Previous Page Next Page 
పరిహారం పేజి 29


    అతడు తన గదిలోకి వచ్చి, బటట్లుమార్చి నింపాదిగా పక్క మీదవాలి పారిజాత ఉత్తరం చదువసాగాడు.
    "మనూ!"
    నేను నా అభిమానాన్ని చంపుకొని ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. ఎటూ గతిలేక ఎవరూ ఆదుకొనేవారు లేక ఎంతో కష్టంలో వుండి నీకీ వుత్తరం వ్రాస్తున్నాను. అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. ప్రాణం కంటే మిన్నగా, ఆప్యాయంగాపెంచిన మా నాన్న కూడా నన్ను విడిచి వెళ్ళిపోయాడు అమ్మ తరపున గాని, నాన్న తరపున గాని నా కెవరూ బంధువులు లేరు.
    నాకున్న ఒకే ఒక్క స్నేహితురాలు లలిత. ప్రాణమైనా ఇవ్వగలిగిన స్నేహం ఆమెది. కాని భర్తచాటుమనిషి. ఈ కష్టంలో ఆమె నాకేమీ వుపాయం చెప్పలేదు. మనూ! ఈ ప్రపంచంలో వుపాయం చెప్పగలిగిన వాడివి నువ్వొక్కడివే కనిపిస్తున్నావు!
    నన్ను ప్రేమించమని అడగటం లేదు నిన్ను. పెళ్ళి చేసుకొమ్మనీ అడగడంలేదు. కేవలం గౌరవంగా బ్రతకడం కోసం నా కింత దారి చూపు. ఇంక నిన్నేమీ అడగను. నాకు సహాయం చేసే అవసరం నీకిక లేకపోవచ్చు. నా పెదవుల మీద ముద్దు పెట్టుకొన్న దానికి పరిహారంగా నువ్వు మా నాన్న ఆత్మశాంతిగా వెళ్ళిపోవడం కోసం అపూర్వమైన సహాయం చేశావు. దానితో నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొన్నట్టుగా తృప్తిపడ్డావు! ఇక ఆ సంఘటన తలచుకొని సిగ్గుపడే అవసరం నీకు లేదనుకొంటావు కదూ?! తాని. మనూ? నీ పెదవులు నా పెదవుల్ని తాకిన ఆ క్షణాల్ని నే నెలా మరచిపోగల ననుకొన్నావు? కన్నెపిల్ల మనసును స్వర్గపు అంచులకు తీసుకు వెళ్ళగలిగిన క్షణాలవి. ఈ పేదరాలికి నీ గుండెలో కాస్త ఆశ్రయం దొరికిందని మరిచిపోయిన క్షణాలవి! కాని, మనూ! నువ్వేం చేశావు? అది కేవలం క్షణికోద్రేకంతో జరిగిపోయిన పొరపాటుగానే ప్రవర్తించావు. ఆ సంఘటన తాలూకు స్మృతిని చెరిపివేయడానికి నువ్వు చూపిన తహతహ నన్నెంత బాధ పెట్టిందో ఎలా చెప్పను? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనీ, అమ్మకోసం పెళ్ళాడలేనని చెబితే నే నెంత సంతోషించేదాన్ని?"
    ఇప్పటికీ నీ హృదయంలో నా కెటువంటి స్థానముందో తెలియదు. దొరికిన ఏకాంతం నిన్ను రెచ్చగొట్టిందో, ఇంతకు నేనంటే నీ కలాంటి ఆలోచన ఏర్పడిందో అంతకంటే తెలియదు. కేవలం అది క్షణికావేశం కాదని చెబితే నా కెంత సంతోషంగా ఉండేది!
    ఇహ ఇప్పుడు నాకొచ్చిన కష్టమేమిటో చెప్పనా?
    రాక్షసిలాంటి మేనత్త చేతిలో వచ్చిపడ్డాను. వచ్చిన వారం పదిరోజులదాకా ఆమె నన్నెంత ప్రేమగా చూచిందని! కొత్త చీరలు తీసింది. తన నగలన్నీ అలంకరించింది. ఇక ఇంట్లో దీపం పెట్టుకోనక్కరలేదంది. ఇదంతా ఎందుకో తెలుసా? ఆమెకు చిలకమర్తివారి గణపతి లాంటికొడుకున్నాడు. అతడికి నన్నిచ్చి చేస్తుందట. నేను చేసుకోనని ఖచ్చితంగా చెప్పేసరికి ఇల్లే ఒక జైలుగా మార్చివేసింది. ఇంట్లోంచి పారిపోయేందుకు వీల్లేకుండా కట్టుదిట్టాలు చేసింది. ఇంట్లో పనులన్నీ నా చేతే చేయిస్తూంది! తల్లిలేని పిల్లనని నాన్న నన్నెంత అపురూపంగా పెంచాడు! కనీసం వంటదగ్గరికి కూడా సరిగా రానిచ్చేవాడు కాదు. అలాంటప్పుడు తెల్లవారుజామున లేస్తే రాత్రి పదిగంటల దాకా ఏదో ఒక పని! నీళ్ళుతోడి, అంట్లుతోమి నాచేతులు బొబ్బలెక్కి రోజూ చితుకుతున్నాయి. ఇంకో రెండు రోజుల్లో యీ చేతులు మొద్దుబారి పోతాయి.
    మా కామమ్మ అత్త చేలు చూచి రావడానికి బండి కట్టుకొని పొలానికి వెళ్ళింది. మా హనుమంతు బావను మంచిచేసుకొని ఈ పెన్ను ఈ కాగితాలు సంపాదించాను. పెరట్లో చేదబావిదగ్గర చిక్కగా పరుచుకున్న చెట్లనీడలో నీకీ ఉత్తరం వ్రాస్తున్నాను. నాకెందుకో యీ సమయంలో నువ్విక్కడ వుంటే ఎంత బాగుండేదనిపిస్తోంది. నా పిచ్చి గాని, యీ క్షణంలో నువ్విక్కడికి ఎలా వస్తావు మనూ? నీకీ ఉత్తరం చేరేసరికే రెండు రోజులు అవుతుంది.
    నన్నీ చెరనుండి విడిపించడానికి నువ్వు వస్తావోరావో -
    నువ్వు తప్ప నన్ను ఆదుకొనే వారెవరూ లేరు. కొద్దిగా చేయి ఆసరాగా ఇచ్చి యీ ఆపదనుండి బయటకు లాగు మనూ! అలా అని నీ మెడకు పడను! నావల్ల నీకే యిబ్బందీ రాకుండా చూస్తానని  హామీ యిస్తున్నాను. రేపో, ఎల్లుండో హనుమంతు బావతో నా పెళ్ళికి ముహూర్తం నిర్ణయం చేస్తారు. ఆ ఉరి నా మెడకు పడకముందే నన్ను రక్షించు. నువ్వొస్తే తపs్ప ఈ ఇంట్లోంచి నేను బయటపడలేను. నీ కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తూ -
                                                                                                             పారిజాత."
    ఉత్తరం పూర్తిచేసేసరికి మనోహర్ మనస్సంతా ఎలాగో అయింది. పారిజాత ఆర్తిగా పిలుస్తున్నట్టుగా తనామె కోసం వెళ్లవలసినవాడిలా అనిపించింది. ఉన్నంతలో తండ్రి ఆమెను ఎంత అపురూపంగా పెంచుకొన్నాడు! తండ్రి పోయి ఆ పిల్లకు ఎన్ని కష్టాలు దాపురించాయి! మనోహర్ మనసు జాలితో ద్రవించిపోయింది. కాని అది కొద్దిక్షణాలు మాత్రమే. తన వివాహము రజనితో స్థిరపడబోతున్న సంగతి అతడికి చటుక్కున గుర్తు వచ్చింది. రజని ముగ్ధమనోహర రూపం అతడి కళ్ళెదుట నిలబడింది. ఒక కోటీశ్వరుడికి, అల్లుడు కాబోతున్న సంగతి స్పురణకు వచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS