12
ఎవరెంత చెప్పినా వినకుండా వెళ్ళిపోవటం వలననేకదా? నాగులు యింతగా ఎదిగిపోయాడు??...అసలు పట్టుదల అంటూ వుంటే మనిషి సాధించలేనిదంటూ లేనే లేదన్నది నాగులుని చూసిన తరువాత అనుకుంది కావేరి!
తనూ అంతే! ఈ మారుమూల పల్లెలో వుంటే తనేమీ సాధించలేను! యిక్కడనుంచి బైటపడితేనే తను అనుకున్నది సాధించగలుగు గలుగుతుంది...తనలోని కళాతృష్ణను ఎవరు అర్ధం చేసుకుంటారు??...ఎవరికి అర్ధం అవుతుంది కనుక??....
"నువ్వు గొప్పదానివి అవగలవు!" అనే వారు డ్రాయింగ్ మాష్టారు.
మన స్కూలుకి మంచి పేరు తెచ్చిన ప్రఖ్యాత నటశిరోమణివి!" అని భుజం తట్టి మరీ అభినందించారు హెడ్ మాష్టారు!
"నువ్వు గొప్ప సినీతారవై పోతావని నేను చెప్పిన జోస్యం ఫలించాలంటే ముందడుగు వేసిచూడు!" అంది సుబ్బులు!
"నువ్వు గొప్ప సినిమా తారవయి పోతావని నాకూ వున్నది. మద్రాసు వెళ్ళితేచాలు! నీకు కావలసినన్ని సినిమాల్లో వేషం యిస్తారు!"
"ఏదయినా ధైర్యంచేసి ముందడుగు వేయగలిగితే సినిమా చాన్సులు నిన్ను వెతుక్కుంటూ మద్రాసులో అడుగుపెట్టగానే వస్తాయి. ఈ పల్లెలో ఏం వున్నది?"
ఎక్కడ కూర్చున్నా నుంచున్నా ఏ పని చేస్తున్నా యివే ఆలోచనలుతో సతమతమయిపోతోంది కావేరి! ఏదీ ఒక నిర్ణయానికి రాలేకపోతోంది. అశాంతితో ఫీలయిపోతోంది.
తను మద్రాసు వెళ్ళితే డబ్బు ఎలా? అన్నది మరో ఆలోచన!
ఆ క్రితంరోజునే పెళ్ళి ఖర్చులకని మేనత్త ఇచ్చిన అయిదువేలూ తెచ్చి అలమరలో వుంచాడు తండ్రి!
తనకి పెట్టిన బంగారం ఎనభైవేలు ఖరీదుచేసేది అని అక్క అంచనా వేసింది! పెళ్ళికాని కొత్తబట్టలు కొన్నది తల్లి. ఇవన్నీ తీసుకుని మద్రాసు కెళ్ళిపోతే?
"అమ్మో! ఇంకేమయినావుందా?"
అని గుండెలమీద చేతులుంచుకున్నది కావేరి!
తను భయపడితే ఏమీ సాధించలేదు! సాధించాలంటే ధైర్యం తెచ్చుకోవాలి! తన కోరిక తీరాలంటే తను ముందుకి అడుగువేయవలసిందే? పెళ్ళి చేసుకుంటే ఏముంటుంది? యివ్వాళేదో తల్లికి తెలియకుండా రెండవ ఆటకి తీసుకువెళ్ళాడు. రేపటినుంచి అలా చేయగలడా బావ? తల్లి వద్దంటే మానివేస్తాడు. ఎంతయినా తల్లిచాటుమనిషికదా? పెళ్ళి అనే బంధంలో తనను బిగించిపెడతారు? తను వెళ్ళిపోయినా తరువాత ఓ నాలుగురోజులు చెప్పుకుంటారు. ఆ తరువాత మామూలే!
తనే ధైర్యం తెచ్చుకోవాలి! ఆఁ కొంత ధైర్యంవచ్చింది. మద్రాసు ఎలా వెళ్ళాలో బావ చెప్పాడు. ఆ డబ్బూ! వస్తువులూ తీసుకెళ్ళితే తనకేమీ ఢోకా వుండదు. తను గొప్ప హీరోయినే అయితే ఇంతకి నూరురెట్లు ఎక్కువ సంపాదించగలదు.
అలా తననుగురించి ఆలోచించుకుంటూ వుంటే కొంతధైర్యం కలిగింది.
తను పుస్తకాలు పెట్టుకునే ట్రంకుపెట్టెను కాళీచేసింది. అందరూ నిద్రపోయిన తరువతః కొత్త చీరలు, జాకెట్లు అన్నీ సర్దుకుంది. వాటి మధ్య పసుపు కుంకాలు రోజున మేనత్త పెట్టిన వడ్డాణం! పెద్ద గొలుసు గాజులు చప్పుడుకాకుండా తీసి వుంచింది. డబ్బుని ఓ వెయ్యిరూపాయలు మాత్రమే జాకెట్టులో వుంచుకుని మిగతా నాలుగువేలూ చీరమడతలో వుంచింది. ట్రంకుపెట్టెకి జాగ్రత్తగా తాళంవేసి తాళంచెవిని జేబురుమాలులో చుట్టివుంచింది.
యివన్నీ చేస్తూవుంటే ముచ్చెమటలు పట్టాయి కావేరికి! ఏదో మొండిధైర్యం ఆవహించింది. తను చేస్తున్నది సరయిన పనే! అన్నది మరొకసారి మరొకసారి రూఢీచేసుకున్నది. బావకి ఎవరయినా పిల్లని యిచ్చి పెళ్ళిచేయగలరు. తనకి పెళ్ళయితే చేతులారా తన నటజీవితానికి ఆశ వదులుకోవలసిందే! యిలాంటి అవకాశం, అదృష్టం ఇంకెవరికి వుంటుంది?
పగలంతా పెళ్ళిపనులు చేసిచేసి అలిసిపోయివున్న సుభద్రమ్మ పార్వతి ఆదమర్చి నిద్రపోతున్నారు. పెళ్ళి ఇంకా నాలుగురోజులేవున్నది. ఎండలోపడి పెళ్ళిపందిరిమీద ఆకులు కప్పటం వలన పరంధామయ్య కూడా ఆ పందిరిక్రిందనే నులకమంచం వేసుకుని ఆదమరచి నిద్రపోతున్నాడు. పెళ్ళిరోజు దగ్గిరపడిన కొలదీ పనులవత్తిడి ఎక్కువగా వుటుంది! ఇదే మంచిసమయం అనుకుని పెరటి తలుపులు తెరుచుకుని బయటికి అడుగుపెట్టింది కావేరి.
13
కావేరి కనిపించటంలేదన్న వార్త మరుక్షణంలోనే ఆ గ్రామమంతా వ్యాపించిపోయింది. పరంధామయ్య ఆదరా బాదరా అన్నిచోట్లా వెతికాదు. ఇంత తెల్లవారగట్ల ఎవరింటికి వెళుతుంది? అన్న ఆలోచన కలిగింది. కావేరి పడుకునేగది వెతికారు. డబ్బున్న అలమర తెరిచి వున్నది. వస్తువులు వున్న పెద్ద కావిడిపెట్టె మూత తీసేవున్నది. కొత్త బట్టలూలేవు. ఎప్పుడూ గూటిలోవుండే ట్రంకుపెట్టెలేదు. ఆ స్థానంలో పుస్తకాలు, సినిమా వాల్ పోస్టర్సు వున్నాయి.
పరిస్థితి ఏమిటో అర్ధంచేసుకున్న సుభద్రమ్మ గుండెలు బాదుకుంటూ-
"ఎంతపని చేశావే కావేరీ!" అంటూ శోకాలు మొదలుపెట్టింది. పెళ్ళియింత శోకాలుఏమిటా?అని ఇరుగుపొరుగు బిలబిలమంటూ వచ్చారు. ఏదయినా ప్రమాదం జరిగిందోనని!
విచారించితే జరిగింది ఇది! అందరూ కావేరి అలా వెళ్ళిపోవటం విని ముక్కుమీద వేలువేసుకున్నారు.
ఈ వార్తవిన్న కామాక్షమ్మ మ్రాన్పడిపోయింది.
వినాయకం అయితే కుప్పకూలిపోయినట్లుగా అరుగుమీద చతికిలబడిపోయాడు.
అన్నగారింటికివెళ్ళి విషయం ఏమిటో తెలుసుకోవాలనికూడా అనిపించలేదు. రాజమ్మ ప్రతీ అరగంటకీ అక్కడ విషయాలు వచ్చి చెప్పుతూనే వుంది! ఎవరేమనుకుంటున్నదీ వివరించుతోంది.
