"నీదంతా అనుభవం లేని మటాలు హరీ! పిల్లలు పుడితే మగాళ్లు తప్పకు మారుతారు. అలా మారిన మగాళ్ళని నేను చాలామందిని చూశాను!" అంది హేమలత.
"మారడం సంగతి దేవుడెరుగు! కాని, కన్న పిల్లల ముందే భర్తచేత తన్నులు తినాల్సివస్తే అప్పుడామె పరిస్థితి ఎంత అసహ్యంగా వుంటుందో చూడు!"
"నీ చాదస్తం కాని, మగాళ్ళు ఎప్పటికీ ఒకలాగే వుంటారా? నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించి ఆ అమ్మాయి మనస్సు చెడగొడుతున్నావు! పెళ్ళయిన కొత్తలో మా పెదబావగారు మా అక్కయ్యని చీటికి మాటికి కొట్టేవాడు. కొడుక్కి తండ్రికాగానే పెద్దమనిషి తరహా వచ్చేసింది. కొడుకంటే వల్లమాలిన ప్రేమ చూపే వాడు. భర్తగారి ఆ బలహీతన కనిపెట్టి "నామీద చెయ్యెత్తారా వాడిని నూతిలో పడేసి నేన పడతాను!" అన్న బెదురు పెట్టింది మా అక్కయ్య అంతే కొడుకుతో పాటు భార్యనూ అపురూపంగా చూచుకోవడం మొదులుపెట్టారు మా బావగారు."
"నిజంగా నాకే కొడుకు పుట్టి నేను ఆ బెదురు పెట్టబోయాననుకోండి "అంత శ్రమ నీకెందుకే? నేనే ఆ పని చేసి నీకాశ్రమ తప్పిస్తాను" అంటూ ఆయనే నూతిలోకి తోస్తారు నన్నూ నా బిడ్డనూ. అలాంటి కర్కోటకుడు పిల్లలు పుడితే మారతాడని నేను నమ్మను" అంది ప్రమీల.
"పిల్లలు పుట్టకుండా జాగ్రత్త తీసుకొంటున్నావా ఏమిటి?" హేమలత అనుమానంగా అడిగింది.
"అదేం లేదండీ! కాని, నెలతప్పినట్టుగానే నా అనుమానం! మొన్న ఎనిమిదికే నెల. వారం రోజులు గడిచాయి."
"నిజంగా నెలతప్పితే పోగొట్టుకోవాలని చూడకు. నీకు పుట్టబోయేబిడ్డ నీ జీవితంలో మార్పు తెస్తుందని నమ్ము."
"నువ్వు ఆమెకు వట్టి చాదస్తం నూరిపోస్తున్నావమ్మా! తాదూర కంతలేదు మెడకోడోలు అన్న సామెతగా ఆమెకు పిల్లల్ని కనమని సలహా ఇస్తున్నావు!"
"నీకు తెలియదు. నువ్వూరుకో హరీ."
"మీ సలహా ఏమిటి హంతా?" అడిగింది ప్రమీల.
ప్రమీల ఏడాది క్రితం పెళ్ళయి కాపురానికి వచ్చిందని, భర్త టీచరుగా చేస్తున్నాడని, అతడు తరచూ ప్రమీలను కొడుతూంటాడని, అత్తగారు అంత మంచిమనిషి కాదని, ఆవిడ ఏవోచాడీలు చెప్పి ప్రమీల మీదికి ఉసిగొల్పుతుంటుందని మాత్రం తెలుసు హరితకు.
"అసలు మీ భార్యా భర్తలమధ్య పోట్లాట ఎందుకు వస్తుందో ముందు నాకు చెప్పండి ప్రమీలగారూ" అడిగింది హరిత.
"అసలు, నేను నోరెత్తితే కదా. అది పోట్లాట అయ్యేది? నా నోరు ఎప్పుడూ మూతపడే వుంటుంది. నా నోరు ఆయనే పెట్టుకుని అరుస్తుంటాడు. కొడుతుంటాడు. చొక్కా సరిగ్గా ఉతక్కపోతే దెబ్బలు! వంటల్లో సరిగా ఉప్పు వేయకపోతే దెబ్బలు! ఆయన వచ్చే సమయానికి గుమ్మంలో నిలబడితే దెబ్బలు. ఎప్పుడైనా సహనం చచ్చి ఏమైనా అంటే చావు దెబ్బలు! ఇంతకోపమూ ఎందుకంటే, పెళ్ళిలో అలుకపాన్పు నీద మా నాన్నగారు ఇస్తానన్న టూ - ఇన్ - వన్ - ఇవ్వలేదని, పెళ్లిలో ఇంకేవో మర్యాదలు సరిగా జరగలేదని మామేనత్త ఒకామె ముస్లింను ప్రేమించి అతడితో వెళ్లిపోయి పెళ్లి చేసుకొంది పెళ్ళయ్యాక ఆ సంగతి తెలియడంతో మాది మంచి వంశం కాదని, ఎరక్క పోయి గోతిలో పడ్డామని ఎప్పుడూ దెప్పుతూ వుంటుంది మా అత్తగారు. పెళ్లిలో వియ్యపురాలికి పెట్టే చీర నాకిరకంది పెట్టామని, తన ఒక్కగానొక్క కూతురికి ఆడపడుచు లాంఛనాలు సరిగా ఇవ్వలేదని ఇలా ఏదో ఒకటి అక్కసు వెళ్లబోస్తూ వుంటుంది."
"అయితే మీది కట్నపు వేధింపు కేసన్నమాట. ఇలా కట్న కానుకల కోసం వేధిస్తున్నాడని అతనిమీద చర్య తీసుకోవచ్చు! శిక్షపడేట్టు చేయవచ్చు."
"ఎవరు చేస్తారు?"
"ప్రభుత్వమే చట్టంద్వారా చర్యతీసుకొంటుంది. మీరు కోర్టులోగానీ, పోలీసు స్టేషన్ లోగాని ఫిర్యాదు చేయాలి. మీబోటి వాళ్లకోసమే సి. బి. సి. ఐ . డి. లో మహిళా సంరక్షక విభాగం ఏర్పరిచారు"
"చేస్తే ఏం జరుగుతుంది?"
"అతడికి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి బుద్దిరాకపోతే ఉద్యోగం ఊడగొట్టి జైలుశిక్షగానీ, జరిమానాగాని వేయవచ్చు."
"కాని, నాకు జరిగే న్యాయమేమిటో అర్దం కావడం లేదు."
"అరే! మీకు న్యాయం ఎందుకుజరగదు. మిమ్మల్ని హింసించడంవల్ల తన ఉద్యోగపోతుందనో, జైలు శిక్ష పడుతుందనో భయం వుంటే మీ జోలికి రాడు కదా?"
