Previous Page Next Page 
మాయ జలతారు పేజి 3


    "ఎందుకులే బ్రదర్! 103 కాళీగా ఉంది"
    ఎత్తుమడమల బూట్లతో ఒక ఆంగ్లో ఇండియన్ యువతి గదిలోకి ప్రవేశిస్తూనే "సూరి వ" మాటమింగేసి "హలో సూరీ! అయామ్ సారీ! పదిహేను నిమిషాలు ఆలస్యం అయింది" అని వచ్చికూర్చుంది.
    "హల్లో డెయిజీ! నా రాణీ! ఎంత వెయిటింగ్, ఎంత వెయిటింగ్! పదిహేను నిమిషాలంటున్నావు పదిహేను ఏళ్లలా ఉంటేనూ? అహ, అహ! ఏం తయారై వచ్చావు డార్లింగ్! రంభలా ఉన్నావనుకో రాజారావు చూశాడంటే వెన్నలా కాదు కాదు మంచులా కరిగిపోతాడు కమాన్ మె హీరోయిన్ డెయిజీ!" అని చేయి అందుకొన్నాడు టకటకా సాగిపోయా రిద్దరూ లిఫ్టులో మూడో అంతస్తుకు.
    నూట మూడో నెంబరు గదిలోకి వెళ్ళి సోఫామీద పడిపోయింది డెయిజీ "ఐ యాం టైర్డు" అంటూ.
    "డెయిజీ! నా రాణీ! ఆ మాటే అనొద్దు వచ్చే వాడున్నాడు చూచావా సరికొత్త సరుకు వట్టి ముడి సరుకు కాంట్రాక్టులు చేసి లక్షలు గడిస్తున్నాడు సాధారణంగా కరిగే ఘటంకాదు, సూరి కరిగించేశాడనుకో పిక్చరు తీయడానికి అంగీకరించాడు మిగతా పని నీవు చేయాలి నెగ్గిందా నా రాణీ, నువ్వు హీరోయిన్, నేను డైరెక్టరు ఇగ చెపుతావూ?"
    "ఐ విల్ ట్రై" - చిరునవ్వు నవ్వింది డెయిజీ.
    "ట్రై అంటేకాదు మేడమ్, సాధించాలి వాడు వచ్చేవేళ అయింది, కిందికి వెళ్తా వట్టి ముడి సరుకు దింపాలి వస్తామరి" అని క్రిందకి వచ్చేశాడు సూరి.
    సూరి క్రిందికివచ్చి సోఫాలో కూర్చున్నాడు "వెధవముండ, ప్రాణం తోడేసింది. ఒప్పుకునేందుకు టెక్కు ఆ ముసలివాడు! ఇచ్చేదాకా వదల్లేదుగా అయినా పట్టేశాం చూస్తే కరిగిపోతాడు వెధవ ఒక్క పెగ్గు కొడ్తే మేలేమో? పన్నెండుకు మూడు నిమిషాలుందంటుంది నా వాచి అయిదు నిమిషాలుందంటుంది నయాగరా గడియారం  సొంత డబ్బెందుకూ ఖర్చుపెట్టడం? అయినా వెధవ హేవర్ద్సేమిటి ఈరోజు! వస్తాడుగా కొడ్దాం వాట్ 69 ఇంకా రాడేం వీడు? వీడు మోసగిస్తాడా? నయాగరా గడియారం 12 కొట్టింది చచ్చువెధవ, ఏ గుడుంబా కొడ్తున్నాడో? డబ్బుండగానే సరా? ఆనందించడం చెత్తకావాలి మరెవరైనా పట్టెయ్యలేదు కదా? ఏమో మరీ? సాయంకాలం కలిసి వస్తానన్నాడే?"
    బక్కపల్చగా పొడుగ్గా ఉన్న వ్యక్తి హోటల్లో ప్రవేశించాడు నాలుగువైపులా చూచాడు సూరి పరధ్యానంలో గుర్తించలేదు రాజారావు గుర్తించాడు "హల్లో సూరీ!" అని విష్ చేశాడు ఉలిక్కిపడ్డాడు సూర్యారావు "హల్లో మిస్టర్ రాజారావు! నాకు తెలుసు గడియారమన్నా తప్పు నడవవచ్చు - గాని మీరు టైమ్ తప్పరని పదండి పైకి వెళ్దాం" అని లేచాడు ఇద్దరూ నడక సాగించారు లిఫ్టువైపు.
    "వచ్చిందా?" అడిగాడు  రాజారావు.
    "ఈ సూర్యారావు రమ్మన్న తరువాత రాకపోవడం అంటూ ఉండదండీ రాజారావుగారూ! రంభా, ఊర్వశులు ఇంకా స్వర్గంలో ఉన్నారంటే ఈ సూర్యారావు అక్కడికి వెళ్ళలేక పోవడమే కారణం అయినా ఎంత సతాయించిందనుకున్నారు ఆవిడ అడుగుల కింద నోట్లు పరచడానికి సిద్దంగా ఉండే కోటీశ్వరులు కాపలా కాస్తుంటారు సినీమాలో హీరోయిన్ను చేస్తాననీ, అదీ ఇదీ చెప్పి తెచ్చాను ఇలా సినీమా మొదలుపెట్టి ఒక్క షాట్ తీశామనుకోండి, ఇంక డెయిజీ కుక్కలా మన చుట్టూ తిరుగుతుంది వెధవ లిఫ్టు చెడిపోయిందీ - పదండి మెట్లెక్కుదాం డెయిజీ అంటే మెరుపు మెరుపంటే మెరుపే ననుకోండి గులాబీరంగు సన్నని పెదవులు, చిన్న చుబుకం, పల్చని చెంపలూ, వ్రేలాడే జుట్టూ, అబ్బో చెప్పబాకండి నవ్విందంటే రత్నాలు రాలినట్లే"
    "ఎంతకు ఒప్పుకుంది?"
    "డబ్బు డబ్బు ఆడదాని విలువ కట్టగలమటండీ డబ్బుతో! ఉమర్ ఖయ్యాం చెప్పాడు - మదిరా, మధువు ఉంటే రాజ్యాలైనా వద్దని ఏదైనా కంట్రాక్టు చేసుకుందాం ఈ రాత్రికో వేయి పారెయ్యండి తరవాత విషయం ఆలోచింతాం"
    "వెయ్యే!"
    "వెయ్యంటే ఎంత? లక్షలో నూరో వంతు! ఇనప్పెట్టెల్లో ఏడుస్తుంది నయాగారాలో నవ్వుతుంది రేపు కంపెనీ రిజిష్టరు చేస్తున్నామా? కంట్రాక్టు చేసుకుందాం తరువాత ఫిలిం కోసరం ఇచ్చే డబ్బే మిగతాదంతా ఉల్ఫా కర్చంతా కంపెనీ పేర రాస్తాం, ఏమంటారు?"
    "బాగుంది కాస్త జాగ్రత్త లాస్ లేకుండా చూడండి"
    "ఈ సూర్యారావు ఉండగా నష్టమన్నది అడుగు పెట్టడానికి జంకుతుందండీ మీరే చూస్తారుగా అలా తెరమీద మీ పేరు వచ్చిందో - ఇక చూడండి మీరూ ప్రొడ్యూసర్లయిపోతారు మాదేమిటి, ఎప్పుడూ డైరెక్టర్లమేగా! ఆఁ అదిగో డెయిజీ ఎదురు చూస్తూంది"
    ఇద్దరూ గదిలో ప్రవేశించారు.
    లేచి నుంచొని తలవంచి "హల్లో మిస్టర్ రాజారావ్!" అని విష్ చేసింది డెయిజీ.
    స్ఫటికపు బొమ్మలా ఉండి, వంగి, వయ్యారంగా నమస్కరిస్తూ చిరునవ్వు నవ్విన డెయిజీని చూచి చకితుడైనాడు రాజారావు చూస్తూ ఉండిపోయాడు తనను తాను మరచిపోయాడు.
    "రాజారావుగారూ, డెయిజీ విష్ చేస్తూంది" అని డెయిజీకి కన్ను గిలిపాడు సూర్యారావు.
    తేరుకొని "అయామ్ సారీ! హల్లో మిస్ డెయిజీ!" అని ముందుకు అడుగు వేశాడు రాజారావు.
    చిరునవ్వు నవ్వి స్వాగతం పలికింది డెయిజీ చేయి చాచింది కరచాలనానికి.
    నవ్వులో కరిగిపోయాడు రాజారావు.
     చేయి అందుకుని హ్యాండ్ షేక్ చేశాడు మెత్తగా పూవులా ఉంది చేయి.
    "కమాన్, టేక్ యువర్ సీట్" అని తన ముందున్న సోఫా చూపించింది డెయిజీ.
    యాంత్రికంగా కూర్చున్నాడు రాజారావు సూరి పక్కనున్న మరో సోఫాలో కూర్చుంటూ బెల్లు నొక్కాడు బాయ్ వస్తే ఆర్డరిచ్చి, ఒకరిని ఒకరికి పరిచయం చేశాడు సూర్యారావు చాలా ఉత్సాహంగా ఉన్నాడు.
    "వీరు రాజారావుగారు నగరంలో పేరుమోసిన కాంట్రాక్టరు మనం నడిచే రోడ్లూ, తిరిగే పార్కులూ అన్నీ వీరు నిర్మించినవే లక్షలు ఆర్జించారు లక్షంటే నయాపైసలా భావిస్తారు దేహీ అన్నవాడికి కాదనలేరు ఈనాటికి చేతికి ఎముకలేదు ఎన్ని స్కూళ్ళు, ఎన్ని ఆస్పత్రులు కట్టించారో లెక్కలేదు సినీరంగంలో ప్రవేశించమని ఈ సూర్యారావు ప్రార్దించాడు అంతే, ఊఁ కానీ అన్నారు వీరు సినీరంగంలో ప్రవేశిస్తున్నారంటే ప్రొడ్యూసర్లందరి గుండె జల్లు మంటూంది యాడాది తిరక్కుండానే రాజారావుగారి పేరు యావద్భారతంలో మ్రోగిపోతుంది చూస్తుండు డెయిజీ!"
    రాజారావు ఉబ్బిపోయాడు.
    "రాజారావుగారూ! ఈమె మిస్ డెయిజీ ఈ నగరంలో అందం, ఆనందం ఇంకా ఉన్నాయంటే డెయిజీ ఉండబట్టే ఆ ఖులీ కుతుబ్ షాకు భాగమతి దొరికింది కాని అప్పుడే డెయిజీ ఉండిఉంటే ఇది అసలు డెయిజీ నగరం కావలసింది చిరునవ్వు నవ్విందంటీ వరాలు రాల్తాయి లక్షాధికారులు ఈవిడ ఇంటిముందు పడిగాపులు కాస్తుంటారు ఈవిడ తెరకెక్కిందంటే భారతదేశంలో ఉన్న హీరోయిన్లంతా సైనాయ్ డ్ వెతుక్కోవల్సిందే"
    కిలకిలా నవ్వేసింది డెయిజీ "మిస్టర్ సూరీ! చమత్కారంగా మాట్లాడ్తారండీ సినిమాస్టార్లకు సాయ్ నాయ్ డ్ పనిచేస్తుందా?" అన్నది.
    నవ్వులో మునిగిపోయాడు రాజారావు ఏదో చమత్కారమైన మాట అనాలని వెతుక్కున్నాడు "అయితే, హుసేన్ సాగర్ లో పడితేసరి" అనేశాడు.
    "పోలీసువారి ప్రాణాలు తీసేస్తారు జనం" అన్నది డెయిజీ, మళ్ళీ నవ్వడానికి ప్రయత్నిస్తూ.
    ఇంతలో బాయ్ గ్లాసులూ, సీసాలూ తెచ్చిపెట్టి వెళ్ళిపోయాడు.
    డెయిజీ గ్లాసులో సోడావేసి కలిపింది ముందు రాజారావుకు అందించిన తరువాత సూరికిచ్చింది 'ఛీర్స్' అని అంతా పుచ్చుకోఅవ్డం సాగించారు.
    "ఇంతకూ కథేమిటో చెప్పారుకారు తీయబోయే సినిమాకు కాబోయే డైరెక్టరు గారు" డెయిజీ అడిగింది తానొక సిగరెట్టు తీసుకొని, రాజారావుకు సిగరెట్టు అందిస్తూ అగ్గిపుల్ల గీసి రాజారావు సిగరెట్టుకు అంటించి తాను అంటించుకుంది.
    డెయిజీ ముఖం రాజారావు ముఖం దగ్గరికివస్తే రాజారావు రక్తం  వేగంగా  ప్రవహించింది డెయిజీ కళ్ళల్లోకి చూచాడు చిలిపిగా నవ్వాయి.
    "కధా! ఈనాటికి ఆంద్రదేశంలో అవతరించనంతటి ఉత్తమ కధ తీస్తాడు సూర్యారావు మన కధను చూచి హిందీ పిక్చర్లవాళ్ళేకాక ఇంగ్లీషు పిక్చర్ల వాళ్ళుకూడా పరేషాన్ అయిపోవాలి నగ్ననృత్యాలూ, కత్తియుద్దాలూ, నవ్వులూ, ఏడ్పులూ అబ్బో! అడక్కు డెయిజీ, పిక్చర్ చూశాడో - పిచ్చెత్తి పోవాల్సిందే"
    "అయితే, పిచ్చాసుపత్రులకు గిరాకీ తెస్తుందన్న మాట మన పిక్చరు!" అని రాజారావు నవ్వేశాడు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS