అ మాటలు విని సృష్టి ఎంత నవ్విందో చెప్పలేం.
నవ్వు తగ్గిన తర్వాత కళ్ళర్పకుండా రాజు వైపు ఎంతో ఆపేక్షగా చూస్తూ అంది.
"మనిషి కష్టాలకి కారణం ఏమిటో తెలుసా రాజూ?"
మాట్లాడకుండా చూస్తున్నాడు రాజు.
మళ్ళీ అన్నది సృష్టి.
"మనిషి కష్టాలకి కారణం అతి తెలివి.
మనిషి మనిషిలా బతకడానికి ఓ మోస్తరు తెలివితేటలూ చాలు. మితిమీరిన తెలివితేటలు మనిషికి ఇవ్వడం అనేది దేవుడు చేసిన తప్పు. నీది ప్యూర్ నాలెడ్జి రాజూ! మనిషిని మారణ హోమం వైపు నడిపించే అతి తెలివి కాదు నీది " అంది.
"ఎందుకంత పెద్ద పెద్ద మాటలూ?" అన్నాడు రాజు.
"సరే! ఏమైనా చిన్న చిన్న మాటలూ చెప్పు ."
"అంటే ....."
"అంటే ...చిన్న చిన్న పదాలతోనే పెద్ద పెద్ద భావాలు వుంటాయి. ఉదాహరణకు "నేను" అన్నపదం ఉందనుకో - చాలా చిన్న పదం కదా. రెండే అక్షరాలూ "
'అవును "
"అట్లాగే 'నిన్ను' అన్న పదం వుండనుకో -అదీ చిన్న పదమే కదా" అది కూడా రెండక్షరాల మాటే !
'అవును"
"అవునా! పొతే ప్రేమిస్తున్నాను " అన్న పదం ఉంది కదా - ముచ్చటగా ఈ మూడు పదాలు కలిపితే ఎమవుతుందీ!"
"నేను .......నిన్ను.....ప్రేమిస్తున్నాను ."
"నిజంగానా ?" అంది సృష్టి వెంటనే .
"అవేకదా నువ్వు చెప్పిన మూడు పదాలు " అన్నాడు రాజు.
నవ్వి , "రాజు అంటే నీ పూర్తి పేరు రాజ్ కపూరా?" అంది సృష్టి.
"ఏం?" అన్నాడు రాజు.
"ఏం లేదు - పాతకాలపు క్లాసిక్ సినిమా ఒకటి ఉందిలే ! 'అనాడీ ' అని అంటే 'అమాయకుడు ' అని ఆర్ధం.
"నేనూ చూశా . మంచి సినిమా !" అన్నాడు రాజు.
సుతారంగా తన నుదుటి మీద ఒకసారి కొట్టుకుని, తర్వాత రాజు తల మీద ఒకసారి మొట్టి, "ఈ డైలాగులు సరైన దార్లో పడేటట్లుగా లేవులే -- ఏ డైలాగు ఎవరి ద్వారా ఎప్పుడు వినబడాలో ముందే రాసిపెట్టి ఉంటుందనుకుంటా. దేనికైనా టైం రావాలి. పోనీ -- పొతే -- ఇందాక నేను చెప్పిన దాన్లో తప్పు పట్టులేకపోయావు నువ్వు."
"తప్పా.....ఏమిటి ?"
"నేను" అన్న పదం చిన్నదని చెప్పాను కదా! కానీ ఈ నేను అన్న పదమే ప్రపంచాన్ని ఆడిస్తోంది. అది చాలా పెద్ద పదం !"
"అవును - నాకు శ్రీరాముడి ఇన్సిడెంటు ఒకటి గుర్తు వస్తోంది " అన్నాడు రాజు.
"చెప్పు "
"మనకి ఎన్నెన్నో రామాయాణాలు ఉన్నాయి. వాటి ఆధారంగా పుట్టుకొచ్చిన పుక్కిటి పురాణాలు ఉన్నాయి. ఒక వృత్తాంతం ప్రకారం శ్రీరాముడు ఒక ముని ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడుట.
"ఎవరు ?" అడిగాడుట ఆ ముని.
"నేను" అన్నాడు శ్రీరాముడు.
"నేనంటే ఎవరు ?" అన్నాడట ఆ ముని యధాలాపంగా.
"అవును "నేను" అంటే ఎవరు ?" అన్న తత్వచింతన మొదలయిందిట శ్ర్రీరాముడికి " అన్నాడు రాజు.
సాలోచనగా కొద్ది క్షణాల పాటు అతని వైపే చూస్తూ ఉండిపోయింది సృష్టి.
"ఏమిటా దీర్దాలోచన ?" అన్నాడు రాజు మృదువుగా.
ఒక్కసారిగా తల విదిలించి ఆలోచనల్లోంచి బయట పడింది సృష్టి.
"ఇది చిత్రంగా లేదు?" అంది.
"ఏమిటి చిత్రంగా ఉన్నది ."
"మనం ఏం మాట్లాడుకున్నా, ఏం చేసినా, ఏం చూసినా కూడా అది చివరకి రామాయణం వైపో, లేకపోతే రాక్షసుడి వైపో దారి తీస్తోంది. చివరికి బాబూ సేట్ సంధి ప్రేలాపన కూడా ........" అని ఆగిపోయింది సృష్టి.
బాబూ సేట్ సంధి ప్రేలాపన గుర్తు వచ్చింది రాజుకి.
"అమ్మోవ్ ! రాక్షసుడు ..."
"బాబోవ్! రాక్షసుడు ..."
"అమ్మ బాబోయ్ రాక్షసమాయ !"
నెమ్మదిగా అంది సృష్టి.
"బాబూ సేట్ అల్లాటప్పా మనిషి కాడు. అన్ని విధాల రాటు తెలినవాడు. సినిమా మాయ రాక్షసమాయ కంటే తక్కువేమీ కాదు. అట్లాంటి సినీరంగాన్ని శాసించిన వాడు బాబూ సేట్ . మారు వేషాలూ, మేకప్పులూ అతని ముందు ఆగవు. పైగా అతను టెక్నాలజీ తెలిసిన మనిషి."
"సో?"
"అట్లాంటి వాడే రాక్షసమాయ అని కలవరించాడంటే ...." అని అసందిగ్ధంగా ఆగిపోయింది సృష్టి.
"పాయింటే " అన్నాడు రాజు.
"నీకేమనిపిస్తోంది ?' అంది సృష్టి.
"దేన్నీ గురించి ?"
"రాక్షసుడి గురించి "
"నువ్వు రిసెర్చి స్కాలర్ వి. నువ్వే చెప్పు వింటాను "
చెప్పడం మొదలెట్టింది సృష్టి.
"పురాణాలలో నుంచి చరిత్రలోకి వద్దాం. ఆర్యులు ఇండియా మీదకి దండెత్తి వచ్చారనీ, అప్పటికే గొప్ప నాగరికత కలిగిన ద్రావిడులని జయించి దక్షిణానికి తరిమేశారని ఒక వాదం వుంది. ఆర్యులు తాము జయించిన ద్రావిడ జాతికి దాసులు. రాక్షసులు అని పేర్లు పెట్టారనీ అంటారు. తమ పట్ల విరోధం ప్రకటించిన వాళ్ళని రాక్షసులని పిలుస్తూ, తమ పట్ల స్నేహభావం ప్రకటించిన ద్రావిడులని వానరులుగా ట్రీట్ చేశారని అంటారు. హనుమంతుడూ, సుగ్రీవుడూ, ఇట్లాంటి కేటగిరికి చెందిన వాళ్ళేట."
మౌనంగా వింటున్నాడు రాజు.
"రామాయణ గాధ చాలా సింభాలిక్ గా ఆర్య ద్రావిడ సంఘర్షణని సూచిస్తుందని ఒక భావన రాజూ!"
"అంటే?"
"రాముడు దక్షిణాది వచ్చి లంకను జయించడం అంటే , ఆర్య నాగరికతని దక్షిణానికి స్ప్రెడ్ చేయడన్నమాట. అట్లాగే , వింద్యను దాటి వచ్చి దక్షిణాన ఆర్య నాగరికతని పాపులర్ చేసిన మొదటి ముని అగస్త్యుడు. అగస్త్యుడు సముద్రాన్ని అవుపోసన పట్టేశాడంటే దాని అర్ధం అతను దక్షిణ పదాన్నంతా ఆర్యుల ప్రభావంలోకి తెచ్చాడని ."
