అతడు తిని వెళ్ళిన ఎంగిలి పళ్ళెం తీసివేసి శుద్ధిపెట్టింది దేవదాసి. అత్తయ్య రాత్రీ తినలేదు ఇప్పడూ తినలేదు దేవదాసికీ తినాలనిపించలేదు.
కృష్ణవేణి నిరాహార దీక్ష ఇంట్లో నౌకర్లందరికీ తెలిసిపోయింది. భార్గవరామ్ కు తప్ప! అందరి మనసులూ కలతబారాయి. "తల్లిని ఉసురు పెడుతున్న కొడుకు.!" అని భార్గవరామ్ నే నిరసించారు చాటుగా నౌకర్లు.
కృష్ణవేణిని భోజనానికి లెమ్మని బ్రతిమాలబోయాడు సుబ్బయ్య. ఆవిడతో రెండు కసిరింపులు తిని, చేసేదేమీలేక చేతులునలుపుకొంటూ వంటగదిలోకి వచ్చి వేశాడు సుబ్బయ్య.
"నాకూ ఇప్పుడే పెట్టకు ఆకలిగా లేదు" అని చెప్పేసి పైకి వెళ్ళింది దేవదాసి.
ఈజీ చెయిర్ లో కూర్చొని అప్పుడే ఏదో గ్రంధం విప్పబోతున్నాడు భార్గవరామ్. "వచ్చావేం దేవదాసీ?
అత్తగారు కంటబడితే చెడిపోతున్నావని గోలెడ్తుంది!" నవ్వబోయి, దేవదాసి వివర్ణ వదనం చూచి చటుక్కున ఆగిపోయాడు.
"అత్త రాత్రినుండి అన్నం తినలేదు, బావా!"
"ఉఁ. ఎందుకు?" నిదానంగా అడిగాడు.
"తెలియకే అడుగుతున్నావా?"
"నాకేం తెలుసు?"
"రాత్రి అత్తయ్యతో నువ్వేమన్నావ్?"
"ఒహో! అదా?" హఠాత్తుగా గాంభీర్యం దాల్చాడు.
"బండ అని అమ్మ ఏనాడో నామకరణం చేసింది. ఇలా తను ప్రాణాచారంబడితే బండలో చలనం కలుగుతుందా నాకు మనశ్శాంతి లేకుండా చేసి ఈ ఇంట్లో నిలువలేకుండా చెయ్యడానికి ఈచర్యలు!"
"అత్తయ్య కోరికలో అన్యాయామేముంది బావా?" తల్లికోరిక తీర్చడం తనయుని ధర్మమేకదా?" జాలిగా, ప్రార్థనా పూర్వకంగా అడిగింది.
"నీకు తెలియదు దేవదాసీ! అదంత సులభంకాదు. నాలో ఒక నిశ్చయమంటూ జరుగలేదు. ఒకరికోరిక తీర్చడం కోసం గృహస్థాశ్రమం స్వీకరించానంటే ఒక క్షుద్రకీటకం శరీరంలోకి పరకాయప్రవేశం చేసినట్లు నా మనసు రగిలిపోతుంది. ఆ జీవితమంత జుగుప్సాకరమో, బాధావహమో ఊహించు!"
"చాలు ఇటువంటి వాదప్రతివాదాలెన్నో ఇదివరకే జరిగాయి. ఇంకా వాదన కొనసాగిస్తే ఇంతకు ముందు వచ్చిన సమాధానాలే ఇప్పుడూ వస్తాయి. మానవత్వానికి విలువ నివ్వడానికి మాతృ మమకారం గురించి, మానవ ధర్మం గురించి బోధించడమేమిటి! కంఠశోష" నిశ్శబ్దంగా లేచి క్రిందికి వచ్చేసింది దేవదాసి.
ఇంట్లో ఇద్దరాడకూతుళ్ళు అ భోజనముండగా తను ఆకు వేసుకుకూర్చోవడ మెలాగో పాలుపోలేదు సుబ్బయ్యకు అపరాహ్ణం దాటిపోయింది.
"దేవతమ్మా తమరికి వడ్డించనా?"
"అత్త రాత్రినుండి తినలేదు నాకు ఎలా తినబుద్ధి అవుతుంది సుబ్బయ్యగారూ" కన్నీళ్ళను బలవంతాన ఆపుకొన్నది దేవదాసి.
కాలుగాలిన పిల్లిలా తిరిగి కృష్ణవేణి గదిలోకి వచ్చాడు సుబ్బయ్య.
"దేవతమ్మ కూడా మీకోసం తినకుండా కూర్చొన్నదమ్మా మీరు...."
మాటిమాటికీ వచ్చి ఊరికే విసిగించకండి సుబ్బయ్యగారూ! నా మనసు బాగుండలేదు. నాకేతిండి మీదాలేదు."
"పాపం, అమ్మాయి....."
"దాన్నిలా పిలవండి."
వచ్చింది దేవదాసి. "నువ్వెందుకు తినలేదే?"
"నువ్వు రా, అత్తా?"
"నేను తిననని చెప్పలేదూ? నువ్వొక దానివి నా ప్రాణానికి పడ్డావా?..... సుబ్బయ్యగారూ, దేవతకు వడ్డించండి..... వెళ్ళు! మధ్యాహ్నం దాటింది ఆ కళ్ళు చూడు ఎలా ఎర్రబడ్డాయో?"
"ఉహూఁ నువ్వు రా!"
"నాకక్కర్లేదని చెబుతుంటే "
"అయితే నాకక్కర్లేదు" వెళ్ళబోయింది దేవదాసి.
"సుబ్బయ్యగారూ, గోవిందస్వామికి చెప్పండి, బండి కట్టించి ఆమెను వాళ్ళ ఊరుపంపి రమ్మని..... నువ్వు నాకు పోటీగా తిండీతిప్పలు మానేసి నువ్వు నాయింట ఉండకు మీ ఊరికి వెళ్ళు!"
