Previous Page Next Page 
సంసారంలో శ్రీశ్రీ పేజి 31

    నేను నోరు చించుకొని పైకి చదివాను. శ్రీశ్రీగారు  విన్నారు.

    "ఏవండీ_బాగా రాశారు కదండీ" అన్నాను.

    ఆయన ఏమీ మాట్లాడలేదు. గట్టిగా  దమ్ములాగారు. అంటే దాని అర్ధం నాకు తెలుసని ఆయనకి తెలుసు.

    "ఆనాటి సభకి  తాపీ ధర్మారావుగారు  అధ్యక్షులు. సభలో చిన్న గమ్మత్తొకటి  జరిగింది సరోజా! ధర్మారావుగారు  ఆరుద్రని  వేదికమీదికి రమ్మని పిలిచారు .తనని సభకు ఆహ్వానించలేదని  చెబుతూ ఆరుద్ర తన  ఉపన్యాసం ప్రారంభించాడు. 'అబద్ధం' అంటూ వెంటనే సభలో నుండి కలకలం రేగింది. కేకలు  నేను స్పష్టంగా  వింటున్నాను" అన్నారు శ్రీశ్రీగారు.

    "అది సరేగానీ_నా మాటకి  ముందు  సమాధానం చెప్పండి. ఆరుద్రగారిని మీరు పిలవలేదా" అని అడిగాను.

    "అదేమిటి సరోజా! ఆరుద్రని  నేను పిలవకుండా  వుంటానా? పైగా  ఆ సన్మానానికి ముందే  నేనూ ఆరుద్రా, హైదరాబాద్  హోటల్ ద్వారకలో  బసచేసినప్పుడు 'శ్రీశ్రీ సమ్మాన సంఘం' అధ్యక్షుడు పురిపండా అక్కడున్నారు. నేనూ పురిపండా  కూడా  ఆరుద్రని  ఆహ్వానించాం. మా ఆహ్వానాన్ని  ఆరుద్ర అంగీకరించడమే  కాకుండా  తాను వైజాగ్ కి విమానం టిక్కెట్ కొనుక్కున్నానని  కూడా చెప్పాడు" అన్నారు.

    "పోన్లెండి. మీ డ్యూటీ  మీరు చేశారు. ఇక అవన్నీ వదిలేయండి" అన్నాను.

    వెంటనే  వారు, "అవునూ_రష్యాకి  నేను ఎప్పుడు  వెళ్ళానో  జ్ఞాపకం వుందా?" అని అడిగారు.

    "మన పాప 1966వ సంవత్సరం  జూలైలో  నా కడుపున పడింది. మీకు ఆగస్టులో  సోవియెట్ లాండ్ నెహ్రూ బహుమతి 'ఖడ్గసృష్టి' కి లభించినట్టు  ఫోనోగ్రామ్ వచ్చింది. నాకు బాగా జ్ఞాపకం" అన్నాను.

    "అవును సరోజా! 70 నుండి  మళ్ళీ వెనక్కి  66లోకి  వెళుతున్నాను. అవార్డ్ ప్రారంభమయ్యింది మొదలు ప్రతీ సంవత్సరం నాకు వస్తుందని అనుకోవడమూ, ఏదో కారణంవల్ల  రాకపోవడమూ  జరుగుతూనే వుండడం ఈసారి ఈ ఫోనోగ్రామ్ నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు.

    నేనెప్పుడూ ఏ బహుమతి కోసమూ  స్వయంగా  ప్రయత్నించలేదు. చిన్నప్పటినుండీ నాకు వచ్చిన బహుమతులన్నీ  అప్రయత్నంగానే లభించాయి. అవార్డు వచ్చిందని  66లో  తెలిసినా రష్యా  వెళ్ళడం మాత్రం 67లోనే కదూ" అన్నారు.

    "అవునండి 67వ సంవత్సరం ఏప్రిల్ నెల 21వ తేదీన  పాప పుట్టింది. 67 మే నెల  పదవ తేదీన మీరు రష్యాకి బయలుదేరారు" అని చెప్పాను. "అవును. అందుకే పాప అదృష్టవంతురాలని  అంటూ తెగ మురిసిపోతూ వుంటావు. నేను మొదటిసారి  రష్యా వెళ్ళడం  1954లో  అప్పుడు  చూసిన రష్యాకీ, 67లో చూసిన  రష్యాకీ సంబంధంలేదు.

    నా రెండోసారి ప్రయాణంలో  కూడా రష్యాలో నాకు కెమెరా బహూకరించారు. అది నువ్వు దానం చేసేశావు. కెమెరా  గురించి అడిగితే 'ఉంది తెస్తాన'ని  అంటావేకానీ దాని గురించి మాత్రం  ఇప్పటికీ చెప్పవు కదా" అన్నారు.

    నేనేమీ మాట్లాడలేదు. "నిన్నేమీ అనడంలేదు సరోజా!" అని అన్నారు.

    "సరేకానీ మీ దృష్టి రష్యామీదకి వెళ్ళింది. ఏమిటి ప్లాన్?" అని అడిగాను.

    "ప్లానేమీలేదు సరోజా! అనుకోవడం వరకే. మాస్కో  రెండుసార్లు, స్టాక్ హోమ్, తాష్కెంట్, ప్యారిస్, జెనీవా, కెయిరో, స్వీడన్, రోమ్ చాలావరకూ అన్నీ చూశాను. లండన్ అమెరికాలు మిగిలిపోయాయి. అవికూడా  చూడాలని వుంది" అన్నారు. 

    "మీరు తప్పకుండా వెళతారండి. డోంట్ వర్రీ" అన్నాను.

    "మీరు అనకు సరోజా! మనం అను. నిన్ను కూడా  తీసుకువెళతాన"ని అన్నారు.

    "అంతకన్నానా? సంతోషం. కానీ అస్తమానమూ నేను దానం చేసిన కెమెరా గురించే దెప్పుతారు కానీ మొదటి మారు మీకిచ్చిన కెమెరా ఎలా పోయిందీ? అది చెప్పరేం?" అని అడిగాను.

    "ఎన్నిసార్లు చెప్పాలి సరోజా! నాకెప్పటికప్పుడే  పరగడుపు" అన్నారు.

    "కాకినాడలోనే  కదండీ  పోయింది. మరొక్కసారి  చెబుదురూ" అన్నాను.

    "నేనూ, నా మిత్రుడు  ఒకాయన ఆరోజు  తగు మాత్రం  మద్యం సేవించాం  సరోజా! తర్వాత కొన్ని సంఘటనలు జరిగాయి. అవి ఇప్పుడనవసరం. దానికి మూడ్ వచ్చినప్పుడు చెపుతానులే. ఆ సంఘటనలతో  మా ఇద్దరిమీద కొందరు కక్ష  కట్టారు.

    నేనూ నా మిత్రుడూ  కూడా కళ్ళజోళ్ళవాళ్ళమే. అంతేకాదు__మా ఇద్దరి కళ్ళజోళ్ళూ  ఒక రకమైనవే. పది పన్నెండు మంది వచ్చారు. అందులో ఒకడు నా దగ్గరకొచ్చి  నన్ను చూసి న మిత్రుడనుకొని, నన్ను కొట్టి 'ఇప్పుడు నిన్ను చంపేస్తే నీకు దిక్కెవ్వరు?' అన్నాడు. నేను వెంటనే, 'నీకు ఒంటిమీద తెలివుందా? ఎవరితో  మాట్లాడుతున్నావో తెలుసా?' అని అడిగాను.

    ఇంతలో  ఇద్దరు ముగ్గురు  నన్ను  గుర్తించారు. బలవంతంగా  నన్ను గదిలో తోసేసి తలుపు గడియ వేసి వెళ్ళిపోయారు. నేను ఏమీ పట్టించుకోకుండా నిద్రపోయాను.

    నేను నిద్రపోయిన కొంతసేపటికి తలుపు  తెరుచుకొని  ఓ వ్యక్తి  గదిలోకి వచ్చాడు.

    'మీరు లోపల గడియ పెట్టుకోలేదా?' అని అడిగాడు.

    "లేదు  నాకు అలవాటులేదు. అటువంటి  జాగ్రత్తలు అవసరమని కూడా నాకు అనిపించలేదు' అన్నాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS