ఇక అతను ఇవ్వబోయే నాలుగొందల కోసం - ఆశగా చూస్తున్నాడు!
ప్రశాంత్ తన పర్స్ లోంచి వంద నోటు తీసి ఇచ్చాడు మళ్లీ.
సూరిబాబు మొహం చిన్నబోయింది.
"డోంట్ వర్రీ! నాకు ఇంకా డబ్బు రాలేదు! రాగానే ఇచ్చేస్తాను. ఈలోగా నువ్వు మొన్న చెప్పిన క్రైం థ్రిల్లర్ నవల ప్రారంభించేయ్!" అన్నాడు ప్రశాంత్ సిగరెట్ వెలిగించుకుంటూ. ...
సూరిబాబు ఆ వందనోటు జేబులో పెట్టుకుని లేచి నిల్చున్నాడు.
"ప్రశాంత్ ఇంటి ఓనరు ఇల్లు ఖాలీ చెయ్యమంటున్నాడు!" అన్నాడు సూరిబాబు.
"వ్వాట్!"
"ఔను... నేను ఐదొందలు బాకీ వున్నానతనికి..."
"డోంట్ వర్రీ ఓ నెలరోజులు ఓపిక పట్టు... నేను రెండు గదులున్న పోర్షన్ అద్దెకు తీసుకుంటాను. .. నువ్వు అక్కడే నాతో పాటూ వుండొచ్చు.. నీ ఖర్చులన్నీ నేనే చూసుకుంటాను. మీ ఇంటికి నెల నెలా ఎంతో కొంత పంపించేటట్టు నేను చూస్తాను!"అన్నాడు ప్రశాంత్.
అలా మొదలయ్యింది "ప్రశాంత్" అనే ప్రముఖ నవలా రచయిత సాహిత్య జీవితం.
"నేను పతివ్రతను కాను" సీరియల్ ప్రారంభం అయిన వారపత్రిక "కవర్ ఫిగర్" ప్రశాంతే!"
అతను ఊహించిన దానికన్నా అధ్బుతమైన రెస్పాన్స్ వచ్చింది పాఠకలోకంనుంచి.
అతనికి బిరుదులు కూడా ప్రసాదించింది ఆ పత్రిక!!
"నవ్య నవలా సాహితీ కపోతం" అని ఒక వారం... "నవీన సాహిత్య సామ్రాట్" అని ఒక వారం "శృంగార సాహితీ కిశోరం" అని ఒక వారం, "సువర్ణాక్షర సార్వభౌమ" అని ఒక వారం.. . ఇలా వారం వారం మారుతున్న కాప్షన్స్ కొరడా ఝళిపింపుల్లాంటి ముఖాముఖి జవాబులతో.... కాంట్రవర్షియల్ సెన్సేషనల్ సక్సెస్ ఫుల్ సీరియల్ రైటర్ గా ప్రశాంత్ జీవితంలో సువర్ణాధ్యాయం మొదలయ్యింది!
ఆంధ్రదేశంలోని అన్ని పత్రికలూ అతని మీదకి దృష్టి మళ్లించాయి.
అతని పారితోషికం పదింతలయ్యింది!!
అతని స్టాటస్ మారిపోయింది!
పెద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నాడు!
ఇప్పుడు తెలుగు సాహితీ ప్రపంచంలో "ప్రశాంత్" పేరు ప్రచురించని పత్రికలేదు. అతని నవల చదవని పాఠకులు లేరు. అతని భాషా పాండిత్యాన్ని అకాశానికెత్తని సాహితీ సమాఖ్య లేదు. అతని ఆటోగ్రాఫ్ కోసం ఎగబడని అభిమాని లేడు.
ఆ అభిమానుల ప్రవాహంలో....
సాహితీ సామ్రాట్టుని గ్లామర్ ప్రపంచపు మణిదీపం చుట్టూ రెక్కలు చాచి పరిభ్రమిస్తున్న... ఎందరో అప్సరసా శిరోమణుల్లో.... సల్మాకూడా ఒకర్తె!!....
ప్రముఖ నవలా రచయిత... ఆరడుగుల అందగాడు..... గ్లామర్ కింగ్... ప్రశాంత్ శృంగార సామ్రాజ్యంలోకి అడుగుపెట్టి.. సర్వస్వం కోల్పోయి... అతని పైశాచిక కామకేళీ విన్యాసాలకు తట్టుకోలేక.....
అతన్ని కసితీరా శపిస్తూ సల్మా వెళ్లిపోయిన ఆ క్షణంలో .. ప్రశాంత్ కి గతమంతా గుర్తుకు వచ్చింది!
ఆ గతంలో బైటికి వస్తూ... చుట్టూ చూసాడు ప్రశాంత్....
16
ఒంటరితనం ఎందుకో ప్రశాంత్ కి భయాన్ని కలిగించింది...
బయట వరండాలోకి వచ్చి నించుని సిగిరెట్ వెలిగించాడు.
రెండు దమ్ములు బలంగా లాగి సిగరెట్ ని దూరంగా విసిరేసి లోపలికి నడిచాడతను.
అతని మనసులో చెలరేగిన అలజడి ఇంకా తగ్గలేదు.
మెల్లగా అద్దం దగ్గరకి నడిచా డతను.
అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకొని ఉలిక్కిపడ్డాడు ప్రశాంత్.
మొహం జేవురించి చాలా చాలా వికృతంగా వుంది.
నూరు గొడ్లని తిన్న రాబందులా వుంది అతని మొహం.
"షీట్!" కోపంగా అనుకొన్నాడు.
టీపాయ్ మీద వున్న విస్కీ సీసామీద పడింది అతని చూపు. అందులో నాలుగోవంతు మిగిలి వుంది విస్కీ.
సీసాని ఎత్తిపట్టి రెండే రెండు గుక్కల్లో తాగేశాడు విస్కీని.
గొంతులో మంట.
చేత్తో గొంతుని సవరదీసుకొన్నాడు.
అతని కళ్లు ఎరుపెక్కాయి.
తూలుతూ బీరువా దగ్గరకి నడిచి అందులోంచి బట్టలని తీసి బ్రీఫ్ కేస్ లో పెట్టేశాడు.
వాచ్ మన్ మల్లప్ప వచ్చి గుమ్మంలో నించున్నాడు.
"దొరసానమ్మా ఏదిదొరా! అడిగాడు.
ప్రశాంత్ వాడికేసి కోపంగా చూశాడు.
"అది దొరసాని కాదురా.. ఇంతవరకూ ఏ దొరసానీ నా గుండె తలుపుని తట్టి నా జీవితంలోకి ప్రవేశించలేదు. అగ్ని గుండం చల్లారింది. వెళ్లిపోయింది. "
