"నీకేం బయం లేదు తల్లీ! నేనున్నానుగా!"
ఒక్క సిటికి ముసలోడి కల్లల్లోకి రెప్పవెయ్యకుండా సూసినాది.
ఆ సూపుకి నీల్లు పొరలు అడ్డబడ్డాయి.
"అమ్మ సచ్చిపోయింది తాతా!' పోల్లిపోల్లి ఏడ్చినాది. ఆ ఏడుపులో సుళ్ళు తిరిగినాది. ఆడి సేతుల్లోంచి కిందికి జారిపోయినాది.
ముసలోడు ఆ దొంగోడెంపు సురసురా సూశాడు.
ఆడు మొకం తిప్పేసుకున్నాడు.
ముసలోడి రగతం సలసల కాగినాది. మొగం కందగడ్డయినాది. ఆణ్ణి సూసి తుపుక్కున వూశాడు.
కొబ్బరి కాయిల బత్తాల కానుకుని ఆడు గోదారోంక సూత్తా నిలుసున్నాడు.
"ఆ ఎంపు తిరిగి ఏం సోద్డెం సూత్తన్నా వురా? నా సిట్టితల్లి పొట్ట ఆప్పటవులాగయిపోయినాది. ఊల్లో కెల్లి తిండాని కేదేనా తీసుకురా!"
మారు మాట్టాడకుండా ఆడు ఎల్లి పోయాడు.
ముసలోడు ఆ సిన్నదాన్ని గుండి కొత్తుకున్నాడు. ఆడికీ కళ్ళు సెమ్మగిల్లాయి.
"మా యమ్మేది తాతా ?"
ఆడు మాట్టాడకుండా అల్లాగే సూత్తన్నాడు.
"సేప్పవూ?"
బాద పోల్లుకు రావడంతో మొగం దాసుకోడానికి గోదారేంపుకి తిరిగాడు. ఏం సేబుతాడు?
"తాతా! మాయమ్మ నిజంగా సచ్చి పోయిందా?"
"లేదమ్మా!లేదు. మీ యమ్మ బతికే వున్నాది!"
"ఏది? ఎక్కడున్నాది?"
"............."
"గోదార్లో వుందా?" నోట్లో సేతులు కుక్కుకున్నాది.
"లేదమ్మా ! గట్టు మీదే వున్నాది. నీదరినే వున్నాది.
"ఏది తాతా? ఏది?" అంటా యిటూ అటూ సూసింది. ఏం కనిపిచ్చ లేదు. అమ్మ, అమ్మ లాటి మనిసి, అమ్మని మరిపిచ్చి మనిసి -- యిక్కడా, అక్కడా , ఎక్కడా లేదు. ఏదీ లేదు. అమ్మ గోదార్లో ములిగి పోయింది. గోదారే అమ్మని దాసేసింది. మొత్తం పెపంచాన్నే పొట్టనెట్టుకుంది!
"అమ్మా! నేను మీ యమ్మని కానా సెప్పు!' అంటా గుచ్చి గుచ్చి దాని కల్లల్లోకిసూశాడు.
తాత గుండిలి మీద వొలి ఆ సిన్నది గోల్లుని ఏడిసింది. సల్లగా దాని తల నివురుతా అకాసేవొంక సూశాడు. జాయిగా పైకి లేత్తా వున్న లేతెండలాగే, ముసలోడి గెడ్డం లో దాగున్న పెదాలు సిన్నగా కదిలినాయి .
గలగలా గోదారి గజ్జిలు వోయిస్తా వున్నాది. సేట్లేక్కి పిట్టలు పిల్లల్ని పలకరిస్తా వున్నాయి. అద్దరినున్న సెట్ల నుంచి సూరీడు ఎనక్కి వొలిపోతావున్నాడు.
గట్టు మీద కూసుని కాళ్ళు గోదార్లో పెట్టుకొని నీళ్ళు సెదర గోడతావున్న సీతమ్మ కి ఉన్నట్టుండి గుండీ అదిరినాది. కాళ్ళు తీసేసుకుని , దోసిడి తో నీళ్ళు పట్టుకొని కల్లింత సేసి సూసింది. ఇదిలేసింది. మల్లా మల్లా యిది లేసింది. అటిలో దానికేం కనిపించలేదు. అమ్మ మొగానికి బదులు, తన్నే తను పదిసార్లు సూసుకున్నాది.
పోద్దత్తమానవూ అక్కడే కూసున్నట్టు కూసుంది. నీల్లు పైకి తీత్తా ఒలక బోత్తానే వున్నాది.
దాని నోటం సూసి 'పిచ్చిదేమో' అనుకున్నాడు బద్రయ్య.
జాలిగా, కల్లల్లో నీల్లెట్టుగున్నాడు ముసలయ్య.
ఇయేయీ పట్టించుకోకుండా గోదారి కెరటాల మీదే మనసు నిలిపి , కన్ను ముయ్యకుండా సూత్తా నిలుసున్నాది సీతమ్మ.
తెగించి అన్నాడు బద్రయ్య . "దీనికి గోదారి పిచ్చి పట్టినట్టుందే!"
కల్లతో మింగేసిలా సూశాడు ముసలయ్య. తేలిగ్గా నవ్వాడు బద్రయ్య. సొగసుగా మీసం దువ్వుకున్నాడు.
సరసరా నడిసేల్లి, సీతమ్మ బుజం మీద సేయ్యేశాడు ముసలయ్య.
"ఏంటి తాతా?"
"రా అమ్మా! మన మెల్లి పోదాం. ఈడి దగ్గిరుంటే మన పరువు దక్కదు. పట్నవంతా తిరిగి ముట్టేత్తి నీకు వొంణం పెడతా!"
"సీరామనవ మెప్పుడు తాతా?"
"సాలా రోజులుందమ్మా ఇంకా!"
"మనం బద్రసేలం వేడదారా?"
అ మాటనే తలికి సీరావుడు ఆడి మనసులో మెదిలి ఒళ్ళు మరిపిచ్చేశాడు. కొండమీద ఆ గుడిలో రావులోరి కాళ్ళ కాడ వోలిపోయి నట్టు తలుసుకున్నాడు.
బద్రాది రావుడు తన ఎదట కొచ్చాడు. తనలోనే కలిసిపోయాడు. ఆడే రావుడయి పోయాడు!
ఆ సిన్నదాని మొగం లో సీతమ్మ కనిపిచ్చి నాది. గుడి తలుపులు తెరిసేట్టి కొండ దిగొచ్చినాది!
ముసీలి రావయ్య కి సీతమ్మ తల్లి కన్నతల్లి.
"సీతమ్మ తల్లియి, నువ్వెక్కడుంటే అక్కడికే ఆయన వోత్తాడమ్మా! మన ముంగట నిల్చుని దరిసెన విత్తాడు. ఏలే బద్రాసేలం ఎల్లక్కర్లేదు. ఊల్లో కెల్లి కూసింత గెంజి అడుక్కుందాం రా!"
బద్రయ్య ఎదురొచ్చి నిలబడ్డాడు.
"ఎక్కడికి పెయ్యానం?"
"ఎట్ట్తోకి!"
"ఆ ఎంపుకాదు యీ ఎంపున్నాది!"
"అబ్బే నీ మొకం లో ఉన్నాది."
నవ్వాడాడు. .. "నాతో పరాసకమెందుకు ముసలయ్యా? నువ్వా ముసలోడివి; కాలిరిగినొడివి. దీన్నిప్పుడెక్కడికి తీసి కెల్లగలవు సెప్పు! మీరిద్దరూ నాకాడే వుండండి. మీ యిద్దరికీ నే కూడెడతా!"
"నీ సేతి కూడా? స్సీ! మేమేం గతి లేనోళ్ళం కాం!"
"పోనీ మీ కూడు నాక్కూడా పెట్టండి!"
ముసలయ్య సీతమ్మ ఎంపు సూశాడు. అది మాటాల్లేదు.
"ఊహూ! ఈల్లేదు!" అన్నాడు.
బతిమాలుకున్నాడు బద్రయ్య. "నాకూడు మీరు తినొద్దు , మీది నేనూ తిన్ను. ఈ సిన్నదాని మెల్లో గొలుసు నాకిచ్చేత్తే సాలు! అది బజార్లో అమ్మేసి డబ్బు తెత్తా. ఈ గోదారి గట్టునే సిన్న పాకేసుకుని వొటేలు పెట్టుకుందారి. పడవోల రేవులో కొచ్చే వొళ్ళందరూ మనకాడికి ఒత్తారు. యాపారం జోరుగా సాగుతాది. సీతమ్మ గోలుసిత్తే సాలు బిగినీసులో లచ్చలు గడిత్తా! సొమ్ము దాందీ , కట్టవు నాదీ! ఏమంటా?"
ముసలోడు మల్లా సీతమ్మ ఎంపు సూశాడు.
మేల్లోంచి గొలుసు తీసి సీతమ్మ ఆడి సేతిలో పెట్టింది.
సటుక్కు నందుకున్నాడు. గిరుక్కున ఎనక్కి తిరిగి ఎల్లి పోతావుంటే గబుక్కుని లేశాడు ముసలయ్య.
"ఏం?"
"గొలుసు సేతులో పడ్డాదని, ఒయి కుంటం ఒలికిందనుకుంటన్నావేమో! జాగర్త. నా కన్ను కప్పి, దీ మేంటి మీదేప్పుడన్నా సెయ్యేసేవో నీ పేనాలు తోడేత్తా . తెలిసిందా?"
డబ్బు మైకంలో ఆడు ఒల్లె మరిశాడు.
"నీ మీ దొట్టు ముసలయ్య! దాని మనసుకి నేను కట్టం కలిగిత్తానా సెప్పు. అమ్మ తోడు కాదో?"
ఇసయిసా నడిసి ఎల్లి పోయాడాడు.
ఎల్లాగన్నా దాని గొలుసు చేతికి సిక్కింది కదా, అదేసుకుని మేడ్డా సేక్కేద్డారనుకున్నాడు బద్రయ్య.
బజార్లో కాటా ఎయిత్తే రొండొంద లిత్తామన్నారు. అయిసర బొజ్జా అనుకున్నాడు.
ఎనకోపాలిల్లాగే బెమ్మన్న మనవరాల్తో మెడ్రాసు ;లెగిసి పోయాడు. గుమ్ముమంటా యిద్దరూ తెగ తిరిగారు. ఓనాడు, సందేల కావోలు, తన సేతులు నిండుకొడం సూసి ఓ నాయుడోరి బుల్లోడితో ఏదో పనుండి ఎల్లి పోయింది అంతే. మల్లా కనిపిత్తే ఒట్టు! అడదన్నా, డబ్బన్నా అంతేగా బాబూ! పట్టోదిల్తే మన సెయ్యి దాటినట్టే లెక్క. అల్లాటప్పుడు సెన్నా పట్టణం లో మట్టుక్కి పోయేవేదెంటంట?
పోనీ, మల్లా కొనసీవకే పొతే?
అయ్యబాబో! సింవం నోట్టో తలదూరిసి నట్టుకాదో? అక్కడోళ్ళు అసలే పొగరు బోతుళ్ళు!
మిక్కిల్నేని మీసాలయ్య కూతుర్ని సేరిపాడని దాని తరపోళ్ళు కర్రలేసు గోచ్చారు. బండీ గుర్రమూ యిడిసేసి చిటికిలో తప్పించుకొచ్చాడు గానీ, నా సావిరంగా పడవలో వొళ్ళ కంట ముందరే ఆడు సారగా లోకం సేరుకోవోల్సి నోడు. ఏం పున్నెం సేసుకున్నాడో కాని యీ ఎల్టికి బూమ్మీద నూకలు మిగిలినాయి!
రెక్కలొచ్చిన పిట్ట, దేసేవంతా ఆడిదే.
తెలివైనోడు యాపారం సేత్తాడు . బురద గోడ్దోడు నౌకరీ సేత్తాడు. ఎనకటికి ఆడి తాత అనీ వొట్ట. అల్లాగని సత్తెన్న గాడు సేప్పాడు. సత్తిగోడి యాపార వెంటంటే యానాం దేసేవు నించి సిలుకు బట్టలూ, సేతి వోచీలు , యింకా సొగుసు సావాన్లన్నీ దొంగతనంగా సేరేసి లాబాని కమ్ముకుంటా వుండీవోడు. అందుకు ఆడు పట్టిందల్లా బంగారమయినాది. ఆడిఒల్లె ఎక్సయిజోళ్ళు కూడా జేబుల్నింపుకున్నారు. అందుకని సేప్పేసి, సత్తిగాడితో యీడు కూడా జతపడదామనుకున్నాడు.
అయితే యీ రొండొందలూ పట్టుకొని తను పారి పోయిన్నాడు ఆ కుంటోడూ సిన్నదీ ఏమయిపోతారు?
ఈదీదికీ తిరిగి అడుక్కుంటారు. కులాయి కాడ కుసిన్ని నీళ్ళు తాగి ఎసందు మలుపులోనో తొంగుంటారు. ముసలోడికి మగత నిద్దర రాడం సూసి, ఏకుర్రనాయాలో దాన్ని లేగదీసుకుపోతాడు!
ఒరబ్బో! అవూసు తలుసుకుంటేనే ఆడికి గుండిలో గునపాలు.
సన్నని సుక్క యీదిని బడితే దాని సాగనంతా ఏమయిపోవాలి?
సీతమ్మ మీద జాలీ కలిగినాది!
పాపం దాని కింకేవరూ లేరు. తనకీ లేరు!
"ఇద్దరాము కలిసి పోదాం గదవే స్సేల్ మోహనరంగీ!"
ఈ పదం అడేదురుగా పాడితే ఒళ్ళు సీట్ల బోడుత్తాడు.
సిసలైన కోనసీమ కుర్రదది! వా! వారెవా!! పెదాలు సప్పరించుగున్నాడు. తన బలవూ, పెగ్గీ సూచి ఏనాటి కైనా ఒల్లక పోతా దేంటిలే!
"దాని మనసు మల్లిత్తే నూరు ముదర కొబ్బరికాయలు నీ కాళ్ళ కాడ కొడతా సిన్నాంజి నేయిస్సావీ!" అంటా మొక్కు కున్నాడు.
సీతమ్మ గొలుసు బజార్లో యిచ్చేసి, యింటికి కావలసిన సరుకులన్నీ కొని తెచ్చి ముసలోడి ముంగట పారేశాడు.
"ఆడబ్బు తీసుకొని పారిపోయావనుకున్నా బద్రయ్య!" అన్నాడు ముసలోడు.
ఓరకన్నుతో సీతమ్మ ఎంపు సూత్తా "అరనవ్వు' నవ్వాడు బద్రయ్య. బుజాలిరుసుకుని, నరాలు కదిల్చాడు. సీతమ్మ నడకలో ఒయ్యారం సూత్తా అలానే వుండి పోయాడు.
గోదారి తెచ్చిచ్చిన సీమాలచ్చి కాదో అది?
ఆడు కిట్టమూర్తి వోరయిపోడో? కిట్టుడి తనవన్నది తెచ్చుకుంటే వొచ్చీదా?
మిగిలిన డబ్బుతో గోదారొడ్డుని రెండు పాకలేయించాడు బద్రయ్య. వోటి వోటేలికీ, యింకోటి ఆళ్ళకీ! ఒటేలు తెరిశాడు. "సీతాలచ్చీ ఒటేలు అని పెరేట్టాడు.
సీతమ్మ ససేమిరా అన్నది . తాతదగ్గర ఏడిసింది. తన్ని నలుగురు నొల్లలోనూ పడేత్త న్నాడన్నాది.
"నీ తాతుండగా నీకు బయవేంటి తల్లీ?" అన్నాడాడు.
ఆ పిల్ల కల్లల్లో ముత్తాలు మెరిసినాయి. తాత కాల్లకి మొక్కుకున్నాది.
"గోదారమ్మ నిన్నెప్పుడూ కనిపిట్టే వుంటాది తల్లీ!"
కొబ్బరికాయల ఏపారం మాజోరుగా సాగుతన్నాదేవో కోనసీమనించోచ్చీ పడవలకి ఎడతెరపి లేదు. సీతమ్మ ఒటేలు చూచి, పడవ లోల్లు సేరసేరా లోన కొచ్చీవొళ్ళు. తియ్యటి కబుర్లు చెప్పి సల్లగా తినిపిచ్చి దమ్మిడీ కాడి నించీ పెలేసి వోసూలు సేసుకునీవోడు బద్రయ్య. కానీలికి అణాల్లెక్కని లాభాలు గుంజుకుంటున్నాడు. మొకాలు మచ్చికయ్యాక సిన్నసిన్న అరువులిచ్చి 'కాతా బొక్కు' తెరిశాడు. అరువులు అప్పులయినాయి. అప్పులు కాయితాల్లో క్కూడా ఎక్కినయున్నాయి.
డబ్బు గడించ డవులో ఆడు వొల్లె మరిసి పోయాడు. ఒటేలు యాపారానికి పనోళ్ళ నెట్టుకుని కొబ్బరి కాయల మీదా, అంటి గెల్ల మీదా, జీడి పప్పు మీదా, మాయిడి పళ్ళ మీదా కనీష నేపారం చేసేవాడు. సరుకోడీదీ, కొనివోడింకోడూ, మద్ది లో మాట్టాడి పెట్టినందుకు కనీష నీడిదీ! ఈడికి తెలీకుండా ఆడి దగ్గరా ఆడికి తెలీకుండా యీడి దగ్గరా తలో కుంతా తీసుకుని జేబు నింపుకుంటాడు.
