Previous Page Next Page 
సంపూర్ణ ప్రేమాయణం పేజి 2


    "నాకేం తెలుసు? స్టేషనులో అడగాలి" అన్నాడు అతను. ఈ లోపులో మరికొంతమంది జనం వచ్చి చేరారు. కంపార్ట్ మెంటు వరండా అంతా మనుష్యుల్తో నిండిపోయింది.

    "రైల్వే పోలీసులకి అప్పచెపుదామా?"

    "బుకింగ్ క్లర్క్ ని ముందు సస్పెండు చేస్తారు."

    టూటైరు కండక్టరు అతడివైపు తిరిగి, "గొడవెందుకు రావయ్యా- నీకో బెర్తు ఇస్తాను" అన్నాడు.

    "మరి ఆ విషయం ఆ స్టేషన్ లోనే చెప్పి వుంటే ఇంత గొడవ జరిగేది కాదు కదా?" అని ఆ యువకుడు జనంవైపు తిరిగి, "చూశారు కదా! ముందేమో కంప్లయింట్ ఇచ్చుకోమన్నారు. ఇక్కడ చైన్ లాగితే పోలీసులకు పట్టిస్తామన్నారు. ఇప్పుడు బెర్తు ఇస్తామంటున్నారు. ఇంత రిస్కు తీసుకుంటే తప్ప పన్లు జరగవన్నమాట" అంటూ లేచారు. జనం అతడిని అభినందిస్తున్నట్టు చూశారు.

    అతడితో ప్రవాహంలా కదిలారు.

    నిముషంలో కంపార్ట్ మెంటు ఖాళీ అయింది. వాన వెలిసినట్టు అయింది. ఆ తరువాత అయిదు నిముషాలకి ట్రైను కదిలింది.

    ప్రేమ తిరిగి పుస్తకం విప్పింది. అరవాయిన తలుపు వేస్తున్నాడు.

    రైలు వేగం పుంజుకుంది.


                                                             *    *    *    *


    "హాయ్ మీనా!"

    "హాయ్ ప్రేమా!" అంటూ కౌగిలించుకున్నంత పని చేసింది మీనా.

    "ఏమిటోయ్ - పూర్తిగా పెళ్ళికళ వచ్చేసింది" అంది ప్రేమ స్నేహితురాలివైపు పరిశీలనగా చూస్తూ.

    "సర్లే, దానికేంగానీ- నువ్వు రావేమోనని ఎంత భయపడ్డానో తెల్సా?"

    "రాకుండా ఎలా వుంటానే?"

    "మీ నాన్నగారు నిన్ను ఒంటరిగా పంపొద్దూ?"

    "ఒంటరిగా పంపలేదులే, ప్రతి స్టేషన్ లోనూ చూడటానికి ఒక నౌఖర్నీ - ఇక్కడ దిగ్గానే మూడు కార్లు వుండే ఏర్పాటునీ చేసేపంపారు" కోపంగా అంది ప్రేమ. "ముగ్గురు డ్రైవర్లు చుట్టుముట్టేసరికి ఎంత ఇరుకున పడ్డానో తెలుసా? ఇంకా పాలుతాగే పసిపాపనే అనుకుంటున్నారు నన్ను."

    "అలాంటి తండ్రి వున్నందుకు సంతోషించాలి!" లోపలికి తీసుకెళ్తూ అంది మీనా. "ఏది ఏమైనా నువ్వొచ్చావు. ఒక గంటసేపు మనం మాటాడేసుకోవాలి. తరువాత మళ్ళీ టైమ్ దొరుకుతుందో, లేదో" అంటూ ఒక చిన్న గది చూపించి, "ఇది నీ గురించే ప్రత్యేకంగా వుంచాను. అఫ్ కోర్స్ నీ బాత్ రూమ్ పాటి చెయ్యదనుకో. బీదవాళ్ళం కదా!" అని మాట పూర్తి చెయ్యకుండానే ప్రేమ చెవి మెలిపెట్టటంతో కెవ్వున అరిచినంత పని చేసింది.

    అతి కష్టంమీద వదిలించుకుని, "చూడు- చెవి ఎలా కందిపోయిందో?" అంది.

    "మీ ఆయనకి అనుమానం వస్తుందేమో రేపు రాత్రి?"

    "ఛీ."

    ప్రేమ నవ్వుకుంటూ స్నానానికి వెళ్ళింది. వేన్నీళ్ళ స్నానంతో ప్రయాణం బడలిక పోయి ఎంతో హాయిగా అనిపించింది.

    గదిలో మీనా ఎదురుచూస్తుంది. సూట్ కేస్ తెరిచి ప్రేమ పౌడరు డబ్బా తీసుకుంటూ, "ఒసేయ్! ఆ పెళ్ళిలో చదివింపులూ అవీ అందరి మధ్య నేనివ్వలేనుగానీ, ఇదిగో - ఈ చీరె బావుందా? నీ కోసమే తెచ్చాను" అంది తెల్లటి చీర చేతుల్లోకి తీసుకుంటూ.

    నిజంగా ఆ చీరె చాలా బావుంది. నీలపు బోర్డర్ తో నీలాకాశంలో తెల్లటి మేఘంలా. 

    మీనా మొహం మాత్రం ఎర్రబడింది. "ఈ ప్రజంటేషన్ల కోసమే నిన్ను పిల్చాననుకున్నావా?" అంది కోపంగా.

    ప్రేమ నవ్వేస్తూ, "దీన్నో పెద్ద టాపిక్ చెయ్యకు. ఇది తీసేసుకుంటే మనం మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు" అంది. మీనా ఒక క్షణం స్నేహితురాలి కళ్ళలోకి సూటిగా చూసి, తనూ నవ్వేస్తూ, "సరేలే, ఆ టాపిక్ వదిలిపెట్టు. నాకీ రోజు ఎంత సంతోషంగా వుందో తెలుసా?" అంది.

    "ఏమిటి పెళ్ళా?"

    "ఉహు-కాదు. ఈ పెళ్ళికి నువ్వు రావడం! అంతేకాదు, ఏ అరమరికలూ లేకుండా నువ్విక్కడ కలిసిపోవడం."

    "ఛా- అదేమిటే?"

    "ఔను ప్రేమా! నేనెన్ని ఆలోచించుకున్నానో తెలుసా? ముందు అసలు నువ్వు రావనుకున్నాను. లేకపోతే ఏదైనా పెద్ద హోటల్లో గది తీసుకుని ముహూర్తం టైంకి వస్తే బావుణ్ణు అన్న పాడు ఆలోచన కూడా వచ్చింది. నువ్విక్కడ ఇమడలేవని నాకు తెలుసు. నేను నీకు హాస్టల్లో స్నేహితురాలిని మాత్రమే. అసలు ఇలాంటి ఇళ్ళు వుంటాయని కూడా ఊహించలేని సంపన్న వర్గంలో పుట్టిన దానివి నువ్వు. నీకు తెలుసా? ఈ ఇంట్లో ఎనిమిదిమందిమి వుంటాం, ఈ చిన్న చిన్న గదులలో ఇరుక్కుని."

    ఎందుకో తెలియకుండా ప్రేమ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. "అలా మాట్లాడకే, ప్లీజ్! నాకేడుపొస్తుంది" అంది.

    మీనా తేరుకుని, "అవును- ఏం మాట్లాడుతున్నాన్నేను? ప్రేమా! ఇది బాధ కాదే, నువ్వొచ్చావనే సంతోషం. అంతే!" అంది నవ్వుతూ.

    ప్రేమ నవ్వలేదు. ఈ వాతావరణం గురించి నిజంగానే ఆమెకి తెలీదు. తండ్రి అలా పెంచాడు. ఈ ఆర్జు కూడా మీనా వాళ్ళ స్థితిగతులు తెలిసివుంటే కూతుర్ని ఇలా పంపించేవాడు కాదేమో!

    గుమాస్తా పనిచేసి మీనా తండ్రి రిటైర్డు అయి రెండు ఏళ్ళు కావస్తూంది. ఆరుగురు కూతుళ్ళాయనకి. మీనా నాలుగోది. అతి కష్టంమీద ఓ గ్రాడ్యుయేట్ ని తేగలిగాడు ఐదువేలు కట్నానికి. ఈ కట్నం సంగతి మీనాకు తెలీదు. పెళ్ళిపీటల మీద ఆ సంఘటన జరక్కపోయి వుంటే ఎప్పటికీ తెలిసేదే కాదు.

    ప్రేమ పెళ్ళికూతురి పక్కనే కూర్చుంది. ఎప్పుడూ అల్లరిచేసే మీనా అలా తల వంచుకుని కూర్చోవటం చాలా గమ్మత్తుగా వుంది. పెళ్ళి కొడుకు కొంచెం బింకంగా కూర్చున్నా, అప్పుడప్పుడు ఓరగా పెళ్ళికూతురివేపు చూస్తూ పట్టుబడిపోతున్నాడు.

    ఏదో సినిమాలోలా జరగలేదు ఆ సంఘటన. పెళ్ళికొడుకు తండ్రి పెద్దగా గర్జిస్తూ, "ఈ పెళ్ళి జరగడానికి వీలులేదు!" అని అరవలేదు. పెళ్ళికొడుకు దగ్గరకొచ్చి, "ఒరేయ్- లేవరా! పీటలమీద నుండి" అన్నాడు నెమ్మదిగా. ఈ మాటలు పెళ్ళికొడుక్కీ, మీనాకీ, పక్కనే కూర్చున్న ప్రేమకీ వినిపించినయ్.

    ఇద్దరూ స్థాణువులయ్యారు.

    పెళ్ళికొడుకు అర్ధంకానట్టు తండ్రివేపు చూసేడు.

    "ఏడువేలిస్తామని అయిదువేలే ఇస్తున్నార్రా! ఇదంతా మోసం. లే__పీటలమీద నుంచి."

    వింటున్న ప్రేమ మొహం అసహ్యం, జుగుప్సలతో నిండిపోయింది. అదృష్టవశాత్తు వీళ్ళమాటలు మంగళ వాయిద్యాల శబ్దంలో కలిసిపోతున్నాయ్! పెళ్ళికొడుకు మీనావైపు చూసి, తండ్రివేపు ఇబ్బందిగా చూసి, "ఏమిటి నాన్నా ఇదంతా- ఇంతవరకూ వచ్చాక?" అన్నాడు.

    'కొంతలో కొంత నయం-కనీసం పెళ్ళికొడుకైనా మంచివాడులాగా వున్నాడు' అనుకుంది ప్రేమ. మీనా కళ్ళు ఏ క్షణమైనా వర్షించటానికి సిద్ధంగా వున్నాయి. ప్రేమ చుట్టూ చూసింది. మీనా తండ్రి అక్కడ లేడు. పురోహితుడు మంగళసూత్రానికి పసుపు రాస్తున్నాడు.

    "ఒరేయ్! పెళ్ళికిముందే ఇంత మోసం చేసినవాళ్ళు ముందు ముందు ఇంకెంత జేస్తారో__లే"

    ప్రేమ ఆయన పక్కగా వెళ్ళి, "రెండువేల కోసం పీటల మీద పెళ్ళి ఆపుచేస్తారా? మీకు సిగ్గులేదూ?" అంది కోపంగా.

    ఆయన ప్రేమవైపూ, ఆమె ఖరీదైన బట్టలవేపూ ఎగాదిగా చూసి, "రెండువేలు నీకు తక్కువైతే అవ్వొచ్చునేమోగానీ మాకు మాత్రం ఎక్కువేనమ్మాయ్!" అన్నాడు.

    "మీరు కట్నం తీసుకుంటున్నారని పోలీసులకు రిపోర్ట్ ఇస్తాను" రోషంగా అన్నది.

    "అమ్మాయ్! నువ్వెవరివో నాకు తెలీదు. అనవసరంగా నవ్వులపాలు కాకు."

    ప్రేమ నిస్సహాయంగా మీనావేపు చూసింది. మీనా మొహంలో అయోమయం కొట్టిచ్చినట్టు కనబడుతూంది.

    పెళ్ళికొడుకు "నాన్నా!" అన్నాడు.

    "నువ్వూరుకోరా!" అని ప్రేమ వైపు తిరిగి, "అంత దగ్గిర దానివైతే నువ్వు ఇవ్వకూడదా ఆ మిగతా రెండువేలూ" అన్నాడు వ్యంగ్యంగా.

    ప్రేమ చివుక్కున లేచి, "తప్పకుండా" అని. "నాతో రండి" అని తనకిచ్చిన గదివైపు నడిచింది. ఎవరి గొడవలో వాళ్ళుండి దీన్ని పట్టించుకోలేదు. పెళ్ళికొడుకుతో, "ఒరేయ్! నేను చెప్పేవరకూ నువ్వు తొందర పడకు" అని ఆమెతోపాటే లోపలికి నడిచాడు తండ్రి.

    మీనా స్నేహితురాలివంక విస్మయంగా చూస్తూ ఉండిపోయింది.

    ప్రేమ చకచకా తన సూట్ కేస్ వద్దకు నడిచి అందులోంచి చెక్ బుక్ తీసి రెండువేలకి చెక్ వ్రాసి అందించింది.

    "ఏమిటమ్మాయ్ ఇది? చెక్కా! ఇంకా నయం. అప్పుడుగానీ పోలీసుకేసులో ఇరుక్కోను" అన్నాడాయన. ప్రేమ నిస్సహాయంగా పర్సు వెతికింది- అయిదొందలకన్నా ఎక్కువ లేవు.

    ముహూర్తం టైమ్ దగ్గిర పడుతూంది.

    ఏదో స్పురించినట్టు చప్పున మెళ్ళోంచి ముత్యాలదండ తీయబోయింది. దాని ఖరీదు ఎంత లేదన్నా రెండు వేలకన్నా ఎక్కువే చేస్తుంది. ఆమె హుక్ తీస్తూంటే,

    "స్నేహితురాలి మెళ్ళో మూడుముళ్ళూ వేయించటం కోసం మీ మెళ్ళో నెక్లెస్ తీస్తున్నారా?" అన్న మాటలు వినిపించాయి. ఆమె చివుక్కున తలతిప్పి చూసింది.

    రైల్లో టిక్కెట్ కలెక్టర్ తో దెబ్బలాడిన యువకుడు.

    అదే ఖాకీబట్టల్లో వున్నాడు.

    పెళ్ళికొడుకు తండ్రికూడా విస్తుబోయి అతడివైపు చూసేడు. ఆ యువకుడు నవ్వి, "నేనూ పెళ్ళికొడుకు తరపు వాడినే లెండి. అయితే రెండువేలకోసం ఇలా ఆడపిల్లల మెడల్లో నగలు వలచటం అంతగా ఇష్టపడనివాణ్ణి" అన్నాడు.

    "ఇంతకీ ఏం కావాలయ్యా నీకు?"

    "పాపం మీ అబ్బాయి మరీ ముచ్చట పడుతున్నాడు. ఆ మూడు ముళ్ళూ వేయించెయ్యరాదా?"

    "నా రెండువేలూ నా చేతిలో పడందే ఒక్క ముడి కూడా పడనివ్వను" అన్నాడు ఆయన. ప్రేమ ప్రేక్షకురాలిగా చూస్తోంది.

    "పాపం! తోటి పెళ్ళికొడుకు అలసిపోయి ఇక్కడొచ్చి పడుకున్నాడు" ముసుగుపెట్టి పడుకున్న చిన్న కుర్రాణ్ణి చూపిస్తూ అన్నాడు- "ఈ చిన్న పెళ్ళికొడుకు మీ తమ్ముడుగారి కొడుకు అనుకుంటాను?"

    "అవును. ఏం?"
   
    "మీరు మీ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, 'ఒరేయ్ నాన్నా! మన రెండువేలూ మనకి ముట్టలేదురా లే ఇక్కణ్ణుంచి' అని అనే లోపులో వీణ్ణి కసుక్కున పొడిచేసేననుకోండి. అప్పుడేమవుతుంది?"

    పెళ్ళికొడుకు తండ్రి అడుగు వెనక్కి వేసి, "ఏమిటి నువ్వు అంటున్నది?" అన్నాడు.  

    అతడు జేబులోంచి కత్తి తీశాడు. "ఇప్పటికే నాలుగు మర్డర్లు చేసేను. నాలుగు చేసినా అయిదు చేసినా ఒకటే శిక్ష. ఈ మర్డరువల్ల ఒక పెళ్ళి సవ్యంగా జరిగితే అంతకన్నా కావల్సింది ఏముంది?" అన్నాడు.

    ఆయన అడుగు వెనక్కి వేసి, "ఇది దారుణం. నిన్నూ.... నిన్నూ...." అన్నాడు.

    "పోలీసులకి తరువాత పట్టిద్దురుగాని, ముందు మీ అబ్బాయి దగ్గిర కెళ్ళి, 'రెండువేలూ ముట్టినయ్ రా నాన్నా! లేచి మంగళసూత్రం కట్టెయ్' అని చెప్పండి. లేకపోతే మీ తమ్ముడిగారబ్బాయి...." అని మిగతా మాటలు పూర్తి చేయలేదు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS