బస్సు దుమ్ము లేపుకుంటూ ముందుకు సాగింది.
క్రొత్తగా బస్సు ఎక్కిన ఇద్దరూ మామూలు ప్రయాణీకులు కాదు. వాళ్ళ చేతి సంచులలో నాటు చేతి బాంబులు, మారణాయుధాలు వున్నాయి. పైకి మాత్రం వాళ్ళిద్దరూ, మరీ పల్లెటూరి బైతుల్లాగా వేషాలు ధరించారు.
బస్సులో జనం నిండానే వున్నారు. అందువల్ల ముగ్గురూ ఒకేచోట కూర్చోటానికి లేకపోయింది.
బస్సులో ముగ్గురూ వేరేవేరే చోట్ల కూర్చోటం కాక, క్రొత్తగా ఎక్కిన ఇద్దరిలో ఒకడు పుండరీకాక్షయ్య పక్కనే కూర్చున్నాడు.
"ఇందాక బస్సులో కబుర్లతో కాలక్షేపం ఎంత బాగా జరిగింది! అసలు ప్రయాణం చేసినట్లే లేదు. 'పక్కవాడిని పలకరిస్తేనో.' అనుకున్న పుండరీకాక్షయ్య "మీరు ఏ వూరు వెళ్ళాలి?" అని పలకరించాడు.
"మీరు ఎక్కడికి వెళ్ళాలి." అడిగాడు వాడు.
"నేను గుంటూరు వెళ్ళాలి!" అని ఒక ముక్క చెప్పి వూరుకోక, తను ఇటువచ్చి ఎందుకు ఈ బస్సు ఎక్కవలసి వచ్చింది, చుట్టూ తిరిగి ప్రయాణం చేస్తున్న విషయం, పూర్తిగా వివరంగా చెప్పి అప్పుడు మళ్ళీ అడిగాడు" పుండరీకాక్షయ్య వాడిని, "మీరు ఏ వూరు వెళ్ళాలి?"
"మీరు ఎక్కడ దాకా వెళ్ళాలో నేనూ అక్కడదాకానే" అన్నాడు వాడు.
"మీరేం చేస్తుంటారు?" పుండరీకాక్షయ్య అడిగాడు వాడిని.
"నేను ఏమీ చేస్తుండను!" అన్నాడు వాడు.
"మీ స్వగ్రామం అదా?"
"మీకెందుకు?" అన్నాడు వాడు పెడసరంగా.
'ఏం మనిషిరా నాయినా వీడు!' అనుకున్న పుండరీకాక్షయ్య ఆ దెబ్బతో నోరు మూసుకున్నాడు.
అసలు విషయం వేరే వుంది.
క్రొత్తగా బస్సు ఎక్కిన ఇద్దరూ బందిపోటు దొంగలు లాంటివాళ్ళు. పచ్చినెత్తురు త్రాగటానికి కూడా వెనుతియ్యరు కసాయి వాళ్ళు. చాలా మొరటుగా పల్లెటూరి బైతుల వేషాలు వేసుకుని. బస్సు ఎక్కారు. వాళ్ళు చాలా పెద్ద పధకంతో బయలుదేరిన ఒక దొంగల ముఠాలోని వ్యక్తులు. చదవనూ, వ్రాయనూ అన్నీ తెలిసినవాళ్ళే. తమని ఎవరూ గుర్తుపట్టకుండా వుండటానికి ఈ వేషాలు ధరించారు. ప్రక్కవాడు అదేపనిగా తన మొహంలోకి చూస్తూ మాట్లాడటం వల్ల, వాళ్ళు తన మొహాన్ని గుర్తుపట్టవచ్చు. కంఠ స్వరాలు కూడా గుర్తుపెట్టుకోవచ్చు. రేపు ఎప్పుడైనా పోలీసులకి తమ ఆచూకీ తెలపవచ్చు. అందువల్లే వాళ్ళు తగు జాగ్రత్త వహించి ఇలాంటపుడు జాగ్రత్తగా మెలుగుతూ వుంటారు.
అవేమీ తెలియని పుండరీకాక్షయ్య, వాడు చదువు సంస్కారం లేనివాడిగానే తలచి, "ఉత్త మూర్ఖుడు" అనుకుని బస్సు కిటికీలోనుండి బయటకి చూస్తూ కూర్చుని వేరే ఆలోచన చేయసాగాడు.
పావుగంట తరువాత, చిన్న పల్లె దగ్గర బస్సు ఆగింది. బస్సులో నుండీ ఎవరూ దిగనూలేదు, ఎక్కనూలేదు.
మరో అరగంట తరువాత.
మరో వూరు వచ్చింది.
అక్కడ ఇద్దరు కోయవాళ్ళు బస్సు ఎక్కారు. ఆ వూళ్ళో కూడా ఎవరూ బస్సు దిగలేదు.
ఈ వూరి తరువాత, మరో గంటన్నర దాకా, ఏ ఊరూ రాదన్న విషయం. మొదటిసారిగా ఆ రూట్ లో ప్రయాణిస్తున్న పుండరీకాక్షయ్యకి తెలియదు.
"ఎన్ని గంటలు ఈ బస్సులో కూర్చోవాలో?" అని అనుకున్నాడు ఆయన.
గంట తరువాత,
ఎత్తుపల్లాలు దాటుకుంటూ చిన్న గుట్టలని అధికమిస్తూ, పెద్ద కొండ ప్రక్కగా బస్సు వెళ్ళడం మొదలుపెట్టింది. కొండ మలుపు దగ్గర ఎదురుగా బస్సు వస్తుందేమోనని డ్రైవరు హారన్ కొట్టిగాని మరీ ముందుకు సాగడు. అటువచ్చే డ్రైవరు గాని, ఇటువచ్చే డ్రైవరుగాని హారన్ కొట్టే ముందుకు వస్తుంటారు.
కొండ మలుపు దగ్గరకి రావటంతో బస్సు హారన్ గట్టిగా మ్రోగించాడు డ్రైవర్. అటునించీ ఏ బస్సు హారన్ వినిపించలేదు. అంటే ఎదురుగుండా ఏ బస్సూ రావటం లేదూ అన్నమాట.
