సిటీ నియాన్ లైట్ల కాంతిలో ఆ ఛేజ్ ఎందరినో భయభ్రాంతుల్ని చేసింది.
చెవులు హోరుమనే హారన్ కి చెదిరిన జనం అటూ ఇటూ కకావికలైపోతుంటే ఓ పది నిముషాలపాటు సాగిన ఆ రేస్ లో అవినాశ్ ని చివరికి తప్పుదోవ పట్టించిన ధనుష్కోటి "సిట్రాన్" మరో అయిదు నిమిషాలకల్లా గోల్కొండ ఫోర్ట్ ప్రాంతాన్ని చేరుకుంది.
కారింకా ముందుకు సాగిపోతుంటే వెనుక తమని ఎవరూ వెంటాడడం లేదన్న నిర్ధారణకు వచ్చాక "కారాపు" అన్నాడు ధనుష్కోటి.
సిట్రాన్ నిర్మానుష్యంగా వున్న ప్రాంతంలో కీచు మంటూ ఆగింది.
వేగంగా బయటికి దిగిన ధనుష్కోటి ఇంకా రగిలిపోతూనే వున్నాడు.
"బాస్టర్డ్" అవినాశ్ ని తిట్టుకుంటూ పొదలమాటున వున్న ఓ బండరాతిపై ఉస్సురోమంటూ చతికిలపడ్డాడు.
ఇప్పుడెలా...
సిటీలో అడుగుపెట్టడం క్షేమకరం కాదు
కొన్ని రోజులపాటు తను అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోవాలి.
ఉన్న పలుకుబడితో అవినాశ్ నోరైనా మూయించాలి. లేడా సాధ్యమైనంత త్వరగా ట్రాన్సఫర్ చేయించాలి...
అప్పటివరకు తను సిటీలో అడుగు పెట్టకూడదు.
అప్పటికే ఫైనాన్సింగ్ కంపెనీ డిపాజిట్స్ ని మాదకద్రవ్యం కొనడానికి మళ్ళించి అక్కడ కూడా నష్టపోవడంతో మానసికంగా చాలా దెబ్బతిన్న ధనుష్కోటి తన కిష్టమైన ఆడదానితో గడుపుతూ జయచంద్రని ఎలా దెబ్బతీయాలా అని ఆలోచిస్తున్నాడు.
అదిగో అప్పుడు వచ్చాడు అవినాశ్.
అసలే వారంటు పట్టుకుని తనను గాలిస్తున్నాడని తెలిసి జయచంద్ర కన్నా ముందు అవినాశ్ నే లేపేయాలన్న ఉద్వేగంతో కాల్చాడు కాని బ్రతికిపోయాడు.
కసిగా పిడికిళ్ళు బిగుసుకున్నాయి.
నష్టపోయింది కేవలం పాతిక లక్షలు మాత్రమే కాదు సుమారు కోటి పాతిక లక్షలు.
అవును. సవ్యంగా సిటీ చేరిక క్రాక్ ని మార్కెట్ లోకి మళ్ళించివుంటే నిజంగా అంత లాభాన్ని ఆర్జించేవాడే.
ఎవరు అసలు ఈ రహస్యాల్ని తన నుంచి బయటికి చేరవేసిన ఆ వ్యక్తి ఎవరు?
పొంతన లేని ఆలోచనలతో ఆస్థిమితంగా నలిగిపోతూ 'జాకీ' అంటూ కేకపెట్టాడు తర్వాత ఏం చేయాల్సిందీ నిర్ధారణకు వచ్చినట్టుగా.
"యస్సర్"
కంఠం కొత్తగా వినిపించింది.
అప్పుడు చూశాడు ఎదురుగా షాట్ గన్ పట్టుకుని నిలబడి వున్న శశాంకని.
తలపై వున్న కేస్ ని పక్కకు పడేస్తూ "నేనెవరూ అన్నది గుర్తించగలిగేటంత మామూలు స్థాయిలో లేను మిష్టర్ ధనుష్కోటీ! నన్ను నేను పరిచయం చేసుకుంటాను. నా పేరు శశాంక, నువ్వు జోక్యం చేసుకోకపోతే గొప్ప షూటర్ ని కావాలనుకున్నవాడిని. ఇప్పుడు అందరినీ కోల్పోయిన నేను నీ మరణంతో నరమేధాన్ని ప్రారంభించాలనుకుంటున్నవాడ్ని..." ఒక్కొక్క వాక్యాన్ని ఒత్తి పలుకుతుంటే ఆ నిర్జన ప్రదేశంలో ఈ సన్నివేశాన్ని ఊహించని ధనుష్కోటి భయవిహ్వలంగా వణికిపోతున్నాడు.
"నేనెలా నీ జాకీ స్థానంలోకి వచ్చానని సందేహిస్తున్నావా ధనుష్కోటీ..." భావరహితంగా నవ్వాడు శశాంక. "నా భార్య చనిపోయినరోజే అనుకున్నాను పౌర్ణమి నాటికల్లా నీ శవాన్ని భూస్థాపితం చేయాలని. అందుకే నిశ్శబ్దంగా నిన్ను వెంటాడాను. పోలీసులు నీ కోసం గాలిస్తున్నారని తెలిసి నీ ఉనికి గుర్తించిన నేనే అవినాశ్ కి ఫోన్ చేశాను. నీ జాకీని సున్నితంగా దెబ్బతీసి అంటే కొన్ని గంటలపాటు స్పృహ లేకుండా చేసి అక్కడే ఓ మూల పడుకోబెట్టాను. నీ చావుని నీ ఆయుధంతోనే పూర్తిచేయాలని. ఇదిగో జాకీ దగ్గర షాట్ గన్ని తీసుకున్నాను..."
చుట్టూ వున్న తోటలపై నిస్సారంగా పడుతున్న వెన్నెల్లో సరిగ్గా అప్పుడే ఓ తీతువు మృత్యునాదంలా కేకలు పెడుతూ ధనుష్కోటి తలపై నుంచి సాగిపోయింది.
శశాంక సేఫ్టీ క్యాచ్ ని ముందుకి జరిపాడు.
ఎందర్నో శాసించగల ధనుష్కోటి ఒళ్ళు చెమటతో తడిసిపోయిందప్పటికే.
"శశాంకా" చేతులు జోడించాడు ధనుష్కోటి. "అసలు నీ భార్యని."
రెండడుగులు ముందుకేసిన ధనుష్కోటి రెండు మోకాళ్ళపైకి గురిచూసి కాల్చాడు వరుసగా.
ఆ నీరవ నిశీధి కర్కశంగాఫ్ ప్రతిధ్వనించింది.
బాధతో మూలుగుతున్న ధనుష్కోటి చాలా దైన్యంగా పడి నేలపై దొర్లుతున్నాడు "అమ్మా" అంటూ.
"గుర్తు చేసుకోవాల్సింది అమ్మను కాదు ధనుష్కోటి ఆరోజు క్రూరంగా కాల్చిచంపావే నా భార్య కృప... ఆవిడ్ని జ్ఞప్తికి తెచ్చుకో. కనీసం పోయేముందు కాసింత పుణ్యమైనా దక్కుతుంది."
"శశాంకా" రొప్పుతూ అన్నాడు." ఆ దేవుడి మీదొట్టు కృపని చంపింది నేను కాదు."
