2
ఇద్దరి నించి అద్దరి దాకా ఒడ్డు తాసుక పోతావున్న గోదార్ని సూసి సవుద్రమెవో నని బయిపడి, 'సెందురుడు మబ్బులేనకా తల దాగున్నాడు.
బూవి సుట్టూత తాడు లేని బొంగరం లా తిరిగే వొడి క్కూడా బయమెందుకో?
మబ్బులంచుల్నించి జారి పడుతున్న ఎన్నెల గోదారి నీల్ల మీద పా లోలకబోసినట్లున్నాది. తలతలా మెరిసిపోతన్నాది.
ఆ ఎన్నెట్లో --
"ఈ ఏల పడవ మాజోరుగా సాగుతాది!" అనుకున్నాడు సరంగోడు.
"సుక్కాని పట్టాపోయినా , రేలు బండిలా నడుత్తన్నాది !" అన్నాడు అవతలోడు.
ఆ ఎన్నిట్టీ గోపాల కిట్టమ్మే పిల్లం గోవి మూలగా కూసున్న ముసలాడో.
పచ్చరంగు కొత్త సీరలో కొత్త పెల్లికూతుర్లా కనిపిత్తా వున్న ఓ సిన్నది, అల్లంత దూరంల అసిగా సూత్తన్న పడుసోణ్ణి ఓ రకళ్ళతో కనిపెట్టి సిగ్గుపడి పోయినాది.
దాని మెల్లో ఉన్న జిగినీ గొలుసు మీద అలోసన పోగా పక్కకి తిరిగి సిటికేశాడు, గళ్ళ లుంగీ లో వున్న గరానా మనిషి.
ఆడి పక్క వొళ్ళంతా సెవులు కొరుక్కున్నారు. పడవంతా పూటుగా ఉన్నాది. లోన సామాను సాలా వుందని , కొంతమంది జనం గూడేక్కి కూకున్నారు.
సామ్మీద పడుకున్న యిష్ణుమూర్తి వోరి లాగ కాళ్ళు నిగడదన్ని పడుకున్నారు కొందరు.
అళ్ళనేమీ అండానికి దమ్ము ల్లేనోళ్ళు మడిసి సెట్టు క్కూకున్నారు.
గలగల్లాడతా గోదారి పడవ అంచుల్ని ముద్దెట్టుగుంటన్నాది.
మబ్బులు గూట్తోంచి సెందురుడు జారి పడ్డాడు.
దాంతో దూరాన్ని కనిపిచ్చే సెట్లూ, సేమలూ బొమ్మల పటంలా ఉన్నాయి.
ఆ రేతిరి అంతా యింత ఎలుగులు అలువుకున్నాయి.
అవతలున్న సుక్కావోడికి వుసా రందుకున్నాది. కూని రాగం వోటి లంకించుగున్నాడు.
ఆడి పక్కనే వున్న అడ కూతురూ వో పదవందుకున్నాది.
గాలి యిసురుకి తెరసాప లాడినట్లు ఆ పడవలో వొళ్ళందరూ పాటకి వూగిసలాడి పోయారు.
గోదారి గంగలో కలిసి సేందరలోకానికే ఎడతన్నట్టు తేలిపోయారు. రాగాల ఒదుగులి మీద పైకే పాకిపోయారు. ఆ మైకంలో ఆళ్ళ వొళ్ళు ఆళ్ళే మరిసిపోయారు.
కుళ్ళు మనసు గోలోళ్ళకి కూడా ఆ పాట గుండిలుకడిగేసినాది. అందరూ ఎలుగెత్తి ఒక్క గొంతుతో పాడారు. పుసపుసా పొంగుతా ఎగిరి గంతేశారు. ఆ పదం నడకల్లో, ఎన్నెల ఏలుగుల్లో, గోదారి పరుగుల్లో మురిసిపోయారు.
మంచు గడ్డని పొర కప్పినాది. పడవలో జనవందరూ సొమ్మసిలిపోయి, గుండిల్లో మోకాళ్ళు దాసుకుని కునికిపాట్లు పడతా వున్నారు. అప్పుడప్పుడా ముసలోడు రావుణ్ణి పిల్డనో, ఒకోడు ఆవులించడనో, కొత్త సీర సిన్నదాని సేతి గాజులు గలగల్లాడ్డ'నో, దూరాన కూసున్న పడుసోడి కళ్ళు మేరుత్తా వుండడనో, దాన్నానుక్కూకున్న అమ్మ కాల్లకున్న అందిలూ కడేలూ సప్పుడ పడవో, సుక్కావోడు ఉండుండి రాగం తీయడవో . ఆడి పక్కనున్న అడ కూతురు ఉస్సురండవో తప్ప, ఆ పడవంతా నిద్దర నీట్టో మునిగినట్టే ఉన్నాది. దుప్పటి కప్పుకు తొంగున్నాడు.పడవంతా సీకటి పరుసుకున్నాది.
సరసరా పడవ ---
గలగలా నీళ్ళు-----
ఇంకేం సప్పుడు లేదు.
పిల్లిలా నడుసు కొచ్చాడాడు.
పండు లాటి పిల్ల మెళ్ళో సేయ్యేట్టి తడివాడు.
ఆడిక్కావల్సింది దాని మెళ్ళో వున్న మెత్తదనం కాదు.
జిగినీ గొలుసు!
ఆడి కళ్ళు జిగేలు మన్నాయి.
ఆ పిల్ల మెడకి మొగోడి సేతులు తగల్డం అదే కొత్తేమో, మగత జారిపోయి మెనుకూ వోచ్చినాది.
కెవ్వుమని కూసినాది.
ఆడి సేతిలో కత్తి మెరిసినాది.
అ కత్తి యిదిసిన మెరుపు ఒంకర్లు తిరిగినాది.
ఆ పిల్ల బిత్తర పోయింది.
ఇంతట్తోకే , ముసలోడి సేతిలో వున్న కర్ర ఎగిరొచ్చి బలంగా యీడి సేతి మీద పడింది.
ఆ పిల్ల దాన్ని యిడిసేసి యీడు ముసలోడి మీదికి యిరుసుకు పడ్డాడు.
ఆ సిన్నది తల్లి వొళ్ళో మొగం దాసుకన్నాది. ఒల్లంతా ఒనికిపోతన్నాది.
ముసలోడేగిరి ముందుకొచ్చి స్సేల్లుని యీడి దవడ మీద వూసి పుచ్చుక్కోట్టాడు.
ఎనకనించి నాలుగు కర్రలు ముసలోడి మీదికి లెగిసినాయి.
దీంతో రెండెంపుల్నించి జనం సొచ్చుకొచ్చారు. పెద్ద గలాటా అయినాది. గొంతులు సించుకుంటా అరుపులూ, కర్రలూ బరబరలాడిత్తా సప్పుడూ!
ఈ గొడవ సేందురుడెం పట్టించుకోలేదు.
అడెంపు కొంతమందీ, యీడెంపు కొంతమందీ సేరి పెద్ద యుద్దమే సేశారు. అసలోళ్ళీద్దరూ దూరాన్ని లుసున్నారు.
కలత నిద్దరయి మెనుకూ ఒచ్చిందేవో సెందురుడు మబ్బుల్లోంచి ఎలపలి కొచ్చి సూసీతలికి ఆ పడవ అక్కడ లేదు.
'ఏమయింది సేప్మా?' అనుకున్నాడు.
నట్ట నడేట్లో ఆ పడవ మునిగి పోయినాది! ఆళ్ళల్లో రెండు పానాలు నిలిసినాయి. ఆడూ, సిన్నదీ!
ఆడికి యిరిగిన తెప్పవోటి దొరికింది. ఈతా ఒచ్చు. సొమ్మసిలిపడ్డ సినదాని కడుపులో గోదారీ నీళ్ళన్నీ దాక్కున్నాయి. దాన్ని ఆడు తెప్ప మీద కెక్కించి యీదు కొచ్చాడు. గోదాల్లో అక్కడక్కడ యిసక మేటేసుకు పోయున్నాది. కొంత సేపట్లో ఆడికో యిసక తిప్ప కనిపించినాది.
ఆ సిన్నదాన్ని నెమ్మలంగా తీసుకుపోయి అక్కడ పడుకో బెట్టాడు.
కడుపులో నీళ్ళు కక్కించి, సేతులు యిటూ అటూ అడిచ్చాడు. దాంతో, అదింక సావదని నమ్మకం కలిగినాది.
ఇంకా దానికి తెలివి రాలేదు.
ఆ ఎన్నెల ఎలుగులో---
ఒనలో తడిసిన మల్లి పువ్వులాగున్నదా సిన్నది!
అల్లాగే దాని మొగంలోకి సూత్తాకూసున్నాడాడు.
ఇంతమంది ఆడోళ్ళని సూశాడు కాని, దీన్లో ఉన్న సొగసు ఏ వోక్కత్తికి లేదు.
విడివయిన కళ్ళూ, సన్నటి ముక్కూ, బుల్లి నోరూ, పలాసని గెడ్డం , మెత్తగా వుంటాదనిపించే మెడా!
తలకి బారిడు జుట్టు , యింకా సల్లగానే వున్నాది.
ఆనాటి రేతిరి , సల్లని సొట, ఆ సిన్నదాని దరిని కూకునుంటే ఆడి గుండి గురగుర లాడినాది.
దాని మెల్లో జిగినీ గొలుసు మెరిసి పోతున్నాది.
గొలుసు తీసేసుకునీ దాకా మన సాగలేదు.
మెల్లో సెయ్యేట్టాడు. సోగ్గానే ముట్టుకున్నాడు.
అది కొంచెం కదిల్నాది.
ఆ కదల్డం లో మబ్బు నీడల్లో కన్నె తాసు కదిల్నట్టే వున్నాది.
ఆడి కళ్ళు పక్క కొరిగి ఏదో అలోసించుకున్నాయి.
ఆ పిల్లే తనకి అంకినప్పుడు, పిల్ల మెళ్ళో గొలుసేక్కడికి పోతాదిలే!
అది తన్ని ఒల్ల కాదంటే ?
మొల్లో కత్తి సేతికి తగిల్నాది.
స్సీ! సచ్చు మొగోడు!
దాని మెడను నునుపు ఎళ్ళతో తడివి సూడాలని మనుసయినాది.
మల్లా సేయ్యేశాడు.
అది కళ్ళు తెరిసి సూసింది.
అడు మొగం పక్కకి తిప్పుకున్నాడు.
"ఎవరు నువ్వు?"
"ఆడు మాటాల్లేదు.
"మా పడవేదీ? మా యమ్మేదీ? నన్నీడి కెందుకు తెచ్చావ్?"
"ఆడు నవ్వాడు.
"ఎర్రిదానా! మీ అమ్మా, నీ పడవా అన్నీ గోదార్లో కొట్టుకు పోయినాయి. బతికి నోళ్ళం నువ్వూ, నేనే!"
"కాదు నేన్నమ్మను! నువ్వబద్దం సేబుతన్నావు. ఆళ్లనందర్నీ మాయి సేసి నన్నేత్తుకోచ్చావు " దాని కేడుపే ఒచ్చినాది.
ఆడు మల్లీ నవ్వాడు.
'నిజవు సెపితే ఎవరూ నమ్మరు మరి! పోనీ అబద్దం సెప్పమంటా'?"
అది అడెంపు సూన్నెలేదు.
"మీ యమ్మ నిన్ను నాకప్ప సెప్పింది!"
"స్సీ! దున్నపోతా! మా యమ్మ నీకు సచ్చినా యియ్యదు. ఆళ్ళ నేం సేశావో సెప్పు!"
మాటాడకుండా ఆడు గోదాట్లోకి సూశాడు.
ఏడుపు పొల్లుకొచ్చీనాది. నోట్లో ఏళ్ళు కుక్కుకుని గుండెలు పిండుకున్నాది.
"అమ్మా! అమ్మా!!" అంటా గొంతుకు సించుకు పిల్సినాది.
గోదాట్తోనించి మాటలు పైకి రాలేదు.
సిన్నసిన్న కెరటాలు ఆరిందాల్లా ఒచ్చి యిసక మీదపడి యిరిగి పోతన్నాయి.
సేతులెత్తి మొత్తుకున్నాది.
పెదాలు కోరుక్కున్నాది.
జుత్తు పీక్కున్నాది.
ఏడిసీ సత్తూ కూడా లేక కుప్పలాగా కూలిపోయినాది.
ఆడు దరి కొచ్చాడు.
కల్లెడంగా పెట్టి నిలుసుని; సేతు లేనక్కి కట్టుకొని, సిన్నగా నవ్వుతున్నట్టు పెదాలు కదిలిచ్చి, కళ్ళు సగం వొల్చి దాన్ని సూత్తా వుండిపోయాడు.
రెండు పిటికి లల్లాగే వున్నాడు.
ఉస్సూరుమనీ అన్నాడు.
దాంతో అది బస్సుమనీ లెగిసినాది.
ఆడి మొగం మీద వూసినాది.
"పో, ఎదవా! పో! ఈ గొలుసు కోసం మా యమ్మని సంపావు. ఆణ్ణి కూడా ముంచావు. పడవలో వొళ్ళందర్నీ పొట్ట నెట్టుకున్నావు. ఎదవ సచ్చినోడా! నీకు అమ్మ లేదు --"
ఆడు నవ్వుకున్నాడు.
"---అప్పా సేల్లిళ్ళు లేరు. బంగారు కంటబడితే పేనాలు కూడా తీత్తావు. పో, పో , యీ గొలుసు తీసుకుని నన్నిడిసిపో. నాదార్ని నన్ను పోనియ్యి! అమ్మా!" అంటా గట్టిగా అరిసింది. మెల్లో గొలుసు తీసి యిసికిలో యిసిరేసింది. ఇసయిసా నడిసి గోదార్లో కి లగేత్తింది.
గోదారి ఉలకలేదు!
ఆడెల్లి దాన్ని ఆపేశాడు.
మోకాలి బంటిలో నిలేశాడు.
'అమ్మా!' అంటా మల్లా అరిసి, అడి కాళ్ళకాడే వొలిపోయినాది.
దాని బుజాలు సేత్తో మెత్తగా పట్టుకొని యిసక లోకి యీడుసు కొచ్చాడు.
సెందురుడు సానాదూరం నడిసినడిసి అలిసిపోయాడు.
సొలసిపోడంతో ఎలుగూ నీర్సాపడ్డాది.
దాని పక్కన ఆడు అల్లాగే కూకుండి పోయాడు.
ఏమేమో అసలు పోడుసు కొచ్చినాయి.
మొగతనవు సురసురమన్నాది.
పాపం, దానోళ్ళు దానికే తెలీలేదు.
ఆడు మనుసాపుకోనూ లేకపోయాడు.
అల్లా వుండగానే ---
మసక ఎల్తురు లో దూరాన్నించి తెరసాపోటి కనిపించినాది. పడవ దరికి రాగానే ఆపి దాని బుజం మీద అన్సి లోన కేక్కించాడు.
రాయసంద్రం సేరుకునే ఏలకి తెలతెల వోరతా వున్నాది.
ఆళ్ళందరితోటి, ఎనకటి ముసలోడు కూడా దిగడంతో ఆడికి సానా యిడ్డూరమయినాది.
గట్టు సేరుకుని, దాన్ని వో రాయి సెట్టు కాడ పడుకోబెట్టాడు.
ముసలోడు కూడా ఎనకాలే వొచ్చాడు. దాని మొకంలోకి సూశాడు. ఒళ్ళు ముస్స్మట్లూ పోసినాయి.
ముంతతో గోదారి నీళ్ళు తెచ్చి దాని మొకం మీద సల్లాడు. ఆ సిన్నది కదల్లేదు.
దాన్ని రెండు సేతుల్లోకి తీసుకొని కల్ల దగ్గరిగా పెట్టుకున్నాడు.
"అమ్మా!" పిలిశాడు ముసలోడు.
ఆ పిలుపు గుండిల్లోకి సోచ్చుకు పోయి ఎయ్యి సార్లు మారు మోగినాది.
దాన్లో మిగిలున్న కొసపెనమేదో ఆ పిలుపుకి లోన కదలాడినాది!
మల్లా పిలిసాడు.
అది కల్లి'ప్పినాది.
ముసలయ్యని సూసి ఎక్కెక్కి ఎడిసినాది.
