మౌనంగా వింటూ కూర్చుందే గాని గాయత్రి పెదవి కదపలేదు.
కారు దిగిన తరువాత "నీ గదిలోనే కాసేపు విశ్రాంతి తీసుకో. తలంటుకు ఏర్పాట్లు చేసి వర్ధనమ్మను పంపుతాను" అంటూ హాలులో ఉండిపోయింది సుమిత్ర. అమ్మగారు ఎప్పుడయితే వెళ్ళిపొమ్మని చెప్పారో రివ్వుమని మేడమీదికి పరుగు తీసింది గాయత్రి. ముందుగా తన గదికి వెళ్ళలేదు.
ఆమని గది వైపుకు పరుగుతీసింది.
ఆ గదికి వేసిన తాళం వెక్కిరిస్తూ కన్పించింది.
ఎక్కడకు వెళ్ళి ఉంటుందబ్బా! తాళంవేసి వెళ్ళిందంటే అమ్మగారికి చెప్పే వెళ్ళాలి. అమ్మగారు ఏవైనా బహుమతులు తీసుకురావటానికి పట్నం పంపించారేమో! బావురుమంది మనసు. చెల్లీ! రాగానే నిన్ను కౌగిలించుకుందామనుకున్నాను. క్షమాపణలు చెప్పుకుందామనుకున్నాను. ఎక్కడికి పోయావు?" అనుకుంది.
అంతా వెలితిగా అనిపించింది.
ఎన్నో ముచ్చట్లు చెబుదామనుకుంది.
మీ బావగారు కాఫీ కలిసి ఇస్తున్నప్పుడు కవ్వింపుగా చూచారు. మొక్కలకు పాదులు చేయించి నీళ్ళు పోయిస్తుంటే తాను కూడా గ్రాస్ కట్టర్ తీసుకుని సిద్ధమయిపోయారు. రాత్రి భోజనం పెడుతూ వుంటే కావాలనే చేయి నాకు తగిలించారే అని చెబ్దామనుకుంది. కాని ఆమని అందకుండా పోయింది.
ఎక్కడికీ పోతుంది? మరి కాస్సేపటికి రాదా?
తలంటుపోసుకుని కురిలార్చుకునే లోగా వచ్చేస్తుంది.
ఈ పూట వారికి కారియర్ ఫాంహౌస్ కి వెడుతుంది.
ఆమనితో కలిసి కూర్చుని దాని కబుర్లు వింటూ భోజనం చేసి కొన్ని యుగాలు అయినట్టుగా అనిపిస్తోంది. ఈ పూట అది వచ్చేవరకూ ఆగాలి.
ఇలా ఎన్నో ఆలోచిస్తూ తన గదిలోకి వచ్చింది గాయత్రి.
ఆయన తక్కువవాడేమీ కాదు. పైకి గంభీరంగా కనిపిస్తారు. ఏమీ తెలియని నంగనాచిలా మాటాడతారు. కాని కొంటెవారే!
అనుకుంటూ ముసి ముసి నవ్వులు నవ్వుకుంది.
మంచం మీద వాలిపోయి ఈ మూడు రోజుల అనుభవాలు నెమరు వేసుకుంది.
దిండు సవరించుకుని పైకి జరుగుదామని దాన్ని కదిలించగానే దిండు క్రింద ఓ కవర్ కన్పించింది. దాన్ని చేతులలోకి తీసుకుంది.
అక్కగారికి-ఆమని అని వ్రాసి ఉంది కవరుమీద!
దాన్ని వొణికే చేతులతో చింపింది.
సెంటువాసన గుబాళించే గులాబి రంగు కాగితం మీద ముత్యాల బారులు తీర్చినట్టుగా వున్న ఆమని ఉత్తరం అది!
దడదడ లాడుతున్న గుండెలతో గబగబా చదివింది గాయత్రి.
"అక్కగారూ! ఈ సమయానికి లేకుండా నేను వెళ్ళిపోయానని తిట్టిపోయకండి! ఈ రోజు మీకు అలంకారాలన్నీ నేనే చేద్దామనుకున్నాను.
తొలిరాత్రి! ఇది ఆడదాని జీవితంలో ఎంత మరుపురాని మధురరాత్రి? ఇల్లుదాటి వెళ్ళటం తెలియని ఒక అమాయకపు ఆడపిల్ల బ్రహ్మలా మరో ప్రాణిని పెంచి పోషించి తండ్రికి అప్పగిస్తుంది. ఆడదాని జీవితంలో మరో ప్రాణికి జన్మ ఇవ్వటం కన్నా గొప్ప అద్భుతం మరొకటి లేదు.
దానికి తొలి రాత్రి తొలి అడుగు.
సృష్టికి మరో సృష్టిని జోడించగల ఆడదాని అద్భుత అనుభవానికి ఈ తొలి రాత్రే కదా తొలి పిలుపు. ఇలాంటి సమయంలో నిన్ను అలంకరించి బావగారిని అల్లరిచేసి గదిలోకి నెట్టి తలుపులు వేసే హక్కు నాది.
ప్చ్! కాని ఏం చేస్తాం! అన్నీ మనం అనుకున్నలాగే జరగవు.
అనుకోనివి కూడా కొన్ని జరుగుతూ వుండటమే కదా జీవితం. నాకు ఉండి నీ ఆనందాన్ని పంచుకోవాలనే వుంది. కాని పరిస్థితులు అలా వచ్చాయి. నగరం వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పుడొస్తానో! ఈసారి వచ్చేసరికి నువ్వు నెలలు నిండిన ఇల్లాలుగా కన్పిస్తావా! తల్లిగా కన్పిస్తావా? అప్పుడు ఈ చెల్లిని గుర్తిస్తావా? ఎక్కడో చూచానమ్మాయ్ నిన్నూ.... అని రాగం తీస్తావా?
అవునే అక్కా! ఈ మాటల్లో విడ్డూరం ఏమీ లేదు.
కట్టుకున్న వాళ్ళతోనే! బాబు పుడితే ఎత్తుకునేందుకు మాకు అందిస్తావా? కందిపోతాడని దూరదూరంగా తీసుకుపోతావా?
అప్పటిదాకా బై! బైబై! ఉత్తరాలు వ్రాస్తూ ఉంటా!
బావగారు పాపం ఎగబడి తినే రకం కాదు.
నువ్వే బుజ్జగించి బ్రతిమాలి అన్నీ అడిగి తినిపించుకోవాలి.
వారికి నా శుభాకాంక్షలు చెప్పు" అని ఆమని ఉత్తరం ముగించింది.
అది చదివి బావురుమని ఏడ్చింది గాయత్రి.
దిండులో తలదూర్చి వెక్కి వెక్కి ఏడ్చింది. పక్కలు ఎగిరి పడ్డాయి. ముఖం కందగడ్డలా అయిపోయింది. అయినా దుఃఖం ఆగలేదు.
చెల్లీ! ఎంత క్రూరంగా వెళ్ళిపోయావు. ఈ ప్రపంచంలో నా మనసు లోపలి పొరల్లోని ఆనందాన్ని పంచుకునే వాళ్ళు నువ్వు తప్ప ఎవరున్నారు నాకు.
ఆ రోజు కానిదానికి కన్నీరు పెట్టుకున్నానని అలిగావా?
నువ్వు నా ప్రాణం. నువ్వు లేకపోతే ఇది ప్రాణంలేని కట్టె! ఈ శుభముహూర్తంలో బావగారికి దీన్ని ఎలా ఇచ్చుకోమంటావు?
అని పరిపరి విధాల తలంచి అరగంట సేపు ఏడ్చింది.
కళ్ళు ఎర్రగా మండే గోళాల్లాగ అయినాయి.
ముఖం ఒద్దారినట్లు వాచిపోయేలా దుఃఖించింది.
వరండాలో అడుగుల చప్పుడు విన్పించింది.
కళ్ళు తుడుచుకుని మరోవైపు తిరిగింది గాయత్రి!
"తలంటు పోసుకోవాలట అమ్మగారు రమ్మంటున్నారు" పాఠంలాగా అప్పగించి వెళ్ళిపోయింది వర్ధనమ్మ.
షింక్ లో నీళ్ళు వదిలి ముఖం తుడుచుకుంది. ఏడ్చిన గుర్తులు ఏవీ కన్పించకుండా టవల్ తో అడ్డుకుని దిగి వెళ్ళింది.
సుమిత్రాదేవి హాలులో సోఫాలో కూర్చుని ఏర్పాట్లు పరిశీలిస్తుంది.
పాలవాడు పూలవాడు స్వీట్స్ వాళ్ళు వరుసగా వచ్చి వెళ్ళిపోతున్నారు. పడకగది అలంకరించేందుకు కడుపు పండిన ముత్తయిదువలు అయిదారుగురు మహ ఉబలాటపడిపోతూ అమ్మగారికి కబుర్లు చెప్తున్నారు.
వారిని సుమిత్ర బాగా అలోచించి ఎంపిక చేసి పిలిపించింది.
అందరూ మగబిడ్డల తల్లులే! తనకి మనమడు కలగాలని ఆమె ఆశ!!
వారికి చీరలు సారెలు కాక ఆ రోజంతా తన యింటిలో ఉండేలా ఏర్పాటు చేసింది.
మౌనంగా ఆమె ముందునుంచి వెళ్ళిపోయింది గాయత్రి.
తలంటు ముగించి మళ్ళీ ఆమె ముందునించే తిరిగి వచ్చింది. భోజనం గదిలోకి వచ్చింది. ఎన్నో ఆలోచనలు అనుభవాలు అనుభూతులతో ఈ మూడురోజులు అలసటగానే గడిచినాయి. భోజనం చేయగానే ఆదమరిచి నిద్రపోయింది.
నిద్రలో కల! కలలో గాయత్రి! కథ అంతా మామూలే! కన్నీళ్ళు మామూలే!
"నిద్రలో కూడా ఏమిటా వెక్కిళ్ళు. నీకేమన్నా పట్టిందా? లేలే? అయిదున్నర అవుతున్నా ఏమిటా మొద్దు నిద్దర. బుద్ధి లేదమ్మా ఈ కాలం పిల్లలకి! అవతల అబ్బాయి వచ్చే వేళ అవుతోంటే ఇంకా నిద్ర దేనికి!" అంటూ అవలించుతున్న కంఠస్వరం విని ఉలిక్కిపడి లేచి కూర్చుంది.
పరిస్థితి సమీక్షించుకోవటానికి వచ్చింది సుమిత్ర.
"కాఫీ తెప్పించాను! లేచి ముఖం కడుక్కునిరా!" అంది. గాయత్రి ముఖం కడుక్కున్న తరువాత వర్ధని చేతిలోని కాఫీ కప్పు తనే అందుకుని ఇచ్చింది.
గాయత్రి కాఫీ త్రాగుతోంది. సుమిత్ర తలఎత్తి చూడగానే వర్ధని వెళ్ళిపోయింది.
"గాయత్రీ! బాగా మెళుకువ వచ్చిందా?"
"వచ్చిందండీ! అమ్మగారూ! మేలుకునే ఉన్నాను"
"అవునుకాని ఉదయమనగా వచ్చావు. తలంటు పోసుకున్నావు. అన్నం తిని నిద్రపోయావు కాని ఆమని గురించి ఒక్కమాటయినా అడగలేదేం"
"ఏమని అడగమంటారు!"
"ఇద్దరూ ఒక్కప్రాణంగా ఉండేవాళ్ళు. అక్కాచెల్లెళ్ళలా కాకుండా స్నేహితుల్లా ఉండేవారు. ఎక్కడకు వెళ్ళింది అని అయినా అడగలేదు ఎందుకని! ఆ పిచ్చిదానిమీద కోపంగా ఉన్నావా?
దానికి వాగుడుకాయతనం అలవాటుంది కాని దాని మనసు వెన్నపూసలాంటిదే పిచ్చిదానా!!"
"అలా అనే నేనూ అనుకున్నాను. కాని అది చాలా క్రూరమయిన మనిషి."
"దానిమీద అంత కోపం పెట్టుకోకమ్మా! ఎక్కడుందో ఏమి చేస్తుందో పిచ్చితల్లి! ఈపూట యిక్కడుంటే గలగలమని గోదావరి ప్రవహించినంత సందడిగా ఉండేది కదుటే. దాన్ని అనుకుంటే కళ్ళుపోతాయి" గాయత్రి మనసులో గాయం ఏదో ఉందని అపోహపడింది సుమిత్ర.
ఆ గాయం మానాలనే ప్రయత్నంలో అలా మాట్లాడుతోంది.
"కోపం దానిమీద కాదు అమ్మగారూ! మీమీద" అంది గాయత్రి! ఆ మాటలు విని తల్లి నిర్ఘాంతపడింది. అంత సాహసించి తన ఎదుట అమ్మాయి అలా ఎన్నడూ మాట్లాడలేదు. ఆశ్చర్యంలోంచి తేరుకునేందుకు కొద్ది సమయం కొద్ది సమయం పట్టింది.
"నామీద కోపం ఎందుకమ్మా! నువ్వు పుట్టాక మొట్టమొదటిసారి నామీద కోపం చూపుచున్నావు" అంది విస్మయంగా!
"ఎందుకంటారేమిటి? వెళ్ళిపోతానంటే నాకెందుకు చెప్పలేదు? అది లేకుండా మీ అలంకారాలు పండగలూ నాకెందుకు?"
సుమిత్రకు ఈ అలక చూచి నవ్వు వచ్చింది.
"ఓ అదా! నీ కోపానికి కారణం? పిచ్చిదానా? వెళ్ళిపోయేముందుగా నీ దగ్గరకు వెళ్ళమన్నాను. డ్రయివర్ ని పంపి కబురు చేస్తానని అన్నాను. దేనికీ బదులు చెప్పలేదు. అదే ఎప్పుడు అంటూ ఉంటుంది. విన్నావు కదా!
