Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 30

    "మరి నీ సంగతి  ఏమిటి?" అన్నారు.

    "ఏముంది? సాయంకాలం నేను హైదరాబాద్ టు మద్రాస్ ఎక్స్ ప్రెస్ పట్టుకొని ఇంటికి వెళ్ళిపోతాను. మీరు విశాఖ ప్రోగ్రాం  ముగించుకొని ఇంటికొచ్చేస్తారుగా" అన్నాను.

    "మరెక్కడికి వెళతాను  సరోజా! బైజూ  నా దగ్గరే వున్నాడు. ఏ పని చేస్తున్నా నా నిఘా అంతా వాడి మీదే వుంటుంది. వాడ్ని మళ్ళీ భద్రంగా నీ చేతికి అప్పగించే వరకూ  నాకు నిద్ర పట్టదు" అన్నారు. నేను నవ్వాను.

    ఆయన "కార్లో విజయవాడ వెళ్ళి, అక్కడినుండీ  ట్రెయిన్  పట్టుకొని విశాఖపట్నం చేరుకుంటా"నన్నారు.

    సికింద్రాబాద్ లోనే వున్న నా తమ్ముడు  కృష్ణారావు ఇంట్లో  నన్ను దింపేసి, "మద్రాసు బండి జాగ్రత్తగా ఎక్కించమ"ని  చెప్పి, బైజుని తీసుకొని వెళ్ళిపోయారాయన. శ్రీశ్రీగారితోపాటు  కార్లో  పురిపండావాకు కూడా వున్నారు.

    నేను మర్నాడు ఎనిమిది గంటలకల్లా  ఇల్లు  చేరుకున్నాను. ఆ రోజే షష్టిపూర్తి అన్నమాట.

    మధ్యాహ్నం  పన్నెండు__ఒంటిగంట  మధ్య  సమయంలో  ఆయన  దగ్గర నుండి  ఫోను వచ్చింది.

    "అనకాపల్లిలో  మూడు నాలుగు గంటలు లేటయ్యింది సరోజా! నూకాలమ్మ పండగట. జనం బండిని కదలనివ్వలేదు. ఉదయం  కవితా గోష్ఠికి కూడా హాజరులేకపోయాను. మరేమీ కంగారుపడకు. షష్టిపూర్తి సన్మానానికి వుంటాలే. బైజు బాగున్నాడు.

    ఇక్కడ చాలా ప్రోగ్రాములున్నాయి.విశాఖ నుండి  ప్రారంభిస్తే కటకం దాకా  సన్మానాలు అప్పుడే ఏర్పాట్లు  చేసేశారు. అవన్నీ ఈ ఊపునే  వెళ్ళలేంకానీ  విజయనగరం, శ్రీకాకుళం మాత్రం వెళ్ళక తప్పదను కుంటాను. ఇవన్నీ  పూర్తిచేసుకొని, నేను వచ్చేస్తాను. నువ్వు అనవసరంగా బెంగపడకు" అని చెప్పేసి  ఫోన్ పొట్టేశారు.

    రెండో రోజు  రాత్రి మళ్ళీ ఫోన్ చేసి, "ఇక్కడ సభలూ, సన్మానాలూ జయప్రదంగా  జరిగాయి. నేను వచ్చాక నీకు  డిటెయిల్స్  చెప్తాన"ని చెప్పారు.

    ఏ ఆటంకమూ లేకుండా  విశాఖ ప్రోగ్రాం  బాగా జరిగినందుకు  నాకెంతో సంతోషం కలిగింది.

    ఆయన ఫోన్  చేసినపుడే "ఆరుద్రగారు వచ్చారా?" అని అడిగాను.

    "దంపతులిద్దరూ  వచ్చారు. నేను  వచ్చాక  అన్ని విషయాలు చెప్తానుగా" అన్నారు.

    పెద్ద ఆందోళన తీరిందని, ఇక ఆయన రాకకి ఎదురుచూడడం  ప్రారంభించాను.

    సన్మానం  అయిపోయిన  తర్వాత సావకాశంగా అన్ని పనులూ చేసుకొని అయిదవ రోజునాటికి కొడుకుతో శ్రీశ్రీగారు  మద్రాసు చేరుకున్నారు. "మళ్ళీ  బైజుని తీసుకొని రెండుమూడు రోజుల్లో బయలుదేరాలి" అన్నారు.

    "ఎక్కడికి?" అన్నాను.

    "నూజివీడు, చిత్తూరు వెళ్ళాలి" అన్నారు.

    "సరే__టైముందికదా? షష్టిపూర్తి  విశేషాలు చెపుదురూ" అన్నాను.

    "సన్మానం చాలా బాగా  జరిగింది సరోజా! ఊపిరి తీసుకోడానికి కూడా టైము లేదంటే  నమ్ము. శ్రీశ్రీకి సన్మానం అంటే  సంతోషించిన వాళ్ళ సంఖ్యే ఎక్కువనుకో" అన్నారు.

    "సరే కానీ  ఎవరెవరు  వచ్చారు?" అని అడిగాను.

    "ఎవరు రాలేదని  చెప్పమంటావు? గ్రౌండ్ అంతా జనంతో కిటకిటలాడిపోయింది. సన్మానం చేసిన మిత్రులంతా  ఒక కమిటీగా  ఏర్పడి 'శ్రీశ్రీ షష్టిపూర్తి  సన్మాన సంఘం' అని పేరు పెట్టి, షష్టిపూర్తి  సన్మాన సందర్భంలో  అంతవరకూ  నేను రాసినదంతా 'శ్రీశ్రీ సాహిత్యం' అని పేరుపెట్టి  అందులో 'సంకల్పం' అని హెడ్డింగ్ పెట్టి కొన్ని మాటలు రాశారు. ఇదిగో చదువు" అని ఒక పుస్తకం నా చేతిలో వుంచారు.


                                                  మందపల్లి  మహారాణి


    షష్టిపూర్తి  సమ్మాన సంఘం  ప్రచురించిన  వాల్యూములలో  ఆయన నాకు ఇచ్చిన ఓ వాల్యూములోని  'సంకల్పం' అనే శీర్షిక కింద ప్రచురించిన అంశాన్ని చదివాను. అందులో ఇలా వుంది_

    "నిత్యహరితమైన  శ్రీశ్రీ జీవితంలో షష్టిపూర్తి  అనేది ఒక సరిహద్దుకాదు. కొండగుర్తు మాత్రమే. ఈ అరవై ఏళ్ళలో దాదాపు ఒక అర్ధ శతాబ్దకాలం  ఆయన సాహిత్య సృజనకు  గావ్యయించాడు. ఆంద్రసాహిత్యానికి ఆధునికతనేగాక  ప్రయోజనపరత్వాన్ని  చేకూర్చేవిధంగా  అనన్య ప్రతిభ తోటి  యావదాంధ్ర దేశానికి  నిస్తులమయిన అక్షరసంపదను సమర్పించాడు.

    లోక జీవనానికి  సాహిత్యాన్నొక స్వర్ణముకురం  చేస్తూ  సాహిత్య ప్రజాతంత్ర సంప్రదాయానికి ధ్వజారోహణ  చేశాడు. ప్రయోగపరత్వం పూర్తిగా  పెడదారులు  పట్టకుండా  జాగరూకత వహించి  నవ్యత్వానికి భవ్యత్వాన్ని  జోడించి  జీవితానికీ సాహిత్యానికీ  ఉండవలసిన  అన్యోన్యాశ్రయత్వాన్ని  చేసి చూపాడు, రాసి చూపాడు.

    శ్రీశ్రీ షష్టిపూర్తి  సందర్భంలో మేమాయనకు  యావదాంధ్రదేశం  తరపున సమర్పిస్తున్న  కానుక ఈ శ్రీశ్రీ సాహిత్యమే. రాశిలోనూ  గుణంలోనూ  ఇది గణనీయమైనది.

    పత్రికలలో  మాటుమణగిపోయి  యుండిన  శ్రీశ్రీ రచనలను  తవ్వితీయడం పరిశోధనకాకపోయినా దాన్ని  పోలిన పరిశ్రమేకాక తప్పలేదు.

    ఈ కృషిలో  మాకు  తోడ్పడిన  వారందరికీ  మా కృతజ్ఞతలు. ముఖ్యంగా శ్రీశ్రీ సాహిత్యాన్ని సమకూర్చి కూర్పరిగా  వ్యవహరించబూనిన  శ్రీ కె.వి. రమణారెడ్డిగారికి ఆయనకు  చేతావాతా తోడ్పడిన శ్రీ బండి  గోపాలరెడ్డి ప్రభృతులకూ, ఈ రచనలను  ఉత్సాహంతోటీ కార్యదీక్షతోటీ  ముద్రింపబూనిన క్రాంతి ప్రెస్ యజమాని శ్రీ ధనికొండ హనుమంతరావుగారికీ, ఈ ముద్రణ వ్యయానికి  మాకు స్తోమత  కలిగించిన యావదాంధ్రలోని  వదాన్యులకందరికీ  మా వందనాలు.ముఖపత్ర చిత్రకారులైన  శ్రీ గోఖలేగారికి  కూడా  కృతజ్ఞులం" అని రాస్తూ, చివరిని 'శ్రీశ్రీ షష్టిపూర్తి సమ్మాన సంఘం' అని రాశారు.       


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS