బీరువా మీదవున్న పాత పత్రికలు తీసి చూస్తున్న యువకుడు అలికిడై తలెత్తి చూశాడు.
తార బాగా ముస్తాబయి, చేతిలో త్రివర్ణ ముఖ చిత్రం గల ఓ సినిమా పత్రిక పట్టుకొని తలుపు వాలుగా కనీ కనిపించకుండా నిల్చుంది.
"ఇదిగోనండీ!" అంటూ చెయ్యి ముందుకు చాచింది.
అతను "ఇలా ఇవ్వండి" అన్నాడు నిల్చున్న చోట నుంచి కదలకుండానే.
సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ ముందుకు వచ్చి పత్రిక అందించింది.
అతను ఆమె ముఖంలోకి చూస్తూ పత్రిక అందుకోబోయి తార చేతిని అందుకున్నాడు.
తార చివ్వున తలెత్తి చూసింది. ఇద్దరి కళ్ళూ కలిశాయి.
"ఓ సారీ!" అంటూ చెయ్యి వదిలేశాడు.
"కూర్చోండి." అన్నాడు తను కూర్చుంటూ.
తార బోలెడంత సిగ్గుపడిపోతూ ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంది.
మీకు సిగ్గు ఎక్కువనుకుంటాను. నో... నో... ఈ రోజుల్లో మరీ అంతగా సిగ్గుపడితే బాగుండదు." అన్నాడు ఆ యువకుడు.
తార గతుక్కుమంది.
"మీ పేరూ?"
"తార."
"నా పేరు చంద్రం! తమాషాగా వుందికదూ! తారా చంద్రుల కథ తెలుసా?"
తార తెలుసు అన్నట్టు తల ఊపింది.
ఆ పెద్దమనుషులిద్దరూ కునుకు తీస్తుండగా కాంతమ్మ వంటింట్లో గారెలతో కుస్తీ పడుతుండగా తారా చంద్రాలు రంగురంగుల కలల ప్రపంచంలో విహరిస్తున్నారు.
ఆ గంటలోనే వాళ్ళు ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. సినిమాల గురించీ, తెలుగు నవలల గురించీ, అభిమాన రచయిత్రుల గురించీ లోకం మర్చిపోయి కబుర్లు చెప్పుకున్నారు.
ఆ తర్వాత "నిన్నే చేసుకుంటాను" అన్నాడు చంద్రం.
"నిన్ను తప్ప మరెవర్నీ చేసుకోను" అన్నది తార.
బుర్ర మీసాలాయన గుర్రు ఆగిపోయింది.
"మీ నాన్న లేచినట్టున్నారు. నేను వెళ్తాను."
"అప్పుడే" అంటూ చెయ్యిపట్టుకొని దగ్గరకు లాక్కున్నాడు.
"ఒరే అబ్బాయి!"
చంద్రం తారను చటుక్కున వదిలేశాడు. తార లోపలకు తూనీగలాగా ఎగిరిపోయింది. చంద్రం ఆమె వెళ్ళిన వైపే చూస్తూ నిట్టూర్పు విడిచాడు.
నాలుగ్గంటలకల్లా వారు కాఫీ టిఫెన్లు పూర్తిచేశారు.
బుర్ర మీసాలాయన చుట్ట ముట్టించుకొని పీలుస్తూ "మంగపతిగారు ఏ ఊరు వెళ్ళారండీ?" అని కాంతమ్మను అడిగాడు.
"మీతో మాట్లాడటానికే గుంటూరు వెళ్ళారు."
"బుర్ర మీసాలాయన చుట్టతీసి చేతితో పట్టుకొని కాంతమ్మ ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడు.
"మీరిక్కడికొచ్చినట్టు తెలియగానే బయలుదేరి వచ్చేస్తారు. వస్తూనే వుండివుండాలి." అన్నది కాంతమ్మ.
"బాపట్ల వెళ్ళారా!" అన్నాడు ఆయన.
"కాదండీ! గుంటూరు"
"బుర్ర మీసాలాయన అయోమయంగా చూశాడు.
"మాది గుంటూరు కాదండీ - బాపట్ల. బాపట్ల నుంచి వస్తున్నాం. ఇవాళ వస్తున్నట్టు వుత్తరం కూడా రాశానుగా? అందలేదా?"
కాంతమ్మ గుండెలు చిక్కబట్టినై. వెర్రిగా చూసింది.
"మీ ఇంటి పేరు ఒంటిమిట్టవారేగా?" సందేహంగా అడిగాడు రెండో వ్యక్తి.
"కాదండీ వేదాంతం వారు!" అన్నది కాంతమ్మ.
బుర్ర మీసాలాయనా, ఆ రెండో వ్యక్తి ఒకరి మొహంలోకి ఒకరు చూసుకున్నారు.
"ఎంత పొరపాటు! ఎంత పొరపాటు!" నొచ్చుకున్నాడు ఆ రెండో వ్యక్తి.
కాంతమ్మ వెర్రి చూపులు చూసింది.
