Previous Page Next Page 
ప్రసన్నకుమార్ సర్రాజు కథలు 2 పేజి 29

   
    మరి ఇదేమిటి? మూర్చ స్త్రీ రోగి ఉపన్యాసం అయిపొయింది. మొత్తానికి ఇదేదో కొత్త చవేలే! ఇవ్వాలే వచ్చినట్లుంది.
    ఒక వ్యాపార ప్రకటన వచ్చింది. బిస్కెట్లు ఎన్ని భాగాలుగా విరుచుకు తినచ్చో వాళ్ళమ్మ చెప్తోంది పిల్లలకు. అంతలోనే ఒక పురుషుడు - ఆవిడ మొగుడనుకుంటా - ఇంత జాగ్రత్తగా తుంచుకు తిననవసరం లేదనీ మొత్తం బిస్కేట్టుని ఒక్కసారే నోట్లో పెట్టుకుని నమిలి మింగోచ్చని చెప్తున్నాడు పిల్లలకు. ఆవిడ అలిగినట్లు మూతి తిప్పుతూ వెళ్ళిపోయింది. పిల్లలు డాడీని కౌగలించుకున్నారు.
    వెంటనే ఎనౌన్సరు ముఖం మటమటలాడించుకుంటూ ప్రత్యక్షమైంది. కానీ చిరునవ్వు మెయిన్ టైన్ చేస్తూనే వుంది. "హై! ఫోక్స్ !' అంది . ఫోక్స్ అనేది అడ జెండరా, మగ జెండరా అర్ధం కాలా నాకు!
    "ఇప్పుడు మీరు ప్రకటన చూశారు కదా! అది తయారుచేసింది మగవాళ్ళు. కానీ మీకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? పిల్లలెప్పుడూ అమ్మ చెప్పిన మాటే వింటారు. అది మీకు త్వరలోనే తెలుస్తుంది. ఈ రోజే మా చానెల్ ప్రారంభించాం., మా 'లోగో ' ఇప్పుడే వచ్చింది."
    నేను టీవీకి పై మూల చూశా. 'స్త్రీ చానెల్' అని కనిపించింది. ఒహూ.... కొత్త చానెల్ ప్రారంభమయిందన్నమాట అనుకున్నా. కానీ టీవీ వాస్తు ప్రకారం లోగోలు ఈశాన్యం ,మూల ఉంటే మంచిది కదా! ఈ చానెల్ ఆగ్నేయ మూల వేశారు. అంటే అగ్ని రాజుకుంటోందన్నమాట!
    "ఇప్పుడు తదుపరి కార్యక్రమం. స్త్రీ పురోభివృద్ది , వారి అంతరంగిక మైధునం .... క్షమించాలి .... అంతరంగిక మధనం!' కొత్త ఎనౌన్సరు కదా, కొంచెం తడబడుతోంది. తరువాత కార్యక్రమం -ఏదో డాక్యుమెంటరీ లాగా వస్తోంది. తెర నిండా స్త్రీలే. గ్రామీణ ప్రాంతం బాక్ డ్రాప్. ఎడ్లబండి తోలేవాళ్ళు, కలుపు తీసేవాళ్ళూ, అందరూ ఆడవాళ్ళే. అంతా 18 నుంచి యాభై ఏళ్ళవారి దాకా ఉన్నారు. వాళ్ళకి తమ బుజ్జి చేతులతో చిన్నచిన్న సహాయాలు అందిస్తున్నారు. చిన్నారి బాలికలు. అంతమంది స్త్రీలు కూడబలుక్కుని అడ సంతానాన్నే కనటం కొంచెం ముచ్చటేసింది నాకు.
    ధాన్యం బళ్ల మీద వేసి వెడుతూ "ఓ రంగమ్మో పూల రంగమ్మో" అంటూ స్త్రీలు పాటలు పాడుకుంటున్నారు. సంగీతం 'జనగణమన శ్రీనివాసలక్ష్మీ' ట.    
    డాక్యుమెంటరీ మధ్యలో ఓ చింతచెట్టు పక్క నుంచీ ఓ పంచె మగ పురుగు రోడ్డు మీదకు వచ్చి ఆశ్చర్యపోయి నిలుచున్నాడు. వెంటనే కొందరు ఆడంగులు వాడి జబ్బ పట్టుకుని "కెమెరాకి అడ్డం వస్తావా!" అని తిడుతూ వాడిని చెరకు తోటల్లోకి విసిరేసిన వైనం (పొరపాటున ఎడిట్ కాకుండా) నాకు దృగోచరమైంది.
    మొత్తానికి డాక్యుమెంటరీ సక్సెస్ పుల్.
    మళ్ళీ యాంకర్ ప్రత్యక్షమైంది. 'చూశారా , మా అడశక్తి ఎంత గొప్పదో!" అన్నట్లు చిరునవ్వు నవ్వి, "ఇప్పుడు కాసేపు తప్పనిసరిగా వ్యాపార ప్రకటనలు!" అంది.
    ఒక పురుషుడు షేవ్ చేసుకుంటున్నాడు. వాళ్ళావిడ వచ్చి "మీ గడ్డం ఇంత నునుపుగా , ఆకుపచ్చగా, పసుపు పచ్చగా అక్కడక్కడా ఎర్రగా అన్ని రంగుల్లో ఉండటానికి కారణం తెలుసా? నేనే కొని తెచ్చాను మీ కోసం - 'నైనో క్లాక్ బ్లేడ్!" అంది.
    'అదేంటి ? నేను పొద్దున్నే ఆరింటికే లేచి ఈ ముదనష్టపు ఫామిలిని పోషించటానికి వెళ్ళి, రాత్రి ఎప్పుడో లేటుగా వస్తా కదా! ఎందుకు నైనోక్లాక్ బ్లేడు పట్టుకోచ్చావు?" అని అడిగాడు. ఆవిడ కిలకిలా నవ్వి, కొత్త బ్లేడు తిరగదిప్పి పట్టుకుంది. తొమ్మిది కాస్తా ఆరు అయింది. వాడు బిక్కమొహం వేశాడు.
    "తదుపరి కార్యక్రమం - హిందూ ముస్లిం సోదరీమణుల సమిష్టి ఐక్యతా కృషితో వినూత్న వికాసం విరాజిల్లే నాటిక , చూసి ఆనందించండి!"
    నాటిక ప్రారంభమయింది.
    "అసూయమ్మాజీ! అసూయమ్మాజీ!" బయటనుంచి ఓ స్త్రీ కంఠం.
    అసూయమ్మగా పక్కింటి సోదరీమణిచే పొరపాటున పిలవబడ్డ అనసూయమ్మ లేచి, లెప్ట్ వింగ్ లోకి వెళ్ళి ఓ బురఖా స్త్రీతో వచ్చింది.
    "కైసే హై అప్, అసూయమ్మాజీ!" అడిగింది చాలా వాత్సల్యం నిండిన కంఠంతో.
    అనసూయమ్మ చిరునవ్వు నవ్వుతూ "మై టీక్ హు, లేకిన్ అనసూయమ్మ హై.... అసూయమ్మా నహీ!" అంది.
    "హమ్ నయా అయే హైనా! కుచ్ దినో మే హమే అప్ కా నామ్ ప్రాక్టీస్ హోజాయేగా!" అంది బురఖా స్త్రీ. ఆపైన "మాఫ్ కర్ నా దీదీ!" అని కూడా అంది.
    "ఫరవానహీ!" అని అనసూయమ్మా "కాఫీ తీసుకుంటావా బెహెన్?" అని అడిగింది.
    "మై కాఫీ లేచుకీహు, కాఫీ హోగయా!" అంది బెహెన్.
    "భాయీజాన్ రాలేదేం?" అడిగింది అనసూయమ్మ.
    "అయన జాన్ కి (ప్రాణానికి) ఇంకో భాయీ తగిలాడీ మధ్య!" అని ఉసూరుమంది బెహెన్.
    దీదీ బెహెన్ ని ఓదార్చింది. ఇలా కొంత సంభాషణతో నాటిక ముగిసే సమయానికి పరాఠా, మొగలాయీ చికెన్ ఎలా చేయాలో బెహెన్ అనసూయమ్మకీ , సున్నండలూ , కజ్జికాయలూ ఎలా చేయాలో అనసూయమ్మ బెహెన్ కి నేర్పుకున్నారు. ఇద్దరూ పకపకా నవ్వుకుంటూ అరగిస్తుంటే శుభం పడింది.
    ఆవులించి టైము చూసుకున్నాను. అరె! పదిన్నరయింది. ఇక పడుకుందామని ఆఫ్ చేయ్యబోతుండగా ఇప్పుడు కాసేపట్లో వార్తలు అని ఎనౌన్స్ చేశారు. వార్తలు చదివే ఆమె తొందర తొందరగా చదివేసింది. పెద్ద విశేషాలేమీ లేవు. మిధిలానగరంలో జనక్ పూర్ లో సీతామందిరం నిర్మాణానికి కేంద్రం నుంచి ప్రత్యేక హామీ. మహిళా రిజర్వేషన్ బిల్లు మొదలైనవి చెప్పి, "ఏవండి! ఆలస్యమైంది. ఓ అరగంటలో ఇంట్లో ఉంటాను. ఈ ఒక్కసారికి ఏమీ అనుకోవద్దు. మీరూ, చంటిగాడూ అన్నాల్తిని పడుకోండి!" అని వాళ్లాయనకి కాబోలు సందేశం ఇచ్చింది.
    మరుక్షణం ఆ చానెల్ డైరెక్టర్స్ కాబోలు ఓ అరడజనుమంది లావుపాటి మగాళ్ళు తమని పరిచయం చేసుకుని, తమ లేడీ స్టాఫ్ ని జాగ్రత్తగా ఇళ్ళకి దింపి వెంటనే తాము ఇళ్ళకి వెళ్ళిపోవాలని , లేకపోతే వాళ్ళ భార్యలు తీసుకునే పాఠాలు విని మళ్ళీ పొద్దున్నే రావటం కష్టమని చెప్పి ఈ రోజుకు వీడ్కోలు తీసుకున్నారు.
    భలే! ఇంత కలుపుగోలు ఛానెల్ ని చూడ్డం ఇదే మొదటిసారి అనుకుంటూ టీవీ ఆఫ్ చేసి మంచం మీద వాలాను.

                                                                      *  *  *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS