Previous Page Next Page 
ది ఇన్వెస్టిగేటర్ పేజి 29


    "నా జీవితం నా ఇష్టం! నన్నాపడానికి మీరెవరు? నా బతుకు నేను బతుకుతున్నప్పుడు మీరెవరు నా దారికి అడ్డు రావడానికి?" అనూష ఆవేశంగా అంటూ తండ్రి చేతిని విదిలించుకుంది.
    వీరేష్ ఆమె వెళుతున్న దారికి లాఠీ అడ్డుపెట్టాడు.
    "ఇన్ స్పెక్టర్! ఇది మీ డ్యూటీయా? స్వార్థంతో సివిల్ డిస్ప్యూట్ లో తలదూర్చడం వల్లే మీ పోలీసు వ్యవస్థ పరువుప్రతిష్టలు మంట కలుస్తున్నాయి. ఆలోచించండి. నా వ్యక్తిగత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం భావ్యం కాదు. దయచేసి నా దారికి అడ్డు తొలగండి!" అసహనంగా అంది అనూష.
    "నోర్ముయ్! ఇన్ స్పెక్టరుగారినే ఎదిరిస్తావే?" కూతురి చెంప ఛెళ్ళుమనిపించాడు శ్రీపతి.
    ఊహించని ఈ పరిణామానికి అంతా నిశ్చేష్టులయ్యారు.
    బిందుమాధవి మెదడు చురుగ్గా పనిచేసింది. "సారీ శ్రీపతిగారూ! మిమ్మల్ని ఆహ్వానించింది తండ్రీ, కూతురూ మనసు విప్పి మాట్లాడుకుంటారని, ఒకరికొకరు నచ్చచెప్పుకుంటారని, కాని మీరు హద్దుమీరి ప్రవర్తించారు. నా యింట్లో నా ఎదుటే నా అతిథిపై చేయి చేసుకుంటారా? దయచేసి వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి!" ఆవేశంగా అంది బిందుమాధవి.
    సాహితి అనూష భుజమ్మీద చేయివేసి యింట్లోకి తీసుకువెళ్ళింది.
    "చూడండి శ్రీపతిగారూ! మీ ఆవేశమే అనూషను మీ నుంచి దూరం చేసింది. ఒక పోలీసు ఆఫీసరు ఎదుటే యిలా ప్రవర్తించారంటే అనూష తీసుకున్న నిర్ణయంలో తప్పులేదనిపిస్తుంది. ఇలాంటి విషయాలలో అనవసరంగా తలదూర్చి తలవంపులు తెచ్చుకున్నాను. దయచేసి ఈ విషయంలో మళ్ళీ ఎప్పుడూ నా దగ్గరకు రావడంకాని, ఫోన్ చేయడం కాని చేయవద్దు!" ఇన్ స్పెక్టరు వీరేష్ నాలుగూ దులిపేశాడు.
    శ్రీపతి మెల్లిగా అక్కడనుంచి జారుకున్నాడు.
    "సారీ మేడమ్! మీకు అనూష విషయంలో శ్రమ ఇచ్చాను. మీ ఇద్దరి మనసులూ కష్టపెట్టాను. అనూషకు క్షమాపణ చెప్పండి" ఇన్ స్పెక్టరు పశ్చాత్తాపంతో అని అక్కడనుంచి నిష్క్రమించాడు.


                                               *    *    *    *


    సహజంగా పోలీసులు ఆత్మహత్యల వంటి కేసులను పెద్ద నేరాలుగా పరిగణనలోకి తీసుకోరు.
    కాని ఇన్ స్పెక్టర్ వీరేష్ స్టేషన్ పరిధిలో రోజుల తేడాలో అవివాహిత స్త్రీలు ఆత్మహత్య చేసుకోవడం ప్రజలలో పలు అనుమానాలను రేకెత్తించాయి.
    యౌవనంలో ఉన్న కన్నెపిల్లలకు లేనిపోని ఆశలు కల్పించి, అందలాలెక్కిస్తామని ఊరించి, అందాలను అనుభవించి, తర్వాత తిరస్కరించినప్పుడు అభం శుభం తెలియని ఆడపిల్లలు ఆ అవమానాన్ని భరించలేక ఆత్మత్యాగం చేసుకోవడం ఇటీవలి కాలంలో పరిపాటైపోయింది.
    అటువంటి కేసులలో ఇన్ స్పెక్టర్ వీరేష్ ఎంత శ్రద్ధ చూపినప్పటికీ శ్రమకు తగ్గట్టు దర్యాప్తులో ప్రజలు సహకరించకపోవడం వలన దోషులను శిక్షించే వీలు లేకుండా ఉంది.
    వాళ్ళు సహకరించకపోవడానికి కారణం ఇదీ అనుకోవడానికి వీలులేదు. అసలు మన వ్యవస్థే ఇలా తయారయింది. సంఘ నిర్మాణంలోనే ఎన్నో లోపాలున్నాయి.
    పురుషాధిక్య సమాజంలో అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ స్త్రీకి అన్యాయమే జరుగుతున్నది.
    చట్టాలెన్ని చూసినా, రాజ్యాంగాన్ని సవరించినా స్త్రీల మనస్తత్వంలో మార్పు రానంతవరకు సమాజంలో స్త్రీకి న్యాయం జరుగుతుందనుకోవడం అత్యాశే అవుతుందేమో!
    కనీసం సాహితి, అనూష సమ్రాట్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే అతన్ని అరెస్టు చేసి న్యాయస్థానంలో నిలపవచ్చు.
    వీరేష్ అనుకోని రాక బిందుమాధవికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
    ఆ రోజు తను అన్నమాటలు ప్రత్యక్షంగా శ్రీపతిని ఉద్దేశించి అన్నా పరోక్షంగా ఇన్ స్పెక్టర్ ను కూడా బాధింఛాయనుకుంది.
    అన్ని మాటలు విన్న తరువాత మళ్ళీ అతను వస్తాడనుకోలేదు. ఆ రోజున తన భాష అంత పరుషంగా ఉన్నది మరి!
    ఆలోచన నుంచి తెప్పరిల్లి వీరేష్ ని లోపలికి ఆహ్వానించింది బిందుమాధవి.
    "మేడమ్! మొన్న జరిగిన సంఘటన మీ మనసును నొప్పిస్తే మరోసారి క్షమాపణ చెబుతాను!" వీరేష్ నమ్రతగా అన్నాడు.
    "ఓహ్! యింకా ఆ విషయం గురించే ఆలోచిస్తూ మీ బాధ్యతలను మరచిపోతున్నారా ఇన్ స్పెక్టర్! శ్రీపతి ప్రవర్తన బాధ కలిగించిన మాట వాస్తవమే. అయినా అనూషకు నేను సర్దిచెప్పాను. మీరు కూడా తెలివిగా తప్పించుకున్నారు. అది పరోక్షంగా ఆమెకు సహాయం చేసినట్టే కదా! ఇప్పుడామె మీ పట్ల ఎంతో కృతజ్ఞతతో వుంది. ఇక మీరు అనవసరంగా బాధపడవలసిన పనిలేదు."
    "థాంక్యూ మేడమ్! నాకిప్పుడు చాలా హాయిగా ఉంది!" అన్నాడు సంతోషంగా.
    "మళ్ళీ ఏదైనా సహాయం కోసం వచ్చారా ఇన్ స్పెక్టర్!" అంది నవ్వుతూ ఆమె.
    వెంటనే ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక మౌనం వహించాడు వీరేష్.
    "పరవాలేదు, చెప్పండి!" అంది అతని ఆంతర్యం గ్రహించి.
    "సాహితి ఇంట్లో లేదా మేడమ్!"
    లేదన్నట్టు తల వూపింది బిందుమాధవి.
    "మీకీ విషయం సాహితి చెప్పలేదా?"
    "ఏ విషయం?" అర్థంకాక ఆసక్తిగా అడిగిందామె.
    "కళ్యాణి విషం తాగి ఆత్మహత్య చేసుకుంది!"
    చెప్పి, క్షణకాలం ఆమె స్పందన కోసం ఎదురుచూశాడు.
    అతనూహించినట్టుగానే ఆ వార్త విని ఆమె కొయ్యబారి పోయింది. అప్రయత్నంగా ఆమె కళ్ళవెంట రెండు కన్నీటి చుక్కలు రాలాయి.
    "అయితే, ఇప్పటివరకు మీకు ఈ విషయం తెలియదన్నమాట! పాపం, సాహితి ఈ విషయం మీ దగ్గర దాచిపెట్టింది."
    "పోలీస్ ఆఫీసర్ కూతురికే ఈ సమాజంలో రక్షణ లేకుండా పోయింది. కళ్యాణి మరణానికి పోలీసుశాఖ అంతా అట్టుడికి పోతున్నది. ఎలాగైనా సరే సమ్రాట్ ను అరెస్టు చేయాలి. అందుకు మీ సహాయం కావాలి మేడమ్!" తను వచ్చిన పని చెప్పాడు వీరేష్.
    బిందుమాధవి మనసు రాయి చేసుకుని వాస్తవంలోకి వచ్చింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS