"ఏమంటావు సరోజా!" అని అడిగారు శ్రీశ్రీగారు.
"ఏమనడం ఏముందండి. మీ జన్మస్థలంలో మీకంత వైభవంగా సన్మానం చేస్తుంటే ఇంతకుమించిన ఆనందం వేరే ఏముంటుంది?" అన్నాను. "అది నిజమే. కానీ ఎవరెవరు విశాఖ వెళ్ళడం?" అన్నారు.
"ఎవరు వెళ్ళినా వెళ్ళకున్నా మీరుతప్పదు. మిగిలినవాళ్ళం మేము. నా విషయంలో మీకు ఏమీ బెంగవద్దు" అన్నాను.
"అందరం కలిసే వెళదాం" అన్నారాయన.
"మీ ఇష్టం" అన్నాను.
రవణమ్మగారి పెంపుడు కూతురు అమ్మాజీకి, వాడపల్లి నాగేశ్వరరావు గారి (కాకినాడ) దత్తపుత్రుడు చిరంజీవి లక్ష్మీ నారాయణునికిచ్చి అప్పటికే మందపల్లిలో నా ఇంట్లోనే పెళ్ళి జరిగింది. తరువాత ఆ అమ్మాయికి ఒక కుమారుడు పుట్టడం కూడా షష్టిపూర్తికి ముందుగానే జరిగిపోయింది.
షష్టిపూర్తికి మేమిద్దరం (నేనూ, రవణమ్మగారూ) వెళ్ళడం కుదరదు. ఎవర్నో ఒకర్నే తీసుకువెళ్ళాలి. రవణమ్మగారు తానే వెళతానని పేచీ పెట్టారు. శ్రీశ్రీగారు చాలా దిగులుపడ్డారు. నేను ఆయనతోపాటు వచ్చి వేడుకల్ని చూడాలని వారి తాపత్రయం. ఇక్కడ కూడా ఇంటిగొడవలు పెట్టుకుంటే రసాభాస అవుతుందని నాకు తెలుసు.
అందుకని ఆయనతో "అక్కడ జరిగినదంతా నాకు ఎలాగూ మీరు ఏటూ జడ్ చెప్తారు. మీరు పెద్దావిడ్ని తీసుకువెళ్ళడం న్యాయం.
నేనేమీ బాధపడను. మీరు, మీ ఆవిడ, అమ్మాజీ, మనవడూ అందరూ కలసి వెళ్ళిరండ"ని చెప్పాను.
అలా అన్నానేకానీ సన్మానాన్ని చూసే అదృష్టానికి నోచుకోలేకపోతున్నానే అని బాధపడుతూనే వున్నాను, ఏం చెయ్యను? గుండె రాయి చేసుకున్నాను.
"కనీసం బైజునయినా నాతో తీసుకువెళతాను సరోజా!" అన్నారు.
"నాకేమీ అభ్యంతరం లేదండి. వారు మీ కొడుకు, వద్దని నేనెందుకంటాను?" అన్నాను.
అప్పటికి సన్మానం జరగడానికి కొంచెం వ్యవధి వుంది.
ఆ రోజుల్లో నేను నాగపూర్ కి మద్రాస్ కి వెళ్ళి వస్తూండేదాన్ని. నా వంట మనిషి, పనిమనిషి, రిక్షా డ్రైవర్ నా పిల్లలతో సహా అందరూ చనిపోయిన నా సోదరి పిల్లలతో నాగపూర్ లోనే వున్నారు.
నా పిల్లలు నాగపూర్ లో మౌంట్ కార్మల్ కాన్వెంటులో చదివేవారు. నా రెండో అన్నదమ్ముడు ఉపద్రష్ట వెంకటరమణ ఫేమిలీతో అక్కడే ఉండేవాడు. పిల్లల చదువులకి మద్రాసులో కాన్వెంటులో సీటుదొరక్క రెండుమూడేళ్లు నాగపూర్ లోనే చదివించాల్సి వచ్చింది.
శ్రీశ్రీగారు నాలుగయిదుసార్లు నాగపూర్ వచ్చి పిల్లల్ని చూసి వెళ్ళారు. నేను మాత్రం ప్రతినెలా మొదటి రెండు మూడు తేదీల్లో నాగపూర్ వెళ్ళి ఇంటికి కావలసిన సామాన్లన్నీ కొనిపడేసి పిల్లల స్కూలు ఫీజులు పని వాళ్ళ జీతాలు వగైరా చూసుకొని మద్రాసు వచ్చేసేదాన్ని. మళ్ళీ నెలాఖరికిగానీ ఒకరి రెండు తేదీల్లోగాని వెళ్ళేదాన్ని. పదిరోజులు పిల్లల దగ్గర వుండేదాన్ని.
మద్రాసులో మా ఇంటికెదురుగానే వున్న 'సెయింట్ జాన్స్ హై సెకండరీ స్కూల్ (ఇప్పటికీ వుంది)లో సీటు సంపాదించాలని మా అవస్థ. చివరికి ఎలాగయితేనేం, ఇద్దరం సాధించి మా నలుగురు పిల్లలకి అందులోనే సీట్లు సంపాదించుకున్నాం. కానీ సన్మానకాలం నాటికి పిల్లలంతా నాగపూర్ లోనే వున్నారు.
అందుకే..."మరి బైజుని నాతో ఎలా తీసుకువెళ్ళడం?" అని అడిగారాయన.
"మీరు హైదరాబాద్ చేరుకొనే నాటికి నేను బైజుని తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను" అని చెప్పి వారికన్నా రెండు రోజులు ముందే నాగపూర్ బయలుదేరి వెళ్ళాను.
ఆయనతో చెప్పిన ప్రకారం బైజుని తీసుకొని 1970 జనవరి 28 వ తేదీనాటికి, వారికన్నా ముందుగానే, వారిచ్చిన అడ్రస్ ప్రకారం హైదరాబాద్ వెళ్ళి, హోటల్ ద్వారకలో పంతొమ్మిదవ నెంబర్ రూమ్ కి చేరుకున్నాను.
ఆ హోటల్ నాకు బాగా తెలుసు. మీమిద్దరం హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా, అక్కడ బంధువులు ఎంతమంది వున్నా, హోటల్ ద్వారకలో అదే రూములో బసచేసేవాళ్ళం.
హైదరాబాద్ ప్రోగ్రాం వుందంటే పదిహేను రోజులు ముందుగానే ఫోన్ చేసి ఆ రూము బుక్ రాసేవారాయన. వారి ప్రోగ్రామంతా చాలా క్రమపద్దతిగా వుండేది. తను అనుకున్నది అక్షరాలా జరగాల్సిందే! ప్రోగ్రాంలో వీసమంతయినా తేడా రాకూడదు.
ఏ ఊరైనా వెళితే స్టేషన్ లోనే రిటన్ టిక్కెట్ రిజర్వ్ చేసి వారికి చూపించాలి. ఎంత పెద్ద ఫంక్షన్ కానీండి, మీటింగ్ కానీండి...ఏర్పాటు చేసిన వాళ్ళకి తిరుగుప్రయాణం టిక్కెట్టు రిజర్వ్ చేసి వుంచాలని ఖచ్చితంగా ముందే తెలియపరచేవారు.
ఉదయం పదిగంటలకి హోటల్ ద్వారకకి చేరుకున్నారాయన. శుక్రవారం 30వ తేదీన అక్కడేదో మీటింగ్ జరిగింది. సాహిత్య అకాడెమీది అనుకుంటాను. వారు నన్నూ మా బైజునీ కూడా తీసుకెళ్ళారు.
మరుసటి రోజున ఆయనతో, "తెల్లారితే షష్టిపూర్తి. మీరింకా హైదరాబాద్ లోనే వున్నారు. విశాఖ ఎలా చేరుకుంటారండి" అని నేను ఒకటే గోల.
"ఫరవాలేదు సరోజా! అసలే ఆందోళనగా వున్నాను. నువ్వు మరీ గొడవచెయ్యకు" అంటూ, "నువ్వూ వచ్చేయి సరోజా! షష్టిపూర్తికి నువ్వూ వుంటే నాకు తృప్తిగా వుంటుంది" అన్నారు.
"చూడండి...ఆఖరి ఘడియలో మీరు పదిసార్లు రమ్మని అంటే నేను రాకుండా వుండలేను. అక్కడ గొడవలువస్తే పరమ అసహ్యంగా వుంటుంది. పెద్దావిడ ఈసరికే విశాఖ వెళ్ళిపోయివుంటారు. ఆవిడ్నయినా ఆ వేడుకల్ని నిశ్చితంగా చూడనివ్వండి" అన్నాను.
