"నన్ను కొట్టకపోవచ్చు కానీ ఇలా చేశానని నా మీద కక్ష పెరిగిపోతుంది. అదను చూచుకొని కాలనాగులా కాటు వేయడానికి సిద్దపడితే?"
"అప్పుడతడికోసం ఉరిత్రాడు సిద్దంగా వుంటుందన్న నిజం అతడికి తెలియజేయాలి."
"కాని, హరితా!" శుష్కహాసం చేసింది ప్రమీల "గుమ్మంలో నిలబడితేనే చావు దెబ్బలు తినే నేను గుమ్మం దాటి ఏ కోర్టుకు వెళ్లి ఫిర్యాదు చేయగలనా? ఏ పోలీసు స్టేషనుకు వెళ్లి చెప్పుకోగలను నా బాధ? మహిళలమీద జరిగే అత్యాచారాల విచారణ కోసం ప్రత్యేక కోర్టులూ, ప్రత్యేక పోలీసుస్టేషన్లూ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది గాని నాలాంటి అబలలకు న్యాయం ఎంత దగ్గిరిగా రావాలనుకొంటే మేం అంత దూరమైపోతున్నాం కదా? ఆయనే వుంటే మంగలాడెందుకన్నట్టు ఎవరి దగ్గరికో వెళ్లి ఫిర్యాదు చేసుకోగల ధీమానే వుంటే ఇంట్లో ఆయనచేత గొడ్డులా ఎందుకు తన్నులు తింటాను? ఏం చేస్తే ఆయనకి కోపం వస్తుందో? ఏం అంటే ఆయనకి కోపం పెరుగుతుందో అని ఎప్పుడూ హడలిపోయే నేను, కోర్టులకూ, పోలీసుస్టేషన్లకూ వెళ్ళగలనా? అసలు, మనిషిలో మార్పు వస్తే సుఖపడగలను గాని, అతడిని బెదిరించి, అదిలించి చేసే కాపురం కాపురమవుతుందా?"
"ఇలా అధైర్యపడే, ఇలా నీరసపడే పురుషుడి దౌష్ట్యానికి బలైపోతున్నారండీ మీలాంటివాళ్లు. మీలాంటి నిస్సహాయులకోసమే ప్రత్యేక న్యాయస్థానాలూ, పోలీసు స్టేషన్లూ ఏర్పరచింది ప్రభుత్వం వాటిని ఉపయోగించుకోకు పోతే ఎలా? భర్త పెట్టే, అత్తపెట్టే చిత్రహింసని మూగగా భరించే రోజులు పోవాలండీ, దెబ్బకు దెయ్యం జడుస్తుంది. కోర్టు భయం, పోలీసుల భయమూ వుంటే మనిషిదారికి రాక ఏమౌతాడు?"
"నీకు తెలీదు. హరీ! ఆలుమగలమధ్య వ్యవహారం చాలా సున్నితంగా వుంటుంది ముందే కిరాతకుడు. ఇంకా బయటికి వెళ్లి పిర్యాదు చేస్తే మరీ రెచ్చిపోడూ?ఆ కోపానికి ఆహుతి అయ్యేది ప్రమీలే కదా? నువ్వు ఇలాంటి సలహా ఇవ్వడం బాగాలేదు." హేమలత కూతుర్నిమందలించింది.
"పిల్లల్ని కనమన్న నీ సలహాకంటే, ఓపికపడితే అన్నీ సర్దుకొంటాయన్న నీ సలహాకంటే మంచి సలహానే ఇచ్చాననుకొంటున్నాను. కోర్టులకు పోలీసుల దగ్గరికివెళ్లే ధైర్యం లేకపోతే సరే. సిటీలో డౌరీ డెత్ కమిటీ వుందికదా? వెళ్ళి వాళ్ల సహాయం అర్దిస్తే బాగుంటుంది."
"వాళ్లెవరితోనూ నాకు పరిచయంలేదు. ఎలా వెళ్ళి నా కష్టసుఖాలు చెప్పుకోవాలి?"
"దీనికి పరిచయమెందుకు? మీలాంటి వాళ్లకోసమే ఆ కమిటీ ఏర్పడింది. దాన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత మీలాంటి వాళ్లది. ఒక్కరూ పోలేరనుకొంటే నేను వెంటబెట్టుకు వెడతాను మిమ్మల్ని."
"మీరు సాయం వస్తానంటే వస్తాను" ఆశగా అంది ప్రమీల "కాని ఈ కారణంగా ఇంట్లో ఏం గొడవ బయల్దేరుతుందోనని భయంగా వుంది."
"గొడవలన్నీ సర్దుకోవాలనే కదా ఈ ప్రయత్నం."
"ఎప్పుడు వెడదాం?'
"నా ఫ్రెండు ఒకామె డౌరీడెత్ కమిటీలో వర్క్ చేస్తోంది. ఆమెకు ఫోన్ చేసి ఎప్పుడు మనం వెళ్లాల్సిందీ చెబుతాను."
"ప్రమీలా! ఇక్కడున్నావా? ఎక్కడికి వెళ్లావోనని వెదికి వెదికి చస్తున్నాను వాడొచ్చే వేళయింది. వాడొచ్చే సరికినువ్వు ఇంట్లో లేకపోతే ఎగురుతాడు. ఎందుకు అనవసరంగా వాడికి కోపం తెప్పించడం? పద!" అంది ప్రమీల అత్తగారు వచ్చి. ఈవిడేనా కోడలు మీద చాడీలు చెప్పి కొడుకుచేత తన్నించేది అని ఆశ్చర్యం కలుగుతుంది ఆవిణ్ణి చూస్తే.
ప్రమీల వెళ్లిపోగానే -
"నువ్వు జోక్యం చేసుకోవడం నాకేమీ నచ్చలేదు హరీ! నువ్వు చేస్తున్న పనికి ఆమె కాపురం ఇంకా చిక్కులకు గురి అవుతుందిగాని, సమస్యలను పరిష్కరించదు!" అంది హేమలత కూతుర్ని చివాట్లు పెడుతూ.
"ఎవరి భయమూ లేక కుందేలుపిల్లమీద సింహంలా దూకుతున్నాడమ్మా ప్రమీల భర్త....... మహిళా మండలి కార్యకర్తలను రంగంలోకి దింపి అతడిని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు త్రాగించకపోతే చూడు!"
"అదే నీకెందుకు, లేనిపోని గొడవ అంటున్నాను."
"అదేంమాట, మమ్మీ! మనం సంఘ జీవులం... సమాజంలో వుంటున్నాం సమాజం అవసరం మనకెంత వుంటుందో, సమాజానికి మన అవసరం అంతే వుంటుంది... పొరుగున ఒక అత్తింటి కోడలు ఆరడిపడుతుంటే భర్త దౌష్ట్యానికి బలైపోతూంటే సంఘజీవిగా మన బాధ్యత ఏమిటి?"
"ఆలుమగల మధ్య తగాదా చాలా సున్నితమైనది! అది వాళ్లకి వాళ్లే సర్దుకోవాలి గాని ఇతరుల జోక్యంవల్ల ఇంకా దెబ్బతింటుంది వాళ్ళ మధ్య సంబంధం. "
