Previous Page Next Page 
మొగుడే కావాలా? పేజి 29


    "అవును!" అంది రమణి.


    "థాంక్యూ!" అంటూ ఎడంచేత్తో తన పక్క ఫ్రంట్ డోర్ ని తెరిచాడు మనోహర్.


    అవంతి కారెక్కి అతని పక్కనే కూర్చుంది.


    "సారీ, రమణీ, డోంట్ థింక్ అదర్ వైజ్!" అంది అవంతి.


    "బై ఆల్ మీన్స్!" అని నవ్వుతూ హాస్టల్లోకి నడిచింది రమణి.


    కారు కదిలాక మనోహర్ ఓ చెయ్యి అవంతి భుజం మీదగా వేశాడు. ఆమె కాస్త దగ్గరగా జరిగి కూర్చుంది. మరో చేత్తో స్టీరింగ్ ని పట్టుకొని డ్రైవ్ చేస్తున్నాడు.


    కారు సామాన్యమైన వేగంతో వెళుతోంది.


    "ఇప్పుడు నీకెలా వుంది?" మెల్లగా అడిగాడు.


    అవంతి ఆశ్చర్యంగా చూసింది.


    అతను తన ఆరోగ్యం గురించి అడుగుతున్నాడు.


    మనోహర్ గంభీరంగా ఉన్నాడు.


    అతని మొహంలో ఏ విధమైన భావాన్ని చదవడానికి వీలులేకపోయింది అవంతికి.


    అతని పెదవుల మధ్య సిగరెట్ మాత్రం పొగలు కక్కుతోంది.


    "బాగానే వుంది" అంది.    


    "అసలా మర్నాడే రావాలనుకొన్నాను."


    "దేనికి?" ఆశ్చర్యంగా అడిగింది.


    "ఎలా వున్నావో చూడాలని!"


    అతని మాటల్ని నమ్మలేకపోతోంది. కానీ ఆ మాటల్లో అతను తన పట్ల కనబరుస్తోన్న శ్రద్ధకి మాత్రం ఆమెకి తృప్తిగా వుంది.


    "థాంక్స్!" అంది.


    మనోహర్ ఓసారి ఆమెకేసి చూశాడు. ఆమె తల పైన చేత్తో సవరదీస్తూ చెప్పాడు.


    "ఇకముందు జాగ్రత్తగా వుండు. అలాంటి పొరపాటు పని జరక్కుండా!"


    అవంతి మాట్లాడలేదు. కిటికీలోంచి బయటికి చూస్తూ కూర్చుంది.     


    కిటికీలోంచి దూసుకొస్తున్న చల్లగాలికి ఆమె ముంగురులు ఎగిరి పడుతోంటే ఎడం చేత్తో సర్దుకొంటోంది.


    కారు టాంక్ బండ్ దగ్గర పార్క్ చేశాడు మనోహర్.


    అవంతి కారు దిగింది. ఆమె నడుం చుట్టూ చేతిని వేసి రోడ్డుక్రాస్ చేయించాడు మనోహర్.


    పైప్ రెయిలింగ్ ని ఆనుకొని హుందాగా నిలబడ్డాడు మనోహర్.


    అతని పక్కనే మోచేతుల్ని రెయిలింగ్ పైన ఉంచి హుస్సేన్ సాగర్ నీళ్ళలోకి చూస్తోంది అవంతి.


    అతను మళ్ళీ సిగిరెట్ వెలిగించాడు. పది నిమిషాలు గడిచాయి ఎవరూ ఏమీ మాట్లాడుకోలేదు.


    చీకటి పడింది. దీపాలు వెలిగాయి. నీళ్ళపై నుంచి చల్లని గాలి దూసుకొస్తోంది.


    "మనోహర్!" అంది అవంతి.


    అతను మెడతిప్పి చూశాడు. ఏమిటన్నట్లు కళ్ళతోనే ప్రశ్నించాడు.


    "పరీక్షలవగానే ఈ వూరు నించి వెళ్ళిపోతాను" అంది.


    అతను విన్నాడు.


    కానీ ఏమీ మాట్లాడలేదు.


    తను చెప్పినదానికి అతనిలో ఏ విధమైన రియాక్షన్ లేకపోవడం చూసి అవంతి కాస్త నిరుత్సాహపడింది.


    "అవున్లే. నే వెళ్ళిపోతే నీకేం నష్టం. అవంతి లాంటి వాళ్ళు నీకు వందలమంది దొరుకుతారు" కోపంగా అంది.


    అతను చివ్వున చూశాడు.


    "మనోహర్ కి అంతకిమించి పనేం లేదనుకొంటున్నావా?" అడిగాడు.


    "అవును మరి? వెళ్ళిపోయి ఏం చేస్తావని కనీసం అడగనుకూడా అడగపోతే నాకు వళ్ళు మండిపోయింది" అంది.


    అతను తమాషాగా నవ్వాడు.


    మనోహర్ చూపుడు వేలితో బొటనవేలిని కలిపి అవంతి ముక్కుని పట్టుకొన్నాడు.


    "రోషానికేం తక్కువలేదు. సరే ఇప్పుడు చెప్పు. వెళ్ళి ఏం చేస్తావు?"


    "రిజల్ట్సు రాగానే ప్రాక్టీసు పెట్టుకొంటాను!"


    "గుడ్! చాలా సంతోషం. అక్కడ నీకెవరున్నారు?"


    "నాన్న వున్నాడని చెప్పానుగా"


    "అవును. చాలా ఓల్డ్ మాన్ అని చెప్పావు. గుర్తుంది. ఆయన్ని నమ్మి అక్కడ వుండగలవా?"


    "అంటే?"


    "ఓల్డ్ మాన్ అంటున్నావు కదూ?"


    "నిజమే, కానీ నాకీ ప్రపంచంలో వున్న ఆధారం ఆ ముసలి నాన్న ఒక్కడే మనోహర్."


    "ఇంకెవరూ లేరా?"


    "లేరు."


    "నేను కూడా!" అడిగాడు.


    అవంతి మనోహర్ కేసి ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది.


    ఆ మాటన్నది మనోహరేనా?


    నమ్మలేనట్టు తనేదో కల కంటున్నట్టుగా అనిపించింది అవంతికి.


    "ఏమిటలా పిచ్చిదానిలా చూస్తున్నావు?" ఆమె భుజాల చుట్టూ చేతుల్ని వేశాడతను.


    "నీ మాట అర్థం కాలేదు" అంది నిర్లిప్తంగా అతనికేసి చూస్తూ.


    "నువ్వు నన్నో స్నేహితుడిగానూ, ఆప్తుడిగానూ భావించడం లేదా అని అడిగాను."


    "మనోహర్" ఆమె కళ్ళల్లో నీరు తిరిగింది.


    "అనుకొంటున్నావే కానీ ప్రాక్టీస్ అంటే మాటలు కాదు అవంతీ, చాలా డబ్బు కావాలి. మీ నాన్న నీకు అన్నీ సమకూర్చగలడా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS