Previous Page Next Page 
చీకట్లో నల్లపులి పేజి 28


    భవానీ, రాజారామ్ లిఫ్టువేపు వెళ్తుండగా-అనుకోకుండా మేనేజింగ్ డైరెక్టర్ విరించి ఎదురయ్యాడు.

    చైర్మన్ గారితో మాట్లాడిన సంగతీ, పత్రిక పని మానుకుంటున్న సంగతీ అతనికి చెప్పాడు రాజారామ్.

    "సారీ రాజారామ్. ఇలా అవుతుందనుకోలేదు. నా పరిస్థితి అర్ధం చేసుకో!" అన్నాడు విరించి.

    "అదే నాకు అర్ధం కావడం లేదు. అప్పారావు మీకు ప్రాణ స్నేహితుడే కావచ్చును. నేను కాదనను. కాని అతని హత్యానేరం నామీద మోపడానికి మీరు మొదటి నుంచీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. చివరికి ఇన్ స్పెక్టర్ దుర్గారావు బుర్రలో కూడా ఈ అనుమానం ప్రవేశపెట్టారు ఎందుకని?"

    "అదేంలేదు. కేసు విషయం మాట్లాడుకున్నాం అంతే. ఇన్ స్పెక్టర్ నిర్ణయాలకి నేనెలా బాధ్యుడినవుతాను." అంటూ రాజారామ్ భుజం మీద విరించి చెయ్యివేశాడు. "నీ మీద వ్యక్తిగతంగా నాకెలాంటి కోపమూ లేదు రాజా, అది మాత్రం గుర్తుంచుకో!" అనేసి వడివడిగా తన గదివేపు వెళ్ళిపోయాడు విరించి.

    లిఫ్టులోంచి రాజారామ్. భవానీ కిందకి దిగారు. దిగాక ఓసారి వెనక్కి తిరిగి చూశాడు రాజారామ్.

    మూడు రోజుల క్రితం ఇదే ఆఫీసు నుంచి ఎం.డి విరించి తనకు ఫోన్ చేశాడు. మూడు రోజుల క్రితం ఇదే పత్రికకు తను ఎడిటర్ అవుతానని ఊహించాడు. కలలుకన్నాడు. అంతేకాని, ఇలాంటి భయంకర నరకం త్వరలో తనకి ఎదురవుతుందని తనానాడు కనీసం ఊహించనైనాలేదు.

    "పదండి సార్" అన్న భవాని మాటలు విని అడుగులు ముందుకు వేసి జీప్ ఎక్కాడు. జీప్ కదులుతున్నంతసేపూ భవాని అతని మొహంలోకి భావాలు చూస్తూ మౌనంగా కూర్చుంది. పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు జీప్ ఆగినప్పుడు మాత్రం ఒక మాట చెప్పింది.

    "రాజారామ్ గారూ, నాదొక సలహా. ఎలాంటి పరిస్థితిలో కూడా మీరు ఉద్రేక పడకండి. మీరు ఇన్ స్పెక్టర్ దుర్గారావు గారితో కామ్ గా కూల్ గా ఆర్ గ్యూ చెయ్యండి అంతే. మీకేంకాదు!"

    రాజారామ్ 'అలాగే' అన్నట్టు తల ఊపాడు.

    ఇద్దరూ హెడ్ క్వార్టర్స్ లోకి నడిచారు. రాజారామ్ వరండాలో ఉన్న బెంచి మీద కూర్చున్నాడు. భవాని లోపలికి వెళ్ళి క్షణాల్లో తిరిగివచ్చింది.

    "దుర్గారావు గారూ మహావీర్ గారు కూడా ఆఫీసులో లేరు. అయిదు నిమిషాల క్రితమే ఎక్కడికో వెళ్ళారట. ఎవరినడిగినా 'సీక్రెట్' అంటున్నారు."

    తల వంచుకుని ఆమె మాటలు వింటున్నాడు రాజారామ్.

    "కాసేపు వెయిట్ చెయ్యండి. ఈలోగా మీకు టీ గాని కాఫీ కాని తెప్పించనా?" అనడిగింది.

    "నో థాంక్స్" అంటూ జేబులోంచి సిగరెట్ పేకెట్ తీశాడు రాజారామ్.

    క్షణాలు నిమిషాలయ్యాయి.

    నిమిషాలు గంటలయ్యాయి.

    అలా రెండు గంటలు గడిచిన తరువాత ... రాజారామ్ దగ్గరున్న సిగరెట్లన్నీ అయిపోయాక, గోడకు చేరబడి అలసటగా కళ్ళు మూసుకున్నాడు రాజారామ్.

    అంతలో బరువుగా బూట్ల చప్పుడు వినిపించింది.

    ఇన్ స్పెక్టర్ దుర్గారావు మొహం గంభీరంగా ఉంది. విషాదంగా కూడా ఉంది. అతని వెనకనే సబ్ ఇన్  స్పెక్టర్ మహావీర్ కూడా ఉన్నాడు. ఇద్దర్నీ చూసి రాజారామ్ లేచి నిలబడ్డాడు. ఇన్ స్పెక్టర్లు ఇద్దరూ అలా సీరియస్ గా ఎందుకు ఉన్నారా అనిపించింది.

    "సారీ రాజారామ్ గారూ, ధైర్యంగా ఉండండి. 
 
    అయ్ హేవ్ బాడ్ న్యూస్ ఫర్ యూ! అన్నాడు దుర్గారావు.

    బాడ్ న్యూస్! దుర్వార్త!!

    ఎంత పెద్ద దుర్వార్త!!!

    ఊపిరి బిగబట్టి నిలబడ్డాడు రాజారామ్. ఆ దుర్వార్త వినకముందే తన గుండె కొట్టుకోవడం మానేస్తే ఎంత బాగుండును....

    "మీ అమ్మాయి కనిపించడంలేదని రాజభూషణరావు గారి మేనకోడలు గంట క్రితం ఇక్కడికి ఫోన్ చేశారు." అన్నాడు దుర్గారావు.

    "మొత్తం వాళ్ళ ఇల్లూ, తోటా అంతా వెదికారట....అంటున్న మహావీర్ కంఠం రుద్దమైపోయింది. కాసేపు ఆగి గొంతు సర్దుకున్నాడు. "వాళ్ళింటి గేటు ముందు పోలీసులకి ఓ చిన్నపాప కాలి జోడు మాత్రం కనిపించింది. అది మీ అమ్మాయిదేనని రాజేశ్వరిగారు చెప్పారు. అదెలా జరిగి ఉంటుందంటే.....ఒహ్....మైగాడ్" అంటూ ఆగిపోయాడు.


                                   9


    ఇన్ స్పెక్టర్ దుర్గారావు మాటలువిన్న రాజారామ్ కి ప్రపంచం అంతా గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది.

    తన ముందున్న మనుషులంతా దట్టమైన మంచులో కరిగిపోతున్నట్టూ, తన శరీరంమీద నిప్పులవర్షం కురుస్తున్నట్టూ, తన కాళ్ళలోని శక్తినంతా ఒక్కసారి ఎవరో హరించేసినట్టూ ఫీలయ్యాడు.

    తన జీవిత సర్వస్వం...అల్లారుముద్దుగా చూసుకొంటున్న రమణి....కనిపించడంలేదు. ఆ మాటే పదేపదే తలచుకొంటూ నిశ్చేష్టుడై నిలబడిపోయాడు.

    ఇన్ స్పెక్టర్ దుర్గారావు, సబ్ ఇన్ స్పెక్టర్ మహావీర్, డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ భవానీలకి ఈ పరిస్థితి చాలా ఇబ్బందిగా అన్పించింది. దుర్గారావు మెల్లిగా దగ్గి ముందుకి నడిచాడు. రాజారామ్ భుజంమీద చెయ్యివేశాడు. ఆ చేతిని మృదువుగా తప్పించాడు రాజారామ్.

    "నేను మా అమ్మాయితో కలిసి ఇంతవరకూ హాయిగా ఉన్నాను. మీరు రమ్మంటేనే మా అమ్మాయిని అక్కడా వదిలి వచ్చాను. ఎందుకు రమ్మన్నారు మీరు? ఏమో!? మా అమ్మాయి ప్రాణం ప్రమాదంలో ఉందని మీకు మొదటి నుంచీ చెప్తూనే ఉన్నాను. కాని మీరు ఒక్కసారైనా విన్నారా? మీ సిద్దాంతం, మీ లైన్ ఆఫ్ థింకింగ్ తప్ప ఏం విన్నారు మీరు? నౌ వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? మా అమ్మాయికి ఏదన్నా జరిగితే ఆ బాధ్యత మీదే?!" అంటూ రాజారామ్ ఒక్కసారి బరస్ట్ అయ్యాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS