హటాత్తుగా వచ్చిన కొడుకుని చూసి చటర్జీ ఆశ్చర్య పోయాడు. ఆశ్చర్యం లోంచి తేరుకుని 'యిప్పుడు సెలవు యెక్కడిది?' అని ప్రశ్నించాడు.
కొడుకులిద్దరూ వెళ్లిపోగానే గోవింద యిప్పుడు యెక్కువ సేపు జోడా మందిర్ లోనే కాలక్షేపం చేస్తున్నది. సాయంత్రం పూట వెళ్లి రెండు మూడు గంటలు అక్కడే వుంటుంది. శ్రీకాంత్ కి ఆ విషయం అరవింద రాశాడు. అతను యింటికి వచ్చే సమయానికి ఆవిడ లేదు.
సూట్ కేస్ లో తన బట్టలన్నీటి ని సర్దుకుంటూ తండ్రి మాటకి జవాబు చెప్పలేదు శ్రీకాంత్.
'నిన్నేనోయ్. యేవిటిలా హటాత్తుగా ఊడి పడ్డావు?' అని అడిగాడు.
శ్రీకాంత్ పెద్దగా నవ్వాడు. చటర్జీ యెదుట అంత అసభ్యంగా ఆతనేన్నడూ ప్రవర్తించలేదు. అతని కడుపులో రగిలే మంటలు అటువంటివి.
'నీకేమైనా మతి పోయిందా శ్రీకాంత్.'
'లేదండి పోయిన మతి తిరిగి వచ్చింది.' శ్రీకాంత్ బట్టలన్నీ సర్దుకున్నాడు. అతని దగ్గర జీతం తాలూకు పదిహేను వందల రూపాయలున్నాయి.
చటర్జీ మొహం యెర్ర బడ్డది. అతనికి యెదురుగా నిలుచుని శ్రీకాంత్ అన్నాడు. యిన్నాళ్ళూ పెంచి పెద్ద చేశారని యెంతో విశ్వాసం గా వున్నాను మీ పట్ల. మీకెప్పుడూ కష్టం కలిగించే పనులు నేను తెలిసి చేయలేదు. తెలియక చిన్నతనం లో చేశానేమో గుర్తు లేదు.
'మీరు యింత నాటకం ఆడి నా బ్రతుకులో నిప్పులు కురిపిస్తారని తెలియని అమాయకపు స్థితిలో యిన్నేళ్ళూ పెరిగాను. మీ నిజ స్వరూపం బయటపడ్డది. మీకు నేను యేమీ కానప్పుడు నాకు మీరు యేమౌతారు? అనేది అర్ధం లెని ప్రశ్న.
'నన్ను అడ్డం వేసుకుని మా అమ్మని పెళ్లి చేసుకున్నారు. సంఘ సంస్కరణ చేసి ఏదో వుద్దరించారని అమాయకురాలు మిమ్మల్ని నమ్ముకున్నది. కానీ మీరు ఆవిడ కున్న కొడుకు నైన నన్ను యింత శత్రువుగా భావిస్తారని తెలుసుకోలేక పోయింది.
'నాకెప్పుడో చెప్పారు అడ్వేకేట్ చక్రవర్తి మీరు ఆస్తినంతా ఉమేష్ పేర రాసినట్లూ ఈ మేడ అమ్మకి రాసినట్లూ, నేను అప్పట్లో నమ్మలేదు. ఆస్తి కోసమే ప్రాణం పెట్టె వాడినైతే మా తాతగారిని ఆవేళ కృతజ్ఞత కోసం నిర్ధాక్షిణ్యంగా వెళ్ళగొట్టే వాడిని కాను. యెందరో చిత్తక్షోభతో తన మనిషిని నేను వున్నా యెందుకూ కొరగాని వాడినయ్యాను.
'మీ రానుకోవచ్చును శ్రీకాంత్ కి వున్నట్లుండి రెండు లక్షల రూపాయల మీదా మమకారం పుట్టిందని. నేను వెళ్ళేది యెక్కడికో నాకే తెలియనప్పుడు ఆ విషయం మీకేం చెబుతాను? మీకు నేను ద్రోహం చేయలేదు, మరి మీ రెందుకండి యిలా చేశారు?
'నాకు ,మీరు చెప్పే సంజాయిషీ వినాలని కూడా లేదు. ఏ ఆస్తి పాస్తుల్ని వదులుకున్నానో అక్కడికి వెళ్ళేంతటి స్వార్ధపరుడు కాదు శ్రీకాంత్. నేను వెళ్ళిపోతున్నాను. అమ్మని మీరు భార్యగా చూశారో మరే విధంగా చూశారో నాకు తెలియదు గానీ ఆ అమాయకురాల్ని నిలువునా దగా చేశారు మీరు.'
'అయినా నేనెంత ఫూల్ ని. మిమ్మల్ని మొదటి నుంచే గమనిస్తుండాల్సింది . స్త్రీలలోనే ఒక్కోసారి సవతి బిడ్డల పైన మామతలనేవీ వుండవు కదా! అప్ట్రాల్ పురుషుడు యెటువంటి వాడై వుంటాడో గ్రహించోద్దా నేను. మీరూ మీ బిడ్డా సుఖంగా వుండండి.
'పెద్దవారై పోయారు మీరు.అమ్మకి యిప్పుడైనా ఉమేష్ ని తీసుకు వచ్చి దగ్గరుంచి శాంతి ని యివ్వండి. ' శ్రీకాంత్ గుడ్లల్లో నీరు క్రమ్ముకు వస్తుంటే ఎడం చేత్తో తుడుచుకుంటూ కుడి చేత్తో సూట్ కేస్ ని అందుకున్నాడు . మాట్లాడే మాటలన్నీ అయిపోయాక.
చటర్జీ కుప్పలా కూలిపోయాడు. అతను స్తంభించి పోయాడు. శ్రీకాంత్ యెన్ని మాటలన్నాడు? ఒక్క వాక్యం లోనూ కూడా తనని 'నాన్నగారూ' అని పిలవకుండానే దూరం అయిపోయాడు. యింకా యింకా దూరం అయిపోతున్నాడు. 'వెళ్ళద్దు శ్రీకాంత్,' అనేందుకు పెదాలు విడిపడి పోవడం లేదు. గంగ పెళ్లి అయినప్పటి నుంచీ చటర్జీ మానసికంగా తను చేసిన తప్పిదానికి చింతిస్తూ పశ్చాత్తాపంతో చితికి పోతున్నాడు. చక్రవర్తిని పిలిచిఅస్తి ని సమ భాగాలుగా చేయించాడు. ప్రపంచానికి వెరచి, సంఘానికి భయపడి లోకం మీద పగని అన్యాయంగా శ్రీకాంత్ మీద తీర్చుకున్నదుకు ఇంచుమించు పిచ్చివాడే అయిపోయాడు. యిప్పుడు చేతులు కాలినాక ఆకులూ పట్టుకుని ప్రయోజనం లేదని తెలుసుకుని అంతర్గతంగా శిధిలం అయిపోతున్నాడు.
'అగు' గోవింద గుమ్మంలో నిలుచుని అడ్డంగా శ్రీకాంత్ ని నిలిపేసింది.
శ్రీకాంత్ సూట్ కేస్ నేల మీద పడేసి తల్లి కాళ్ళని చుట్టేసి ఘోల్లుమన్నాడు: 'నన్ను వెళ్ళనియ్యమ్మా. నేను వెళ్లి పోతాను. నాకు ఈ యింట్లో వుండాలని లేదు.'
గోవింద అక్కడే నిలుచుని చటర్జీ వైపు చూసింది. 'ఒక తండ్రికి పుట్టాక పోయినా పిల్లల్నిద్దర్నీ మీరుచూస్తున్న ప్రేమకి నేను నా అంతటి అదృష్టవంతురాలు వుండదని అనుకునేదాన్ని. శ్రీకాంత్ కి మీరు చేసిన అన్యాయానికి భగవంతుడైనా క్షమిస్తాడంటారా?'
'వాడెం చేశాడు? మిమ్మల్ని నన్నే పెళ్ళి చేసుకోమని నిర్భంధించలేదే? పసివాడిగా వున్నప్పుడు మీరు వాడిని చేరదీసి యెంత నాటకం ఆడారు. వాడిని అడ్డం వేసుకుని మా అన్నయ్య ని దగా చేయడంతో ప్రారంభించి యిప్పుడు అంతం చేశారు.'
'అన్నయ్య నాకు స్వంత అన్నయ్యే అని అతడినీ, ప్రపంచాన్ని కూడా నమ్మించ గలిగాను. అన్నయ్య మామూలు మనిషి కాదు. దేవుడు. అతని తల్లికి మా తండ్రి చేసిన అన్యాయానికి చిహ్నంగా అతడు పుట్టాడు. మా అమ్మే పెంచి పెద్ద చేసింది తన కొడుకుగా. ఈ సంగతి నాన్న పోయేముందు నాకు చెప్పారు.'
మా అమ్మ పరాయి పిల్లాడిని అంత ప్రేమగా చూసినప్పుడు పురుషుల్లో కూడా వుంటారు అటువంటి వాళ్ళని నేను అనుకుని మీరు చేసుకుంటా నంటే నా పట్ల మీరు చూపిస్తున్న ఆదరణ కి తట్టుకోలేక యేమైనా అయిపోతానేమో అనుకున్నాను.
'యెంత భ్రమ పడ్డాను. స్త్రీ లో స్వతహాగా వున్న లాలిత్యం యీ పురుషుడి కెక్కడి నుంచి వస్తుంది? ఆ మాత్రం దేనికి అర్ధం చేసుకోలేదు? ప్రపంచం అనుకుంటుంది. యిరవై కి పాతిక కి మధ్యన వున్న నేను శారీరక సుఖం కోసమే మీకు లొంగి పోయానని. యెందుకు ఆ విధంగా చేశానో ఆలోచించినా యిప్పుడు నాకు జవాబు దొరకదు.
'అయిన పోయాక మిమ్మల్ని చేసుకుని అయన పట్ల తీరని కృతఘ్నతచూపించాను. ఆయనకి పుట్టిన బిడ్డ బ్రతుకులో తుఫానులు రేపి అయన అంతరాత్మకి శాంతి లేకుండా చేసిన పాపిష్టి దాన్నయ్యాను నేను.
'ఉమేష్ ని మీరు తాత్కాలికంగా దూరం చేశారను కున్నాను. కానీ వాడిని కూడా నాకు కాకుండా చేశారు. ఆ మాటకి వస్తే పెద్దలం తల్లిదండ్రులం మనం చేసిన పనులు మాత్రం ఏం బాగున్నాయి.
'మన శాస్త్రాలు యిటువంటి సందర్భాలు రాకుండా వుండేందుకు పుట్టాయి. వుడుకు రక్తంలో విరుచుకు పడతాం సమాజం మీదా, ధర్మ శాస్త్రాల మీదా. అవకతవక పనులు చేసి మనం చూస్తున్న ఫలితాలు యెంత వికృతంగా వికటాట్టహాసం చేస్తాయో అనుభవంలోకి వచ్చాక యెంత పరితపిస్తే మాత్రం యేమిటి లాభం?
'నాకు యిద్దరు కొడుకులు రెండు కళ్ళు అనుకునేదాన్ని. ఒక కంట్లో దైవం మరో కంట్లో మీరూ పొడిచారని భ్రమ పడ్డాను యిన్నాళ్ళూ. నాకు జ్ఞానోదయం అయింది. నేను గ్రుడ్డి దాన్ని కాలేదు.
'శ్రీకాంత్ వెళ్ళిపోతున్నాడు. వాడిని ఒంటరిగా ప్రపంచం లోకి తరిమి వేసేంత గొడ్రాలిని కాను నేను. భర్తగా మీ పట్ల నేను నా ధర్మాన్ని యిన్నాళ్ళూ నెరవేర్చాననే తృప్తి నాకు వుంది.
'పోగా యిప్పుడు'......గోవింద ఆయాసంగా రొప్పుతూ అతని వైపు చూసి తిరిగి ప్రారంభించింది.
'నేను చచ్చిపోయాక ఆయన్ని యెలాగూ కలుసుకోవాలి. 'నా బిడ్డని యెంత నిర్దయగా చూశావు గోవింద . ఆడదానివి కదా నీకు తెలియదా కర్తవ్యాన్ని యెలా నిర్వర్తించాలో ,' అని దీనంగా అడుగుతారు.
'నేను చేసింది తప్పే అని ముందు ఆయనకి తెలియచేసి....యిప్పుడు ,' గోవింద యేడుస్తూ అంది.
'నా కర్తవ్యం తెలిసింది నాకు. మీ బిడ్డ ఉమేష్. వాడిని చేరదీసినా దూరం చేసుకున్నా అది మీ యిష్టం. నేను వాడిని కలుసుకున్నా మీకు తెలియాలనే నియమం లేదు. నేను వెడుతున్నాను.'
చటర్జీ ఒక్కసారి కుర్చీలోంచి యెగిరి పడ్డాడు. గోవిందా, నేను మూర్కుడిని. చవట ని. చేతకాని వాడిని. ధైర్యం లేని పిరికి పందని. నన్ను నువ్వు వదిలేస్తావా.' గోవింద భుజం చుట్టూ చేతులు వేసి ఆవిడ కళ్లల్లో కి చూస్తూ అడిగాడు.
గోవింద అతని చేతుల్ని నెమ్మదిగా విదిపించుకుంది. 'పద శ్రీకాంత్' అన్నది కొడుకు వైపు చూస్తూ చటర్జీ నిలబడి పోయాడు. గోవింద వొంగు ని అతనికి నమస్కరించి కొడుకు వెనుకే కట్టుబట్టలతో బయలుదేరింది. గోవింద నిశ్శబ్ద అగ్ని పర్వతం లా, యిన్నాళ్ళూ వుండి యిప్పుడు అకస్మాత్తుగా ఒక్కసారి బ్రద్దలైందని చటర్జీ అనుకున్నాడు.
శ్రీకాంత్ ఏదో చెప్పబోతున్నవాడిలా 'అమ్మా,' అన్నాడు.
'నీకు నేను బరువు కాను. ఒకవేళ....అయినా యిది నా అజ్ఞా శ్రీకాంత్ పద,' అన్నది.
శ్రీకాంత్ మాట్లాడలేదు. తల్లి ప్రక్కనే నడుస్తూ మెట్లు దిగాడు.
చటర్జీ శిలవలె నిలుచుండి పోయాడు.
రైలు కదులుతుంటే ఆ సమయానికే చటర్జీ ఆగమేఘాల మీద కారులో వచ్చాడు.
'శ్రీకాంత్! గోవిందా!!' అని అతను కంపార్టు మెంటు దగ్గర నిలుచుని లోపలికి తొంగి చూస్తూ వెతికే లోపలే రైలు కదిలింది. అతనింకా పిచ్చి వాడిలా 'శ్రీకాంత్ గోవిందా!!' అని పిలుస్తుంటే అతని కేకలు రైలు కూతలోనూ, శబ్దం లోనూ కలిసి పోయాయి.
మరి రెండు రోజులకి శ్రీకాంత్ కి ఆస్తి నంతా రాసి స్వర్గస్తుడైన వృద్దుడి తాలూకు లాయరు పంపిన వుత్తరం , రిజిస్టరు పోస్టులో వచ్చిన దస్తావేజులు చూసి చటర్జీ వున్మాధుడు అయిపోయాడు ఇంచుమించు భార్య పిల్లలూ లేని ఆ యిల్లు కళా హీనంగా వుంది, విష్ణుమూర్తి కనిపించి పగలబడి నవ్వుతూ 'మిత్రద్రోహివి' అంటున్నట్లుంది అతనికి. సమాజాన్ని వుద్దరించాలని, విప్లవం తీసుకురావాలనీ ముందంజ వేసిన అతడు మనసికంగా ఎదగలేక పోయాడు. వరద వెల్లువ లాంటి వుడుకు రక్తపు ప్రవాహం లో ఒక విధంగా కొట్టుకు పోయాడు. చేసిన పనికి అంతర్లీనంగా దుఃఖిస్తూ బాహాటంగా నవ్వు నభినయిస్తూ తీయని నరకం అనుభవించి మనశ్శాంతి లేకుండా చేసుకున్నాడు.
శ్రీకాంత్ చిన్నతనం లో ప్లిమత్ కారు కొనమనేవాడు. యిప్పుడు అతనికి ఆ కారు కూడా వచ్చింది. రోజూ అతను రైలు కదిలే వేల్టికి స్టేషన్ కి వెళ్లి 'శ్రీకాంత్ రా బాబూ . ఈ కారు నీది. ఈ సంపద నీది. తండ్రిని కదా తిట్టినా, కొట్టినా పరాయి వాడిని అయిపోతానా నాయనా. చిన్నప్పుడు కొనమన్న కారు యిప్పుడు వచ్చింది. యిది నీకే. గోవిందా నన్ను ఒక్కడినీ వదిలి మీరు యిద్దరూ వెళ్ళద్దు. నేనూ వస్తాను' అంటాడు.రైలు కూతలో ఆ మాటలు యెవరికీ వినిపించవు. స్టేషను మాష్టారు , కూలీలు అతన్ని పరిశీలనగా చూస్తూ 'రోజూ ఈ వేల్టికి యితనిక్కడికి దేనికి వస్తాడు? పిచ్చివాడు కాదు కదా' అనుకుంటారు.
చటర్జీ రైలు వెళ్లి పోయేవరకూ ఆగి 'యివాళ వీల్లేక పోయింది. రేపు తప్పకుండా కలుసుకోవాలి,' అని నెమ్మదిగా గొణుక్కుంటూ స్టేషన్ లోంచి యివతలికి వచ్చి కారులో కూర్చుంటాడు. 'ఈ కారు రేపు వాడే డ్రైవ్ చేస్తాడు ' అనుకుంటాడు. అతని కళ్ళల్లో నీళ్ళు నెమ్మదిగా చోటు చేసుకుని కంటి నిండా వ్యాపించి టప్పున రాలి పడ్తాయి చెంపల మీద. అతను మలుపు తిరిగి యింటి వైపు దారి తీస్తాడు.
అప్పుడప్పుడు అతని మిత్రుడు ఉపెంద్రుడు వచ్చి చూసి వెడుతుంటాడు దూరం నుండే. అతని కారు ఆగి అతను లోపలికి వెళ్ళగానే 'యెన్ని తప్పిదాలు' జరిగాయి' అనుకుంటాడు మనసులో. అతనికి గోవింద చటర్జీ ల చరిత్ర పూర్తిగా తెలుసును.
కట్న కానుకలు యివ్వడం , విష్ణుమూర్తి పోయాక చటర్జీ చేసుకోవడం పిల్లలకి తెలియనీయక పోవడం, శ్రీకాంత్ పట్ల చటర్జీ ముందు ఆ విధంగా ప్రవర్తించడం అన్నీ తప్పులుగానే తోస్తాయి అతనికి.
పెద్దలు యేర్పరచిన కట్టుబాట్లు యెంత వున్నతమైనవో వాటిని దిక్కరిస్తే వచ్చే సాధక బాధకాలేమిటో అతనికా క్షణం లో లీలగా మెదిలి నిట్టూర్పు విడుస్తాడు. ఏటికి ఎదురీదిన మనుషులందరూ తప్పు త్రోవన పోయినట్టే అనిపిస్తుంది అతనికి.
(అయిపొయింది)
