రెండు రోజులు గడిచేక శ్యామల పల్లెటూరి లో పుట్టిన గోదావరి తాను ప్రావహిస్తూ పవిత్రం చేసిన కోనసీమ ని చూసి తనను తాను మరిచిపోయింది. మహేశ్వరి ఆ పిల్లకి ఏ లోటూ రాకుండా చూడసాగింది. పొద్దుటే తెర్రగా కాగిన పాలు ఇచ్చేది. ఆ పాలు కొబ్బరి మట్టలతో కాగడం వల్ల వాటి తాలుకూ సువాసన కే కడుపు నిండిపోయేది. తొమ్మిది గంటలు కాక మునుపే పనసాకులవి మడిచి కుట్టి ఇడ్లీలు తయారు చేయించి పంపేది. పన్నెండు గంటలకి ఆకాలపు మామిడి కాయలతో కలిపిన కొబ్బరి పచ్చడి, పనస పొట్టు కూరా-- శ్యామల వాటి వైపు చిత్రంగా చూస్తుంటే మరీ మరీ వడ్డించేది.
నాలుగు గంటలకి కనకాంబరాలు, జాజి మొగ్గలు కలిపి జారేడు జడ తనే అల్లేది. ఐదు గంటలకి కాఫీ, టిఫిన్. శ్యామల కి అప్పుడప్పుడు కాలేజీ గురించి భయం వేసినా ఆ వాతావరణం లోంచి బయటికి రావాలంటేనే బాధపడేది. శుక్రవారం . శ్రావణ మాసం కావడం వల్ల వర్షాలు పడి పల్లెటూరు ఇంకా రోడ్డు పడని కారణంగా తడిసిపోయి బురద గుంటలు ఎర్పాడాయి. చినుకులు విడవకుండా పడుతున్నాయి. కొత్తగా పెళ్లి అయిన వాళ్ళూ, ఇంకా నోములు పూర్తీ కాని వాళ్ళూ వీధుల్లో సాయంకాలం అయేసరికి కాలు నిండా పసుపు రాసుకుని, మోహన ఎర్రటి కుంకుమ తో, శెనగలు మూటలు కట్టుకుని వెడుతుంటే కిటికీ లోంచి శ్యామల చూడసాగింది. పట్టుచీరల గరగర లతో , సెంటు వాసనల గుభాళింపులతో , మూర్తిభవించిన తెలుగు తనంతో ప్రకృతి రమణీయ శోభతో గ్రామం పూర్తిగా లక్ష్మీ దేవి నిలయం లా కనిపిస్తుంటే ఆప్రయత్నంగా కళ్ళు చేమర్చేయి శ్యామల కి. "పెన్నా గోదావరి చిరుతరగల తిన్నని సన్నని తీయని పాటల తేనే లొలుకునమ్మా తెలుగుల వాణి పల్కునమ్మా!" ఎప్పటితో రికార్డు గ్రామ ఫోనులో పలుకుతుంది. తెలుగువారి అదృష్టం ముందు...శ్యామల ఆ పైన ఆలోచించేందుకు అవకాశం లేకపోయింది.
"మా కోడలు. రేపు వైశాఖ మాసం లో చేస్తాం పెళ్లి." మహేశ్వరి కంఠం అది.
"ఏ ఊరు అమ్మాయిది?' మరో స్త్రీ కంఠం కుతూహలంగా అడుగుతుంది.
"హైదారాబాదు!"
"అలాగా!"
"చూడు, సూరీడు. పిల్ల ఎలా ఉంది?" మహేశ్వరి కావాలనే అడుగుతుంది.
"పిల్లాకేం! రంభలా ఉంది. అయినా నువ్వు చాలా అదృష్ట వంతురాలివి!' ఆ స్త్రీ కంఠం కొంచెం దూరంగా వినిపించి వెళ్ళిపోతున్నట్లు అడుగుల శబ్దం అంతకంతకు దూరం కాసాగింది.
శ్యామల నిరుత్తరురాలింది. మహేశ్వరీ....తనని క్యా విధంగా ఊహించు కుంటుందని అలోచించనే లేదు.
ఐదు గంటలకి మహేశ్వరి రెండు మూరల పూల దండ తీసుకు వచ్చింది. శ్యామల వైపు చూస్తూ నిలబడింది.
"ఏమిటండీ?" అన్నది శ్యామల.
"చూడు, శ్యామలా. రెండు జడలు మానేసి ఈవేళ ఒక జడ వేసుకుంటావా?' అని అడిగింది.
"అలాగే " అన్నది శ్యామల.
శ్యామల వేను తిరిగి చూసుకునేసరికి భర్త తన కోసం చేయించిన వస్తువులన్నీ మహేశ్వరి జడకి అమర్చేసింది. మొగలి రేకుల బంగారు జడ, వంకీ, నాగరం-- ఇలా వేల లేని ఆభరణాలు తీసి తొడుగు తుంటే శ్యామల అయోమయావస్థలో చిక్కుకుపోయింది. "ఇన్ని వస్తువులు నాకు పెడుతున్నారు!" అన్నది తేరుకుని.
మహేశ్వరి నవ్వి ఊరుకుంది. హరికృష్ణ గదిలోకి ప్రవేశించి తల్లిని ప్రేమగా చూశాడు. ఆవిడ వాత్సల్యాన్నర్ధం చేసుకోలేక పోయేడనిపించిందతని కా క్షణం లో. మహేశ్వరి కళ్ళతోనే కొడుకు వైపు గర్వంగా కోడల్ని చూపించింది. అతను నవ్వి ఊరుకున్నాడు.
హరికృష్ణ వెళ్ళిపోయే వరకూ ఆగి శ్యామల అంతరంగం లో చెలరేగే ప్రశ్నలకి జవాబులు చెప్పమని మహేశ్వరి ని కోరింది.
"అంటే?" మహేశ్వరి కి అర్ధం కాలేదు.
"మీరేదో దాస్తున్నారని మీ మొహం చూస్తె అర్ధం అవుతుంది. గిరిజ ని మీరంత ప్రేమగా చూసేవారు కదా, ఆవిడకి డబ్బు ఇవ్వలేక పొయినారా?"
మహేశ్వరి కొన్ని సంవత్సరాలుగా తనలో ఇముడ్చు కున్న బాధని ఎప్పుడో ఒకప్పుడు, ఎవరికో ఒక్కరి కైనా చెప్పలేనిది బ్రతకడం దుర్భరం అని తెలుసుకుంది. తనలో చెలరేగే ఈ భీకరమైన తుఫానులు ఉండి ఉండి తనే అంతమయేట్లు చేయవు కదా అని మధన పడ్డది. చేసింది పాపమో, పుణ్యమో న్యాయనిర్ణేత గురించి తెలియక పోయినా, అణువణువున చిత్రవధ చేయసాగే ఈ అలజడిని భరించలేక వేయి గొంతుకలతో ప్రపంచాని కి తను చేసిన పని గురించి తెలియజేయాలను కునేది. ఈ సంఘర్షణ లో తుఫాను లా తనని కుదిరింపు తో ఒక్కో రాత్రి మహేశ్వరి జాగరణ చేసేది. అటువంటి సమయాల్లో గిరిజ అనురాగంతో మెట్ల దగ్గర ఆగి "అత్తయ్యా" అని పిలుస్తున్నట్లు, తను మెట్లెక్కి పూర్తిగా రావచ్చునో, కూడదో అని విలపిస్తున్నట్లూ, యాచిస్తున్నట్లూ కనిపించేది. పరికించి చూస్తె ఆ పిల్ల కళ్ళలో చిందులాడే నీటి బిందువులు తను ద్రోహం చేస్తున్న సంగతిని విశదపరిచేవి.
"నేనేం చేయను? ఇది నేను కావాలని చేయలేదు గిరీ. నాలో చల్లారని పగ నిన్ను బలి పెట్టింది." అనేది అస్పష్టంగా గొణుగుతూ. కన్ను మూసినా, తెరిచినా గిరిజ రూపం కదిలి తనని రంపపు కోత కోసేది.
"చెప్పండి . మీరు సందేహిస్తున్నారు.' శ్యామల రెట్టించి అడగగానే మహేశ్వరి మరి దాచుకోలేక పోయింది.
"ఈ వయసులో నేను నా ప్రేమ గాధ చెప్పడం, అది నువ్వు వినడం నాకు సిగ్గు గానే అనిపించినా, శ్యామలా , నేను ...నేనే ఎందుకిలా మారిపోయేనో ఒక్కోసారి నాకే అర్ధం కాదు!"
"ఫరావాలేదు . మీకు సిగ్గు పడాల్సిన పని లేదు."
"నన్ను చెప్పమంటారా?" ఆవిడ దీనంగా చూసింది.
"ఆ!"
"కాలం, దైవం ,మనిషి కాటేశారు నన్ను." మహేశ్వరి కన్నుల్లో నీరు ఉబికింది.
"ఈశ్వర చంద్రుడు -- అంటే గిరిజ తండ్రీ, నేనూ చిన్నతనం లో గిరిజా, హరికృష్ణ మాదిరే పెరిగాం. నాకు యుక్త వయసు వచ్చేవరకూ గ్రామం లోనూ, ఇంటా కూడా పుట్టుక తోటే ఈశ్వర చంద్రుణ్ణి నా భర్తగా నిర్ణయించేరు.
"మేము చాలా పేదవాళ్ళం. ఈశ్వర చంద్రుడి తండ్రి రిటైరైన మంచి స్థితి మంతుడు, అయన నన్ను...." మహేశ్వరి కొంగు చాటు చేసుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది.
శ్యామల ఓదార్చే ప్రయత్నం చేయలేదు.
కాస్సేపు ఆగి మళ్ళీ ప్రారంభించింది . "ఈశ్వరుడు పై చదువు చదివేందుకు పట్నం వెళ్లిపోయేడు. ఆ సమయంలోనే అయన నన్ను స్వయంగా కేక పెట్టేరు.
"పేదతనం , ఒకే గ్రామంలో ఉండడం విధి చేయించినని కానీ నేను కావాలని చేసిన వని కాదని అయన గుర్తించేడు కాదు. ఈశ్వరుడిని పట్నం నించి వస్తే చూడను కూడా రాకూడదని శాసించేడు.
"ఈశ్వరుడు చదువుకున్నాడు. జ్ఞానం ఏమైపోయింది అతనికి? ఒక్కసారి తనే వస్తాడేమోనని ఎదురు చూశాను. చిన్నవాడు ఇసుక లో నా కాలు మీద పిచ్చిక గూడు కట్టి మనిద్దరం ఇందులో ఉందాం అనేవాడు. అటువంటి వివేకం చదువు హరించేసిందా? విజ్ఞానం కప్పెసిందా? రాత్రింబవళ్ళు అతని కోసం మనసులోనే కుళ్ళి క్రుంగి , కృశించి పోయేదాన్ని . అతని తండ్రిని సవాల్ చేసేందుకు నేను మంచి మనసున్న అవిటి వాడిని చేసుకున్నాను."
'అయితే గిరిజ తప్పేం చేసిందో? గిరిజ కి అతనెందుకు బలవంతంగా డబ్బు తీసుకుని పెళ్లి చేయదలుచు కున్నాడో మీరు ఊహించ లేకపోయారా?"
మహేశ్వరి పిచ్చిదానిలా నవ్వింది." అంటా వట్టిది. నాలో రగులుకున్న పగ నానాటికీ మెరుపులా పెరగడం ప్రారంభించింది. నాకు లేని సుఖం, నాకు లేని మనశ్శాంతి, తృప్తీ, ఆనందం, ఆ పిల్ల కెందుకు దక్కాలి? లేమి వల్లే సంబంధం చెడింది నా విషయంలో. ఈశ్వరుడి దగ్గర ఇప్పుడు ఏమీ లేదు. ఆ పిల్ల చేసిన తప్పేమీ లేదు ఇందులో. పెద్దలు కొన్నిసార్లు అవకతవకలు చేస్తుంటారు. అవి పిల్లలు అనుభవించక తప్పదు. గిరిజ తన ప్రాణానికి ప్రాణం అనేవాడు ఈశ్వరుడు. గిరిజ కోసం ఏదైనా చేసిందుకు సిద్దపడేవాడు. ఆనాడు నా సంగతి దేనికి ఆలోచించలేక పోయేడు? నేను పెట్టుకున్న ఆశల్ని చీల్చి ముక్కలు చేశాడు. నా కోరికల సౌదాల్నీ నేలమట్టం చేశాడు. పగ అందుకే. ప్రతీకారం అతడు కన్న కూతురనుభావించింది. గిరిజ ను పిలిచి హరితో కలవద్దని నేనే శాసించెను. అంతే. హరి పిచ్చి ప్రేమ ఆ పిల్లని చేసుకునేట్లు చేస్తే చల్లారని నా పగతో నన్ను నేనే తుద ముట్టించుకోవలసి వచ్చేది. శ్యామలా, ఆడదాన్ని ఉసురు పెట్టడం ఎవరికీ మంచిది కాదు. ఈశ్వరుడు ఎకాకై, బికారై పోయేందుకు కారణం తండ్రి చేసిన పని తప్ప మరొకటి కాదు...."
మహేశ్వరి ధారావాహినిగా కారే కన్నీరుని తుడుచుకో ప్రయత్నం చేయలేదు. చెప్పుకు పోతూనే ఉంది: "నువ్వు ఇన్నాళ్ళ కి నా గాధ వినేందుకు దైవం పంపినట్లు వచ్చేవు. విద్యావివేకం కల ఏ ఆడపిల్ల అయినా నాకు ప్రేమ పాత్రురాలే. ఈశ్వరుడే గిరిజ తండ్రి కాకపొతే సగర్వంగా నా ఇంటికి కోడలుగా తెచ్చుకునే దాన్ని. పేదరికం అని కావాలని షరతు పెట్టెను. నా కున్న ఆస్తిపాస్తులు నాలుగు కాలాల పాటు దర్జాగా బ్రతికెందుకు సరిపోతాయి. నాకెందుకీ ధనరాసులు?"
శ్యామల మొహం జాలితో నిండిపోయింది. చదువు కున్న వివేకం అడిలిస్తుంటే నెమ్మదిగా అన్నది; "గిరిజ తప్పు ఏమాత్రం లేదు ఇందులో. మీరు చాలా పొరపాటు పని చేశారు!"
"దేనికీ?' మహేశ్వరీ కంఠం కరుకుగా ధ్వనించింది.
శ్యామల సరుదుకుని అన్నది: "ప్రేమ ప్రతీకారం కోరుకోదండి. మీరు అన్యాయంగా ఆ పిల్లని వెళ్ళ గొట్టేరు. నిజం చెప్పండి, ఇప్పుడు మీరు బాధ పడడం లేదూ?"
"నాకు బాధ దేనికీ?"
"గిరిజ పట్ల మీరు నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించ లేరు. ఆ విషయం ఒప్పుకోండి."
"లేదు. నేనంత సున్నితమైన మనసున్న దాన్ని కాను!' మహేశ్వరి కంఠం వణికిందీసారి.
"అలా అని మిమ్మల్ని మీరు మభ్య పెట్టు కుంటున్నారు. ఆడది ఆబల అంటారు. మీరు కూడా అబలలు చేసే పని చేశారు. ఇలా చేయకూడదు. పాపం! ఆ పిల్ల హరి కోసం దిగులు పెట్టుకుని ఏదైనా అయిపోతే ఆ శిక్ష ఎవరికి పడుతుందో అలోచించేరా?"
"శ్యామలా!' మహేశ్వరీ నెమ్మదిగా అన్నది: "కుల గోత్రాలతో , సిరి సంపదలతో నాకు పని లేదు. హరి ఏమై పోతాడో ననే బెంగ లో నిద్రకు దూరమై వాడి కోసమే బ్రతికేను ఇన్నాళ్ళూ. నా బ్రతుకు చాలా తక్కువ. ఎంతో కాలం ఉండను నేను. వాడు మామూలు మనిషి అయేందుకు పడిన శ్రమ, ఎవరిదో నేను గ్రహించెను. నువ్వు....నువ్వు నా ఇంటి కోడలివి, తల్లీ. నీకు అన్నీ అప్పగించి నేను వెళ్ళిపోతాను. నువ్వు దీనికి అంగీకరించాలి!"
శ్యామల మాట్లాడలేదు. ఎదురుగా కర్టెన్ వెనక నీడ కదలడం గమనించి తల దించుకున్నది. అది హరికృష్ణ నీడ. ఎంత సేపటి నుంచీ ఉన్నాడో శ్యామల కీ, మహేశ్వరీ కి కూడా తెలియదు. మహేశ్వరీ లోపలికి వెళ్ళిపోయింది. హరికృష్ణ తేర తప్పించుకుని నిదానంగా "అమ్మా, కాఫీ!' అన్నాడు. అతనిలో ఎటువంటి మార్పూ, ఘర్షణా లేవు.
శ్యామల లేవబోతుంటే "కూర్చో . కొంచెం సేపు పెకాడదాం" అన్నాడు తను కూర్చుంటూ. శ్యామల మాట్లాడలేదు . రంగు టద్దాల ప్రపంచాన్ని చూస్తూ ఉంటె కళ్ళు బైర్లు కమ్మసాగేయి. మనుష్యుల్లో ఉన్నతులేవరో, అల్పు లెవరో , అల్పుల యెందుకు కారణ భూతులేవరో ఏదీ అంతు చిక్కడం లేదు. వరసగా కుటుంబం కోసం త్యాగం చేసిన అక్కా, మధ్యతరగతి కుటుంబంలో గంపెడు సంతానాన్ని పోషించలేక తాము నలిగిపోతూ పిల్లల్ని కోరికల్నీ, సుఖశాంతు లకీదూరం చేసి అందుకు బాధ్యుడు భగవంతుడని నింద వేసే తలిదండ్రులూ, స్వార్ధమో, పొరబాటు కారణం గానో అక్క లాంటి వ్యక్తుల్ని చేసుకుని పశ్చాత్తాప పడుతూ ప్రక్షాళన కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్న బావా, ప్రేమ కోసం పతనమయ్యాని చెప్పుకుంటూ వ్యసనానికి బానిస అయిన హరీ, తన ప్రేమ గాధ సఫలీకృతం కాలేనందుకు పగబట్టి, ఇప్పుడు అంతర్గతంగా దాహానం అయిపోతున్న మహేశ్వరీ భగవంతుడు తిప్పే హీరా స్కోపు లా అందులోంచి తను చూస్తుంటే రకరకాల పూవ్వులు కనిపిస్తున్నట్లు ప్రతి మనిషి వెనకా కొంత కధనం ఉండడం శ్యామల పద్దేనిమిదీ ఇరవయ్యేళ్ళ మధ్య ఎదిగీ ఎదగని మనసు ఉక్కిరిబిక్కిరి కాసాగింది.
"నువ్వు సరిగా ఆడడం లేదు. ఇక్కడ లేవా?" అన్నాడు పేక కింద పడేస్తూ.
శ్యామల ఉలిక్కి పడింది. తను ఆడడం మానేసి ఎంత సేపైందో తనకే తెలియదు.
"రేపు నన్ను గోదావరి ఒడ్డుకు తీసుకు వెడతారా?"
"మనం వచ్చింది ఆ పక్క నుంచే కదా?"
"హడావుడి లో సరిగా చూడలేదు. తనివితీరా కాస్సేపు కూర్చోవాలని ఉంది!"
"అమ్మతో చెప్పావా?"
"ఇప్పుడు అమ్మతో చెప్పి రానా?"
"అంత అవసరం లేదు. ఇదివరకైతే తప్పకుండా చెప్పాలి."
"అంటే?"
"ఇన్ని ఆలోచించే మనిషివి ఇది మాత్రం ఆలోచించ కుండా ఉంటావా?"
"నాకు అర్ధం కావడం లేదు."
"అమ్మ చెప్పలేదా?"
"ఏమనీ?"
హరికృష్ణ భయపడ్డాడు. శ్యామల మొహం భీకర రణరంగం లా ఉన్నది ఎందు చేతనో. అతను నెమ్మదిగా లేచి వెళ్లిపోయేడు. వెళ్ళే ముందు "చూడు, శ్యామలా, నీకు ఏది అర్ధం కాకపోయినా అమ్మని అడుగు. చెబుతుంది. నేను చెప్పాలా విడమరిచి?" అన్నాడు.
శ్యామల అలాగే కూర్చుండి పోయింది. హరికృష్ణ ఏమంటున్నాడో తనకి అంత క్రితం అర్ధం కాకపోయినా ఇప్పుడైనా గ్రహించలేదు. సిరిసంపద లూ, భోగ భాగ్యాలూ శ్యామల చుట్టూ చేరుకొని అనురాగపు హస్తాలతో బంధించే ప్రయత్నం చేస్తున్నాయి. మరో పక్క నుంచి చిరునవ్వూ, మమతా, మానవత్వం , మంచితనం -- ఇవన్నీ కలగా పులగం కాగా "రావోయ్ నేను నీ మనిషిని.' అంటున్నాడు అంతర్గతంగా నిలిచిపోయిన మరో వ్యక్తీ. మహేశ్వరి భోజనానికి పిలవగా అన్యమనస్కంగా కదిలి వెళ్ళింది శ్యామల.
