Previous Page Next Page 
యుద్దక్షేత్రం పేజి 28



    ఫకాలున నవ్వేసాడు ప్రసాంత్.

    "ఒరే ఫూల్! నేను రాసింది అసలు భాషే కాదు! ఏవో పిచ్చి పిచ్చి  పదాల మధ్య అక్కడక్కడా నిఘంటువులోని కఠినమైన సంస్కృత పదాలు కలిపి కొట్టి దుమ్ముదులిపేసాను. వాటికి అర్దం నాకు కూడా తెలీదు!" అన్నాడు ప్రశాంత్.

     సూరిబాబు అదిరిపడ్డాడు.

     "నీకు  కూడా తెలీదా?'

    "తెలీదు!"

    "అలా అయితే ప్రమాదమే!"

    "ఎందుకు?"

    "వాటి అర్దం చెప్పమని ఎవరైనా అడిగితే?" అన్నాడు సూరిబాబు.

    సిగరెట్ వెలిగించుకున్నాడు  ప్రశాంత్.

     "ఏదీ! ఎలా అడుగుతావో అడుగు.."  అన్నాడు.

     "ప్రశాంత్ జీ.... మీరు మీ నవలలో చాలా కఠినమైన పదాలు ప్రయోగిస్తారు. వాటి అర్దం తెలియక మేము జుట్టు పీక్కుంటున్నాం.... "ధవోష్ణపు శబ్ద సర్మిష్టిలా" అన్నారు... దాని బావం ఏమిటో తెలియజెయ్యరూ...?" అన్నాడు సూరిబాబు, ఒక పాఠకుడిలా.

    చిద్విలాసంగా నవ్వాడు ప్రశాంత్.

     "అదే పదాన్ని కొన్నాళ్లు చదవండి. వాటితోపాటు "ఆంధ్ర శబ్దార్ద రత్నాకరం" చదవండి. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ.... వీళ్లందరినీ చదవండి. అప్పుడు కోస్కీ, జేమ్స్ వాషింగ్ టన్, గోగో పాయ్ లని చదవండి. ఆ తర్వాత నా నవల చదివితే, మీకు నా భాష ఎంతో సులభంగా అర్దం ఔతుంది!"  చెప్పాడు ప్రశాంత్ గంభీరంగా.

     ఉలిక్కి పడ్డాడు సూరిబాబు.

     "వాళ్లందరూ తెలుసుగానీ, ఈ వాషింగ్ టన్, గోగోపాయ్ లు ఎవర్రా?" ఆశ్చర్యంగా అడిగాడు సూరిబాబు.

     "జెర్మన్ లిటరేచర్ లో మహామహులు" అన్నాడు ప్రశాంత్.

    "వాళ్లందరినీ నువ్వు చదివావా?"

    గొల్లుమని నవ్వాడు ప్రశాంత్.

     "ఒరే ఇడియట్... అసలు అలాంటి పేరున్న వాళ్లు ఎవరూ  ఈ పృధ్వీ మండలంలోనే లేరు!  అలాగే మన ప్రియతమ పాఠకుడి ప్రశ్నకి మనం ఇచ్చే జవాబు అలా బొంబార్డింగ్ గా వుండాలి! ఇంటర్నేషనల్ లిటరేచర్ ని ఉద్దరించవలసిన రచయిత... మన ఆంధ్ర దేశంలో ఉధ్బవించాడు అని పాఠకుడు ఆనందోత్సాహాలతో ఉన్మాదంతో ఉప్పొంగిపోయి, ఉర్రూతలూగి మనకి బ్రహ్మరథం పడతారు!" అన్నాడు ప్రశాంత్... ఎంతో ప్రశాంతంగా.

    అతని మాటలు సూరిబాబుని ప్రభావితం చేసాయి.

    జేబులోంచి వందరూపాయలనోటు తీసి సూరిబాబుకి అందించాడు ప్రశాంత్.

    అతని కళ్లల్లో కనిపించిన మెరుపు, ప్రశాంత్ పెదవులచాటున అరవిరిసిన చిరునవ్వుకి మాత్రమే తెలుసు.
 
     "సూరిబాబు! ఇదిగో వంద! ఇది ఎడ్వాన్స్ మాత్రమే! ఇంకా మొదలు కాని నా సాహితీ జీవితానికి నువ్వు రథ సారధిగా ఈ క్షణం నుంచి నియమించబడినట్లు లెక్క! నా రచనలు ప్రచురణకి అంగీకరించగానే మరో నాలుగొందలు ఇస్తాను... మన మధ్య జరిగిన ఈ ఒప్పందం మూడో కంటికి తెలీకూడదు! ఫ్రండే ఆన్ వర్డ్స్ యు ఆర్ మై గోస్ట్ రైటర్!" అన్నాడు ప్రశాంత్.

     ఒక్క క్షణం సూరిబాబు  సందేహాస్పదంగా చూసాడు అతని కళ్లల్లోకి.

     తను ఇతనికి ఇక లొంగిపోవలసిందేనా?

    "అతని రచనలకి తను సహకరిస్తానని అన్నాడే గానీ అతని పేరున రాస్తానని అనలేదే" అనుకున్నాడు...

    కానీ కళ్లముందు రెపరెపలాడుతున్న వందనోటు అతన్ని నిస్సహాయుడ్ని చేస్తోంది! నిర్వీర్యుడ్ని చేస్తోంది!

     ముందు ఒక వంద...

     ఆ తరువాత నాలుగు వందలు...

     ఆ తరువాత ఇంకా ఇంకా...

     ప్రశాంత్ ఎదుగుతున్న కొద్దీ తనకీ ఆదాయం పెరుగుతుంది.

    అతనిలాగా తనకి పదిమందిలోకి దూసుకుపోగల స్వభావం లేదు! అవసరమైతే... నవల ప్రచురించడానికి అంగీకరించే శాల్తీని... వెతికి పట్టుకుని అతనికి "మర్యాదలు" చెయ్యగలిగే స్తోమత  తనకి లేదు కాబట్టి... రాయాలి!

      చెయ్యి ముందుకు చాచి వందనోటు అందుకున్నాడు.

      ఆ క్షణం నుంచి ప్రశాంత్ పేరున నవలలు రాయటానికి తనని తాను సమర్పించుకున్నాడు సూరిబాబు.

     మొదటి నవల....

     "నేను పతివ్రతను కాను" నెల రోజుల్లో పూర్తి చేసి ప్రశాంత్ కి అందించాడు.

     ప్రశాంత్ కి దాన్ని గట్టిగా చదివి వినిపించాడు.

     సూరిబాబు రెండు భుజాలని పట్టి గట్టిగా కుదిపేశాడు... ఆనందంతో.!

    "వండ్రఫుల్!రియల్లీ ఫెంటాస్టిక్!ఎల్లుండే హోటల్ శిరాజ్ కాండినెంటల్ లో ద్వారకానాధ్ కి పార్టీ ఇస్తున్నాను. కాక్ టయిల్ పార్టీ... అతనికి దీని కధ చెప్పగానే ఓ. కే. అన్నాడు. కాకపోతే కాస్త సెక్స్ డోస్ తక్కువయ్యింది! అదంతా నేను చూసుకుంటానులే! ఈ రాత్రి  ఓ పట్టు పట్టి రేపు  ఇచ్చేస్తాను....!" అన్నాడు ప్రశాంత్.

     సూరిబాబుకి ఆ మాటలు రుచించలేదు.

     తను రాసిన కాగితాలు అతని చేతికి అందాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS