Previous Page Next Page 
వాసన లేని పూలు పేజి 2


    "ఎందుకండి క్షమాపణ?"
    "నావల్లనే కదా ప్రిన్సిపాల్ మీకీ  శిక్ష విధించింది."
    "ఇందులో శిక్షే మున్నది చెప్పండి?" అన్నాడు రాజు ప్రశాంత స్వరంతో.
    "ఇదే-- మమ్మల్నిద్దర్నీ ఎగ్జిబిషనంతా తిప్పి చూపించే శిక్ష " అన్నది నవ్వుతూ.
    "ఇదొక శిక్షా? కానే కాదు, దీన్ని గొప్ప ప్రివిలేజ్ గా భావిస్తున్నాను."
    "యేమండీ మీకు మనుషుల్ని బాగా ఐస్ చెయ్యటం కూడా చేతనౌనె" అన్నది చిన్నావిడ.
    "ఛీ! ఊరుకోవే" పెద్దావిడ మందలించింది.
    వాళ్ళు వెళ్ళేప్పుడు రాజుకు చాలా చాలా థాంక్స్ చెప్పారు. మొదట విధిలేక వాళ్ళను వెంటేసుకుని బయలుదేరిన రాజు చివరకు చాలా ప్రసన్న చిత్తం తో వారిని సాగనంపాడు అంతే! ఆ తర్వాత వాళ్ళెప్పుడూ రాజుకు తటస్థపడలేదు ఐనా అతి సహజమైన వారి వరస ప్రవర్తన మృదు మధుర వాక్కులూ రాజు మర్చిపోలేక పోయాడు. ఎప్పుడో.... ఎక్కడో కన్పించక పోరన్న నమ్మకంతో షాపుల్లోనూ, సినిమా హాల్స్ లోనూ స్త్రీలున్న వేపు నిశితంగా చూస్తుండేవాడు. మనసులో ఎంత ఉత్కంట ఉన్నా సువిశాలమైన ఆ మహా పట్టణం లో వాళ్ళెవరో, ఎక్కడో ఎవరికి తెలుస్తుంది? కనీసం పేర్లు కూడా అడిగి తెలుసుకోలేదు. మనదేశం లో ఒకర్నొకరు విధగా "పరిచయం" చేసుకొనే ఆచారం ఇంకా బాగా వెళ్ళు తోక్కుకోలేదయ్యే.
    ఈనాడు చిన్నావిడ అనుకోకుండా కనిపించేసరికి అతని హృదయం ఏదో అవ్యక్తా ఆనందంతో నిండిపోయింది. ఈసారి పేరూ, అడ్రసూ అన్ని వివరాలూ తెలుసుకోకుండా వదలకూడదని నిశ్చయించు కొన్నాడు. ఆ అమ్మాయంటే అతనికి తెలియకుండానే అతనిలో ఒక రకమైన ఆకర్షణ ఏర్పడింది.
    పంతులమ్మ గైనిక్ వార్డు లో ఉంది శుష్కించి పోయి, మ్లానవదనంతో నున్న అవిడ రాజును చూడగానే లేచి కూర్చుని చేతులు రెండూ జోడించి "నమస్తే" అన్నది నీరస స్వరంతో.
    రాజు  ప్రతి నమస్కారం చేసి "నేను గుర్తున్నానా ?" అన్నాడు.
    "ఎంతమాట! ఆ రోజు మమ్మల్ని పద్మవ్యూహం లోంచి బయట పడేయ్యటమే కాకుండా ఎగ్జిబిషనంతా తిప్పి చూపించారు. మిమ్మల్ని మర్చిపోవటమా? కూర్చోండి అన్నది సాదరంగా.
    "మా అక్క కూడా మీలాగే విషయాన్నీ అంత త్వరగా మర్చిపోదు" చెల్లెలు అంది గ్లాసులో కాఫీ పోసి అక్క కందిస్తూ.
    "ఇప్పుడెలా ఉంది మీకు?" రాజు ప్రశ్నించాడు.
    "ఫర్వాలేదు, కొంచెం నెమ్మదిగానే ఉంది"
    "అంతా అబద్దం. మా అక్క మాటలు నమ్మకండి. తగ్గలేదని చెప్తే ఆపరేషను చేస్తారనే భయంతో అలా చెప్తుంది."
    రాజుకి ఆమె మాటల్లోని విశేషమేమిటో బోధపడలేదు.
    "అదేమిటి?" అన్నాడు.
    "డాక్టర్లు ఆపరేషను చెయ్యాలన్నారు. అక్కే మో వద్దని మొండి కేస్తోంది. ఆపరేషను చెయ్యకపోతే జబ్బు తగ్గదట . మీరు డాక్టరేగా మీరైనా చెప్పి చూడండి." అన్నది చెల్లెలు తెచ్చి పెట్టుకున్న కోపంతో అక్క వేపు చూస్తూ.
    రాజు మంచానికి తగిలించి ఉన్న కేస్ షీట్ తీసి చదివాడు. లేడీ డాక్టరు డి.అండ్. సి ఇండికేట్ చేసింది. రోగి ఆపరేషన్ కు నిరాకరించినట్లు కూడా రాసి ఉంది.
    "ఆపరేషను వద్దని ఎందుకన్నారు?"
    ఆమె జవాబు చెప్పకుండా మౌనం వహించింది.
    "ఇది చాలా చిన్న ఆపరేషను. అసలు ఆపరేషను కాదన్నా అతిశయోక్తి కాదు. ఇందులో మీరు భయపడాల్సిన అవసరమేముంది చెప్పండి?" అన్నాడు.
    పంతులమ్మ పొంగి వస్తున్న కన్నీటిని అపుకోటానికి వ్యర్ధ ప్రయత్నం చేస్తూ "మేము దిక్కులేని పక్షులం. నాకేమన్నా జరిగితే నా తమ్ముణ్ణి , చెల్లెల్ని ఎవరు చూస్తారు? నిరాదారులైన వారి గతేం కాను?" అన్నది చాలా ఆవేశంతో.
    "చదువుకున్నారు. మీరే ఇలా మాట్లాడితే ఎలా? ఇది చాలా నిరపాయకరమైన ఆపరేషను. ఈ ఆపరేషను వల్ల ఇంతవరకూ ఎవరికీ ఒక్క ప్రమాదం కూడా జరగలేదు. నా మాట నమ్మండి. కావాలంటే నేను దగ్గరుండి చేయిస్తాను. సరా?"
    పదినిమిషాల పాటు చెప్పగా చెప్పగా ఎలాగో ధైర్యం చేసుకొని "సరే" అన్నది పంతులమ్మ. అని వెంటనే ముఖానికి పైట కొంగు అడ్డు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆమెకు సర్దిచెప్పి ఒప్పించే సరికి రాజు తల ప్రాణం తోక కొచ్చింది. పంతులమ్మ చివరకు సరే కానివ్వండి. అన్నిటికీ ఆ యేసు ప్రభువే ఉన్నాడు" అన్నది.
    చిన్నావిడ పెద్ద భారమేదో తోలిగిపోయినట్లు నిట్టూర్చి రాజు వేపు కృతజ్ఞతా పూర్వకంగా చూసింది. రాజు కూడ గొప్ప ఘనకార్యాన్నేదో సాధించినట్లు తృప్తి పడ్డాడు.
    హాస్పిటల్లో సందె చీకట్లు అలుముకున్నాయి. లైట్లు వెలిగించారు. నర్సులు డ్యూటీ లు మారుతున్నారు. హౌస్ సర్జేన్లు సిరెంజీలు చేత బట్టుకుని వార్డు లో హడావిడి చెయ్యడం మొదలెట్టారు. రాజు ఆ వార్డు లో పనిచేస్తున్న ఇద్దరు ముగ్గురు హౌస్ సర్జేన్ల తో వీరు నాకు తెలిసినవారు, కాస్త ఇంటరెస్ట్ తీసుకొని చూడండి." అని చెప్పాడు. వాడు రోగి వైపూ, పక్క నున్న చిన్నావిడ వేపు చూసి, సాభిప్రాయంగా నవ్వుతూ 'అలాగే అన్నారు.
    "సరే నేనిక వెళ్తాను. రేపు లేడీ డాక్టర్ తో చెప్పి ఆపరేషన్ కు ఏర్పాటు చేస్తాను. ఆవిడ మా బంధువే. ఈలోపల మీరు కంగారు పడి అందర్నీ కంగారు పెట్టకండి."
    పంతులమ్మ సిగ్గుపడుతూ "లేదులెండి" అన్నది.
    ఖాళీ టిఫిన్ కారియర్ తీసుకుని చిన్నావిడ కూడా బయలుదేరింది. ఇద్దరూ మౌనంగా నడవ సాగారు. సుదీర్ఘమైన ఆ హాస్పిటల్ వరండాల్లో వెలుగు చీకట్లను దాటుకుంటూ బయట పడేసరికి డిసెంబరు నెల చలి వణుకు పుట్టించ సాగింది. బజారంతా జనాకీర్ణమై కోలాహలంగా వుంది. రిక్షాలు, కార్లూ, మనుష్యులు ఎడతెరిపి లేకుండా అటూ ఇటూ పోతున్నారు. రాజు ఇన్నాళ్ళూ ఎవరినైతే కలుసుకోటానికి ఉవ్విళ్ళూరాడో ఆ అమ్మాయితో ఏమి మాట్లాడాలో అని ఆలోచిస్తున్నాడు. చివరకు ఆ యువతే నిశ్శబ్దాన్ని భంగ పరుస్తూ "మీ మేలేన్నటికి మర్చిపోలేను. చాలా థాంక్స్" అన్నది.
    రాజు కొంచెం లజ్జితుడై "నన్నంతగా పొగడనక్కర్లేదు. ఇందులో నేను చేసిన ఘనకార్య మేమున్నదని?' అన్నాడు.
    "అలా అనకండి. ఈరోజు మీరు ఆపద్భాందవుడి లా వచ్చి నచ్చ జెప్పకపొతే అక్కయ్య ఈ ఆపరేషన్ కు ఒప్పుకునేది కాదు. మీకు తెలియదు గాని అక్కయ్య క్షేమంగా బయటపడాలని మేమంతగా  కోరుకొంటూన్నామో ఆ భగవంతునికే  తెలియాలి."    
    ఆరోజు మాటిమాటికి పొగడ్తలు వినవలసి రావటం రాజుకు కొంచెం ఇబ్బంది గానే ఉంది -- అందులోనూ ఆడవాళ్ళ నోటంట ! ఇద్దరూ కబుర్ల లోకి దిగారు. మామూలు విషయాలు-- కాలేజీలు చదువులూ, మెయిన్ గేటు వద్ద నిలబడి అలా చాలాసేపు మాట్లాడుకుంటూ వుండి పోయారు. తెలిసిన డాక్టర్లు, నర్సు లూ చాలా మంది, కొందరు వాళ్ళిద్దర్నీ చూసి కూడా చూడనట్లు వెళ్ళిపోయారు. కొందరు మర్యాద కోసం "హల్లో" అనేసి వెళ్ళిపోతున్నారు. ఒక గడుగ్గాయి నర్సు మాత్రం నిలబడి "గుడ్ ఈవెనింగ్ డాక్టర్" అని అదోలా అనేసి మరీ వెళ్ళిపోయింది. రాజుకు ఇక ఆ అమ్మాయితో మాట్లాడుతూ అక్కడ నిలబడటం మంచి పనిగా తోచలేదు. హాస్పిటలు వాతావరణం లో అపోహలు అవలీలగా పుట్టి ఆనతి కాలంలోనే కాయలూ పిందేలూ వేస్తాయి. కాసేపు మనసులోనే తర్జన భర్జన లు చేసుకోన్నాక "నేను ఆపి లాండ్స్ వెళ్ళాలి. మీరెటు వేపు వెళ్తారో చెప్పండి రిక్షా పిలుస్తాను." అన్నాడు.
    ఆవిడ అంగీకార సూచకంగా తల ఊపి "మా ఇల్లు హార్బరు కెళ్ళే దోవలో ఉంది. మీరొకసారి తప్పక రావాలి" అన్నది.
    "దానికేం లెండి. అలాగే వస్తాను." అంటూ ఖాళీ రిక్షా కోసం అటూ ఇటూ చూడసాగాడు. కొంచెం సేపటికి రిక్షా వచ్చింది. ఆ అమ్మాయి ఎక్కి కూర్చుని, పాదాల వద్ద చీరే కుచ్చెళ్ల ను సరి జేసుకుంటూ . మార్ధవమైన స్వరంతో "మేము పేదవాళ్ళం. ఇచ్చిన వాగ్దానం మాత్రం మరువ కండెం?" అన్నది.
    "అలాగే, కాని...... ఇంతవరకు మీ పేరు చెప్పనే లేదు" అన్నాడు.
    రిక్షా కదిలింది. ఆ యువతి ముఖం చాటుచేసుకొని నవ్వుకొంటూ "పేరులో ఏముంది లెండి? మనిషిని తెలుసుకొన్నారు కదా? చాలు" అన్నది. అతడు సమాధానం చెప్పే లోపలే రిక్షా దూరమైపోయింది. స్తబ్ధుడై నిలబడి పోయిన రాజుకు, ఆ అమ్మాయి వెనుక పరదా తొలిగించి తనకేసి చూస్తూ చేయ్యూపటం కనుపించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS