Previous Page Next Page 
నయనతార పేజి 2

 

    సారధి వులిక్కిపడ్డాడు. వళ్ళు ఝల్లుమంది బిట్టరపోతూ చూశాడు.
    "మీరు ....మీరు తెలియకపోవడం ఏమిటి? .......ప్రసిద్ద సినీ నటి నయనతారగాదూ?" అన్నాడు నోరు పెగుల్చుకొని కాసేపటికి .
    "అది సరే ........నన్నిమ్కా గుర్తుంచలేదన్నమాట..... యీ సుందరి జ్ఞాపకం లేదన్నమాట " నెమ్మదిగా అంది.
    సుందరి! ....సుందరి! "సుందరివా నీవు ?" చటుక్కున గుర్తువచ్చి సంతోషంగా అరిచినంత పని చేశాడు సారధి.
    "ష్, నెమ్మది ......పోనీ యిప్పటికన్నా గుర్తు వచ్చాను....... వచ్చిందగ్గిరినించి చూస్తున్నాను గుర్తుస్తావేమోనని " చెవిలో గుసగుసలాడింది.
    సారధి ఏదో చెప్పబోయాడు......." తరువాత మాట్లాడుకుందాం, అంతా యిటే చూస్తున్నారు.... సినిమా అయ్యాక ఇంటి కేడదాం-- వెళ్ళిపోకు " అంటూ తెరవైపు తిరిగి సినిమా చూడడంలో నిమగ్మమైంది తార.
    సారధి యింక సినిమా చూడలేకపోయాడు. మనసు ఆరేళ్ళ వెనక్కి పరిగెత్తింది.
    సుందరి ! ....... ప్రఖ్యాత సినీతార నయనతార! గుమాస్తా కూతురు , ఏడుగురు పిల్లల మధ్య నాలుగో ఆడపిల్లగా రెండొందల జీతం మధ్య దరిద్రంలో పెరిగిన సుందరి యినాడు లక్షలకదికారిణి? నల్లటి నలుపు వల్ల పెళ్ళికి నోచుకోని సుందరి అందాన్ని యినాడు లక్షల మంది అరాదిస్తున్నారా? సుందరిట, సుందరి అంటూ హేళనగా నవ్వే అందరూ --- యీనాడు ఆ సుందరి గ్లామరస్ తార, అందాల తార అంటూ పొగుడుతుంటే నయనతార -- ఆ సుందరా!
    తండ్రి పెళ్లి చెయ్యలేక మూడో పెళ్ళి ముసలి మొగుడిని నిర్ణయిస్తే యింట్లో ఏడ్చి మొత్తుకుని చస్తానని బెదిరించినా పెళ్ళికి తప్పించుకోలేని సుందరి -- తెల్లారితే పెళ్లనగా అర్ధరాత్రి తన గది దగ్గరికి వచ్చి తనని పెళ్ళి చేసుకోమని కన్నీళ్ళతో ప్రార్ధించితే. చదువే ఓ కొలిక్కి రాని తన నిస్సహాయత, చండశాసనుడైన తండ్రిని ఎదిరించలేని పిరికితనమే గాక చూస్తూ చూస్తూ ఓ లేనింటి నల్లని పిల్లని పెళ్లాడగలిగే సంస్కారం, సహృదయత లోపించిన తనని, తన పిరికితనాన్ని , తన మౌనాన్ని ఓ తిరస్కారపు చూపు విసిరి విసవిస వెళ్ళిపోయి, తెల్లారేసరికి యింటిలోంచి మాయమయిన ఆ సుందరి.... యీనాడు ఆరేళ్ళ తర్వాత ప్రఖ్యాత సినీతారాగా తేలిందా? మింగుడు పడని ఆ నిజాన్ని మింగలేక పోతున్నాడు సారధి.
    తల తిప్పి చూశాడు. తార తన్మయతతో తనని తాను తెరమీద చూసుకుంటుంది నల్లటి సుందరి. సినిమాలో అంత అందంగా కనిపించే సుందరిని అందుకే యిన్నాళ్ళూ గుర్తించలేకపోయాడు, మేకప్ కి, ఫోటోగ్రఫీకి, మనిషిని యింతగా మార్చే శక్తి వుందని అతనికేం తెలుసు. ఆ మొహం  తెరమీద చూసుంటే ఎక్కడో చూసినట్టు అనిపించినా, సుందరే అనుకోలేకపోయాడు. ఇందాక సుందరిని చూసిందగ్గరనించి ఆ కళ్ళు ఆ నవ్వు ఎక్కడో ఎప్పుడో ఎరిగినట్లనిపించింది.
    సుందరి ఇదివరకు కంటే వళ్ళు చేసింది. డబ్బు తెచ్చిపెట్టే ఆరోగ్యంతో మిసమిసలాడుతూ , కాస్త నలుపు విరిగినట్టనిపించింది. లేత ఆకుపచ్చ షిఫాన్ చీర మీద గులాబీల ప్రింటు వున్న చీర కొద్దిపాటి మేకప్, అందంగా ఫేషన్ గా చుట్టిన ముడితో వున్న నయనతారకి -- వెలిసిపోయిన పాత వాయిల్ చీర, మెడ మీద జిడ్దోడుతున్న జాకట్టు , గట్టిగా బిగించి వేసిన జ్జాడ, జిడ్డు మొహం , అసలే నలుపు మొహం మీద, ఆ పెద్ద పెద్ద కళ్ళకి పాముకున్న నల్లటి కాటుక, ఇంటిలో చాకిరి, పోషణ లేక, మనసులో దిగుళ్ళతో, ఎండిపోయినట్లుండే ఆ సుందరికీ ఎంత వ్యత్యాసం. ఆహా\
, డబ్బు మహత్యం! అనుకున్నాడు సారధి.
    సుందరి అనాకారి, అనామిక యింత ప్రసిద్ద నటి ఎలా కాగలిగింది. ఏఏ ఇబ్బందులు పడింది? ఏఏ ముళ్ళ కంచెల్ని దాటగలిగింది? ఏఏ త్యాగాలు చేసింది?


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS