"సరే" తలవంచుకొని తన గదిలోకి వెళ్ళి బట్టలన్నీ పెట్టెలో సర్దుకోసాగింది దేవదాసి.
సుబ్బయ్య వచ్చాడు. "ఏమిటి తల్లీ? ఈ మధ్యాహ్నం వేళ ఆకలి కడుపుతో వెళ్ళిపోతారా?"
"బండి కడుతున్నారేమో చూడండి తొందరగా కట్టమనండి" ఓ ప్రక్క కళ్ళు తుడుచుకొంటూనే చెప్పింది దేవదాసి.
చరచరా గదిలోకి వచ్చిన కృష్ణవేణి, దేవదాసి చేతిలోని చీర లాగేసి "చాల్లే! మహారోసం పుట్టుక! కోపమొచ్చి కసురుకొంటే ఏదో మతిచెడింది వాగుకొందని ఊరుకోక మొహంమీద కొట్టినట్లు వెళ్ళిపోవడమే?" అంది నవ్వుతూ నిష్ఠూరమాడుతూ.
ముఖం తిప్పుకొంది దేవదాసి.
"తిందాం పద, మొండీ: సుబ్బయ్యగారూ, వడ్డనకు పదండి!"
మాట విన్నదే తడవు, సుబ్బయ్య ఉత్సాహంగా వంట గదికేసి సాగాడు.
ఎన్నడూ లేనిది నాటి సాయంత్రం మేనకోడలికి జడవేయడానికి కూర్చొంది కృష్ణవేణి, దేవదాసి పెట్టుకోకుండా లోపల వేసిన జడగంటలు, రాగిణి. జడబిళ్ళ అన్నీ తెప్పించి పెట్టింది. తన చంద్రహారం తీసి కోడలి మెడలో వేసింది. తను స్వయంగా కట్టిన కదంబమాల జడలో తురిమి "ఈ బట్టలు అంతబాగా లేవు మంచి బట్టలు వేసుకో" అని చెప్పింది.
"ఎక్కడికైనా వెళ్ళేదుందా, అత్తా?"
"ఎక్కడికీ లేదు."
"మరి?"
కోడలి బుగ్గలు ఆప్యాయంగా చేతిలోకి తీసుకొని "ఈ బంగారు బొమ్మను ముందుపెట్టి అడగాలి మీ బావను! ఇంతటి సౌందర్యాన్ని తృణీకరించగల శుకుడు కాదు వాడు!" అన్నది కృష్ణవేణి.
చటుక్కున కృష్ణవేణి పాదాలు పట్టుకొంది దేవదాసి. "నీకాళ్ళు పట్టుకొంటానత్తా అలాచేయకు సిగ్గుతో చచ్చిపోవాలి నేను."
"పిచ్చిపిల్లా, పిచ్చిపిల్లా!" తేలికగా, పరిహాసంగా నవ్విందావిడ. "సిగ్గుపడు. మరీ అందమే పెళ్ళి అంటే సిగ్గుపడని కన్నెపిల్ల ఎక్కడే? జీవితంలో మరిచిపోకూడని అదొక మధుర ఘట్టం!"
"కాదత్తా" ఇబ్బందిగా, జాలిగా పెట్టింది ముఖం.
ఆ పిల్ల చుబుకంపట్టి కుతూహలంగా ప్రశ్నించింది కృష్ణవేణి "బావ అంటే యిష్టమేకదూ, దేవీ?"
మృదుహస్తాలలో మొగం దాచుకొంది దేవదాసి "అది కాదత్తా!....."
కృష్ణవేణి ఆందోళనను వ్యక్తపరుస్తూ అడిగింది. "ఏమిటే?"
"అత్తయ్య మనస్సెందుకు నొప్పిస్తావంటూ బావను పెళ్ళికి ఒప్పించడానికి ఎన్నో విధాల వాదించాను. నన్నే మనసులో పెట్టుకొని పోరానని అనుకోడూ బావ?"
"ఇంతేనా?" తృప్తిగా ఊపిరి వదిలింది కృష్ణవేణి "నీ భ్రమ! అలా ఎందుకు అనుకొంటాడు?"
"ఉహుఁ అడగకత్తా! బావ ఎదుట పడలేనిక. నా ప్రార్థన కాదని నువ్వడిగావంటే చూడు! ఈరోజే మా ఊరికి పారిపోతాను."
కృష్ణవేణి ఉత్సాహమంతా ఎగిరిపోయి దిగులావరించింది మనసు. "సరేలే! అంతా బాగా మొదలయ్యారు నా ప్రాణానికి!" అని విసుక్కొంటూ అక్కడినుండి వెళ్ళిపోయింది.
కార్తీక శుద్ధ ఏకాదశినాడు శ్రీ సత్యనారాయణస్వామివారి వ్రతం పీటలమీద కూర్చొని నిర్విఘ్నంగా కొనసాగించారు కృష్ణవేణి దంపతులు.
వ్రతానికి ఆహ్వానించబడ్డ సూర్యదేవులు సకుటుంబంగా వచ్చి రెండురోజులున్నారు. రేపు వెళ్ళిపోతామనగా ఆడబిడ్డతో దేవదాసి వివాహ ప్రస్తావన తెచ్చింది శ్రీలక్ష్మి.
"తిరుమలాపురం వాళ్ళకు పెళ్ళికి తొందర ఉన్నదట. అన్నీ కుదిరిపోతే ఈ మాఘంలోనే చేయాలని కబుర్లుమీద కబుర్లు పెడుతున్నారు. ముందు పిల్లవాడి జాతకం పంపించండి. పిల్ల జాతకంతో చూపించి కుదిరితే పిల్లవాడిని వచ్చి పిల్లను చూచిపొమ్మంటాం అని చెప్పి పంపాము.
కుదిరినా కుదరకపోయినా పిల్లను పరాయింటికి ఇవ్వాలనిలేదు వదినా! సలక్షణంగా మేనల్లుడుండగా కొత్త సంబంధం కలుపుకోవడం ఎందుకు? దేవతను నీ ఇంట్లో పడేసేనా నాకు నిశ్చింత ఏం, వదినా?" ఆత్రంగా అడిగింది శ్రీలక్ష్మి.
"నా సంగతి నీకు తెలియందేముంది, శ్రీలక్ష్మి? దేవిని నా కోడల్ని చేసుకోవడంకంటే నాకు కావల్సిందేముంది? కాని నాదేముంది? నీ మేనల్లుడున్నాడు. అడుగు అతడిని ఒప్పించగలిగావంటే దేవి ఈ ఇంటిదైందన్నమాటే!" అన్నది కృష్ణవేణి.
భార్గవరామ్ వివాహానికి విముఖడైన సంగతీ, కృష్ణవేమి నిరాహారదీక్ష సంగతీ ఏమీ తెలియదు శ్రీలక్ష్మికి తెలిస్తే అసలు, దేవదాసిని ఈ ఇంట వేసే ఉద్దేశ్యమే బయటపెట్టేది కాదేమో!
