సాయంత్రం నాలుగైనా ఎండ తీక్షణంగా ఉంది. మెయిన్ రోడ్డు వచ్చేపోయే జనంతో , కార్లు , సిటీ బస్సులు, రిక్షాలతో ఒకటే రద్దీగా ఉంది.
అలసిన మొహంతో, అత్రతగా , ఆశగా ప్రతి షాపు ముందూ నిలుచుని , ఆ బోర్డు చదివి ముందుకు నడుస్తున్నాడు పచ్చని అందమైన పదహారేళ్ళ అబ్బాయి, వాసు.
'విజయా పాలెస్' బోర్డు చూసిన వాసు కళ్ళు మెరిశాయి. వింతగా, తడబబుగా షాపులో అడుగు పెట్టిన వాసు కళ్ళు చెదిరాయి. షాపులో ఉన్న వ్యక్తులందర్నీ కలయ జూస్తున్నాయి.
"ఎవర్ని యేమని అడగాలి? ఇందులో మా నాన్నేవరు? తీరా అయనెఉన్నా నన్నెలా తెలుసుకుంటారు? అతనెలా ఉంటారో నాకేం తెలుసు?' అనుకున్న వాసు గుండెలు బిగుసుకున్నాయి. భయంగా, తిరుగు టిక్కెట్ డబ్బుల కోసం జేబు తడుముకున్నాడు. కప్పు కాఫీకి మాత్రమే ఉన్నాయి. అతని కాళ్ళ క్రింద భూమి కంపించినట్లయింది. తానెం చెయ్యాలిప్పుడు?
"ఏం కావాలబ్బాయ్?" ఎవరో తట్టి లేపినట్టు అడిగారు.
"అతను.... అయన... ఈ షాపులో ....అంటే ప్రసాదరావు గా" రని తడబడ్డాడు.
"ఓ! ఈవేళ మరి షాపుకి రారు. చూడు, ఆరోడ్డు చివరి కెళ్ళి కుడి చేతి వైపు మళ్ళిపో. ఫర్లాంగు దూరం వెళ్ళాక మర్రి చెట్టు ఉంటుంది. అక్కడ నిల్చుని చూస్తె ఎదురుగా కనిపిస్తుంది , నలబై నాలుగు డోర్ నెంబరు అతని పేరున్న బోర్డు.' గబగబా చెప్పాడు సేల్స్ మన్.
* * * *
రోడ్డు దిగి నాలుగడుగులు వేసి చిన్న గేటు తెరిచి లోపలి కెళ్ళాడు. దారికి రెండు ప్రక్కలా క్రోటన్సూ , ఏవో పూల మొక్కలూ. నాలుగు మెట్లెక్కి వీధి వరండా లో నిలిచిన వాసు గుండెలు పీచుపీచు మంటున్నాయి.
చేరవేసి ఉన్న తలుపులు మెల్లగా తెరిచి లోపలికి చూశాడు.
కేరమ్స్ ఆడుకుంటున్న నలుగురు వ్యక్తులూ ఒక్కసారే వాసు వైపు చూశారు.
'విజయా పాలెస్.... ప్రసాదరావు గా రిల్లిదేనా అండీ? అయన ఉన్నారండీ?' వణికే గొంతుతో తడబాటుగా ప్రశ్నించేడు వాసు.
పచ్చగా, దృడంగా గుండ్రని మొహం, నొక్కు నొక్కుల క్రాపు ఉన్న ఒక నడి వయస్సు వ్యక్తీ పై మిగతా ముగ్గురి దృష్టి పడింది.
"ఆ నేనే, అబ్బాయ్...రా, కూర్చో , ఏం కావాలి? ఎవరు నువ్వు?' అన్నాడతను చిన్నగా నవ్వుతూ.
"నేనా ? నేనండి...." అన్నాడు అతని వైపు సంభ్రమంగా , తత్తరపాటుగా చూస్తూ వాసు.
"ఆ.....నువ్వే!" అన్నాడతను పకాల్న నవ్వి. బోర్డు పై ఉన్న కాయిన్సు వైపు చూస్తూ.
'చందాఅడగడానికా , బాబూ?"
"ఇతగాడు ఒంటరి వాడని నీ కెవరు చెప్పారు, నాయనా?"
'అతని స్కూలు ఫీజుకి సాయం చేయ్యామంటాడోయ్ , ప్రసాద్! అంతే. మరేం అడిగేలా లేదు." అంటూ తను విసిరిన విట్టుకి తనే గొల్లున నవ్వాడు ఒకతను.
బాగుందన్నట్టు మొదటి ఇద్దరూ నవ్వారు.
"మళ్ళీ వస్తాను. సార్ మీతో మాట్లాడాలి." విసురుగా, రోషంగా వచ్చిందా మాట వాసు నుంచి.
మళ్ళీ గలగలా నవ్వులు.
'అలా చెయ్. సాయంత్రం ఆరు దాటాక రా" అన్నాడు ప్రసాదరావు, తేలిగ్గా ఊపిరి వదిలి సర్దుకు కూర్చుంటూ.
"వస్తాను, సార్...." అంటూ అందరికీ ఓసారి నమస్కరించి వెనుదిరిగి రోడ్డెక్కాడు వాసు. మర్రి చెట్టు అతనికి ఆశ్రయ మిచ్చింది.
* * * *
"మీ అన్నయ్య ఫీజు కడతానని అంటారంటారా?' ఆఫీసు నుంచి వచ్చిన గోపాల్రావు కి కాఫీ గ్లాసందిస్తూ అడిగింది లక్ష్మీ.
"ఏమో!" ముక్తసరిగా అన్నాడు గోపాల్రావు.
"పాపం! నాకా అబ్బాయిని చూస్తె జాలిగా ఉందండీ." అంది లక్ష్మీ.
"ఏం చేస్తాం! నువ్వే చూస్తున్నావుగా -- నే తెచ్చిన జీతం నాలుగు వందలూ ఇరవయ్యో తేదీ రాకముందే ఎలా యెగిరి పోతుందో? నీకు మీ నన్నగారిచ్చిందేమైనా సర్దుబాటు చేసి చదివిస్తానంటే నా అభ్యంతరం లేదు" అన్నాడు గోపాల్రావు కొంటెగా ఆమె వైపు చూస్తూ.
"ఏం ? నేను భయపడతానా ఆ కవ్వింపు? మహా అయితే ఆ అబ్బాయి గ్రాడ్యుయేట్ అయ్యేదాకా నాలుగైదు వేలు. మీ అన్నయ్య చదిసించని నాడు నేను చదివిస్తాను." సవాలు చేస్తున్నట్టంది లక్ష్మీ.
"ఏదో గాలం వేస్తున్నావేమో గారాల కూతురు కోసం! వాడన్న మాట గుర్తుందా?" నవ్వాడు గోపాల్రావు.
"ఆ మీ అల్లుడి లాటి వాడు దొరకడు నా కూతురికి! అన్నీ అపార్ధాలే. " ఉదాసీనంగా వెళ్ళబోయింది లక్ష్మీ.
"లక్ష్మీ! కోపగించుకోకు , ప్లీజ్! వాన్నే లా అన్నా గ్రాడ్యుయేట్ అయ్యేదాకా చదివించాలని వాడు మనింటికి రాగానే నిశ్చయించు కున్నాను." అన్నాడు గోపాల్రావు.
"మరేం!" తేలిగ్గా నవ్వింది లక్ష్మీ.
* * * *
సంధ్య చీకట్లలుముకుంటున్నాయి. పక్షులు మర్రి చెట్టు మీద పడకలు వెదుక్కుంటూ గోల చేస్తున్నాయి.
చిన్న గేటు వైపు నడుస్తున్న పదహారేళ్ళ అబ్బాయి గుండెలు పీచుపీచు మంటున్నాయి. అతని కాళ్ళు నీరసంగా తెలిపోతున్నాయి.
ఆకుపచ్చని తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి. గదిలో ఎలక్ట్రిక్ లైటు చప్పున వెలిగింది.
గదిలో అడుగు పెట్టిన అబ్బాయి, "సార్ , ఉన్నారా?' అని దీనంగా పిలిచాడు.
"ఓహ్! నువ్వా!" పచ్చని అందమైన మోహమంతా నవ్వు నింపుకుని అన్నాడు ప్రసాదరావు.
క్షణం మౌనం తరవాత అదే నవ్వుతో, తల వంచి నిలుచున్నా వాసు వైపు చూస్తూ, "నాతొ ఏమో మాట్లాడాలన్నావ్?' అన్నాడు ప్రసాదరావు.
"ఆ అవునండీ....నేను స్కూలు ఫైనలు పాసయ్యాను" అన్నాడు వాసు నసుగుతూ.
"ఆహా! అయితే ఉద్యోగ మేమన్నా కావాలా?' నవ్వాడు ప్రసాదరావు ఆశ్చర్యాన్ని వ్యక్తం చెయ్యకుండా.
"కాదండి." మళ్ళీ తల వంచుకున్నాడు వాసు.
"చదువు కేమన్నా డబ్బు సాయం చేయ్యమనా?"
ఒకసారి ప్రసాదరావు వైపు చూసి మళ్ళీ తల వంచుకున్నాడు వాసు.
"పది ఇళ్ళు దండుకు చదువుకోవలసిన కుర్రాడివి ఇలా సిగ్గుపడితే ఎలాగోయ్! ఇదిగో, తీసుకెళ్ళు" అంటూ ఐదు రూపాయల కాగితం వాసు పక్కన ఉన్నబల్ల పై పెట్టాడు ప్రసాదరావు.
"వద్దు, తీసుకోండి" అన్న వాసు గొంతు వణికింది దుఃఖంతో.
"అయితే ఎందుకు వచ్చినట్టు?" వెళ్ళావోయ్ !" చిరాగ్గా అన్నాడు ప్రసాదరావు.
"ఇదే మీ కొడుకైతే ఇలా పొమ్మనగలరా సార్. ఐదు రూపాయలతో!" ఆ గొంతులో బాధ, నిష్టూరం.
