి ఎంతో అధమ స్థాయిలో పడిపోయి వుంటాడు.
రోత, జుగుప్స, అసహనం.
బహుశా భవిష్యత్తులో సల్మా ఇక తనకోసం రాకపోవచ్చు.
రాదు.
అయిదే అది ప్రశాంత్ కి బాధ కలిగించే విషయం ఏమీ కాదు.
ఎందరెందరో .. అతని చుట్టూ సీతాకోక చిలుకల్లా పరిభ్రమిస్తున్నారు.
ఒకసారి పరిచయం అయ్యాక -
కొందరు ఇప్పటికే వస్తూనే వున్నారు.
మరికొందరు ఒక్కసారితోనే తెరమరుగయ్యారు. ఇంకొందర్ని అతనే రావద్దని చెప్పాడు.
సల్మాతో ఇంకొంత కాలం నడిపించాలనుకొన్నాడు.
అతనికి ఆమె మీద మోజు తీరలేదింకా.
ఎనీ హౌ?
షి లెఫ్ట్.
ప్రశాంత్ కింది పెదిమని కొరుక్కున్నాడు. కారు స్పీడు పెరిగింది.
బోయిన్ పల్లి నేషనల్ హైవే మీద పరుగుతీస్తోంది.
17
ప్రశాంత్ ఓ తలుపు తెరిచాడు.
లోపల గది చీకటిగా వుంది చేతిలో బ్రీఫ్ కేస్ పట్టుకుని లోపలికి నడిచాడు.
గుమ్మం పక్కనే వున్న స్విచ్ బోర్డుమీద చేయివేసి స్విచ్ నొక్కాడు.
గదిలో లైట్ వెలిగింది.
ఆ గదిలో మంచి ఫర్నిచర్ వుంది. ఓ కాట్ వుంది. టి. వి. వి. సి ఆర్. అమర్చి వున్నాయి.రాక్స్ లో రకరకాల బుక్స్ అందంగా సర్దివున్నాయి. ఓ టేబిల్, దానిముందు రివాల్వింగ్ ఛైర్.
