శ్రీకాంత్ కళ్ళు చిట్లించి 'ఆవిడా? ఆవిడ ఎవరు? అని అడిగాడు అర్ధం కాక.
'అదే ఆవిడ హేమ నళిని రాలేదా'
'అవిడేందుకు వస్తుంది?'
'అదేవిటన్నయ్యా , హేమనళిని వదిన నీతో రాక మరెవరితో వస్తుంది?'
'హేమనళిని వదినా. నువ్వేం మాట్లాడుతున్నావు తమ్ముడూ?'
'నువ్వు ఆవిడని పెళ్ళి చేసుకోలేదా?'
'యెవరన్నారలాగని?'
'నీకు పెళ్లి అయినట్లూ, నువ్వు డిల్లీ లో వుంటున్నట్లూ రాస్తే నే కదా అత్త తక్షణం గంగకి పెళ్లి చేసేసింది.'
'యెవరు రాశారు తమ్ముడూ నా కసలు యేమీ తెలీదు.'
ఉమేష్ యింకా ఏదో అనబోతూ వుండగానే కృష్ణ మోహిని భోజనం వడ్డించి 'మీరు తరువాత మాట్లాడుదురు గాని, అయన యింకా గడప లో అడుగు పెట్టారో లేదో తిండి తిన్నావా అన్నయ్యా అనైనా అనకుండా ప్రశ్నలతో చంపుకు తింటున్నారు. మీరు బాబుని తీసుకోండి.' అని శ్రీకాంత్ వైపు తిరిగి "భోజనానికి లేవండి బావా' అన్నది.
శ్రీకాంత్ ఆకలి తో వున్నా మెతుకు సహించని కారణంగా అర్ధాకలితో కంచం ముంచు నుంచి లేచి వచ్చి "యిప్పుడు చెప్పు తమ్ముడు ,' అని అడిగాడు.
అన్నని చూడగానే తమ్ముడు సిగేరేట్ అవతల పడేశాడు గబుక్కున. శ్రీకాంత్ అంత వేదనలోనూ నవ్వుకున్నాడు. తమ్ముడి పక్కనే మంచం మీద కూర్చుని ఉమేష్ చెప్పబోయేది వినేందుకు ఆత్రుతగా వున్నాడు.
ఉమేష్ అన్న మొహంలోకి చూసి 'అసలు సంగతులేవి నాకు అంతగా తెలియవన్నయ్యా. రాధిక అత్తా వో సాయంత్రం పూట కారు దిగి యింట్లోకి వచ్చి పెద్దగా యేడుస్తోంది . కారణం యేవిటంటే చెప్పదు. చాలాసేపటి కి కళ్ళు తుడుచుకుని అన్నది. 'నువ్వు డిల్లీ లో హేమ నళిని అనే అమ్మాయిని చేసుకున్నట్లూ నాన్నగారితో బంధాలు తెంపుకుని నాకు మల్లేనే డిల్లీ వెళ్ళిపోయి విడిగా వుంటున్నట్లు.చెప్పి 'విత్తనం ఒకటి వేస్తె చెట్టు ఒకటి మొలుస్తుందా నా పిచ్చి గాని, చిన్న్నప్పటి నుంచీ వాడంటే యెంత అభిమాన పడ్డాను. నా కూతురికి ఏం లోటు వచ్చిందని వేరే పిల్లని చేసుకున్నాడు? అంత కానివాళ్ళం అయిపోయామా ,' అంటుండి పోయింది. వెళ్ళిపోతూ అన్నది. 'వారం రోజుల్లో నా కూతురి కి పెళ్లి చేయకపోతే నా పేరు రాధిక కాదని నేను నిజంగా డిల్లపోయాను' అన్నాడు.
'యింతకీ అసలు సంగతేవిటి?' ఉమేష్ అడిగాడు.
'సంగతా! యిదంతా గందరగోళం లా వున్నది తమ్ముడూ. నాకసలు యేవీ తెలియడం లేదు. డిల్లీ నేను వెళ్ళిన మాట నిజమే. అక్కడ నాన్నగారి స్నేహితుడు రామచంద్ర చౌదరి అని అడ్వకేట్ గా సుప్రీం కోర్టు లో పని చేస్తున్నారు. ఆయన్ని కలుసుకోమని విడిగా యెక్కడా వుండద్దని నాన్నగారు నొక్కి చెప్పి అడ్రసు యిచ్చారు. నాకు అడ్రసు యివ్వడమే కాకుండా ఆయనకి నేను వస్తున్నట్లు టెలిగ్రాం కూడా యిచ్చారు.
'స్టేషన్ లో దిగగానే ఆయన వెంట కూతుర్ని, కొడుకునీ తీసుకుని కారులో యింటికి తీసుకు వెళ్ళారు. ఆ యింటి ల్లి పాదీ నన్ను చాలా ఆదరణ గా చూస్తుంటే అప్పుడే నాకు అనుమానం వచ్చింది.'
'నేను తిరిగి యింటికి వెళ్లాను. అప్పుడే గంగ పెళ్లి శుభలేఖ వచ్చింది. అప్పటికప్పుడే హైదరాబాదు వద్దాం అనుకున్నాను కాని చేయి దాటిపోయాక ప్రయోజనం లేదని వూరుకున్నాను. డిల్లీ కి వెళ్ళకూడదనే అనుకుంటుండే వాడిని. ఆ పిల్ల నన్ను వెర్రిగా ప్రేమిస్తోంది. అనవసరంగా జీవితాల్తో చెలగాటాలు ఆడడం దేనికని అసలా వుద్యోగమే మానేద్దాం అనుకుంటుంటే నాన్నే వెళ్ళమని నిర్భందించారు. తప్పనిసరిగా వెళ్ళ వలసి వచ్చింది.
'ఆ పిల్ల వున్నట్టుండి అడిగింది 'నా వుత్తరాలకి జవాబు రాయలేదేం అని? నాకసలు ఒక వుత్తరం కూడా అందలేదు . ఆ వుత్తరాలు ఏమై పోయినట్టూ?పైగా నాన్నగారీ సంబంధానికి ఒప్పుకున్నట్లు ఆయనకి వుత్తరం కూడా రాశారు. నీ పెళ్లికి అయన చేసిన గల్లంతు కి ఈ సంబంధం విషయంలో అయన అంగీకారానికీ ఆశ్చర్యపోయాను. గంగ పెళ్లి అలా యెందుకు జరిగింది? ఒక్కసారి అత్తనే కలుసుకోవాలని బయలుదేరాను. మనసు ఆగక గంగ యింటికి వెళ్ళి దాని చేత యింట్లోంచి గెంటించుకు వచ్చాను. యింక అత్త దగ్గరికి వెళ్ళి ఆ తరువాత సత్కారం చేయించుకోవాలి.' శ్రీకాంత్ బాధగా జుట్టులోకి వ్రేళ్ళు పోనిచ్చుకుని శూన్యంలోకి చూస్తుండి పోయాడు.
'నేనూ రానా అన్నయ్యా.' అని అడిగాడు ఉమేష్.
'వద్దు నేను ఒక్కడినే వెడతాను.' యిప్పుడు యెక్కడ వుంటున్నారని రాశావు అరవింద కి?'
'నారాయణ గూడా అన్నయ్యా. నీకు వెతుక్కోవడం కష్టం అవుతుందేమో.'
'యింటి నెంబరు చెప్పు తమ్ముడూ. టాక్సీ లో వెళ్లి వస్తాను.'
'ఈ రాత్రికి తప్పకుండా యిక్కడికే రా అన్నయ్యా. అత్త ఆగి పొమ్మంటే వుండి పోకు. నీకోసం యెదురు చూస్తూ వుంటాను' ఉమేష్ రాధిక అడ్రసు యిస్తూ అన్నాడు.
పక్కనే హాయిగా దర్జాగా పడుకున్న పసివాడిని చూసి 'తమ్ముడూ పేరెం పెట్టావురా' అని అడిగాడు శ్రీకాంత్.
'గోవిందరావు ' ఉమేష్ మొహం తిప్పేసుకున్నాడు. అతనికి తల్లి జ్ఞాపకం వచ్చింది. తమ్ముడి కీ, మరదలి కి చెప్పి శ్రీకాంత్ యింట్లోంచి వచ్చేశాడు.
14
పదిహేను నిమిషాల్లో రాధిక యింటి ముందు టాక్సీ దిగాడు శ్రీకాంత్. టాక్సీవాడికి డబ్బు యిచ్చి పంపేసి లోపలికి వెడుతుంటే పులి లాంటి అల్సేషియన్ కుక్క తెగ మొరగడం ప్రారంభించింది. తలుపు తెరుచుకుని వచ్చిన రాధిక శ్రీకాంత్ నిచూసి నివ్వెర పోయింది. అల్సేషియన్ యింకా మొరుగుతూనే వుంది. రాధిక దాని నెత్తిన ఒకటి వేసి నోరు మూయించి 'లోపలికి రా' అన్నది.
శ్రీకాంత్ ఆవిడ వెనకే వెళ్ళాడు.
హల్లో సోఫాలో కూర్చున్నారు యిద్దరూ. కొంచెం అయేక రాధిక నౌకర్ని పిలిచి 'కాఫీ పెట్ట'మని పురమాయించింది.
శ్రీకాంత్ వైపు చూస్తూ 'ఒక్కడివే వచ్చావెం?' అని ఆడిగింది రాధిక.
శ్రీకాంత్ వ్యర్ధంగా నవ్వాడు. 'ఒక్కడినే వున్నప్పుడు ఒక్కడు రాక యెంత మంది వస్తారత్తా.'
'మీ ఆవిడ....?' రాధిక ప్రశ్నార్ధకంగా చూసింది.
'నా కసలు పెళ్లే కాలేదే.'
రాధిక నెత్తిన నిశ్శబ్దంగా బాంబులు కురవసాగాయి. అతని వైపు నీరసంగా చూడ సాగింది. బలవంతంగా నోట్లోంచి మాటలు పెగిలి వస్తుంటే 'యేమిటి శ్రీ నువ్వు అంటున్నది . నాతొ వేళా కోళం ఆడేందుకు యింతదూరం వచ్చావా . హేమ నళిని యేది. గంగ పెళ్లి అయిపొయింది. యింక నీకు అడ్డేమిటి? చెప్పిందుకేం? ఆ పిల్ల నెక్కడ దాచావు?' అని అడిగింది.
శ్రీకాంత్ తను కూర్చున్న సోఫాలోంచి లేచి వచ్చి రాధిక పక్కన కూర్చుని ఆవిడ మెడ చుట్టూ చేతులు వేసి గుండెల్లోకి దూరిపోయి పసిపిల్ల వాడి మాదిరిగా బావురుమన్నాడు. 'నన్నెవరో మోసం చేశారత్తయ్యా. ఆ పిల్లని నే నెప్పుడూ ఆ దృష్టి తో చూడలేదు. ఆ పిల్ల నాకు వుత్తరాలు రాసిందిట. అవి ఒక్కటి కూడా అందలేదు నాకు. గంగ పెళ్ళి శుభలేఖ మాత్రం చూశాను నేను. రేపు పెళ్లి అనగా యివాళ అందిందని నాన్నగారు చెప్పారు.'
రాధిక కి తను వున్న స్థితిలోంచి తెరుకునేందుకు చాలాసేపే పట్టింది. 'అంతా అబద్దం. నాలుగు రోజులు ముందు పంపాను. యిప్పుడు అర్ధం అయింది. యిదంతా అన్నయ్య మోసం.'
'అత్తా' శ్రీకాంత్ నిర్ఘాంత పోయాడు ఆవిడ వైపు చూస్తూ.
'అవును శ్రీ. నీకిచ్చి గంగని పెళ్లి చేస్తానంటే పెద్ద ఉపన్యాసం యిచ్చాడు. రాధిక అతన్ని కొద్దిగా జరగమని చెప్పి హేమనళిని అతనికి రాసిన వుత్తరాల కట్ట తీసుకు వచ్చి ముందు పడేసింది. చటర్జీ జత చేసి రాసిన ఉత్తరాన్ని శ్రీకాంత్ చేతికి యిచ్చింది.
శ్రీకాంత్ ఆశ్చర్యంలోంచి తేరుకోలేక పోతున్నాడు. పద్మనాభం 'ఒకవేళ యిదంతా మీ నాన్నగారే చేశారేమో?' అంటే అతనికి తండ్రి మీద అంతటి నింద వేయాలనిపించ లేదు. పైగా యెంతో గౌరవంగా మాట్లాడాడు. అతనికి తన మీద వున్న అనురాగాన్ని విప్పి చెప్పాడు. మరి యిప్పుడు?
'నాన్నగారికి నేనంటే దేనికింత పగ?' శ్రీకాంత్ అవగాహన కాలేదు.
'వాడు డిల్లీ లో ఆ పిల్లని చేసుకున్నట్లు యిక్కడ నా మిత్రుడు వొకడు చెప్పాడు. యిన్నాళ్ళూ నువ్వు వాడి మీద చూపిన వాత్సల్యానికి మంచి శాస్తి చేశాడు. ప్రపంచం లో క్రుతఘ్నులు లేరనుకున్నావు. యింతకు మించి యింకేం సాక్ష్యం కావాలి? యిప్పటి కైనా మించి పోయింది లేదు. నీ పిల్ల చదువు కోలేదని గానీ, కురూపి అని గానీ బెంగ పెట్టుకోవలసిన పని లేదు. వాడు యింత పని చేస్తాడని నేను అనుకోలేదు -- నీ అన్న బలరం చటర్జీ.
'అత్తా నాన్నగారు ఆ పిల్లని చేసుకునేందుకు ఒప్పుకుంటూ చౌదరి గారికి వుత్తరం కూడా రాశారు.'
రాధిక అర్ధం లేని నవ్వు నవ్వింది. 'ఉమేష్ పుట్టాక అన్నయ్య కి తన పర తెలిసింది శ్రీ. నువ్వు వట్టి అమాయకుడివి. అయన నిన్ను చదివిస్తున్నాడని, ప్రేమగా మాట్లాడుతున్నాడని పొంగి పోయావు. మనసులో విషం పెట్టుకుని తను నెమ్మది నెమ్మదిగా దాన్ని అమృతం అని చెప్పి నమ్మించి నీ చేత తాగించాడు.

వితంతువు కొడుకువి నువ్వు. నీకు సుఖ పడే రాత వుండకూడదు. అదే అయన ఆలోచన. యిది స్వతహాగా పుట్టలేదు అతనికి. నిన్ను చూస్తూ అతన్ని చులకన చేయగానే భరించలేక పోయాడు. ఆ పగ నీ మీద తీర్చుకున్నాడు. పిచ్చిదాన్ని నేనెలా నమ్మగలిగాను?' రాధిక కళ్ళు తుడుచుకుంది.
శ్రీకాంత్ ఉత్తరాల వైపు చూడసాగాడు. అవి చటర్జీ రాసిన వుత్తరానికీ కావలసిన మద్దతు యిస్తున్నాయి. అంతకన్నా ఋజు సాక్ష్యాలు అనవసరం కాక మరేమిటి?
'అన్నయ్య కాదు శ్రీ నీకు ద్రోహం చేసింది నేను,' రాధిక అతన్ని గుండెల్లోకి తీసుకుని కన్నీరు కార్చ సాగింది.
శ్రీకాంత్ దేనికీ మాట్లాడలేదు. అతను రాధిక బలవంతం చేస్తున్నా మరొక నిమిషం వుండేందుకు వొప్పుకోలేదు. గుండెల్లో భరించలేని ఆవేదన. కడుపులో అగ్ని హోత్రం ప్రజ్వరిల్లుతున్న తపన కలుగుతోంది శ్రీకాంత్ కి. తిన్నగా తమ్ముడి దగ్గరికి వచ్చి ఆ రాత్రి వుండి ఉమేష్ బ్రతిమి లాడినా కృష్ణ మోహిని ప్రాధేయపడినా వినిపించుకోకుండా మర్నాడు రైలెక్కాడు.
