Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 29


    ఆరంభ ఘంటిక గణగణ మ్రోగింది. తాన్ సేన్ గంభీర కంఠంతో సంగీతశాస్త్రం మీద బైజూను ప్రశ్నించాడు. బైజూ ప్రశాంతంగా, అడిగిన ప్రశ్నలకు బదులు చెప్పాడు. బైజూ కొన్ని కళా రహస్యాలను గూర్చి ఆస్థాన గాయకుణ్ణి అడిగాడు. తాన్ సేన్ పెదవి విప్పలేకపోయాడు. జనం బైజూకు జయం పలుకుతున్నారు. ఆస్థానగాయకుడికి ఆగ్రహం వస్తున్నది.
    బైజూ సితారా చేత పట్టుకొని ఒకమాటు మీటి రాగాలాపన చేశాడు. మహాజనం మంత్రముగ్ధమై మైమరచిపోయారు. బైజూ తీగలు మీటుతూనే ఉన్నాడు. చెట్ల ఆకులు చలించటంలేదు. పూలతీగలు ఊగులాడటం లేదు. గాలికూడా కదలటం లేదు. పశువులూ పక్షులూ నిశ్శబ్దంగా నిలబడి పోయాయి. ప్రకృతి అంతా పరవశమై పోయింది. అంతలోనే కొన్ని లేడిపిల్లలు బైజూ ముందుకు పరుగెత్తుకొని వచ్చాయి. బైజూ మనోహరంగా సితారా మ్రోగిస్తూనే ఉన్నాడు. లేడిపిల్లలు నిశ్చలంగా ప్రక్కనే నిలబడి వింటూనే ఉన్నవి. అద్భుతమైన ఆ గానమహాత్వానికి నిర్విణ్ణుడైనాడు ఆస్థాన గాయకుడు.
    బైజూ పాట ఆపుచేశాడు. తాను ధరించి వున్న పూలదండను ఎదుట వున్న లేడిపిల్ల మెడలో వేశాడు. అప్పటిదాకా మైమరచి ఉన్న లేడిపిల్ల పూలమాల మెడలో పడగానే ఒళ్లు తెలిసి ఒక్క గంతులో దూరంగా పరుగెత్తిపోయింది. బైజూ ఆస్థానగాయకుడి వంకచూచి "మహాశయా! ఆ లేడిపిల్ల నా పూలమాలను ఎత్తుకొని పోయింది. దానిని వెనుకకు రప్పించి నాదండ నాకు ఇప్పించండి" అని పలికాడు.
    తాన్ సేన్ సగర్వంగా సితారా అందుకున్నాడు, రాగాలాపన ఆరంభించాడు. ఎంతసేపు ఆలపించినా లేడిపిల్ల తిరిగి రాలేదు. తాన్ సేన్ తన కళాప్రావీణ్యం అంతా ప్రయోగించాడు. లేడిపిల్ల జాడలేదు. కాలం గడిచిపోతున్నది. తాన్ సేన్ చేతివ్రేళ్లు సితారాను మ్రోగిస్తూ ఉన్నవి కాని లేడిపిల్ల మాత్రం వెనుకకు తిరిగి రాలేదు.
    తాన్ సేన్ సితారా క్రిందపెట్టాడు. "బైజూ! ఆ లేడిపిల్ల నీగానం వల్లనే ఇక్కడికి వచ్చిందని నాకు నమ్మకం లేదు. అది ఈ త్రోవను పరిగెత్తిపోతూ ఇలా కొంచెంసేపు నిలబడివుంటుంది! నీ పాండిత్యం వల్లనే పరుగెత్తి వచ్చిందంటావా! మళ్లీ సితారా మ్రోగించి దానిని ఇక్కడకు రప్పించు. నీగానం పస తెలుస్తుంది." అని పలికాడు తాన్ సేన్.
    బైజూ చిరునవ్వు నవ్వుతూ మళ్లీ సితారా చేత పట్టాడు. మళ్లీ ఒక్కమాటు గానవాహిని పొంగి పొరలింది. సభా సదులందరూ సంగీత ప్రవాహంలో మునకలు వేస్తున్నారు. అంతలో పూలమాల వేసుకున్న లేడిపిల్ల ఎక్కడనుంచో చెంగుచెంగున పరుగెత్తి వచ్చింది. బైజూ లేడి మెడలోని పూలదండ అందుకున్నాడు. ఆ అద్భుతం చూచి జనం అంతా జయ జయ ధ్వానాలు చేశారు. అక్బరు పాదుషా ఆసనం మీద నుంచి లేచి "సెభాష్! బైజూ! నీవే జయించావు. తాన్ సేన్ ఓడిపోయాడు. నియమానుసారం అతనిని నీవు శిక్షించవచ్చు" అని పలికాడు.
    తాన్ సేన్ తలవంచుకొని తనకు ప్రాణభిక్ష పెట్టమని బైజూను ప్రార్థించాడు. బైజూ ఆదరంగా "తాన్ సేన్ మహాశయా! భయపడకండి! మీకు నేను ప్రాణదానం చేస్తున్నాను. ఇంతవరకూ మీరు విద్యా గర్వంతో ఎందరినో గెలిచి అన్యాయంగా చంపించారు. అందువల్ల మీకు బుద్ధిచెప్పాలనే నేను గానవిద్య నేర్చుకున్నాను. కాని పన్నెండేళ్ల క్రిందట పసిబాలుణ్ణి కదా అని నన్ను మీరు అందరితోపాటు చంపించకుండా దయతలచి విడిచిపెట్టారు. ఉపకారానికి ప్రత్యుపకారంగా ఇప్పుడు మీకు ప్రాణభిక్ష పెడుతున్నాను. ఇక మంచిగా జీవించండి" అని పలికాడు. తాన్ సేన్ మారుమాట్లాడకుండా బైజూ ముందు చేతులు మోడ్చి వినమ్రుడై నిలిచాడు.

                                        *  *  *  *


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS