Previous Page Next Page 
ప్రతీకారం పేజి 29


    "కూరగాయలు ఎక్కడ? ఆ బంతేమిటి? కూరగాయల కిచ్చిన డబ్బు పెట్టి బంతి కొన్నావా?" పూర్తిగా షాక్ నుంచి కోలుకోకుండానే అన్నది రమ.
    అంజి బంతిని రమకేసి విసిరాడు. రమ యాంత్రికంగా చెయ్యి అడ్డం పెట్టి వెనక్కు కొట్టింది. మళ్ళీ అంజి ఆ బంతిని కింద పడకుండా భార్యకేసి కొట్టాడు. ఆమె మళ్ళీ వెనక్కు అంజి ముందుకు...అలా కొంతసేపు అనుకోకుండా బంతి ఆట సాగింది. రమ కోపంతో బుసలు కొట్టసాగింది. అంజి అదేమీ పట్టించుకోవడం లేదు.
    అంజి చేతిలో వున్న న్యూస్ పేపరు రమ ముఖం మీదకి విసిరాడు.
    ఈ సారి రమకు నిజంగానే భయం వేసింది! భర్తకు నిజంగానే మతి భ్రమించిందనుకొని భయంతో బయటకి పరుగు తియ్యబోయింది. అంజి ఒక్కసారిగా రమ జబ్బను గట్టిగా గుచ్చి పట్టుకున్నాడు. రమ భయంతో బిగుసుకు పోయింది. కేకలు పెట్టాలనుకుంది కాని గవదలు బిగుసుకుపోయి నోరు తెరవలేకపోయింది. పిచ్చి చూపులు చూస్తూ నిలబడిపోయింది. ఒళ్ళంతా చెమట్లు పట్టింది.
    "ఏయ్ రమా! ఎందుకట్టా వణికిపోతావ్ నాకేం పిచ్చి పట్టలేదులే! పదివేలు ... పదివేలు ... సంపాయించబోతున్నాను. ఒక్కసారిగా కష్టపడకుండా పదివేలు! బంతి ... బేబీ... బాల్ బేబీ...బంతి అదే బాల్ దొరికింది. ఇక బేబీ కావాలి! ఐదేళ్ళ బేబీ కావాలి" ఉత్సాహంగా అన్నాడు అంజి.
    రమకు అంజి మాటలు బోధపడలేదు. భయం మరీ ఎక్కువయింది. చచ్చినోడికి నిజంగానే మతిపోయింది? లేకపోతే ఆ మాటలేమిటి? పిచ్చివాళ్ళు తమకు పిచ్చి లేదంటారట.
    "అమ్మ బాబోయ్!" ఎలాగో గొంతు పెగుల్చుకుని అరిచింది రమ.
    "ఏయ్ ఎందుకట్లా అరుస్తావు? నాకేం పిచ్చెక్కలేదు. భయపడకు. అలా బిగుసుకోకు. ఏదీ సరిగా నిల్చో. నిటారుగా నిల్చోమంటూంటే..." అంటూ అంజి జేబులో నుంచి టేపు లాగి రమ పొడవునూ, లావునూ కొలవడం మొదలుపెట్టాడు.
    రమ కొయ్యబొమ్మలా బిగుసుకొని నిటారుగా నిల్చుంది.
    "కరెక్టు! కొలతలు సరిగానే వున్నాయ్. నువ్వూ చామన చాయే, నేను తెల్లటి తెలుపు! కరెక్టు పదివేలు వచ్చినట్టే. ఇక కావాల్సింది ఒకటే! బేబీ! బేబీని సంపాయించాలి." అంజి ఉత్సాహంగా గెంతసాగాడు.
    "బాబోయ్! నిజంగానే పిచ్చెక్కింది" వెర్రికేక పెట్టి రమ విరుచుకు పడిపోయింది.
    మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికి అంజి ఒళ్ళో తల పెట్టుకుని వుంది. మళ్ళీ వెర్రికేక పెట్టింది. అంజి లేవకుండా గట్టిగా పట్టుకున్నాడు.
    "పిచ్చిదానా! ఎందుకలా భయపడిపోతావ్? నాకేం పిచ్చెక్కలేదు. విను చెబుతాను" అంటూ న్యూస్ పేపరు ప్రకటన గురించి చెప్పాడు.
    అంతా విని రమ తేలికగా లేచి కూర్చుంది.
    "ఆ ఏడుపేదో ముందే ఏడవకూడదు? నా ప్రాణాలు తియ్యకపోతే" కసురుకుంది రమ.
    "నువ్వు నన్ను చెప్పనిచ్చావా? మరి మనకు బేబీ కావాలి."
    "బేబీని ఎవరిస్తారు?" సాలోచనగా అన్నది రమ.
    అంజి ఆలోచనలో పడ్డాడు. ఒక ఆలోచన మెరుపులా తట్టి ఎగిరి గంతేశాడు.
    "వెంటనే బయలుదేరు. బేబీని సంపాదించాలి." అంటూ భార్యను హెచ్చరించాడు.

                                                                      23

    పేపర్లో ప్రకటన పడి పది రోజులయింది. జగన్నాథం వరండాలో కుర్చీ వేసుకుని కూర్చొని ఆత్రంగా ప్రతి నిమిషం వాకిలికేసి చూస్తున్నాడు. దూరంగా పోస్టుమాన్ వాకిలి దాటిపోగానే ఒంట్లో నుంచి ఎవరో సత్తువను లాగేసినట్టు వెనక్కి వచ్చి కుర్చీలో కూలబడుతున్నాడు.
    నిముషం నిముషం ఆ తండ్రి హృదయం ఆశా నిరాశల మధ్య తల్లడిల్లి పోతూంది. రోజులు గడుస్తూ ఉంటే కాల గమనం ఎంత క్రూరమైందో అర్థం అవుతుంది. గడచిపోతున్న ప్రతీక్షణం కొంత ఓపికను తీసుకుపోతూ ఉంది.
    ఊరంతా తిరిగి, రాత్రికి దిగాలుపడి ఇల్లుచేరే రవిని పలుకరించే ధైర్యం వుండటం లేదు. రవికూడా తండ్రికేసి చూడకుండానే తలవంచుకుని లోపలకు వెళ్ళిపోతాడు. పగలంతా కళ్ళల్లో వత్తులు వేసుకుని తనకోసం ఎదురుచూసే తండ్రికి సాక్ష్యుల గురించి ఏమీ తెలియలేదని చెప్పే ధైర్యం రవికి లేదు.
    ఆ రోజు సెప్టెంబరు 15వ తారీఖు ఇంకా పదిహేను రోజుల గడువు మాత్రం ఉంది. జగన్నాథం, రవీ, ఇందిరా మౌనంగా కూర్చొని ఉన్నారు. ముగ్గురి ముఖాల మీదా విషాదఛాయలు అలుముకొని ఉన్నాయి.
    "రేడియో ఎనౌన్స్ మెంట్ ఇస్తే" అన్నది ఇందిర మౌనభంగం చేస్తూ.
    రవి విననట్టే ఉండిపోయాడు.
    "నాకు ఆలోచించే శక్తి లేదు తల్లీ, నీకు ఎలా తోస్తే అలాగే!" అన్నాడు జగన్నాథం బరువుగా.
    ఇందిర రేడియో ఎనౌన్స్ మెంట్ రాసింది. చదివి వినిపించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS