Previous Page Next Page 
ప్రసన్నకుమార్ సర్రాజు కథలు 2 పేజి 28


                

    ఇంట్లో ఒక్కణ్ణే ఉన్నా. ఆఫీసు పేపర్లు చూడటం అయిపోయాక, ఇంకేం చేయాలో తోచలేదు. ఏదో లోటుగా అనిపించింది. నన్ను గిల్లే వాళ్లూ, ఆపైన కజ్జాలు పెట్టుకునే వాళ్లూ ఈ రోజుకి ఎవరూ లేకపోవటం కొంచెం చిరాకేసింది.
    సరే, కాస్తో కూస్తో ఈ లోటు తీర్చే ఇడియట్, టేబుల్ మీద రెండు కొమ్ముల్లా యాంటెన్నాలు నెత్తిమీద పెట్టుకొని క్రూరంగా చూస్తోంది. ఇది నా బెడ్ రూమ్ పిశాచి. అంటే ఉంగరం భూతం అనుకోవచ్చు. దీని బాబు హాల్లో ఉంది. అది పెద్ద భూతం. పదేళ్లు పాతదయినా, పేపర్లలో 'పాతభూతాలకి కొత్త భూతాలిస్తాం' అంటూ అరిచే మాంత్రికులు ఆ పనేదో నేరుగా చెయ్యక, ఒక పాత భూతానికి ఒక చిన్న భూతాన్ని, ఒక దెయ్యపు పిల్లను, పనిమనిషి వచ్చే ముందరే బట్టల్నీ మనుషుల్నీ ఉతికి ఆరేసే ఓ పిశాచప్పిల్లనూ, ఇవే కాక ఓ రాక్షస కంపెనీ మామ ఆఫర్ చేసే ఓ ఫ్యామిలీ టైపు రాక్షస స్త్రీ కూడా ఉచితం - లాంటి వాటితో నేనేమీ ప్రలోభపడలేదు. కీలుగుర్రంలో నాగేశ్వరావులాగా క్లయిమాక్సులో ఎంతో కోపం వచ్చి, నల్ల సాలీడుని ఏకీలుకాకీలు విరుస్తూంటే, అంజలీదేవి రాక్షసి (సారీ... సినిమాలోనే) - "రాకుమారా! వద్దు, నా ప్రాణం ఆ సాలీడులోనే ఉంది... నాకిచ్చేయ్! నాకిచ్చేయ్!" అని ప్రాధేయపడుతుంటే, నాగేశ్వర్రావుకు కొంచెం జాలి కలిగినా, ఆ నల్ల సాలీడును నాకటానికి ఇష్టపడక బలహీనమైన బలగొంతుకతో "ఏం? రాజుగారిని కష్టపెట్టినప్పుడు లేదేం? గుర్రాల్నీ, ఏనుగుల్నీ భక్షించినప్పుడు లేదేం? మహారాణీ వారిని అంధురాల్ని చేసినప్పుడు లేదేం?" అంటూ కఠోరంగా వ్యవహరించినట్లు, నేనూ ఎలాంటి ప్రలోభాలకూ లోబడకుండా ఉన్నాను గాబట్టి ఇంకా మనగలుగుతున్నాను.
    ఇంతకీ ఆ సిన్మాలో అంజలీదేవిలాంటి అప్పటి సౌందర్యవతిని రాక్షసిగా పెట్టిన దమ్మున్న ఆ నిర్మాత ఎవరు? అసలు ఆయనకి ఎందుకాదమ్మాలోచన వచ్చింది? అని మనసు పరిపరి విధాల పోయింది. సరే... ఆయన పర్సనల్ రాక్షస విషయాలు మనకెందుకులే అని లేచాను. ఐడిల్ మాన్స్ బ్రెయిన్ ఈజె డెవిల్స్ వర్క్ షాప్...ఛ! ఇక్కడ కూడా దెయ్యమే..!
    లేచి, తప్పటడుగులు వేసుకుంటూ వెళ్లి, హాల్లో పెద్ద బాక్సు ముందు కూర్చుని రిమోట్ చేతిలోకి తీసుకున్నాను.
    పెద్ద టీవీ నిమిత్తమాత్రురాలిగా నన్ను చూస్తోంది. నేను ఏదో మైకంలో ఉన్నవాడిలా నిమత్తు మాత్రుడిగా చూస్తూ ఆన్ చేశాను.
    కొన్ని సంవత్సరాలుగా సేవ చేసిన రిమోట్, బటన్స్ అరిగిపోయినా మా ఫ్యామిలీ మెంబర్స్ ఇష్టాయిష్టాలు తెలుసుకున్నదానిలా నా వేలు వెళ్లీ వెళ్లకముందే ఓ సెకెండులో తొంభయ్యవ వంతులో మాజిక్ టచ్ లాగా తెలుగు ఛానెల్ ఓపెన్ చేసింది. మా ఫ్యామిలీ మెంబర్స్ టేస్ట్ అంతగా తెలుసుకున్న ఆ రిమోట్ మీద అదోలా గౌరవభావం మొలకెత్తింది. పరీక్షగా చూశా. కింద కొంచెం తెల్ల గడ్డం కూడా పెరిగినట్టు అనుమానమొచ్చింది. హుఁ... విశ్వాసపాత్రమైన రిమోట్!
    మొదట సిటీ కేబుల్ వచ్చింది. తెలుగు సినిమా అనుకుని పొరబడ్డాను. కాదు.. హిందీ సినిమా ఏదో వస్తోంది. హీరోయిన్ జబ్బలమధ్య తల దాచుకుని 'మై మజ్ బూర్ హుఁ' అంటున్నాడు హీరో -ఉష్ట్రపక్షిలా. ఛానెల్ మార్చా. ఈటీవీ వచ్చింది. ఏదో సీరియల్ మొదలైంది. క్రితంసారి దెయ్యం ఎవరిని ఆవహించిందీ చెప్పి, ఈసారి ఎవరిని పట్టుకుంటుందో చూడండి అని హెచ్చరిస్తున్నారు. అర్జంటుగా ఛానెల్ మారింది. జెమినీ వస్తోంది. ఓ అరవమో, మళయాళమో డబ్బింగు. యాక్టర్లందరూ తమకిచ్చిన రెమ్యూనరేషన్ కంటే నాలుగింతలు యాక్షన్ చేసేస్తున్నారు. విలన్ తనమీద పడకముందే హీరోయిన్ మొత్తం బట్టలు చింపేసుకుని భయంకరంగా అరిచేస్తోంది.
    నా వేలు నెక్ట్స్ బటన్ నొక్కింది. ఈసారి నేనే (స్వయంకృతాపరాధం) నొక్కాను. రిమోట్ ఈసారి నాకు సహకరించలేదు. బహుశా దానికీ ఈ ఛానెల్ కొత్తేమో. ఇవ్వాళే మొదలయిందనుకుంటా.
    ఓ నలభై ఏళ్లావిడ హిస్టీరిక్ గా అరుస్తోంది. పక్క ఫ్లాట్ వాళ్ళొచ్చి తిట్టకముందే ఆవిడ వాల్యూమ్ కంట్రోల్ చేశాను-అదిటీవీ గాబట్టి. పాపం ఆవిడంత హైరానా పడుతోందే... బి.పి. ఎక్కువగా ఉందేమో! పైగా లైవ్ ప్రోగ్రాము. చుట్టుపక్కల ఎవరూ లేరా? అసలావిడని ఎవరేమన్నారో! ఇంకాస్సేపయితే గుడ్లు తేలేస్తుందేమో! ఎందుకంత డిస్టర్బ్ అయిందావిడ? చాలా జాలేసింది.
    అవునూ? ఇంతవరకూ నా బుర్రకి తట్టలేదు. ఇదేం ఛానెల్? డి.డి.? అబ్బే కాదే... వాళ్లకింత ఆవేశం ఎక్కడేడ్చింది? "రేప్పొద్దున్న పదకొండింటికి బొంబాయి, కలకత్తా, చెన్నై, విశాఖపట్టణం మీద అణుబాంబులు ఐదు నిమిషాల తేడాతో పడుతున్నాయని, ఈ సందర్భంగా పై నాలుగు ప్రధాన నగరాలలో తొంభయ్యవ పాయింటు ప్రమాద సూచికలను ఎగరెయ్యటానికి కూడా టైము లేదనీ, జాలర్లకు ప్రత్యేక సూచన-ఒడ్డు మీద ఉన్న జాలర్లందరూ బతికి గోచీలు కట్టాలంటే వెంటనే సముద్రం మీదకు పొండి" - అని నింపాదిగా చెప్పి, "తరువాత వార్త - భార్యలు వదిలేసిన భర్తల పునరావాసానికి హస్తకళల్లో వివిధ రకాలుగా శిక్షణపై మూకుమ్మడి నిర్ణయం, కూచిపూడిక... క్షమించాలి... కూచిపూడికి అండమాన్ నికోబార్లలో ఆదిమవాసుల ఆదరణ, వారి నృత్యరీతులు, నాగరికత...." ఇత్యాది వార్తలు చెప్పి, "తిరిగి రేపు ఇదే సమయానికి కలుద్దాం!" అని చిరునవ్వుతో వీడ్కోలు తీసుకునే అతి నెమ్మది ఛానెల్ అది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS