"గురుదేవా! ఈ దురదృష్టవంతురాలిపై నిర్హేతుకంగా మీరు చూపుతున్న దయ మీకు దైవత్వాన్ని ఆపాదిస్తోంది. మీరు ఆవశ్యమే బయలుదేరండి. నేను పెద్దియజ్వ వారి సహాయంతో శారదా యజ్ఞం ప్రారంభిస్తాను. నా యజ్ఞం పూర్తయ్యేసరికి మీరు విజయులై కంచు ఢక్కను పగులకొట్ట గలుగుతారు. మీలోని ప్రజ్ఞాపాటవాలూ, పాండిత్యమూ దశదిశల్లో వెలుగులు విరజిమ్ముతాయి."
శ్రీనాధుడు సంతుష్టుడై లేచాడు.
సప్తమినాడు కొద్దిమంది శిష్యులతో ఆయన విజయనగరాభిముఖంగా ప్రయాణమయ్యాడు. కొండవీడు నగర దాటిపోయేముందు మూలగూరమ్మ దేవాలయం దిక్కు నుండి వొక వీరుడు అశ్వారూఢుడై రావటం కనిపించింది. ఆ మేనా ఆపించాడు. దుగ్గన్నను దగ్గరగా పిలిచి ఆ వచ్చేదెవరో పరికించి చూడమన్నాడు.
దుగ్గన్న శ్రీనాధుని బావమరిది. శ్రీనాధుడు దగ్గుపల్లి వారింటి ఆడపడుచును పరిణయమాడాడు. ఆమెకు ముగ్గురు సోదరులున్నారు. (1) పోతన, (2) ఎర్రన్న, (3) దుగ్గన్న, మొదటివాడయిన పోతన్న భాగవతం తెనిగించిన పోతన్నగా కొందరు భ్రమపడ్డారేమో! కాని, యీ పోతన్న దాదాపు నిరక్షర కుక్షి, ఎర్రన్న కవిత్రయం ఎర్రన్న కాదు. ఇతడు కూడా పోట్టపోసి వెతికితే తప్ప అక్షరం ముక్క వొరకని వాడు. మూడోవాడు దుగ్గన్న అక్షరకుక్షి. శ్రీనాధుని వద్ద శిష్యరికం చేస్తూ వున్నాడు. అతడు శ్రీనాధునీడగా ఎల్లవేళలా ఆయనను అంటిపెట్టుకున్నవాడు, అది ఆయనకూ ఇష్టమే! అతడంటే అంత ప్రేమ!
గుర్రంమీద వస్తున్న యువకుడు వారిని సమీపించి ఛెంగున గుర్రాన్ని దూకాడు. శ్రీనాధయ్య దగ్గరగా వచ్చి పల్లకిలోనికి వంగి ఆయన పాదాలను తాకాడు. ఆ వంగినప్పుడా యువకుడి తలపాగా వూడి శ్రేనాధయ్య పాదాలమీద పడింది. నిడుపాటి వెంట్రుకలు మోకాళ్ళవరకూ జీరాడాయి.
"అమ్మా! వెమా౧ నువ్వా! ఇలా ఎందుకొచ్చావు?"
"గురుదేవా! మీరు నా ప్రాణప్రదుడయిన సోమదేవుడిని విడిపించి తీసుకొచ్చేందుకు వెళుతున్నారు. స్వామి ప్రసాదం తెచ్చాను. స్వీకరించండి" అంటూ ప్రసాదం అందించింది.
"ఇంత మాత్రం దానికి నీవు రావాలా తల్లీ" ప్రశ్నించాడాయన. వేమాంబిక ఇందుకు సంశయించి తన దుస్తుల్లో ఒక వస్తువును తీసి ఆయనకిచ్చింది. అది బంగారు గొడ్డలి.
దానిని చూచి శ్రీనాధయ్య విస్తుపోయాడు. ఆమె భావాన్ని గ్రహించిన దుగ్గన ఆ బంగారు గొడ్డలిని తీసుకుని భుజాన పెట్టుకుని పరశురాముడల్లే ప్రతిజ్ఞ చేశాడు.
"రవిచంద్రులు ఏకమైనా" మా బొందిలో ప్రాణాలున్నంత వరకూ ఈ గొడ్డలితో డిండిమభట్టు కందుఢక్క పగులకొట్టిగాని తిరిగిరాము."
శ్రీనాథయ్య చిరునవ్వు నవ్వి వేమాంబను వీడ్కొలిపాడు. దారిపొడవునా ఆయన గాయత్రి, పంచాక్షరి జపిస్తూ గడిపాడు. దుగ్గన్న చిన్నపొన్న పండితులూ కవులూ ఎదురైతే వారిని ఓడిస్తూ, తన పాండిత్యానికి ఒరిపిడి పెట్టుకుంటూ ముందుకు సాగారు.
అలాగే పదిహేను రోజులు ప్రయాణం చేసి సరిగా సప్తమినాడే విజయనగరం పొలిమేర్లలో ప్రవేశించారు.
ఆ సప్తమినటి ఉషోదయాన శ్రీనాధుడు విజయనగరం నగరి వాకిట నిలచి తలుపుతట్టాడు. విజయనగరం కవి పండితుల గుండెలు గుభిల్లుమన్నాయి.
ముమ్మకవి కుతంత్రం ప్రారంభించాడు. అయినా శ్రీనాధుడు కన్ను తెరిచాక అతని తంత్రం పారలేదు.
ప్రౌఢదేవరాయ క్షితీంద్రుడు శ్రీనాధయ్యను సన్మానించి ఆయన అభ్యర్ధన మన్నించి కవిగోష్టి ఏర్పాటుచేశాడు. ఆ గోష్టిలో తీర్పరిచంద్రభూష క్రియాశక్తి. ఆయన సభా ప్రవేశం చేసినప్పుడు రాజు సైతం లేచి నిలిచేవాడు.
ఒకప్రక్క అరుణ గిరినాథగౌడ (డిండిమ) భట్టు, రాజనాధుడు చేరారు.
మరొకప్రక్క కొండవీటి రాజ్య విద్యాధికారి శ్రీనాథయ్య దుగ్గనా చేరారు.
మధ్యలో పౌంఢ్రదేవరాయలూ, చంద్రభూష క్రియా శక్తి ధర్మసూచికల వలె కూర్చున్నారు.
తర్కవ్యాకరణ, జ్యోతిష ఛందో శాస్త్రాలు చర్చాంశాల్లో దొర్లాయి. షడజ్యనాలూ, అష్టాదశ పురాణాలూ, ఉపనిషత్తులూ, వేదాంశాలూ ఎన్నో దొర్లాయి. "అధర్వువేదశాఖా ధీతినిష్టాతుడైనవాడు శ్రీనాధుడు.
