Previous Page Next Page 
అనాథ మహిళా సదన్ పేజి 29


    మౌనికను పట్టుకోవడానికి కైవల్య ముందుకొచ్చింది.

 

    "ఫరవాలేదు కైవల్యా! నడవగలను" అంది మౌనిక చిన్నగా టేబుల్ మీద నుంచి లేస్తూ. అందరూ అనాథ మహిళా సదన్ కి బయల్దేరారు.

 

    "మీరుండబట్టి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం" శృతి రిలాక్స్ డ్ గా అంది తరుణ్ వైపు తిరిగి.

 

    "మనమందరం శేఖర్ కి రుణపడి వున్నాం. రెండు వేలు" అంటూ చిన్నగా నవ్వాడు తరుణ్.

 

    "రెండు వేలా?" మౌనికకు వారి మాటలు ఏమీ అర్థంకాలేదు.

 

    "ఆఁ మిమ్మల్ని రక్షించినందుకు డాక్టర్ ఫీజు. ఈ వూర్లో శేఖర్ అని ఓ మిత్రుడున్నాడు. అతన్నడిగి తీసుకొచ్చాను. మనం పూసలు కుట్టి ఆ డబ్బు వాయిదాల పధ్ధతి మీద కొద్దికొద్దిగా తీర్చాలి" అని వివరించాడతను.

 

    "విమలాబాయి ఒప్పుకుంటుందా?" ఎవరో తన సందేహాన్ని బయటపెట్టారు.

 

    "ఒప్పుకు తీరాల్సిందే. మీ సంపాదనకు ఆమె పర్మిషన్ అనవసరం. అసలు సంపాదన లేకపోవడం వల్లే మీరు భారంగా అనిపించి, మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని యిక్కడికి తరిమేశారు"   

 

    బలంగా ఓ గాలికెరటం తమను కొట్టినట్లు జడుసుకున్నారు అమ్మాయిలు.

 

    తరుణ్ కొనసాగించాడు.

 

    "ఇది మీకు కష్టం కలిగించే విషయమైనా నిజమదే. మధ్యతరగతి కుటుంబాలలోని  స్త్రీలు అన్నీ వున్నంతవరకే హాయిగా వుంటారు.

 

    ఏదైనా ఒడిదుడుకులు వస్తే మీలాగే పలాయన మంత్రం పాటిస్తారు. అదే కూలీనాలీ చేసుకునే కుటుంబాలలో స్త్రీలు దేనికీ భయపడరు. ఎక్కడైనా కష్టం చేసుకునే బతుకుతారు కాబట్టి కుటుంబంలోని మిగిలిన సభ్యులు వాళ్ళమీద తమ అధికారాన్ని చెలాయించలేరు.

 

    అందుకే భర్తను వదిలేసి తన చెల్లెలో, తన కూతురో యింటికి వచ్చేస్తే మిన్ను విరిగి భూమిమీద పడ్డట్టు మనలాగా యాగీ చేయరు. స్త్రీలు ఇంట్లో కూడా మూలుగుతూ కూర్చోక ఎంచక్కా కూలికి వెళతారు. అందుకే మొదట మీ కడుపును మీరే పోషించుకోవాలి"

 

    "మరి మాకు పూసలు కుట్టడం రాదే" మరో అమ్మాయి అంది.

 

    "ఏదీ బ్రహ్మవిద్య కాదు. ఒకటి రెండు రోజులు అలవాటుపడితే దానంతటదే వస్తుంది. నాలుగు డబ్బులు చేతుల్లో పడగానే మీ ఆలోచనా ధోరణిలోనే ప్రధానమైన మార్పులొస్తాయి. ఇప్పుడు విమలాబాయి చెప్పిన దానికంతా తలలూపిన మీరే రేపు ఆమెనే నిలదీస్తారు" అన్నాడు తరుణ్.

 

    "అంత ధైర్యం మాకెప్పటికీ రాదేమో!" సునీత అనే అమ్మాయి అంది.

 

    "తప్పకుండా వస్తుంది. జనం మధ్య వుంటూ పనీపాటూ చేస్తున్నప్పుడే మన ఆలోచన కూడా ఆరోగ్యవంతంగా వుంటుంది. ఎప్పుడైతే జనానికి దూరం అవుతామో వెర్రిమొర్రి ఆలోచనలన్నీ తలకెక్కుతాయి. దీనికి మంచి ఉదాహరణ బౌద్ధం"         

 

    గాలి కూడా అతని మాటలు ఎంతో శ్రద్ధగా వింటున్నట్లు మెల్లిగా వీస్తోంది.

 

    "బౌద్ధం మొదట్లో ప్రజల్లోంచి వచ్చింది. బుద్ధుని కాలంలో ఎటు చూసినా యుద్ధాలు జరుగుతుండేవి. వీటికి తోడు తాకట్టు, వడ్డీ ప్రజలను పీడించేవి. ఇదంతా బుద్ధుడు చూశాడు.

 

    తన చుట్టూ వున్న సాంఘిక, నైతిక, రాజకీయ దురాగతాలను నివారించడానికి అంతకుముందు వ్యాప్తిలో వున్న భక్తిగానీ, ప్రార్థనలుగానీ, యజ్ఞయాగాదులుగానీ పనికిరావని బుద్ధుడు నమ్మాడు.

 

    బుద్ధుడు ఏ విధంగా భగవంతుని ఉనికిని నిరాకరించిందీ అశ్వఘోషుని 'బుద్ధచరిత'లో మనం చూడచ్చు.

 

    "ఇలా నాస్తికమతంగా బౌద్ధం ప్రారంభమైంది. అయితే ఆ తరువాత విషయం మారింది" అతను తిరిగి ప్రారంభించాడు.

 

    "బౌద్ధం రాజరికపు వాకిళ్ళలోకి ఎక్కింది. బౌద్ధ ఆరామాలు వెలిశాయి. విశ్వవిద్యాలయాలని స్థాపించారు. ఆచార్యులు ఏర్పడ్డారు. జనంతో వీరికి సంబంధాలు పోయాయి. రాజపోషణలో వీరికి ముప్పొద్దులా హాయిగా గడిచిపోయింది.

 

    మొత్తం పద్దెనిమిది శాఖలుగా బౌద్ధం చీలిపోయింది. వీటిలో కొన్ని చివరికి బుద్ధుడు వ్యతిరేకించిన కర్మ సిద్ధాంతాన్ని కూడా సమర్ధించాయి. బుద్ధుడ్ని భగవంతుడిని చేశాయి.

 

    అలానే మీ విమలాబాయి కూడా. ఎవరో ఇచ్చే విరాళాల మీద బతికేస్తూ ఎప్పుడో చనిపోయిన సనాతన ధర్మాలని తిరిగి బతికించాలని వ్యర్థ ప్రయత్నం చేస్తోంది. ఓరోజు రాళ్ళు కొట్టమనండి మీ విమలాబాయిని. అప్పుడు ఏం చెబుతుందో చూద్దాం"

 

    అతడు అంత ఘాటుగా విమర్శించినప్పటికీ అమ్మాయిలు ఎవరూ అతన్ని ఏమీ అనలేకపోయారు. అతడు చెబుతున్నదంతా నిజమేనని వాళ్ళ మనసులూ అంగీకరిస్తున్నాయి.

 

    "అయితే రేపటినుంచి మేం పూసలు కుట్టాలన్న మాట" కైవల్య చిన్నపిల్లలా అరిచింది. జరుగుతున్న పరిణామాలన్నీ ఆమెకు హుషారుగా వున్నాయి.

 

    "ప్రస్తుతానికి విమలాబాయికి ఈ విషయం తెలియకుండా వుంచుదాం. మరీ తప్పదనుకున్నప్పుడే చెబుదాం" శృతి మౌనిక ముఖంలోకి చూస్తూ అంది.

 

    ఆమెకు తెలుసు ప్రతి విషయాన్నీ మౌనిక విమలాబాయికి చెబుతుందని.

 

    అలాగే అన్నట్లు తల వూపింది మౌనిక.

 

    ఆమె ఒప్పుకున్నందుకు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోతూ ఆమె కుడిచేతిని అందుకోబోయింది.

 

    శృతి వేళ్ళు తగిలేసరికి కొవ్వొత్తితో కాలిపోయిన చేయి నొప్పెట్టింది. అందుకే ఆమె చేతిని విసురుగా వెనక్కి లాక్కుంది.

 

    "సారీ మౌనికా!"

 

    "ఫర్వాలేదు"

 

    "డాక్టర్ దగ్గర ఆ చేతికి కూడా మందు రాసుకుని వుంటే బావుండేదేమో!"

 

    "చేతికా? ఎందుకు?" తరుణ్ అలా ప్రశ్నించడంతో వులిక్కిపడింది మౌనిక. జరిగినదంతా చెబితే అతడు బాధపడవచ్చు. కానీ కైవల్య అంతా చెప్పింది.

 

    ఆమె చెబుతూ వుండగానే తట్టుకోలేక అతడు మౌనిక చేయందుకుని చూశాడు. మసక చీకట్లో కూడా కాలిపోయిన చర్మం ఎర్రగా మెరుస్తోంది.

 

    "ఇది దారుణం మౌనికా! నాకు ఓ రోజు ఆశ్రయం ఇచ్చినందుకు యిలా కాల్చుకోవాలా? అయితే నేను వెంటనే వెళ్లిపోతాను" అన్నాడు.

 

    కొవ్వొత్తి కాల్చుకున్నప్పుడు కాదు, ఇప్పుడు నిజంగానే ఏడుపొచ్చింది ఆమెకు. అతడు వెళ్ళిపోతే యింకేమైనా వుందా? ప్రత్యర్థులు పొడిచి చంపేయరూ? తను నిజంగానే ఆ వార్త విని తట్టుకోలేదు. అందుకే కంగారుగా అంది "ఒద్దొద్దు"     

   

    అక్కడ వున్న మిగిలిన అమ్మాయిలంతా కూడా ఆమెకు వంత పాడారు.

 

    "మీరు వెళ్ళకండి. ఇంత సహాయం చేసిన మిమ్మల్ని మేం గాలికి వదిలెయ్యలేం. ఆ ప్రమాదం పూర్తిగా తప్పిపోయేవరకూ మీరు మహిళా సదన్ లోనే వుండాలి"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS