"ఆ బడిలో ఏ పంతులుతోనట? వాదేనత నాటకాలలో వేషాలు వేయించటం...బల్లల మీదకి ఎక్కించి గంతులు వేయించేవాడట!...పైగా యింకోకటి కూడా చేసింది!" ఎంతో రహస్యం చెప్పుతున్నట్టుగా అటూ యిటూ చూసి ఆగాడు.
"ఏం చేసింది?..." ఎంతో ఆసక్తి కావాలనే ప్రదర్శించాడు.
"కామాక్షమ్మ పెట్టిన వడ్డాణం, పెద్ద గొలుసు గాజులుతో సహా తీసుకుపోయిందట! అక్కడికి వెళ్ళినాక బ్రతకటానికి కావాలిగా! మంచి ప్లాన్ వేసిందిలే...!"
గబగబా నడిచి కామాక్షమ్మ యిల్లు చేరాడు వెంకయ్య!...
14
మద్రాసు సెంట్రల్ స్టేషన్ లో ట్రంకుపెట్టె పట్టుకుని నలిగిపోయిన చీరతో నిద్రలేక పోవటంతో ఎర్రబారిన కళ్ళతో భయంతో అటూ యిటూ చూసుకుంటూ సర్కార్ ఎక్స్ ప్రెస్ నుంచి దిగిన కావేరికి బైటికి వెళ్ళటానికి దారి ఎటో తెలియలేదు. దిక్కులు చూస్తూ నడుస్తూనే ఎంతో మందిని ఢీ కొట్టింది.
చేబురుమలులో దాచిన టిక్కెట్టుని యిచ్చి బైటికి వచ్చి నిలబడిన కావేరికి ఎక్కడికి వెళ్ళాలో? వుండేది ఎక్కడ?...ఎలా వుండాలి? ఏ మహాసముద్రంలో వాళ్ళు మాట్లాడే తమిళం తనకి తెలియదే? ఎలా?...ఏం చెయ్యాలి? తనకి పరిచయస్థులు అనబడే వారే లేరు...అర్ధం కాని భాష! నిశ్శబ్ద వాతావరణంలో నుంచీ కల్లోలిత ప్రాంతానికి అకస్మాత్తుగా వచ్చినట్లయింది కావేరి పరిస్థితి...తనకి తెలియని వాతావరణంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడేమి చేయాలి? తను తొందర పడిందా?...లేక! లేక?...నిముషాలు! అరగంటలు గడిచేసరికి కావేరిలో భయం చోటు చేసుకుంది తను ఎంతసేపని అలా నిలబడగలదు?...ఒకవేళ వినాయకం బావ వస్తే?...అమ్మో?...యింకేమయినా వున్నదా?...
"మీరు ఎక్కడికి వెళ్ళాలి మేడం?"
అచ్చమయిన తెలుగు మాట్లాడుతున్న కంఠం విని ఆ వైపుకు చూసింది.
"మీ వాళ్ళెవ్వరూ స్టేషన్ కి రాలేదా?..." అతను చనువుగా దగ్గిరకు వచ్చి అడిగాడు.
"రాలేదండీ?...అదే చూస్తున్నాను!..." అటు యిటూ చూస్తూ అంది కావేరి.
"నేను తెలుగువాడినే! విజయవాడ మాది!...మద్రాసు వచ్చి ఎనిమిది సంవత్సరాలు అయింది. ఇక్కడంతా నాకు తెలుసు! మీరు ఎక్కడికి వెళ్ళారో చెప్పితే నేను టాక్సీలో మిమ్ములను తీసుకెళ్ళి మీ వాళ్ళకి అప్పగించి వస్తాను..."
"వద్దులెండి!...మీకెందుకు శ్రమ!...నేను వెళ్ళగలను! "తన కంగారుని అణుచుకుని మరీ అంది.
"వెళ్ళేవారయితే రెండు గంటల నుంచీ యిక్కడే ఇలాగే నిలబడిపోరుగా?...ఎంతమంది టాక్సీవాలాలు మిములను అడిగారు? మీరెందుకు వెళ్ళలేదూ?"
అతనలా చనువుగా సూటిగా అడిగే సరికి కావేరి బిత్తరపోయింది. తను ట్రైన్ దిగినప్పటినుంచీ తనను గమనించుతున్నాడు కాబోలు!...
అందుకే అలా అడుగుతున్నాడు? ఇప్పుడేమి చెప్పి తప్పించుకోవాలి?...చెప్పినా అతను నమ్ముతాడా? అతని చూపుల్లోనే వుంది ఎదుటి వారి మనసులను చదివే శక్తి!
"మీరు మరోలా భావించకండి! నన్ను మీ ఆత్మీయుడుగా భావించండి! ఈ మహాపట్నంలో వంటరిగా మీరు ఎక్కడకని వెళతారు?...ఏ రౌడీలో మిమ్ములను, మీ వాలకాన్ని చూసి మాయం చేస్తారు...ఇంతసేపు యిక్కడ మీరు నిలబడి బెదురుచూపులుతో దిక్కులు చూస్తూ ఉంటే? మీరేదో లేచివచ్చిన బాపతులాగానే పసిగట్టి పోలీసులు మిమ్ములను అరెస్టు చేసి స్టేషన్ కి తీసుకువెళ్ళి మీ నుంచి నిజం రాబట్టు కునే వరకూ ఊరుకోరు! అవసరం అయితే లాఠీలతో కొట్టి అయినా నిజం చెప్పించుతారు...మీ యిబ్బంది ఏమిటో చెప్పండి! నేను మీకు ఏ సహాయము చేయమంటే ఆ సహాయం చేస్తాను!"
అతనంత నమ్మకంగా అంటుంటే మెత్తబడింది కావేరి!
నిజంగా పోలీసులు నిర్బంధించి అడిగితే తన గుట్టు కాస్తా రట్టు అవుతుంది. మంచివాడులాగానే వున్నాడు. యితనితో వుంటే తన పని సులువు అవుతుంది. అన్నీ, అంతా తెలుసుకుంటున్నాడు కాబట్టి తనకి ఉపయోగపడగలడు.
"యింకా ఆలోచించుతున్నారా? అరుగో పోలీసులు వస్తున్నారు. మనలను చూసి యిటు రావచ్చును..."మీరెవరూ?" అని అడిగితే "భార్యాభర్తలం" అని చెప్పాల్సి వస్తుంది. అలా చెపితేనే మనలను వదిలి పెడతారు. లేదా నా దారిన నేను అవతలికి వెళ్ళిపోతాననుకోండి! మిమ్ములను మాత్రం వదిలిపెట్టరు. అసలు మీ వాలకం చూస్తే ఎవరయినా యిట్టే గ్రహించి వేస్తారు.
"మీరు ఇంట్లో చెప్పకుండా వచ్చేసిన బాపతనీ! త్వరగా నిర్ణయం తీసుకోండి! నన్ను మీ ఆప్తుడుగా భావించండి!"
అతనలా అనేసరికి ఇంకా లాభం లేదనుకుంది. ఎర్ర టోపీల వాళ్ళు కారా కిళ్ళీ నములుతూ ఒకేచోట నిలబడి అటుఇటు పరీక్షగా చూస్తున్నారు. వాళ్ళని చూస్తుంటేనే కావేరీకి భయం కలుగసాగింది....ఇంకా ఆలస్యం దేనికి? ఇక్కడ మరో వ్యక్తి సహాయం లేనిదే మనుగడ సాగించటం కష్టం అవుతుంది. అతన్ని చూస్తుంటేను, ఆ మాటలను బట్టి అతను ఎంతో మంచివాడన్న సదభిప్రాయం కలిగింది.
"మీకు సినిమా నిర్మాతలు, నటీ నటులూ తెలుసా?..."
"ఆ...ఎంతో మంది తెలుసు! నేను ప్రస్తుతం నాలుగుసినిమాలకి అసిస్టెంటు డైరెక్టరుగా పనిచేస్తున్నాను. మా ఆడవాళ్ళని ట్రైన్ ఎక్కించటానికి వచ్చాను. తిరిగి వస్తుంటే మీరు కనిపించారు. కావాలంటే మీకు సినీమా షూటింగ్ లవీ చూపించుతాను. మీకు సినిమాలంటే ఇష్టమా?"
"చాలా ఇష్టం!"
"మీ బంధువుల ఇంటి అడ్రసు వుంటే ఇవ్వండి. అక్కడకు మిమ్ములను చేర్చి మా పిక్చర్ షూటింగ్ వున్నప్పుడు వచ్చి తీసుకెళ్తాను."
"బంధువులనబడేవారు ఎవరూ లేరండీ? నేను ఇక్కడికి వంటరిగానే వచ్చేశాను. సినిమా హీరోయిన్ ని కావాలని!...అదంతా తరువాత చెప్పుతాను...మనం ఎక్కడికయినా వెళ్ళి మాట్లాడుకుందాం..."అంది కావేరి.
ఇలాంటి వాళ్ళను ఎంతో మంది వారి వారి భావాలను బట్టి గ్రహించగల నేర్పు మాధవరావుకి వుంది. రెండు వారాలనుంచి గిరాకీలేక ఎంతో బాధపడుతున్నాడు. తెల్లవారు ఝామున బయలుదేరి సిటీ బస్సులను పట్టుకుని స్టేషన్ కి చేరటం, ముఖ్యంగా సర్కార్ ఎక్స్ ప్రెస్ కాకినాడ నుంచి బయలు దేరుతుంది. ఎంతోమంది సినిమా హీరోయిన్ లు అవ్వాలని కలలుగంటూ ఆ సర్కార్ ఎక్స్ ప్రెస్ కి కాకినాడనుంచి మొదలవుతుంది మద్రాసు బయలుదేరే వారి సంఖ్య అలాంటి బాపతు వాళ్ళు ఎవరో ఇట్టే తెలుసుకోగల నేర్పు ఈ మాధవరావుకి వుంది.
