"మీరు బి.ఎ.తో చదువెందుకు ఆపేశారు?" మనోహర్ మొదటి ప్రశ్న.
"అసలు మనిషికి చదువెందుకని మీ ఉద్దేశ్యం?" రజని అందంగా నవ్వింది.
"చదువు విజ్ఞానం కోసం. సంపాదన కోసం కూడా"
"రెండో దానికోసం నేను చదివే అవసరంలేదు కదా? ఇక మొదటి దానికోసం చదవాలనుకుంటే దానికి క్లాసు పుస్తకాలే కానక్కరలేదు. జీవితానికి కావలసిన నిజమైన విజ్ఞానం క్లాస్ పుస్తకాల్లో దొరుకుతుందని నేననుకోను."
"మరెక్కడ దొరుకుతుంది?" మనోహర్ లో జిజ్ఞాస వ్యక్తమైంది.
"ఈ సృష్టిలో ప్రతి అడుగులో విజ్ఞానం నిక్షిప్తమై ఉంది. దాన్ని పొందాలనే కోరికే ఉంటే అపారంగా దొరుకుతుందది. ఊఁ నా లైబ్రరీ చూస్తారా?"
"చూపండి"
అద్దాల బీరువాలు రెండింటి నిండుగా అందంగా పేర్చి ఉన్న పుస్తకాల్ని అబ్బురంగా చూశాడు మనోహర్. ఎన్ని పుస్తకాలు! ఎన్ని గొప్ప రచనలు!
"ఈ గదిలో చదువుకోడానికి కూర్చొన్నానంటే నాకిక అన్నం నీళ్ళు గుర్తుకురావు"
"మీ అభిమాన రచయిత ఎవరు?"
"శరత్ నా అభిమాన రచయిత. స్త్రీ హృదయాన్ని, ఆమె ప్రేమనూ శరత్ చదివినట్టుగా ఇంకో రచయిత చదివినట్టు నా కనిపించదు. ఆయన పాత్రలు ఎంత సజీవంగా ఉంటాయి! మనతో మాట్లాడుతున్నట్టుగా, మన మనసుల్లోకి తొంగిచూస్తున్నట్టుగా ఉంటాయి. పతితల్లో పవిత్రత వెలికి తీసి ప్రపంచానికి చాటిన మహనీయుడాయన."
"మీరు పుస్తకాలు చదవడం వరకేనా? వ్రాస్తారు కూడానా?"
"ఉహుఁ వ్రాయాలన్న కోరిక వుందికాని, ఇప్పుడు కాదు. ఎప్పుడో ఒక గొప్ప నవల వ్రాసేస్తాను!"
మనోహర్ దృష్టి ఎక్వేరియం మీద పడింది. నాచుమొక్కల మధ్య రంగు రంగుల చేపలు అటు ఇటు పరుగులు పెడుతున్నాయి. అడుగున ఇసుక, గవ్వలు, శంకులు వున్నాయి.
"మీ అభిరుచులు చాలా వుత్తమంగా వున్నాయి"
"పావురాల్ని చూస్తారా?"
రజని మేడ వెనుకభాగంలోకి తీసికెళ్ళింది మనోహర్ ని. పెంపుడు పావురాలు గుంపులు గుంపులుగా వున్నాయక్కడ. పైకి తమాషాగా కట్టిన కుండల్లో గూఁ గూఁ అంటున్నాయి. ఒక పావురం కాళ్ళకు గజ్జలు గలగల లాడుతుండగా రజని భుజంమీద వాలింది. ఆప్యాయంగా పావురాన్ని చేతిలోకి తీసుకొని నిమురుతూ "వీటి మధ్య గడపటం ఎంత హాయిగా వుంటుదనుకున్నారు?" అంది రజని.
"బ్రతుకును సౌందర్యవంతంగా తీర్చిదిద్దుకోవాలని ప్రతి మనిషికీ ఉంటుంది రజనీ! కాని, అవకాశం అందరికీ ఉండదు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. కోటీశ్వరులకి ఒక్కగానొక్క బిడ్డవి! నీకు తెలియకుండా పెరిగినట్టున్నావు. చేపల మధ్య జలకన్యలా, పావురాలమధ్య వనకన్యలా గడిపేయగలవు హాయిగా. నిన్ను చూస్తే నాకే ఈర్ష్యకలుగుతోంది."
"ఏం? మీరు మాత్రం శ్రీమంతులు కాదా? మీ అమ్మకు ఒక్కగానొక్క కొడుకు కారా?"
"మీలా ఇంత చక్కటి అభిరుచులు మాత్రం నాకు లేవు."
మనోహర్ లో క్రొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. ఇక్కడికి బయల్దేరి వచ్చినప్పటి ఉదాశీనత మచ్చుకైనా లేకుండాపోయింది. రజని రూపం, ఆమె అభిరుచులు అన్నీ అద్భుతంగా తోచాయి. ఈ ప్రపంచంలో పారిజాత ఒక్కతే అందగత్తెకాదు. ఇంకా చాలా మంది ఉన్నారు.
పారిజాతను చేసుకొంటే ఏముంది? ఆమె దరిద్రానికి తను వారసుడు కావడం తప్ప! ఒక్కనాడైనా అల్లుడిగా మర్యాదలు పొందగలడా? అత్తగారంటూ తన కెవరైనా ఉంటే కదూ? పిల్ల ఒక్కతే సమస్తంకాదు పురుషుడికి. ఆమె సంప్రదాయం, తెచ్చే లాంఛనాలు, క్రొత్త బంధుత్వాలూ - అన్నీ కావలసినవే!
11
మనోహర్ స్కూటర్ రివ్వున దూసుకువస్తూంది కాంపౌండ్ లోపలికి. గేటు ప్రక్కగా నిలబడిన లలిత చప్పున చేయూపింది ఆగమన్నట్టుగా. మనోహర్ ఆగాడు.
లలిత కంగారుగా అటు ఇటు చూసి చప్పున ఓ కాగితం మడిచి మనోహర్ చేతిలోపెట్టింది "పారు వ్రాసింది ఉత్తరం!"
మనోహర్ మౌనంగా తీసుకొని జేబులోకి త్రోసి స్కూటర్ స్టార్ట్ చేశాడు.
