Previous Page Next Page 
నయనతార పేజి 3

 

    పిక్చరు ఎప్పుడయిందో , జాతీయగీతం వినిపిస్తోంటే ఆలోచనలనించి, లేచి నిల్చున్నాడు సారధి. లైట్లు వెలిగాయి. "రా, వెడదాం." అంది తార సారధి వంక తిరిగి .
    "మీతో రమ్మంటారా?......"
    "ఏం ఏమన్నా పనుందా?"
    "అబ్బే లేదు, రాత్రి అయిందిగా, రేపో ఎప్పుడో వస్తా."
    "రాత్రి అయితేనేం. నేను డ్రాప్ చేస్తా మళ్ళీ. ఇంటి కెళ్ళి మాట్లాడుకుందాం. ఇన్నాళ్లయింది కలుసుకున్నాం."
    క్రింద బెంచి లెక్కి తమ అభిమాన తారని మరోసారి చూడాలని ఆరాటపడిపోతున్నారు జనం. నయినతారనే చూస్తూ జనం అంతా నిల్చున్నారు. కొంతమంది స్టూడెంట్లు నయనతారని చుట్టుముట్టారు. మేనేజరు దారి చూపిస్తుండగా గుంపుని తప్పించుకుంటూ క్రిందికి వెళ్ళింది. క్రింద, అందరూ వెళ్ళిపోకుండా తమ అభిమాన నటిని మరోసారి దగ్గిరనించి చూడాలన్న ఆరాటంతో నిలబడ్డారు. బ్యాట పోలీసులు గుంపుని అదిలిస్తుంటే అందరికీ చిరునవ్వుతో నమస్కారం చేస్తూ కారులో కూర్చుంది తార. ఆమె వెంట కారెక్కి ఆమెతో వెనుక సీటులో కూర్చున్న సారధిని అంతా అదృష్టవంతుడన్నట్లు అసూయగా చూశారు. పెద్ద కారు పాములా మెత్తగా కదిలింది.  
    "ఊ, ఏమిటి ఇంకా ఆశ్చర్యంగా వుందేమిటి. నేను సుందరినా అని ఇంకా నమ్మబుద్ది కావడం లేదా ఏమిటి" అంది తార.
     "నిజంగానే నమ్మలేకపోతున్నాను, ఎక్కడి సుందరి- ఎక్కడి మీరు."
    "మీరు , అంటూ కొత్తగా మాట్లాడుతున్నావేమిటి, నేను అందరికి నయనతారని కాని నీకు పాత సుందరినే." చనువుగా అంది సుందరి.
    ఆ మాటకి చాలా ఆనందం కల్గింది సారధికి. ఆనందంగా "నిజంగా ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను సుందరీ. ఎన్ని సినిమాలలో చూశాను గాని నీవన్న అనుమానమే రాలేదు సుమా. అవును సరాసరి తారా పధంకి ఎలా వెళ్లిపోయావు?" కుతూహలంగా అడిగాడు.
    నయనతార కారు సీటుకి జారగిలబడి అదోలా నిట్టురుస్తూ "సరాసరి వెళ్ళానా? లేదు , త్రోవలో ఎన్నో నిచ్చెనలు, పాములు దాటుకుంటూ వెళ్ళి చేరాను. పరమపదసోపాన పటంలో మాదిరి. ఈనాడు ఈ స్థానంలో వుండడానికి ముందు నేనేం కష్టాలు పడ్డానో, ఏ ఇక్కట్లు దాటానో అదంతా పెద్ద కధలే. సరే మరిచిపోయిన కష్టాలని యిప్పుడెందుకు గుర్తుతెచ్చుకోవటం . అది సరే నీ గురించి చెప్పు, ఇప్పుడెం చేస్తున్నావు, ఏం ఉద్యోగం, పెళ్ళయిందా , పిల్లలా."
    "ఉండుండు, అన్ని ప్రశ్నలా ఒకసారేనా. ఇక్కడ ఓ కంపెనీలో ఎకౌంటెంట్ గా ఉంటున్నాను. పెళ్ళి గాలేదు. గనుక పిల్లలు ప్రసక్తి లేదు." నవ్వాడు సారధి.  
    "పెళ్ళీ కాలేదు! ఇంకా చేసుకోలేదూ." తార గొంతులో ఆశ్చర్యంతో పాటు అదో రకం అనందం లాంటిది ధ్వనించింది.
    "లేదు, ఏదీ ఉద్యోగంలో చేరి మూడేళ్ళయింది. నాలుగు డబ్బులు వెనకేసుకోకుండా ఇప్పటి నుంచి చేసుకుని ఏం సుఖపడాలి. అది సరే , మరి నీ సంగతి."
    "ఏమిటా సిల్లీ ప్రశ్నలు? ప్రఖ్యాత సినీతార నయనతార పెళ్ళయితే నీలాంటి వాళ్లకి తెలియ చెప్పవా ప్రతికలు" నవ్వుతూ అంది తార.
    నిజమే! అనుకున్నాడు సారధి మాటలలో కారు ఏఏరోడ్లు తిరిగి ఇల్లు చేరుకుందో కూడా గుర్తించలేదు సారధి. గేటు దగ్గిర కారాగాక అప్పుడు చూశాడు. గూర్ఖా సలాం చేసి గేటు తెరిచాడు. కారు రయ్ మని దూసుకుని వెళ్ళి పోర్టికోలో ఆగింది. బంగాళా అంతా కాంతులీనుతోంది. కారాగడంతోనే లోపల్నుంచి నాలుగు బొచ్చు కుక్కలు తోకాడించుకుంటూ వచ్చి తార మీదికి ఎగబాకాయి. "హలో రీటా, జానీ, టైగర్, వుస్సీ." అంటూ మీద పడుతున్న కుక్కలన్నింటినీ దగ్గిరకు తీసుకుని దువ్వింది. "నౌ ...... గో....ఐసే ." అంది తార వాటితో. అవన్నీ బుద్దిగా తార దగ్గిర నుంచి తోకాడించుకుంటూ వెళ్ళిపోయాయి. బంగాళా చుట్టుతా గుండ్రని వరండా వుంది. నున్నటి స్తంభాలు, పూలకుండీలు, వరండాలో రెండు ఫేము కుర్చీల సెట్లు. అన్నీ చూస్తున్న సారధిని "రా లోపలికి" అంటూ దారితీసింద తార. అడుగు పెడుతుండగానే ముందు పెద్ద హాలు వుంది.  హాలులో ఓ పక్క మేడమీదికి వెళ్ళడానికీ అందమైన కర్ర మెడ మెట్లు వున్నాయి.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS