Previous Page Next Page 
చీకట్లో నల్లపులి పేజి 29


    "అయ్ అండర్ స్టాండ్ యువర్ ఫీలింగ్స్ మీరేం వర్రీ కాకండి. మొత్తం ఫోర్సంతా రంగంలోకి దింపుతాను. రమణిని తిరిగి మీకు అప్పచెప్పే పూచీ నాది...." అన్నాడు దుర్గారావు.

    "ఎప్పుడు....ఎప్పుడు అప్పచెప్తారు?"

    తనంత గట్టిగా అరవగాలనని రాజారామ్ ఎన్నడూ ఊహించలేదు.

    "ప్లీజ్...కంట్రోల్ యువర్ ఎమోషన్స్....పదండి....చైర్మన్ గారింటికి వెళ్దాం."

    రాజారామ్ గుండె భగ్గుమంటోంది. ఒక్కసారి దుర్గారావు మీద పులిలా పడి అతని పేగులు తీసెయ్యాలనిపించింది కాని...

    మౌనంగా అతన్ని అనుసరించాడు.

    అంతా కలసి జీప్ ఎక్కారు. జీప్ బంజారా హిల్స్ వేపు పరుగులు తీసింది.

    రమణి అదృశ్యం అయిపోయింది. చిన్నారి రమణి హంతకుడి చేతుల్లో బందీ అయింది. ఎక్కడుందో? వాడు ఆ నరరూపరాక్షసుడు శిరీషకుసుమకోమలి రమణిని ఏం చేస్తున్నాడో....రాజారామ్ మెదడులో మాటిమాటికీ ఇవే ఆలోచనలు. కాసేపు వాటిని పక్కకి పెట్టాలి తప్పదు.

    నిజమే...

    రమణి కనిపించడంలేదు.

    అదిమాత్రం వాస్తవం.

    దానిగురించి అదే పనిగా ఆలోచించి బుర్ర పాడు చేసుకోవడం వలన ఫలితం శూన్యం. రాజారామ్ గుండె దిటవు చేసుకున్నాడు.

    "రమణి కనిపించటంలేదని మీకు ఎన్నిగంటలకి ఫోన్ వచ్చింది?" అనడిగాడు రాజారామ్.

    "పన్నెండు గంటలకి" అన్నాడు దుర్గారావు భవానీ, మహావీర్ తదేకంగా రాజారామ్ నే చూస్తున్నారు.

    రాజారామ్ తన వాచీ వేపు చూసుకున్నాడు. ఒంటిగంట!

    "ఇంతసేపూ ఏం చేస్తున్నారు మీరు?"

    "టాంక్ బ్యాండ్ దగ్గర ఉన్నాను. సుందరి డెడ్ బాడీ తేలినట్టు ఫోన్ రాగానే అక్కడికి వెళ్ళాను. చైర్మన్ గారింటి నుంచి వచ్చిన ఫోన్ కాల్ ని కంట్రోల్ రూం ఆపరేటర్ అందుకుని నాకు ఇప్పుడే తెలియజేశాడు. వెంటనే మీకు చెప్పాను."

    రాజారామ్ మౌనంగా తల పలకించాడు.

    చైర్మన్ గారింటినుంచి తనూ, భవానీ సరిగ్గా పదకొండు గంటలకి బయలుదేరాడు. మధ్యలో తను ఓసారి ఆఫీసుముందు ఆగాడు. బంజారా హిల్స్ నుంచి కంట్రోల్ రూంకి మహా అయితే అరగంట ప్రయాణం...అంటే తను పదకొండున్నరకి కంట్రోల్ రూం చేరుకున్నాడు. ఇప్పుడు ఒంటిగంట దాటింది. గంటన్నరసేపు తను కంట్రోల్ రూంలో వెయిట్ చేస్తూ కూర్చున్నాడు.

    పదకొండు-పన్నెండు గంటల మధ్య జరిగి ఉండాలి ఈ అమానుషం ఆ ఒక్కగంటలోనే జరిగిపోయింది దురాగతం!!

    దీనికంతటికీ కారణం దుర్గారావే... ఆ కాసేపూ ఆగితే ఏం జరిగేది? ఏం కొంప ములిగేది?

    జీప్ చైర్మన్ రాజభూషణరావు ఇంటిముందు ఆగింది. రాజారామ్ జీప్ దిగి ఇంటివేపు నడిచాడు. అతని వెనుకనే ఇన్ స్పెక్టర్లు ముగ్గురూ నడిచారు.

    రాజారామ్ ని చూడగానే హాల్లో కూర్చుని ఉన్న మహాలక్ష్మి, రాజేశ్వరీ లేచి నిలబడ్డారు. ఇద్దరి మొహాల్లోనూ ఆందోళన. మహాలక్ష్మికయితే నోటంట మాట రావడం కష్టంగా ఉంది.
 
    అందరూ హాల్లోని సోఫాల్లో కూర్చున్నారు.

    "రాజేశ్వరీ, ఏం జరిగిందో ఒకసారి వివరంగా చెప్తావా?" అన్నాడు రాజారామ్.

    రాజేశ్వరి ఒక్కసారి ముగ్గురు ఇన్ స్పెక్టర్ల వేపూ చూసింది. తరవాత రాజారామ్ ని చూసింది.

    "మీరూ, భవానీగారూ వెళ్ళిపోయాక నేనూ, రమణీ కాసేపు కారమ్స్ ఆడాం. అలా ఓ పది నిమిషాలు అయిందో లేదో 'జ్వరంగా ఉంది ఆంటీ'....అంది రమణి. టాబ్లెట్ ఇచ్చి కాసేపు పడుకోమన్నాను. సరేనంది...."

    "పడుకుందా మరి."

    "ఆఁ "

    "ఎక్కడ?"

    "మా బెడ్ రూంలో..."అంది మహాలక్ష్మి తడి ఆరిపోతున్న గొంతుకతో.

    "తరవాత!"

    'విరించిగారు వస్తే భోజనం పెట్టడానికి మహాలక్ష్మిగారు వెళ్ళారు. నేను చైర్మన్ గారి రూంలో ఆయన టెంపరేచర్ చూడడానికి వెళ్ళి అక్కడా కాసేపు ఉన్నాను. తర్వాత హాల్లోకి వచ్చాను. ఈలోగా విరించిగారు భోజనం చేసి ఎల్లిపోయారు. నేనూ, మహాలక్ష్మిగారూ కొద్దిసేపు పిచ్చాపాటీ మాట్లాడుకున్నాం. పన్నెండుకల్లా రమణికి ఎలా ఉందో చూద్దామని బెడ్ రూంలోకి వెళ్ళాను. తీరా చూస్తే అక్కడలేదు. మొత్తం ఇల్లంతా కలియజూశాం. ఎక్కడాలేదు. ఇంటివెనుక తోటలో ఉందేమోనని అక్కడా కూడా చూశాం. కాని ఎక్కడాలేదు." అంటూ రాజేశ్వరి ఆగిపోయింది.

    "ఇంట్లో ఉండే మీ ముగ్గురుకాక, ఇంకెవరెవరు ఉంటారు?" అనడిగాడు ఇన్ స్పెక్టర్ దుర్గారావు.

    "వంటవాడు కృష్ణన్. పనిమనిషి సీత. డ్రయివర్ సైదులు." అంది మహాలక్ష్మి.

    "అంటే వాళ్ళ ఇళ్ళుకూడా ఇక్కడేనా?"

    "అవును"

    "ఈ సంఘటన్ జరిగిన సమయంలో వాళ్ళంతా ఇంట్లోనే ఉన్నారా!"

    "ఇక్కడే ఉన్నారు."

    "ఏం చేస్తున్నారో చెప్పగలరా?"

    "వంటవాడు కృష్ణన్ కిచెన్ లోనే ఉన్నాడప్పుడు. డ్రయివర్ పోర్టికోలో కాంటెస్సా కారు దగ్గర ఉన్నాడు. సీతని సినిమా టిక్కెట్లకోసం పంపించాను. అన్నట్టు వాచ్ మెన్ గేటుదగ్గరే ఉంటాడు." అంది మహాలక్ష్మి.

    రాజేశ్వరి అదే పనిగా సిగరెట్ మీద సిగరెట్ తాగుతోన్న రాజారామ్ ని తదేకంగా చూస్తోంది.

    డ్రాయింగ్ రూం కిటికీలోంచి బయట పోర్టికో వేపు చూశాడు ఇన్ స్పెక్టర్ దుర్గారావు.

    అక్కడ ఒక ఎరుపురంగు కాంటెస్సా కారు, తెలుపు రంగు మారుతీ కారు ఉన్నాయి.

    "మీవారు ఇవ్వాళ కారు తీసుకు వెళ్ళలేదా?" అన్నాడు దుర్గారావు మహాలక్ష్మి వేపు చూస్తో."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS