నాలుగంటే నాలుగేరోజులు పెళ్ళివుంది? ఎంత హడావుడిగా వున్నారు పనులతో? యిన్నిరోజులనుంచీ బాగున్నది. ఇంతలోకి ఏమయిపోయింది దీనికి? అన్నదే కామాక్షమ్మ ఆలోచన!
ఈ విషయంవిన్న బండి వెంకయ్య ఎంతో ఆనందంతో రోడ్డుమీదనే బండి గబగబా లోపలికివచ్చి ఇదేదో శుభవార్త అయినట్లుగా భార్యకి చెప్పాడు.
"అదెందుకు చేసుకుంటుందండీ? దానికి సినిమా పిచ్చి అయ్యే! రోజూ ఇంట్లోనుంచి డబ్బులు ఎత్తుకువెళ్ళేదట స్కూలుకి తనిష్టం వచ్చినన్ని కొనుక్కునేదట! స్కూలు ఎగ్గొట్టి సినిమాకి వెళ్లేదట ఆ నాగులుతో కలిసి!"
తల్లి మాటలువిన్న సుబ్బులు ఎంతో ఆనందించింది. తాను అనుకున్నట్టుగానే కావేరి చేసినందుకు ఎంతో ఎంతో సంతోషించింది.
"ఇలా చేస్తుందని నాకు తెలుసమ్మా! దానికి సినిమాల్లో హీరోయిన్ అయిపోవాలన్న ఉబలాటం వుండేది! ఆ నల్లోడిని, పొట్టివాడిని చేసుకుంటుందా? చిరంజీవి, భానుచందర్ లాంటి హీరోలు మొగుళ్ళుగా ఊహించుకునేది లాంటి కావేరి ఈ సుద్ద అవతారాన్ని చేసుకుంటుందా? అందుకే వెళ్ళిపోయి వుంటుంది! మనలను ఎంతో తేలికగాచేసి మాట్లాడిందే ఆ కామాక్షమ్మ. లేచిపోయిన తన అన్న కూతురుకంటే మనకీ ఎన్నోరెట్లు పరువు, ప్రతిష్టలు వున్నాయని ఇప్పటికయినా గ్రహించుతుందిలే!"
"అవునవును! ఆరోజున నేనూ, మీనాన్నా వెళ్ళి అడిగితే ఎన్ని మాటలన్నది ఆ కామాక్షమ్మ? మీరు కిరాయికి బండితోలుకుని బ్రతికేవారన్నది. మీ ఆస్తులు అంతస్తులూ ఏమిటో తెలుసుకుని మాట్లాడుతున్నారా? అనడిగింది. ఇప్పుడవన్నీ ఏమయినవి? బజారున పడిపోయాయి! ఊడ్చి తెచ్చుకోవటమే! ఊడ్చినా పోయినపరువు వస్తుందా? ఏదయినా వాళ్ళకే చెల్లింది!" ఛీత్కరించుకుంది సీతమ్మ కోపంతో!
"మా వినాయకం బావని నేను చేసుకోను! ఏమీ బాగోడు! నల్లగా పొట్టిగా వుంటాడు. అట్టే చదువుకోలేదు! ఎప్పటికయినా మద్రాసు వెళ్ళి పోతాను. మా బావని నువ్వే చేసుకోవే! అని స్కూలుకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడుకూడా చెప్పేది నాతో! అందుకని నేనువెళ్ళి కామాక్షమ్మను అడగమన్నాను!" అంది సుబ్బులు!
"ఏది ఏమయినా మీరేమీ నోరు విప్పవద్దు! ఏం జరుగుతుందో? ఆ కామాక్షమ్మ కొడుక్కి ఎలా పెళ్ళి చూస్తుందో చూద్దాం!" అన్నాడు వెంకయ్య.
"నేను ఎందుకంటాను?" అంది సీతమ్మ.
"నువ్వీరోజున స్కూలుకి వెళ్ళవద్దు! అందరూ నిన్నే అడుగుతారు. అదీగాక ఒక్కదానివే వెళ్ళిరావాలిగా?"
"నాకేం భయంనాన్నా? ఆ కావేరికాబట్టి లేచిపోయింది. నాకేం లోటు వుందని? ధైర్యంగా వెళ్ళగలనూ, రాగలను! అదేదో చేసిందని మనంకూడా చేస్తామని ఎందుకు అనుకోవాలి? యిప్పుడు నేను వెళ్ళకపోతే నన్నే అనుమానించుతారు! కావేరి లేచిపోయిందని స్కూలులోని వాళ్ళకి తెలిసేది ఎలా?"
అవునవునండీ! తెలిసేది ఎలా? పనికట్టుకుని అందరికీ చెప్పు! వీళ్ళ ఆస్తులూ అంతస్తులూ ఏమిటో? ఇప్పుడు తెలుస్తాయి.
తమని పరాభావించిన కామాక్షమ్మని అల్లరి చేయటమే ఆ కుటుంబ సభ్యుల ఆలోచన! మనిషి పగ పాము పగ కంటే ఎక్కువయినదనుకునేటందుకు నిదర్శనం యిదే!
"వెంకయ్యగారున్నారా?" సోములు వీధి వాకిట్లోనే నిలబడి పిలిచాడు లోపలికి రాకుండానే?
"ఏమిట్రా?..." అంటూ బైటికి వచ్చాడు వెంకయ్య.
"వీధిలో బండి నిలబడి వుంటేనే అనుకున్నాను యింట్లోనే వుంటారని మీ అమ్మాయి సుబ్బలక్ష్మమ్మ గారిని తీసుకుని కామాక్షమ్మగారు రమ్మనమని మీకు చెప్పమన్నారు!.."
"ఏమిటే?...మా సుబ్బలక్ష్మిని తీసుకురమ్మన్నారా?...అంత అవసరం అయితే తననే రమ్మనమను! పెళ్ళి కావాలసిన పిల్లని అలా ఇంటింటికీ తిప్పే అలవాటు మాకులేదు!..." కసిరింది సీతమ్మ.
"అది కాదమ్మా!" సోములు చెప్పబోయినా వినిపించుకోలేదు.
"లేచిపోయిన మేనకోడలు కావేరి గురించి తెలుసుకోవాలంటే మా అమ్మాయి ఒక్రతే దొరికిందా?...స్కూలు దగ్గరకు వెళ్ళి అడిగితే అందరూ చెప్పుతారు దాని బాగోతం!..."
సోములు యింకేమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.
సుబ్బులు తన పని ముగించుకుని వెనుక దారిన స్కూలుకి వెళ్ళింది.
వెంకయ్య బాగా ఆలోచించాడు....ఏ పుట్టలో ఏ పాము వుందో? అలాగే ఏ మనిషి నుదుట రాత ఎలా వుంటుందో? ఎలాగూ కామాక్షమ్మే తన కోసం తన కూతురు కోసం కబురు చేసిందంటే కావేరి విషయాలు తెలుసుకునేటందుకే! అన్న రూఢీ అయింది కాబట్టి యింక కావేరిని తలుచుకునే అవసరం లేకుండా చేయాలి! చేయాలీ అంటే తను వెళ్ళాలి! ఆమె మనసులో విష బీజాలు నాటాలి?...యిదే లగ్నానికి మీ సుబ్బులుని యిచ్చి మా వినాయకానికి పెళ్ళి చేయమని అడిగినా అడగవచ్చును! అలా కనుక అడిగితే తనకి కావలసింది ఏమున్నది?....అంత ఆస్థిపరుడు బుద్దిమంతుడయిన వినాయకం కంటే గొప్పవాడిని తన జనమంతా ధారాపోసినా తీసుకురాలేడు. అసలు కామాక్షమ్మ మనసులో పడితే చాలు! అనుగ్రహం కలిగినట్లే!
అలా కీడెంచి మేలు కూడా ఎంచిన వెంకయ్య ఎడ్ల బండిని చావిడిలో విప్పి ఎద్లని కట్టేసి మేత వేస్తూ కూడా అనుకున్నాడు.
"తను వెళ్ళటం మంచిదా? కాదా?..." అని!....
మంచిదనే నిర్ణయానికి వచ్చి తలగుడ్దని తీసి దులిపి భుజాన వేసుకుని కామాక్షమ్మ యింటికి బయలుదేరాడు.
"ఎక్కడికీ బయలుదేరావు వెంకయ్యన్నా!...ఈ విషయం తెలిసిందా?..." అని పరిచయస్థులు నిలబెట్టి అడిగారు...
"కామాక్షమ్మగారు అర్జంటుగా రమ్మనమని కబురు చేశారు! వారింటికి వెళ్ళుదామని!...ఏ విషయం గురించి అడుగుతున్నావు?...ఏమీ తెలియనట్లుగా అడిగాడు.
"నీకు తెలియదా?..." ఆశ్చర్యంగా అవతలి వ్యక్తి అడిగాడు.
"తెలియదని చెప్పుతున్నానుగా?...ఏమిటి సంగతి?"
"పరంధామయ్య కూతురు కావేరి లేదూ? ఎవడితోనో లేచిపోయింది అన్నా!"
"అలాగా? నాకీ విషయం తెలియనే లేదు!...ఎవరితోనట లేచి పోయింది?.." ఎంతో ఆశ్చర్యంగానూ, అప్పుడే తాను వింటున్నట్టు అడిగాడు వెంకయ్య.
