Previous Page Next Page 
మూసిన తలుపులు పేజి 2


                                      2
    రాజశేఖరం ఎమ్ . ఎ లో చేరాడు. అతనికి తెలిసి వచ్చినప్పటి నుండి ఆనందరావు గారు వారింట్లో నే ఉండి చదువు కొమ్మని చెప్పినా వినయంగా నిరాకరించి వేరేగా ఉంటున్నాడు. ఊరి చివర ఒక పెద్ద ఇంట్లో ఓ చిన్న గది అద్దెకు తీసుకొని అందులో ఉంటున్నాడు. హోటలు భోజనం. అతనికి డబ్బు కావలసి నప్పుడు ఆనందరావు గారిని అడుగుతాడు. జీవితంలో ఎలాంటి సుఖాలకు , సౌకర్యాలకు అందుబాటు లో లేకుండా గుట్టుగా జీవిస్తున్నాడు.
    అతడు ఉన్న వీధి లో అందరికీ అతడంటే అభిమానమూ, మంచివాడనే అభిప్రాయమూ ఉన్నాయి. అందుకు తగ్గట్టు గానే నడుచు కొంటున్నాడు రాజ్. ఏనాడూ అతడు ఆ వీధి లోని ఇళ్ళ వైపు తలెత్తి చూసి ఎరగడు. తన పనేమో తనేమో. తలవంచుకు పోవడం , తలవంచుకుని రావడం అలవాటు చేసుకొన్నాడు. ఎవరైనా కొత్తవాళ్ళు అది చూస్తె ఇదొక అవతారమేమో అనుకుంటారు. కాలేజీ లో అతనంటే అందరికీ భయం, సదభిప్రాయమూ ఉన్నాయి.
    ఒకనాడు రాజ్ కాలేజీ కి వెళ్ళుతుండగా ప్రక్క బంగళాలో నుండి ఒక సైకిలు వచ్చి అతన్ని డీ కొంది. అనుకోని ఆ ఊహకు క్రింద పడ్డాడు రాజ్. బట్టలకు దుమ్మయింది. ఉన్న ఆ ఒక్క జత గుడ్డలు మరో వారం ధరించాలి. అవి కూడా మట్టి కావడంతో కోపం వచ్చింది. లేచి మట్టి దులుపుకొని కోపంగా అటు వైపు చూశాడు. సైకిలు బాలన్సు పట్టలేక క్రింద పడి లేచి భయంగా తననే చూస్తున్న ఒక అమ్మాయిని చూసి ఏమీ అనలేక పోయాడు. తెల్లటి పైజమా, యెర్ర రంగు గౌను ధరించి, మెడ చుట్టూ పైట చెంగును వేసుకొన్న ఆమెను చూసి ముస్లిములని నిశ్చయించుకొన్నాడు.
    "క్షమించండి. పొరపాటయింది." అంది ఆమె మెల్లిగా.
    "ఫరవాలేదు లెండి.' అని ముందుకు సాగి పోయాడు రాజ్. ఠీవిగా అడుగులు వేసుకుంటూ పోతున్న అతన్ని చూస్తూ కాస్సేపు అలాగే ఉండి పోయిందామె. ఆ తర్వాత క్రింద పడ్డ సైకిలు లేవదీసి హండిల్ సరి చేసుకొని సైకిలేక్కింది.
    ఆ సాయంకాలం అవే బంగళా లో తన తండ్రితో పాటు టీ త్రాగుతుంది ఆ ఆమ్మాయి. అదే సమయంలో రాజ్ అటుగా తన గదికి వెళ్ళుతుండగా చూసిందామె.
    'బాబా! అతనెవరు?' అంది.
    ఆమె తండ్రి ఆమెను అనుమానంగా చూసి "ఎందుకు?" అన్నాడు.
     ఉదయం జరిగిన విషయం చెప్పింది.
    నవ్వి 'అతడు రాజశేఖరమని ఎమ్. ఎ చదువుతున్నాడమ్మా . చాలా మంచివాడు. ఒకరి విషయంలో జోక్యం కలిగించుకోడు" అన్నాడు.
    "ఈ వీధిలో వాళ్ళ యిల్లేక్కడ , బాబా?"
    "ఈ వరస లో ఆరో యిల్లు. అక్కడ ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. అంతకు మించి వివరాలు తెలియవు." అని టీ కప్పు బల్ల మీద పెట్టి పైప్ వెలిగించాడు.
    అయన రిటైర్డ్ కలెక్టర్. పేరు అమీర్ ఖాన్. ఆ అమ్మాయి అతని ఒక్కగానొక్క ముద్దుల కూతురు రజియా. ముస్లిము లైనా ఎప్పుడూ తెలుగు భాషకే అలవాటు పడి దాన్నే ఉపయోగిస్తుంటారు. కుమార్తె ను వైద్యం చదివిస్తున్నాడాయనగారు. ఎమ్. బి.మూడవ సంవత్సరం చదువుతున్న రజియా కు ఎందుకో రాజ్ తో పరిచయం చేసుకోవలెనన్న కోరిక కలిగింది.
    ఆ మరునాడు రజియా సైకిలు పై ఇంటికి వస్తుండగా గదికి పోతున్న రాజ్ కనిపించాడు. "హల్లో ! గుడ్ మార్నింగ్ , మిస్టర్ రాజశేఖరం " అంది అతని ప్రక్కనే సైకిలు దిగి.
    రాజ్ తిరిగి 'విష్' చేసి ఈవిడ తన పేరెలా తెలిసి కొందా అనుకొన్నాడు. రజియా అతని ప్రక్కనే నడవ సాగింది. అది చూచి భయపడి ఇదేమిట్రా బాబూ అనుకోని చుట్టూ చూశాడు ఎవరైనా చూస్తారేమో నని. కానీ అప్పటికి అక్కడ ఎవ్వరూ కనిపించక పోవడంతో బ్రతికా ననుకొన్నాడు.
    'చూడండి . నాపై కోపమా?" అడిగింది రజియా. అతని మొహం లోని భావాలను కనిపెట్టాలని ప్రయత్నిస్తూ. కానీ సముద్రపు లోతు నైనా కనిపెట్ట వచ్చు కానీ అది అసాధ్యమని తెలుసుకొంది.
    "మీ పైన కోపం నాకెందుకు?' తిరిగి ప్రశ్నించాడు రాజ్.
    "అదే. నిన్న జరిగిన సంఘటనకు." మెల్లిగా గొణిగింది.
    "దానికి కోపమెందుకు? జీవితంలో మనం ఎన్నో పొరపాట్లు చేస్తుంటాము. మీరు మామూలైన చిన్న పొరపాటు చేశారు. అంతే."
    "మరి పలుకరించినా మాట్లాడరే?'
    "ఏం మాట్లాడమంటారో మీరే చెప్పండి.'
    ఆ మాటతో తికమక పడింది రజియా. అవును, ఏం మాట్లాడాలి అంది ఆమె హృదయం.
    ఇంతలో వాళ్ళ యిల్లు సమీపించడంతో "రండి కాస్సేపు వుండి వెళుదురు గాని" అని ఆహ్వానించింది రజియా.
    "నాకు కాస్త పనుంది వెళ్ళాలి." తప్పించుకో జూచాడు రాజ్.
    అప్పుడే బయటికి వస్తున్న ఖాన్ గారు "ఫరవాలేదు , రా అబ్బాయ్" అన్నారు.
    రాజ్ ఆయన్ను చూశాడు. అతని పిలుపులో ఠీవి, అజ్ఞ , అధికారాలతో కూడిన అర్దింపు ఉంది. దాన్ని త్రోసి పుచ్చలేక లోపలి నడిచాడు. రజియా అతన్ని అక్కడ కూర్చో బెట్టి లోపలికి వెళ్ళింది. దుస్తులు మార్చుకొని టీ తీసుకు వచ్చింది రజియా. ముస్లిము ల దుస్తులు విప్పి హిందూ సంప్రదాయం ప్రకారం చీరే ధరించి ఉంది ఆమె. ఆ దుస్తుల్లో ఆమె మూర్తిభవించిన వసంత కాలపు వన దేవతలా ఉంది. ఆమెను రెప్పర్పకుండా పరీక్షించి పులకితుడయ్యాడు రాజ్. పరాయి స్త్రీలను అలా చూడడం తప్పన్న మాట జ్ఞాపకం చేసుకొని సిగ్గుతో తల వంచు కొన్నాడు.
    "చూడబ్బాయ్! మా రజియా ఒంటరి తనంతో బాధపడుతోంది. కాస్త నువ్వు తోడుగా ఉండకూడదూ" అన్నారు ఖాన్ గారు టీ త్రాగడం పూర్తీ చేసి.
    ఆ మాటలు విని ఇరుకున పడ్డాడు రాజ్. "నా కెక్కడవుతుందండీ" అనగలిగాడు.
    "వీలు కాదనా? ఫరవాలేదు. వీలు చేసుకొనే కలుస్తుండు. అయినా మీరిద్దరూ కాలేజీ కి కలిసి ఎందుకు వెళ్ళ కూడదు?'
    'చచ్చాం రా, దేవుడా' అనుకోని బదులు చెప్పలేక పోయాడు.
    "కాలేజీ నుండి తిరిగి వస్తూనే కలిసి అలా షికారు కెళ్లి రండి. ఎలాగూ నువ్వు పోతుంటావు. మా రజియా ను వెంట పెట్టుకొని పో. అదీ కాకుంటే ఇక్కడే కూర్చొని మాట్లాడు కొండి. ఏమంటావు?'
    "హి భగవాన్! ఈ దినం ప్రొద్దున్నే లేచి ఎవరి మొహం చూశానో, ఇలాంటి విషమ పరిస్థితి తెచ్చి పెడుతున్నావు' అనుకోని 'క్షమించండి నాకు వీలు కాదు." అని చెప్పబోయి చేతకాక " ప్రయత్నిస్తాను లెండి" అనగలిగాడు!
    'అలాగే . ఏదో పెద్ద వాణ్ణి . నా మాట తీసి వెయ్యకు. ఉభయులకూ కాస్త "రిలీఫ్' ఉంటుంది." అని పైప్ నోట్లో పెట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు ఖాన్ గారు.
    రాజ్ మాట్లాడుతున్నంత సేపు అతన్నే గమనిస్తుంది రజియా. తనతో పరిచయం అతని కిష్టం లేదని గ్రహించింది.
    "నాతొ పరిచయం మీ కిష్టం లేదా?' సూటిగా అడిగింది.
    'అది కాదండీ. మీరు సైకిల్ మీద వెళతారు. నేను నడిచి వెళ్తాను. ఎలాగా అని నా సందేహం."
    "నేను కూడా మీతో నడిచే వస్తే ఆ బాధ తీరిపోతుందిగా."
    ఇదో కొత్త బాధ కలిగించావే అనుకోని "మీరు నాతొ రావడం ఎవరైనా చూస్తె బాగుండదని నా అభిప్రాయం." అన్నాడు.
    "ఒకరి అభిప్రాయాలతో మనకేం పని. నేను మీతో స్నేహం చేయడం ఎందుకో తెలుసా? చదువుకున్నవారు. దగ్గర్లో ఉండి తోడుగా ఉంటారని. అంతే. మీ కిష్టం లేకపోతె పోనీలెండి."
    'నా ఇష్టానికి కాదండీ! సరే మీ యిష్ట ప్రకారమే చేద్దాం లెండి." ఓడిపోయినట్లు అంగీకరించాడు. అమెకు కష్టం కలుగకుండా ఉండడానికి అలా చేయక తప్పింది కాదు.
    రజియా అతని అంగీకారంతో ఉప్పొంగి పోయింది. ఆమె హృదయం సముద్రుడు వెన్నెల రాత్రి లో పొంగినట్లు ఆనంద తరంగాలతో నింగిని తాకి ఎన్నడూ లేని ఉత్సాహంతో వెల్లి విరిసింది. ఆ పారవశ్యం లో రాజ్ వెళ్లి పోగానే పూల తోటలో కి పరుగెత్తింది. పూలన్నీ క్రొత్త అందాలతో ఆమె ఆనందాన్ని ఎగతాళి చేస్తూ నీ ఆనందానికి కారణం మాకు తెలుసులే అని వెక్కిరించి భయంతో అటూ యిటూ ఊగాయి. ఆ గాలి వల్ల వచ్చిన సువాసన లు ఆమెను ఆవరించి ఉక్కిరిబిక్కిరి చేసి ప్రతి పుష్పాన్నీ ఆస్వాదించమని ప్రేరేపించాయి. ప్రతి పువ్వునూ వాసన చూసి మైమరిచింది. చేతి కందిన కొమ్మను పట్టుకొని మితిమీరిన సంతోషంతో పూగులాడించింది. పూల స్నానం చేసి మురిసిపోయి చేతి కందిన పుష్పాలను తలలో పెట్టుకొని దోసిలి నిండా పూలు కోసుకొని పై కెగుర వేసి గంతులు వేసింది. ఫక్కుమని నవ్విన పూలను చూసి సిగ్గుతో గదిలో కురికి ప్రక్కపై పడి ఏవో కలలను కనాలని ప్రయత్నించి చేత కాక బాధగా మూలిగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS