Previous Page Next Page 
దాశరథి రంగాచార్య రచనలు -7 పేజి 3


    "ఏమి? ఏమైంది?" షాహిద్ బెదిరినట్లయి చేతితో జుట్టు సవరించుకున్నాడు.
    "ఏం చెప్పమంటావ్ - వద్దంటుంటే అమ్మాయిలంతా నన్ను యూనియన్ కు ప్రెసిడెంటును చేశారు. ఇప్పుడేమో ఎవరో మంత్రిగారు వస్తారట ప్రారంభోత్సవానికి, వారికేమో ఎడ్రస్ రాసి సమర్పించాలి. నిజం నాకు చాలా భయంగా ఉంది. ఎలా రాస్తారో ఎడ్రస్ మంత్రులకు!"
    "సరే ఎడ్రస్ రాసిస్తాను కాని ఒక్క షరతు." షాహిద్ చిరునవ్వులో కొంటెదనం కనిపించింది.
    'నిజం!' అని గంతేసింది. సురయా షాహిద్ భుజానికి తాకింది. (సలీమ్ ఏమంటుందంటే రాత్రింబవళ్ళు కూర్చొని వెధవ వ్యాసాలూ రాయడం ప్రయోజనం కాదు. నీకోసం మరొకరు కవిత రాయడంలో స్వారస్యం ఉందని)
    "ఇప్పుడిహ షరతులు గిరతులు పెట్టకు. ఎల్లుండి నాకు ఎడ్రస్ కావాలి."
    "ముందు మీ ఫంక్షన్ కు ఆహ్వానం పంపండి. తరవాత జమాల్ తో పరిచయం చేయిస్తానని వాగ్దానం చేయండి."
    అయితే ఈ వెధవకూడా 'మీరు' అనడం మానడం లేదు. దౌర్భాగ్యుడు.
    మరుసటిరోజు కాలేజీకి వెళ్లింది. జమాల్ సుందర సుకుమార హస్తం తన గుండెలమీద పెట్టుకుంది. తన దగ్గరి మిత్రుల్ని తోటలోకి లాక్కెళ్ళింది. అక్కడ సిగ్గుతో వంకర తిరిగిపోయి, షాహిద్ కొంటెదనాన్ని గురించి, నిన్నటి అసభ్య ప్రవర్తనను గురించి వివరించింది. అజీమ్ అక్క ఆహ్వానం మీద రేపటి సభకు వస్తున్నాడు - ఎందుకు? అచ్చంగా తనను చూట్టానికి.
    వెళ్ళేప్పుడు అతిప్రేమగా జమాల్ చేయి పట్టుకుంది. "జమాల్! నిజం నువ్వే అతిథులను ఆహ్వానించాలి. ఒట్టు నేను స్టేజి మీదికి రాలేను. ఏమోనబ్బా నాకు భయంగా ఉంది. సిగ్గేస్తూంది ఈ వార్త కాలేజీలో వ్యాపిస్తుందేమోనని."
    షాహిద్ సభకు వచ్చాడు. అతిథుల మధ్య సోఫాలో కూర్చున్నాడు. వెనక సీట్లలో కూర్చున్న అమ్మాయిల్లో గుసగుసలు బయల్దేరాయి, సురయా అంటే షాహిద్ పడి చస్తాడని.
    సురయా స్టేజిమీద ఉదయించి, బహు పసందయిన ఎడ్రస్ చదివింది. అందరూ నివ్వెరపోయారు. మాటకు తప్పు తీసే ఖమర్ హుసేన్ సహితం మెచ్చుకున్నాడంటే అమ్మాయిల సంగతి అడుగనేల? సురయా తన సాయం ఆర్థించక ఏ రచయిత ప్రాపకం సంపాదించి ఉంటుందని అజీమ్ అక్క ఆలోచనలో పడిపోయింది. అంతకుముందు అజీమ్ అక్క ఒకే అడ్రస్ అందరిచేత చదివించేది. అది ఎక్కడిదంటే ఆమె ప్రెసిడెంటు అయినప్పుడు ఖమర్ హుసేన్ రాసిచ్చింది - పేర్లుమాత్రం మారేవి అంతే.
    షాహిద్ సురయా గుండెలో గూడు కట్టుకున్నాడని అమ్మాయిలంతా ఏకగ్రీవాభిప్రాయానికి వచ్చారు. అందుకే స్టేజిమీద ఉన్న సురయాను నిక్కి నిక్కి చూస్తున్నాడని అనుకున్నారు.
    సురయా మైక్ ముందునుంచి జరగ్గానే షాహిద్ పక్కనున్న అజీమ్ అక్కతో ;దీన్నంటారు మంత్రముగ్ధరచన' అని అన్నాడు.
    'ఎంతైనా నా శిష్యురాలు!' అజీమ్ అక్క ధ్వనిలో అట్టడుగున దాగిన కావేషం కనిపించింది. ఆ మాటకు అజీమ్ తోపాటు షాహిద్ కూడా పెద్దగా నవ్వాడు. వారి నవ్వు విని అంతా వారివేపు చూశారు. తరవాత డ్రామాలవంతు వచ్చింది. తీర్చిదిద్దిన కొండపల్లి బొమ్మలా జమాల్ స్టేజిమీద అవతరించింది. షాహిద్ ఆమెను చూచాడు. తన్నుతాను మరచాడు. పారాకులో అతని సిగరెట్టు అజీమ్ చంపకు తగిలింది. ఆమె చుర్రున లేచింది. 'ఇందుకే మిమ్మల్ని అమ్మాయిల కాలేజీకి పిలవంది. హద్దూపద్దూ ఎరగరు.'
    'క్షమించండి. నిజంగానే మాకు హద్దులేదు' అని చేతులు నలుపుకున్నాడు. తరువాత ఆమె మీదికి వంగి 'మీరు సంధాన విద్యావేత్తలని విన్నాను' గుసగుసలాడారు.
    'హుష్... ఊరుకో అజీమ్ డ్రామాలో మునిగి ఉంది.
    'వీల్లేదు. జమాల్ తో కలుపుతానని వాగ్దానం చేయండి. కాకుంటే ఇక్కడే అందరిముందు అల్లరిచేస్తా' పిల్లల్లా మంకు పట్టాడు.
    "నాకేమీ తెలీదు బాబూ, సురయా వల్ల పట్టుకో" అని చేయి వదిలించుకుంది. సంధాన విద్యలో సురయా ఆమెకు నిజమైన శిష్యురాలిగా నిరూపితం అవుతూంది.
    డ్రామా ఏం బావుండలేదు. జమాల్ హీరోయిన్ పాత్ర నిర్వహించలేకపోయింది. రొమాంటిక్ సీన్ వస్తే సంభాషణలు మరచి వణికిపోయింది. కాటుక మీసాలు పెట్టుకున్న సురయా చూచి, వాస్తవంగా వరుడు వచ్చి చేతికి ఉంగరం పెడ్తున్నట్లు కుంచించుకు పోయింది.
    సారాబాయి వగైరాలు గ్రీన్ రూమ్ లో జమాల్ నటనను గురించి విసుక్కుంటున్నప్పుడు మైక్ ద్వారా ఒక ప్రకటన వెలువడింది. నవాబ్ రహమతలీగారి కూతురు జమాల్ అత్యద్భుత నటనకు గాను షాహిద్ రోమానీ బహుమానం ప్రకటించారు. హాలు మరొకసారి కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనించింది. ఇద్దరే ఇద్దరు మిన్నకున్నారు. గోడవైపు ముఖంపెట్టి నవ్వుతున్న జమాల్ ఒకర్తె, చేతిలో వున్న ఎడ్రస్ కాపీ అంచులు చించిపారేస్తున్న సురయా రెండోది.
    తర్వాత చర్చల పోటీ. అజీమ్ అక్క జడ్జీగా స్టేజి ఎక్కింది.
    "చాలా కష్టపడ్డాను. సురయా ఉపన్యాసం కాస్త శ్రద్ధగా విను." వికార్ షాహిద్ చెవిలో చెబితే ఉలిక్కిపడ్డాడు. నమ్మలేనట్లు చూశాడు. సురయా స్టేజి మీద టిక్కుటిక్కుమని కులుకుతూ కదులుతూంది.
    వికార్ డ్రామాల్లో విలన్ వేషం వేసేవాడు. క్రికెట్ ఆడుతాడు. దారే వెళ్ళే అమ్మాయిలను చూచి ఈల వేస్తాడు. అమ్మాయిలకు అతడంటే అదురు. అందుకే షాహిద్ వంటి బుద్ధిమంతుల్లోకి అతని రాకలేదు. సురయా వికార్ పద్ధతిలో స్టేజిమీద పొగలు జిమ్మే ఉపన్యాసం ఇచ్చినప్పుడు పాపం, ఈ అమ్మాయికి కీర్తికండూతి మెండయింది అనుకున్నాడు షాహిద్.
    కాలేజి సాంతం చూస్తుండగా సురయా ట్రాఫీ గెలుచుకుంది. షాహిద్ చాలా ఉత్సాహంగా ఆమెతో కరచాలనం చేశాడు. చిన్నపిల్లల్లా సురయా కొంగు పట్టుకొని మిఠాయి ఇప్పించాలని మంకు పట్టాడు. సురయా ఒప్పుకోక తప్పలేదు.
    అతిథులను సాగనంపడానికి జమాల్ గేట్ దాకా వెళ్ళింది. ఆమె ముఖపు మేకప్ ఇంకా పూర్తిగా వదల్లేదు. గోరింటాకుతో చేతులు ఎర్రగా ఉన్నాయి. చమ్కీ ఉన్న ఓణీ కండవాలా భుజాలమీద కప్పుకుంది. ప్రతి అతిథివెంటా కారుదాకా వెళ్లి సవినయంగా "చాలా చాలా కృతజ్ఞతలు చాలా శ్రమ కల్గించాం" అంటూంది.
    యూనివర్శిటీ పిల్లలంతా "చాలా చాలా కృతజ్ఞతలు" అని గట్టిగా అరచి జమాల్ ను అనుసరించుతూ సాగిపోతున్నారు. అదే సమయంలో షాహిద్ ఒక నల్ల షేర్వాని మిత్రునితో అటుగా వెళ్తున్నాడు.
    "జమాల్ గారు! మిఠాయి తినడానికి మీ ఇంటికి ఎప్పుడు రమ్మంటారు?"
    "మా ఇంటికా?" జమాల్ కొండమీంచి దొర్లిపడిపోతున్నట్లనిపించింది. ఆమె కళ్ళల్లో మంటలు ఇమిసే తండ్రి కనిపించాడు. జమాల్ స్టేజి ఎక్కిందని వారికి తెలిస్తే వెంటనే తుప్పుపట్టిన తుపాకీ మరమ్మత్తు ప్రారంభిస్తాడు.
    "సురయా అక్కను అడగండీ" ఆమె ముడుచుకుపోయింది.
    "వీల్లేదు. మేం మిమ్మల్నే అడుగుతాం. మీరు గొప్పగా నటించారు. ఆ సమయంలో గాలిబ్ మహాకవి ఉంటే తన కవితకు వ్యాఖ్య చూసి పొంగిపోయేవాడు."
    "చాలా చాలా కృతజ్ఞతలు, చాలా శ్రమ కల్గించాం" అని తప్పుకుంది.
    "ఎవరా పిల్ల వెర్రిదానిలా ఉంది" అని అతని మిత్రుడు లాక్కుపోయాడు.
    "సురయా అన్నీ నేర్పుతుంది" అన్నాడు షాహిద్.
    పార్టీ సురయా ఇచ్చింది. కానీ తన ఇల్లు ఇరుకని సలీం ఇంటికి పిలిచింది. అంతమంది మగపిల్లల్ని ఇంటికెవరు రానిస్తారు? విన్న మాటల్నిబట్టే 'చలాకీ పిల్ల' అనే బిరుదం ఇచ్చేశారు. తండ్రి తిట్లు దాటి దెబ్బలదాకా వచ్చాడు. తల్లి, అక్కల ముందు అవమానించింది. అంతేకాదు, ఎవడో ఒక కసాయిని పిలిపించి 'నికా' చదివిస్తానని బెదిరించింది. చదువుకున్న పిల్లను నికా కట్టుకునే కసాయి ఉండడని గ్రహించి ధైర్యం తెచ్చుకుంది. ఏర్పాట్లలో మునిగిపోయింది.  
    ఈ విందు ఆమె సలీమ్ ఇంట్లో ఏర్పాటుచేసింది. సలీమ్ నాయబ్ జంగ్ గారి ఒకే ఒక ముద్దుల కూతురు. ఆమెకు క్షయ. పదేళ్ళనుంచీ కాలేజీకి వస్తుందంటే చదవడానికి కాదు విహారానికి. యూనివర్శిటీలో కాస్త పేరున్న విద్యార్థినల్లా విందులనీ, వినోదాలనీ సతాయించేది. సలీం అనుగ్రహం ఉంటే ఫస్ట్ డివిజన్ ఏమిటి తాసిల్దారీ కూడా చేతికి అందుతుందని కాలేజీలో చెప్పుకునేవారు. ఆమెకు మామలు, బాబాయిలు, అన్నలు అంతటా ఉండేవారు. ఫీజు మాఫీతో చదివే పిల్లలు ఆమె దయాధర్మాలకై పడిగాపులు కాసేవారు. ఎలుక ముఖమూ, లొడితెడు మనిషి అయినా సౌందర్య రాశిగా చిత్రించే కవిరాజులకు కరువు లేదు. అందువల్ల ఆమె కీర్తిచంద్రికలు యూనివర్శిటీని దాటి నగరంలోకీ వ్యాపించాయి. నగరంలోని సాహితీ రంగం ఆమెకు చేరువ అయింది. ఊరినుంచి వచ్చిన తల్లిచాటు పిల్లలు కూడా ఆమె శిక్షణతో నగరంలో పేరున్న రచయితలుగా ప్రఖ్యాతి గాంచారు. వీరంతా సృష్టిలో మహాకవులు అనిపించుకున్న సలీమ్ ను చూస్తే ఊరిలోని తల్లులను గుర్తుకు తెచ్చుకుంటారు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS