Previous Page Next Page 
ది సెల్ పేజి 29


                                        పోలీస్ ఆఫీసర్

    విజయపురి ఒక ఆదర్శ గ్రామం. ఆ గ్రామానికి చివరగా వుంది కుటీరంలాంటి ఇల్లు. చుట్టూ కొబ్బరి చెట్లు. పెరటిలో కూరగాయల మొక్కల పచ్చదనంతో రకరకాల పూల సోయగాలతో ఆహ్లాదకరంగా వుంది వాతావరణం.
    విజయ్ ఆ ఇంటి తోటలో కూర్చుని ఆలోచిస్తున్నాడు. అలికిడికి తలఎత్తి చూశాడు. ఎదురుగా డాక్టర్ లత వుంది.
    "రండి, కూర్చోండి" అని ఎదురుగావున్న కుర్చీ చూపించాడు. డాక్టర్ లత వచ్చి కూర్చుంది. విజయ్ ఏమీ మాట్లాడలేదు. అతని మస్తిష్కంలో ఆలోచనా తరంగాలు కల్లోలం సృష్టిస్తున్నాయి. ఆలోచనలతో పోటీపడలేక అతని చూపు దిగంతాలలోకి వుంది. అతను అనేక విధాలుగా మనసుకి సర్దిచెప్పుకుంటున్నా అది అతని ఆధీనంలో లేదు.
    విజయ్ ను ఆ సమయంలో మాట్లాడించే ధైర్యంలేక అక్కడనుండి లోపలకు వెళ్ళింది, టీ తయారుచేయటానికి.
    అతని మనోఫలకంమీద జీవితంలో సంభవించిన సంఘటనలు తటస్థపడిన వ్యక్తులు కదలాడుతున్నారు. అన్నీ చేదు అనుభవాలే. ఆ చేదు అనుభవాలు తన జీవితానికి మాత్రమే పరిమితం కాదు. వాటి చుట్టు అనేక పాత్రలు వెన్నంటి వున్నాయి. కొందరు మధ్యలో నిష్క్రమించారు తను మాత్రం బాధితుడుగా మిగిలాడు.
    "టీ" అంటూ కప్పుతో వచ్చిన లత పిలుపుకి ఆలోచనల నుండి ఈ లోకంలోకి వచ్చాడు విజయ్.
    "ఏమిటి మీరంతా సీరియస్ గా ఆలోచిస్తున్నది? మీరే అలా వుంటే ఇక సామాన్యుల సంగతి ఏమిటి, బి బ్రేవ్ ...." డాక్టర్ లత అనగలిగిందేకాని ఆ మాటలు ఆమె హృదయాంతరాలాల్లోంచి రాలేదు. మరుక్షణంలో ఆమె కళ్ళవెంట నీళ్ళు ఉబికివస్తుంటే ముఖం ప్రక్కకు త్రిప్పుకుంది.
    "వాటె వండర్! డాక్టర్ గా పేషెంట్లకు ధైర్యం చెప్పవలసినవారు, మీరే అలా అయిపోతే; మీ పేషంటుని నా పరిస్థితి ఏమిటి? నేను ఇంకెంత బెంగపడిపోవాలి? కాని నేను జీవచ్చవాన్ని....ఐయాం స్టిల్ ఎలైన్....ఇనుప గుండె నాది. నా కళ్ళు చమర్చవు. నా కళ్ళలో నీరు ఇంకిపోయింది డాక్టర్ ...." ఆవేదన పొంగి పొరలింది విజయ్ మాటల్లో.
    గతాన్ని తలచుకోవల్సినంతగా మరచిపోలేదు వాళ్ళిద్దరు. మరచిపోదామని ప్రయత్నించినా మరచిపోలేకపోతున్నారు.
    విజయ్ పేరుప్రఖ్యాతులు గల పోలీసు ఆఫీసర్. న్యాయాన్ని రక్షించటంలోను, చట్టాన్ని అమలుపరచటంలోను అతనికి అతనే సాటి.
    రాయుడిపాలెంకు పోస్టు చేసిన ఏ పోలీసు ఆఫీసర్ సరిగ్గా నెలరోజులు కూడా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించటం లేదు. అతని ఉద్యోగ పరిధిలో రాయుడుపాలెం, దానిచుట్టు ఒక ఇరవై చిన్న గ్రామాలు వున్నాయి. ఎవర్ని అక్కడ వేసినా ఆరోగ్యం సరిగా వుండటంలేదని మెడికల్ లీవుపెట్టి వెళ్ళిపోతున్నారు.
    పోలీసు డిపార్టుమెంటు గురించి, ఆఫీసర్ల గురించి పత్రికలలో వింతలు రాశారు.
    డిపార్టుమెంటు గౌరవ మర్యాదలను నిలపటానికి ఉన్నతాధికారులు ఏరి కోరి విజయ్ ని అక్కడ పోస్ట్ చేశారు.
    మారుమూల ప్రాంతానికి వెళ్ళటానికి విజయ్ కి అయిష్టతగా వున్నా అధికార్లు నచ్చచెప్పి అతనికి సవాలుగా ఈ పోస్టింగ్ ఇచ్చారు.
    రాయుడిపాలెం పోస్టింగ్ ను ఛాలెంజ్ గా తీసుకొని పట్టుదలతో బయలుదేరాడు విజయ్.
    ఓ చేత్తో సూట్ కేసు మరో చేత్తో ఒక ఐదు సంవత్సరాల తన ముద్దుల కొడుకు టింకుని పట్టుకుని బస్సు దిగి చుట్టూ చూశాడు విజయ్.
    అక్కడ గుర్రపు బళ్ళు, గూడు రిక్షాలు వున్నాయి. ఓ రిక్షాఅతన్ని రమ్మని సైగ చేశాడు.
    అతను ముందుకు రాలేదు. దగ్గరకు వెళ్ళి తనే రిక్షాలో సూట్ కేసు పెట్టాడు. రిక్షా త్రొక్కే అతను టైరులో గాలి లేదన్నాడు.
    విజయ్ మిగిలిన రిక్షాలకేసి చూశాడు. అతన్ని చూసి అక్కడి రిక్షావాళ్ళు, గుర్రపుబళ్ళవాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు.
    మొదటే చేదు అనుభవం ఎదురయ్యింది. విజయ్ విషయం అర్థంచేసుకున్నాడు. కావాలని వాళ్ళు అలా చేసినట్లు బోధపడింది. స్వతహాగా వాళ్ళకి పోలీసు ఆఫీసర్ ని ఎదిరించే ధైర్యం వుండదు. వాళ్ళ ప్రవర్తన వెనుక ఏదో బలమైన హస్తం వుందనుకున్నాడు.
    అటువంటి పరిస్థితులు ఎదురవ్వటం మూలంగానేమో లోగడ ఎవరూ అక్కడ ఉద్యోగం చేయటానికి యిష్టంలేక శెలవుమీద వెళ్ళిపోయారు.
    పోలీసు వ్యతిరేకతను తట్టుకొని ఉద్యోగ బాధ్యతలలో అప్రమత్తంగా వుండి ప్రజల మనస్తత్వంలో మార్పు తీసుకురావలసిన గురుతర బాధ్యత తనమీద ఎంతైనా వుంది.
    రాయుడిపాలెం పోలీసు స్టేషన్ లో డ్యూటీలో జాయిన్ అయ్యాడు విజయ్. సిబ్బందికి కొండంత అండ లభించినట్లనిపించింది. వాళ్ళ ముఖాలలో నూతనోత్సాహం వెల్లివిరిసింది. యువకుడు, విద్యావంతుడు, ఆదర్శవంతమైన పోలీసు ఆఫీసర్ ను పోలీసుశాఖ గౌరవ మర్యాదలను రాయుడిపాలెంలో నిలబెట్టటానికి ఉన్నతాధికారులు ఏరికోరి విజయ్ ని అక్కడ వేసినట్లు ఆ సిబ్బందికే కాదు, ఆ వూరి ప్రజలందరికి త్వరగా తెలిసిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS