Previous Page Next Page 
రామాయణము పేజి 28

                   

                          సంశయ నివృత్తి
    సుగ్రీవుడు నగల మూటను అందించుచు "శ్రీరామచంద్రా ఇందలి ఆభరణములు నీ దేవేరివేమో చూచి చెప్పుము. మున్ను ఒకనాడిది మిన్ను నుండి వచ్చి మామధ్య పడినది" అన్నాడు. రామునకు జానకి జ్ఞప్తికి వచ్చి కన్నులు బాష్పములతో నిండినవి; "తమ్ముడా నీవు చూడుము" అన్నాడు. లక్ష్మణుడు మూటను విప్పుచూ "అన్నా నేను నిత్యము వదినెకు పాదాభివందనము చేసినపుడు ఆమె కాలి యందెలను మాత్రమే దర్శించ గలిగెడివాడను" అని మంజీరములను పైకి తీసినాడు. ఆ అందెల జతను రామునకు చూపుతూ "అన్నా ఇవి వదినెవె. సందేహము లేదు. ఈ ఆభరణములను నభము నుండి జారవిడిచిన సాధ్వి వైదేహియే" అన్నాడు. పిమ్మట రాముడును ఆ భూషణములు మైథిలివియే అని ఆనవాలు కట్టినాడు. ఆ తొడవులణు మూటగా కట్టుటకుపయోగించబడిన వస్త్రభాగము జానకి కొక కొంగులోనిదియె. సీత ఎక్కడనున్నదో ఎట్లున్నదోయని రాముడు విలపించసాగినాడు. సుగ్రీవుడు "శ్రీరామ చంద్రా ధైర్యమును కోల్పోకుము. నా అనుచరులగు వనచరులను భూమి నలుదెసలకును పంపి భూపుత్రి ఎచ్చట నున్నదో తెలిసికొని రమ్మని ఆజ్ఞాపించెదను. ఆమెను అపహరించిన అపరాధి ఎవ్వడో తెలిసికొని వానిని వధించుటలో నీకన్నివిధముల తోడ్పడెదను" అన్నాడు. రాముడు ఊరడిల్లినాడు. పిమ్మట అతడు సుగ్రీవునితో "కార్యమును సాధించుటలో ఆలస్యము తగదు. నిన్ను ఈ కొండకు తరిమి నీ భార్యను చెఱపట్టిన దుర్మార్గుడు వాలిని నేనిప్పుడే సంహరించి నీ దుఃఖమును శమించజేసెదను" అన్నాడు. సుగ్రీవుడు: 'సందేహించుచు' శ్రీరామచంద్రా నీవు అన్యధా తలంచనిచో నేను విన్నవించవలసిన దొకటి యున్నది.

    రాముడు: వానరోత్తమా మనము ఆప్తమిత్రులము కదా? సందేహించక వచించుము.
    సుగ్రీవుడు: నీ బలపరాక్రమములను గూర్చి వినుటయె కాని నేను చూడలేదు. వాలి పర్వతమంత పరిమాణము కల దుందుభి కళేబరమును కందుకము వలె తన్నగా అది యోజనము దూరమున కావల పడినది. నేను పోయి ఆ మహాబలునితో తలపడినచో నీవు నన్ను రక్షించగలవా యన్నది నా సంశయము.
    రాముడు: (మందహాసముతో) ఆ కళేబరమెచ్చటనున్నదో నాకు చూపుము.
    సుగ్రీవుడు రాముని మతంగ ముని ఆశ్రమ ప్రాంతమునకు కొనిపోయినాడు. లక్ష్మణుడును హనుమంతుడును అనుసరించినారు. సుగ్రీవుడు రామునకు దుందుభి అస్థిపంజరమును జూపినాడు. రాముడా యెముకల గూడును కాలిబొటనవేలితో మీటినాడు. హనుమంతుడెగిరిపోయి అది ఎంత దూరమున పడినదో తెలిసికొని వచ్చినాడు.
    హనుమంతుడు: ఆ అస్థిపంజరము రెండున్నర యోజనముల దూరమున పడినది.
    సుగ్రీవుడు: వాలి తన్నినది రక్తమాంసయుతమై అత్యంత భారవంతమైన కళేబరము. అస్థిపంజరము తేలిక కనుక దానిని ఎగురగొట్టుట సులభము కదా?
    లక్ష్మణుడు: వాలిని నిగ్రహించగలడన్న ధైర్యమును నీకు కలిగించుటకు శ్రీరామచంద్రుడేమి చేయవలెనో సూచించుము.
    సుగ్రీవుడు: అవిగో అటు చూడుడు. మహోన్నతములైన మద్దిచెట్లు ఏడు ఒకదాని పక్కనొకటి యున్నవి. వాలి అప్పుడప్పుడక్కడకు వచ్చి తన బాహుబలమును పరీక్షించుకొనుటకు లావు గల ఆ మ్రానులను పట్టుకొని ఆకులన్నియూ రాలిపడునట్లు కుదిపెడువాడు. శ్రీరామచంద్రా ఆ సాల సప్తకములో ఏయొక వృక్షమును పడగొట్టి చూపినను నాకు ధైర్యము కలుగును.
    రాముడు బాణమును వదిలినాడు. ఆ శరము అత్యంత రయమున పోయి ఒక్క వ్రుక్షమునే కాదు సప్తసాలములను పడగొట్టి సుగ్రీవునకు సంభ్రమాశ్చర్యములను కలిగించినది.
    సుగ్రీవుడు: (ఉత్సాహ సంతోషములతో) శ్రీరామచంద్రా నాకు సంశయ నివృత్తియైనది. రేపు కిష్కింధకు పోయి వాలితో తలపడెదను. నీ నిశిత సాయకమున వానిని సంహరించి నాకీ పర్వతమున ప్రవాసము అంతమగునట్లనుగ్రహించుము.
                                 *       *       *  
                             వాలి వధ


    రాముడు "అమ్ము శీఘ్రముగ సుగ్రీవుని వద్దకు చేర్చుము" అని హనుమంతుని కోరినాడు. హనుమంతుడు రామలక్ష్మణులను తన భుజములపై కూర్చుండపెట్టుకొని ఋశ్యమూకమునకు ఎగిరిపోయి సుగ్రీవుని సమక్షమున దింపినాడు.
    కిష్కింధ కోట ద్వారమున కెదురుగా కొంచెము దూరమున నిలువెత్తు పాషాణమొకటి కలదు. దాని మాటున రామలక్ష్మణులునూ హనుమంతుడునూ వేచియున్నారు. రాముడు ధనువున శరమును సంధించి వాలిపై ప్రయోగించుటకు సిద్ధముగ నున్నాడు.
    సుగ్రీవుడు కోట ప్రాంగణమున నిలిచి సింహనాదమును చేసి వాలిని బయటకు రప్పించినాడు. వాలి "నిన్ను ఋశ్యమూకము నుండి రప్పించుట యెట్లని ఇంతకాలము యోచించుచుండగా తుదకు నీవే మృత్యువును వరించి వచ్చినావు! నిన్నిప్పుడే యమసదనమునకు పంపెదను!" అనుచు తలపడినాడు.
    ఆదిలో సుగ్రీవుడు వాలితో ధైర్యముగనె పోరాడినాడు. దెబ్బకు దెబ్బను అందించి వాలికి ఆశ్చర్యమును కలిగించినాడు. పిమ్మట అట్లు చేయలేకపోయినాడు. వాలి దెబ్బలను నేర్పుగా తప్పించుకొనుట యందు మాత్రమె కృతార్ధుడైనాడు. మరికొన్ని నిముషములకు అదియూ అసాధ్యమై అధైర్యము కలుగసాగినది. రాముని బాణము రాలేదు. 'ఎందువలన?' సుగ్రీవుని ధైర్యము వీగిపోయినది. "నేనిక్కడ ఆగినచో వాలి తన ఉక్కు పిడికిళ్లతో నా ఎముకలను విరుగగొట్టి ప్రాణములను తీయును" సుగ్రీవుడు తన శక్తినంతనూ కూడగట్టుకొని ఋశ్యమూకమునకు ఎగిరిపోయి అందలి గుహను చొరబడి  చావును తప్పించుకున్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS